ఒడిశాపై కన్ను: ప్రధాని మోదీ రోడ్‌షో
భువనేశ్వర్: కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వచ్చే నెలలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అధికార బీజేపీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశం శనివారం భువనేశ్వర్‌లో ప్రారంభమైంది. మౌలికంగా అంత బలంగా లేని రాష్ట్రాల్లో దృష్టి పెట్టాలని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో ఒడిశా వేదికగా ఈ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు కీలక నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు. అయితే, ఆరోగ్య కారణాలతో ఈ భేటీకి విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ దూరంగా ఉండే అవకాశముందని తెలుస్తోంది.
జాతీయ కార్యవర్గ సదస్సుకు ముందు ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించి.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ప్రారంభమైన ఈ సదస్సులో ప్రధానంగా త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కీలకమైన ఈ భేటీలో ప్రధాని మోదీ, అమిత్ షా సహా 40 మంది కేంద్రమంత్రులు, 13మంది ముఖ్యమంత్రులు, ప్రధాన నేతలు పాల్గొనబోతున్నారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అంతేకాదు తూర్పు భారతంలో పట్టు చాటుకోవాలని ఈ పార్టీ నేతలు తపిస్తున్నారు. అందుకే వేదికగా ఒడిశాను చేసుకోవాలన్నది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తున్నది. ఇక్కడ బీజేపీ బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అంచనాలకు భిన్నంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. అధికార బీజేడీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు షాకిచ్చేరీతిలో ఇక్కడ ఫలితాలు సాధించింది. ఈ నేపథ్యంలో ఒడిశాలోనూ పాగా వేయాలని కమలనాథులు భావిస్తున్నారు. అందులో భాగంగానే భువనేశ్వర్‌లో కీలకమైన జాతీయ కార్యవర్గ భేటీని ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది.