బీజేపీ గెలుపు.. చైనాకు ముప్పు!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం చైనాకు ఏమంత మంచిది కాదట. బీజేపీ అంత భారీ విజయం సాధిస్తే తమ దేశానికి ముప్పేనని అక్కడి అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ తన కథనంలో తెలిపింది. అంతర్జాతీయ వివాదాల్లో రాజీపడే ధోరణి భారతదేశంలోని అధికార బీజేపీకి మరింత తగ్గుతుందని ఆ కథనంలో రాశారు. మోదీ అసలే జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా మొండిగా వ్యవహరిస్తారని, ఇప్పుడు అది మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీయే గెలుస్తుందని వాళ్లు ఆ కథనం చివర్లో చెప్పడం గమనార్హం. అంతర్జాతీయ యవనికపై భారతదేశం తీరును మోదీ గణనీయంగా మార్చేశారని, ఇంతకుముందు భారత్ ఎప్పుడూ ఎవరినీ నొప్పించేది కాదని, కానీ ఇప్పుడు ఆయన వివాదాల విషయంలో స్పష్టమైన స్టాండ్ తీసుకుని తమ ప్రయోజనాలకు పెద్దపీట వేసుకుంటున్నారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోదీ గెలుస్తారని, ఇక అప్పుడు చైనాకు మరింత కష్టకాలం ముందుంటుదని గ్లోబల్ టైమ్స్ చెప్పింది.
ఇండో చైనా సరిహద్దుల్లో సైనికులతో కలిసి మోదీ దీపావళి జరుపుకొన్నారని, తద్వారా ఆయన వాళ్లకు గట్టి మద్దతు పలకడమే కాక, బీజింగ్- న్యూఢిల్లీల మధ్య సరిహద్దు వివాదాన్ని ఆయన మరింత రెచ్చగొట్టినట్లు అయిందని వ్యాఖ్యానించారు. ఒకవైపు మోదీ ప్రభుత్వం చైనాతోను, రష్యాతోను సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నట్లు చెబుతోందని, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో సభ్యత్వం కోసం కూడా దరఖాస్తు చేశారని అన్నారు. అయినా.. వ్యూహాత్మకంగా ఆయన కౌంటర్ బ్యాలెన్స్ చేస్తున్నారన్నారు. అదే సమయంలో ఆయన అమెరికా, జపాన్ లాంటి దేశాలతో రక్షణ బంధాలను పెంచుకుంటున్నారని, దక్షిణ చైనా సముద్ర మార్గం విషయంలో అమెరికా విధానాలను కూడా ప్రభావితం చేస్తున్నారని చెప్పారు.