నేరంపై కులం ముద్రా!? | shekhar gupta guest column on Caste and crime | Sakshi
Sakshi News home page

నేరంపై కులం ముద్రా!?

Published Sat, Dec 23 2017 1:08 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

shekhar gupta guest column on Caste and crime - Sakshi

జాతిహితం
దిగువ కులాలు, ముస్లింలలో అవినీతి, నేరగ్రస్తత సాధారణమని భావించడం సహేతుకమేనా? లేక పోలీసులు, న్యాయమూర్తుల నుంచి మీడియా, ప్రజాభిప్రాయం వరకు ఈ వ్యవస్థ అణగారినవారి పట్ల చాలా అన్యాయంగా ఉంటున్నదా? ఒకే కేసులో నిర్దోషిగా తేలిన రాజాను ఇంకా దొంగగానే చూస్తుంటే, శిక్షపడ్డ సుఖరామ్‌కు జైలుకు వెళ్లకుండానే గడిచిపోతోంది. అంటే, బంగారు లక్షణ్‌ను జైల్లో మగ్గుతూ చావమని వదిలేసినా, జాదవ్‌కు రాజకీయ పునరావాసం కల్పించడం సాధ్యమేనని అర్థం.

అవినీతి, నేరగ్రస్తతలకూ, కులానికి లేదా మతానికి ఏదైనా సంబంధం ఉన్నదా? లేకపోతే, కులాల నిచ్చెన మెట్లపై కిందకు దిగే కొద్దీ మీరు అవినీతికి పాల్పడి (పట్టుబడి) కేసులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ అవుతాయా? వాస్తవాలేమిటో చూద్దాం. 2–జీ కుంభకోణం కేసులో దోషిగా పదిహేను నెలలు విచారణలో ఉన్న ఖైదీగా జైల్లో గడిపి, ఆరేళ్లు విచారణను ఎదుర్కొన్న ఎ. రాజాను నేడు నిర్దోషిగా తేల్చారు. ఆయన దళితుడు. పార్టీలో ఆయన సహ నేత, కేసులో సహ నిందితురాలైన కనిమొళిని కూడా అలాగే నిర్దోషి అని తేల్చారు. ఆమె కూడా వెనుకబడిన కులాలకు చెందినవారే. మధు కోడా (బొగ్గు కుంభకోణంలో ఇటీవలే శిక్ష పడింది), శిబూ సోరెన్‌ (లంచం తీసుకోవడం, హత్య కేసులను చివరకు కొట్టివేశారు) ఇద్దరూ ఆదివాసులు.

ఇక మాయావతి దళిత మహిళ. లాలూప్రసాద్‌ యాదవ్, ములాయంసింగ్‌ యాదవ్‌ ఓబీసీలు. వీరు ముగ్గురు అవినీతి లేదా లెక్కకు మించిన ఆస్తుల కేసుల్లో దొరికినవారు. ఎప్పటికప్పుడు అప్పటి రాజకీయాలను బట్టి ఈ కేసులు ముందుకు వస్తూ, మరుగున పడిపోతూ ఉంటాయి. అధికారంలో ఉన్న పెద్దలు ఎప్పుడు వారు నోళ్లు మూయాలని లేదా వారి ఆమోదం కావాలని అనుకుంటే అప్పుడు ఆ కేసులను పతాక శీర్షికలకు ఎక్కించే కొత్త సినిమా తయారవుతుంది. ఆ రాజకీయ లక్ష్యం ఏదో నెరవేరిన వెంటనే ఊహించినట్టుగానే అది మరుగున పడిపోతుంది. అతి సుదీర్ఘ కాలపు శిక్షను (పదేళ్లు) అనుభవిస్తున్న హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓమ్‌ ప్రకాశ్‌ చౌతాలా జాట్‌ కులస్తుడు, వెనుకబడిన కులాలకు చెందినవారు కారు. అయినప్పటికీ, కులాల అంత స్తులలో ఆయన కులం సవర్ణుల కంటే దిగువన ఉండేదే.

పట్టుబడేవారంతా దిగువ కులాల నేతలే
2008 నాటి పార్లమెంటులో ఓటుకు నోట్లు కుంభకోణాన్ని ఒకసారి వెనక్కు తిరిగి చూడండి. రాజ్‌దీప్‌ సర్దేశాయ్, సుధీంద్ర కులకర్ణి (అప్పట్లో అద్వానీకి సన్నిహితుడు) ఒకప్పుడు సీఎన్‌ఎన్‌–ఐబీఎన్‌ కోసం నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌ ఫలితమది. ఫగ్గన్‌సింగ్‌ కులాస్తే, అశోక్‌ అర్గాల్, మహవీర్‌సింగ్‌ భరోగాలు అందులో ఇరుక్కున్నవారు. వారంతా ఎస్సీ/ఎస్టీలే. అంతకు ముందటి స్టింగ్‌ ఆపరేషన్‌లో నోటుకు ప్రశ్న కుంభకోణం వెలుగు చూసింది. అందులో ఇరుక్కున్న 11 మంది ఎంపీలు 2005లో పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. దాదాపు వారంతా ఎస్సీ/ఎస్టీలే. వారిలో ఆరుగురు బీజేపీకి, ముగ్గురు బీఎస్‌పీకి, ఒకరు కాంగ్రెస్‌కు, ఒకరు ఆర్జేడీకి చెందిన వారు.

అవినీతి కేసుల్లో ఇరుక్కున్న అగ్ర కులాలకు చెందిన సుప్రసిద్ధ ప్రజా ప్రతినిధులు కూడా లేకపోలేదు. సుఖ్‌రాం, జయలలిత, సురేష్‌ కల్మాడీలను చెప్పుకోవచ్చు. అయితే వాళ్లు చాలా కొద్ది మందే. వారికి కేసుల నుంచి తప్పిం చుకునే అవకాశాలూ ఎక్కువే. లేకపోతే వారి కేసులు ఎంతకాలమైనా సాగుతూ పోతూనే ఉంటాయి. వాస్తవం ఏమిటో చూడండి: సుఖ్‌రామ్‌ పరుపు కింద డబ్బు దొరికినా, శిక్షపడ్డా ఆయన ఎన్నడూ జైలు శిక్ష అనుభవించాల్సి రాలేదు. ఇప్పుడు 90ల వయసులో ఉన్న ఆయన సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌వాది. బీజే పీని కౌగలించుకుని నేడు ఆ పార్టీలో పునరావాసాన్ని పొందారు. ఎన్నికలకు ముందు ఆయన పార్టీ ఫిరాయించారు. ఆయన కుమారుడు అనిల్‌ బీజేపీ ఎంఎల్‌ఏ. బహుశా హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వంలో మంత్రి కూడా కావచ్చు.

బీజేపీలో చేరితే రాజాకుగానీ, ఆయన పిల్లలకు గానీ ఆలాంటి భాగ్యం కలుగుతుందని మీరు ఆశించగలరా? అవినీతి పట్ల నా ‘‘కులతత్వవాద’’ దృష్టిపై విరుచుకు పడటానికి ముందు మీరు దయచేసి నాలుగు వాస్తవాలను చూడండి. ఒకటి, సుఖ్‌రామ్, రాజా ఇద్దరూ వారు టెలికాం మంత్రులుగా ఉండగానే వారిపైన అవినీతి ఆరోపణలను మోపారు. రెండు, సుఖ్‌రాంకు శిక్షపడగా, రాజాను వదిలిపెట్టారు. మూడు, ఒకరి వద్ద ఆయన పరుపు కిందనే డబ్బు దొరికింది. మరొకరివద్ద విచారణ సాగించిన న్యాయమూర్తి వెటకారంగా ప్రశ్నించినట్టుగా డబ్బు ఎక్కడుందీ? డబ్బు దొరకలేదూ అంటే ఇక అవినీతి ఎక్కడిది? కాబట్టి, నిర్దోషిగా ప్రకటించారు.

ఇక నాలుగో వాస్తవం అత్యంత ముఖ్యమైనది. సుఖ్‌రామ్‌ బ్రాహ్మణుడు. ఆయన ఏదో ఒకసారి దారి తప్పి ఉంటారంతే. అలాంటివాళ్లు సాధార ణంగా అవినీతికి పాల్పడరు. ఇక రాజా అంటే దళితుడు. అలాంటి వాళ్ల నుంచి అంత కన్నా ఎక్కువ ఏం ఆశించగలరు? అధికారాన్ని, బాధ్యతలను వాళ్లు సక్రమంగా నిర్వహించలేరు అంతే. సాధారణంగా అనుమానించాల్సినవారు వారే.

కులాన్ని బట్టే కటకటాలు లెక్కించాలా?
ఇక ఇప్పుడు బీజేపీకి చెందిన ఒక ఆసక్తికరమైన ఓ కేసును పరిశీలిద్దాం. రెండు భిన్న సందర్భాల్లో ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు లంచం పుచ్చుకుంటూ కెమెరాకు దొరికిపోయారు. ఒకరు, దిలీప్‌సింగ్‌ జాదవ్‌. 2003లో రూ. 9 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన ఆయన అగ్ర కులస్తుడు. బీజేపీ సంతోషంగా ఆయనకు పునరావాసం కల్పించి తిరిగి ఎన్నికల్లో నిలబెట్టింది. ఎన్నికై పార్లమెంటులో ప్రవేశించారు. పైగా ‘‘డబ్బే దేవుడు కాదు, ఆ దేవుని సాక్షిగా చెబుతున్నా డబ్బు దేవుని కంటే తక్కువదేం కాదు’’ అంటూ కెమెరాకు చిక్కారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో అప్పుడు జూనియర్‌ మంత్రిగా ఉన్న ఆయన లంచం ఇచ్చే వ్యక్తితో కలసి బ్లాక్‌ లేబుల్‌ సీసాను ఖాళీ చేస్తూ చెప్పారీ మాట.


మరొకరు తెహల్కా స్టింగ్‌ ఆపరేషన్‌లో (2001) కేవలం రూ. 1 లక్ష తీసు కుంటూ పట్టుబడ్డ బంగారు లక్ష్మణ్‌. జాదవ్‌ కేవలం జూనియర్‌ మంత్రే. కానీ బంగారు లక్ష్మణ్‌ నాటి బీజేపీ జాతీయ అధ్యక్షులు. అయితేనేం, ఆయన ముందుగా ఒక దళితుడు. నేటికి కూడా బీజేపీలో అంత ఉన్నత స్థాయికి చేరిన ఒకే ఒక్క దళితుడు ఆయనే. ఆ పార్టీ ఆయనతో తమకు సంబంధం లేదంది, ఖండించింది, పార్టీ నుంచి వెళ్లగొట్టింది, ఏకాకిని చేసింది. ఆయన జైలుకు వెళ్లారు. ఆ తెహెల్కా కేసుల్లో తనంత తాను ఒంటరిగా పోరాడుతూనే మర ణించారు. ఆ స్టింగ్‌ ఆపరేషన్‌లో జైలుకు వెళ్లిన ఏకైక నేత ఆయనే. జాదన్‌ను ఇంకా కాపాడుకుంటూనే వస్తున్న ఆ పార్టీ లక్ష్మణ్‌ను అంటరానివాడన్నట్టు గానే చూసింది. ఇది దురదృష్టకరమైన అభివర్ణనే అయినా అలా చెప్పక తప్పడం లేదు. ఈ వాదనను మీరు న్యాయవ్యవస్థకు విస్తరింపజేయాలం టారా? మన ప్రధాన న్యాయమూర్తులలో ఎక్కువ మంది అవినీతిపరులని చాలా మందే పరోక్షంగా సూచించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం మంచి ఊపు మీద ఉన్నప్పుడు ఆ ఉద్యమంలోని పలువురు ప్రము ఖులు సైతం అలా అన్నారు. కానీ పేరు పెట్టి దాడిని ఎక్కుపెట్టింది ఎవరి పైన? జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ ఒక్కరిపైనే. ఆయన దళితుడు. దశాబ్ది దాటినా నేటికీ ఆయనకు వ్యతిరేకంగా కనిపెట్టింది ఏదీ లేదు.

వ్యవస్థలోనే ఉన్న  పక్షపాతం
ఈ విషయాన్ని మరింతగా శోధిద్దాం. వృత్తిపరమైన ఓ చిన్నపాటి పొరపాటు చేసినందుకు... ఉన్నత న్యాయస్థానంపట్ల కోర్టు ధిక్కారానికి పాల్పడ్డందుకు జైలుకు వెళ్లిన ఏకైక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కన్నన్‌. ఆయన దళితుడు. గణనీయులైన ముగ్గురు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చినా వారు ఏ మచ్చా అంటకుండా బయటపడ్డారు. ఈ మూడు కేసులనూ సమాధి చేసేశారు. ఒక కేసులోనైతే, ఆ ఆరోపణల గురించి మాట్లాడటానికే వీల్లేదని మీడియాపై నిషేధం విధించేంత వరకూ కూడా ఒక హైకోర్టు వెళ్లింది. ముగ్గురిలో ఇద్దరు సుప్రీం కోర్టు చేరగా, ఒకరు పదవీ విరమణానంతరం చేపట్టగల ఒక ఉన్నత పదవిని అలంకరిం చారు. చివరగా ఒక్క మాట చెప్పాలి. వీరిలో ఏ ఒక్కరూ కింది కులాలకు చెందిన వారు కారు. కాబట్టి సాధారణ అనుమానితులు కారు.

ఇది, సామాజిక వ్యవస్థ అనే గోపురంలోని శిఖరాగ్ర భాగం ఒక నియ మంగానే ‘‘ఎక్కువ పరిశుద్ధమైనది’’గా ఉండటం ఫలితం కావచ్చా, లేక దిగువ సగ భాగం పట్ల ఈ వ్యవస్థ బాగా అన్యాయంగా ఉండటం ఫలితం కావచ్చా? మన దేశంలో పదవులు ఉద్యోగాల వంటి స్థానాల్లో, ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ముస్లింల సంఖ్య వారి జనాభాతో ఏమా త్రం పొంతన లేకుడా అతి తక్కువ సంఖ్యలో ఉన్నది. ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసిన సచార్‌ కమిటీ నివేదిక సైతం అదే విషయాన్ని  తెలిపింది. జనాభాతో పొంతన లేకుండా ముస్లింలు ఎక్కువగా ఉన్నది ఒక్క జైళ్లలోనే. కాబట్టి హిందువుల కంటే ముస్లింలలో నేరగ్రస్తులయ్యే ధోరణి ఎక్కువగా ఉంటుందా, లేక వ్యవస్థ వారి పట్ల బాగా అన్యాయంగా ఉన్నదా?

 ‘ఐసీ తైసీ డెమోక్రసీ’ (పరిహాసాస్పద ప్రజాస్వామ్యం) అనేది బాగా ప్రాచుర్యం పొందిన రంగస్థల ప్రదర్శనల్లో ఒకటి. మన దేశంలో హత్య నేరానికి ఉరిశిక్షను అనుభవించేవారిలో అత్యధికులు మైనారిటీలు లేదా దిగువ కులాల వారేనని ఆ రాజకీయ వ్యంగ్య ప్రదర్శన మనకు గుర్తుచేస్తుం టుంది. ఒక బ్రాహ్మణున్ని ఉరితీస్తామంటే వారు కత్తులు నూరుతారు, అతగాడు ఎవరినో కాదు మహాత్మా గాంధీనే హత్య చేసినా సరే.  కాబట్టి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతాయి. అవినీతి, నేరగ్రస్తతల విషయంలో జన్యు పరమైన అంశాల ప్రభావం ఏమైనా ఉంటుందా? లేకపోతే ఈ వ్యవస్థ... పోలీసులు, న్యాయమూర్తుల నుంచి మీడియా, ప్రజాభిప్రాయం వరకు బడు గులకు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణగారినవారి పట్ల బాగా అన్యా యంగా ఉంటున్నదా? పోలీసు కాల్పులకు గురయ్యే లేదా జైళ్లలో జనాభాతో పొంతన లేకుండా ఎక్కువ సంఖ్యలో ఉండే ఆఫ్రికన్‌–అమెరికన్ల సంఖ్యను చూడండి.

కొన్ని చోట్ల జాతి అనేది మన దేశంలోని కులం స్థానంలో నిలు స్తోంది. కొన్ని మైనారిటీలు, ఆదివాసులు కూడా  మన దేశంలో అదే కోవకు చెందుతుండటంతో ఈ సమస్య మరింత జటిలం అవుతుంది. ఈ పక్షపాతం కొనసాగుతూనే ఉంటుంది. నిర్దోషిగా తేలిన రాజాను ఇంకా దొంగగానే చూస్తుండగా, శిక్షపడ్డ సుఖరామ్‌ జైలుకు వెళ్లకుండా ఈ వ్యవస్థ కాపాడు తుంది. అంటే, బంగారు లక్షణ్‌ను ఒంటరిగా జైల్లో మగ్గుతూ చావమని వదిలేసినా, జాదవ్‌కు రాజకీయ పునరావాసం కల్పించగలుగుతుందని కూడా అర్థం. ఇలాంటి చేదు ఆలోచనలతో మీ క్రిస్‌మస్‌ వారాంతాన్ని పాడు చేస్తు న్నందుకు మన్నించండి. వాస్తవం ఏమిటో సరిచూసుకోవడానికి మంచి సమయం అంటూ ఏదీ ఉండదు.


వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
శేఖర్‌ గుప్తా

twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement