నల్లజాతి కళ్లలోంచి మన కులవ్యవస్థ | Kancha Ilaiah Guest Column Caste The Origins of Our Discontents | Sakshi
Sakshi News home page

నల్లజాతి కళ్లలోంచి మన కులవ్యవస్థ

Published Thu, Oct 29 2020 2:14 AM | Last Updated on Thu, Oct 29 2020 2:14 AM

Kancha Ilaiah Guest Column Caste The Origins of Our Discontents - Sakshi

అమెరికన్‌ ఓటర్లను 2020 ఎన్నికల్లో ప్రభావితం చేసిన ఇసాబెల్‌ విల్కర్‌సన్‌ రచన ‘క్యాస్ట్‌: ది ఆరిజన్స్‌ ఆఫ్‌ అవర్‌ డిస్‌కంటెంట్స్‌’ (కులం: మన అసంతృప్తుల మూలాలు) పుస్తకాన్ని పూర్తిగా చదవకముందే నేనొక విషయాన్ని గుర్తించాను. అదేమిటంటే, ఒక నల్ల సోదరి 400 సంవత్సరాల పాత గృహం నుంచి 3,500 సంవత్సరాల మన పాత గృహానికి వచ్చేసింది. ఆమె మన పాత ఇంటిని పూర్తిగా కూల్చివేసి కొత్త ఇంటిని నిర్మించుకోవాలని చెప్పింది. వాస్తవానికి చరిత్రలో మొట్టమొదటిసారిగా కులం జన్మించిన అతి పాత ఇంటి కథను ఆమె మనకు చెప్పింది (ఆర్యుల మూల స్థానం జర్మనీ). ఆర్యుల తొలి స్థలం రెండో ప్రపంచయుద్ధంలో కూల్చివేతకు గురై తిరిగి దాన్ని కొత్తగా నిర్మించారని నాకు గుర్తొచ్చింది. అమెరికాలో కూడా వారు తమ పాత ఇంటిని కూల్చివేసే మార్గంలో ఉన్నారు. అమెరికాలో తమదైన కులాన్ని పాటించే తెల్లవాళ్లు ఇప్పుడు ఒక సర్దుబాటు క్రమంలో ఉన్నారు. ఇసాబెల్‌ విల్కర్‌సన్‌ గొప్ప సత్యాన్ని చెబుతున్నారు. మానవుల చర్మాల్లో జాతి భావన ఎలా ఇమిడిపోయి ఉందో, అలాగే భారతీయుల, అమెరికన్ల మూలగల్లో కులం ఘనీభవించింది. ఆర్యులే కుల వైరస్‌ సృష్టికర్తలు. భూమ్మీద ఉన్న మానవులందరిలో ఎక్కువగా భారతీయుల మూలగలను ఈ వైరస్‌ కబళించేస్తోంది.

భారతీయుల్లో కులం నరనరానా ఎంతగా జీర్ణించుకుని పోయిం దంటే అమెరికాలో లేక యూరోపియన్‌ విశ్వవిద్యాలయాల్లో ఉంటున్న ఇంగ్లిష్‌ విద్యావంతురాలైన బ్రాహ్మణ సోదరి తన చేతిలో ఉన్న సాధనాన్ని తనిఖీ చేయాలని కానీ, లేదా కనీసం ఈ ఇంటిలో ఉన్న పరిస్థితిపై చర్చ జరగాలని కానీ భావించడం లేదు. వెయ్యి సంవత్సరాలుగా సంస్కృతంలో, పర్షియన్‌ భాషలో విద్య పొందిన, ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్‌ యూనివర్శిటీల్లో అత్యున్నత ఇంగ్లిష్‌ విద్య పొందుతున్న మన ఆధిపత్యకుల సోదరులు ఎన్నడూ మన ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఎవరినీ అనుమతించాలని కోరుకోలేదు.

మరోవైపున బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లోని మన ఆధిపత్యకుల సోదరీమణులు ఈ పాత ఇంటిలోనే అనేక విషయాలను సాధించారు. కమలా హ్యారిస్, నిక్కీ హేలీ, ఇంద్రా నూయి మరెందరో ఈ పాత ఇంటిలోనే చాలా చక్కగా పనిచేశారు. కానీ తమకు చెందిన ఈ పాత ఇంటిలో కుళ్లిపోతున్న మూలగలను అమెరికన్లు తెలుసుకోవాలని వీరు ఎన్నడూ కోరుకోలేదు. అమెరికాలో ఉంటున్న అనేకమంది బ్రాహ్మణ మహిళలు చాలా పుస్తకాలను రాసి అనేక అవార్డులు పొందారు. కానీ వీరెవ్వరూ తన పాత ఇంటిని గురించి రాయలేదు. మన చర్మాన్నే కాదు, మన మూలగలను కూడా తినేస్తున్న వ్యాధి గురించి వీరిలో ఎవరూ రాయలేదు. పైగా 3,500 ఏళ్లుగా ఆ వైరస్‌ మనల్ని దుర్గంధంలోకి నెట్టేస్తోంది. అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో అత్యున్నతమైన ఇంజనీరింగ్‌ నైపుణ్యాలు నేర్చుకుని, ఐఐటీలు, ఐఐఎమ్‌లను నిర్వహించడానికి మళ్లీ పాత ఇంటికి తిరిగొచ్చిన పండిట్లు మన పాత ఇంటిలోని ఘనమైన ప్రజాస్వామ్యంలాగే ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ప్రజాస్వామ్యం గొప్పదనం గురించి డాలర్ల సంపాదన కోసం కథలురాసి అమ్మేసుకుంటున్నారు. ఏమైతేనేం, పాత ఇంటిలో వ్యవస్థ కంటే ఇది మెరుగ్గా ఉందని వీరు చెబుతున్నారు. ఇక్కడికి సమీపంలోనే హిట్లర్‌ జన్మించి, ప్రపంచాన్ని కొత్తగా సృష్టించడానికి స్వస్తిక్‌ సింబల్‌ని ఉపయోగించి నియంతగా ఎదుగుతూ, జాతితత్వం, కులతత్వంతో నిండిన పాత వ్యవస్థను ప్రపంచమంతటా వ్యాపింపచేయాలని కోరుకున్నాడు. అదృష్టవశాత్తూ రష్యన్ల చేతిలో అతడు పరాజయం పొందాడు.

రాజ్యాంగ ప్రజాస్వామ్యం ముసుగులో అనేక మంది నియంతలు పుట్టుకొస్తున్నారు కానీ వారితో ఎలా పోరాడాలో వీరికి తెలియదు.  సొంత ఇంటికి తిరిగి వచ్చాక మన ఆధిపత్యకుల సోదర, సోదరీ మణులు (ది నేమ్‌సేక్‌ లేదా లైఫ్‌ ఈజ్‌ వాట్‌ యు మేక్‌ ఇట్‌ వంటి నవలలు రాయడం ద్వారా) తమ పేర్లు, లేక వైవాహిక జీవితానికి సంబంధించి తాము అక్కడా ఇక్కడా ఎదుర్కొంటున్న సమస్యల గురించి కథలు చెబుతూ వస్తున్నారు. పాత ఇంటిలో నివసిస్తున్న ఏ రచయిత కంటే జంపా లహరి, అనితా దేశాయ్‌ వంటి రచయిత్రులు భారతీయ బుక్‌ మార్కెట్‌లో చాలా బాగానే సంపాదిస్తున్నారు.

తమ ఆర్యన్‌ ఇళ్లలో తమ పెళ్లిళ్ల గురించి, పాత ఇంటి ఆచారాల గురించి మన ద్విజ పురుషులు మాట్లాడుతూ వచ్చారు. వారు ఎ సూటబుల్‌ బాయ్, ది గ్లాస్‌ ప్యాలెస్‌ తదితర రచనల ద్వారా పాత ఇంటి సమస్యల గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇకపోతే విక్రమ్‌ సేత్, అమితవ్‌ ఘోష్‌ వంటి రచయితలు అయితే దాదాపు అన్ని సాహిత్య ఉత్సవాలలో అత్యున్నత గౌరవాలు పొందుతూ, అవార్డులు గెల్చుకుంటూ వస్తున్నారు. కానీ తమ పాత ఇంటిలో క్రీస్తు పూర్వం 3,500 ఏళ్లకు ముందునాటి ఆర్యజాతి నుంచి పుట్టుకొచ్చిన కులం అనే వ్యాధి గురించి వీరెన్నడూ రాసి ఉండలేదు. టోనీ జోసెఫ్‌ తన ఎర్లీ ఇండియన్స్‌ (తొలి భారతీయులు) పుస్తకంలో, సింధుస్థాన్‌కు ఆర్యన్లు మూడో పెనువలస వచ్చిన క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల కాలం లోనే భారతీయ మూలగలను కబళించేస్తున్న కులం అనే వ్యాధి కూడా వచ్చి చేరిందని చెబుతున్నారు. 

కానీ హరప్పా గ్రామీణ, నగర నాగరికత నిర్మించడానికి వేల సంవత్సరాల క్రితమే ఆఫ్రికా నుంచి వచ్చిన తొలి రంగుజాతి ప్రజల (ఆండో–ఆఫ్రికన్స్‌) మూలాలు కలిగిన మన సొంత సోదరి మాత్రం జాతితత్వం, కులతత్వానికి సంబంధించిన సమస్య లేకుండానే భారతదేశానికి వచ్చి మన బాధలు గమనించి ఎంకే గాంధీ ప్రపచించిన సత్యానికి భిన్నమైన వాస్తవాన్ని మనకు తెలియజేస్తోంది. హరప్పన్‌ నాగరికతా కాలంలో మనం కూడా ఇసాబెల్‌ లాగే నల్లగానూ, అందంగానూ ఉండేవారం. కానీ ఆర్యన్‌ వలస మొదలైన తర్వాత మాత్రమే మనం సంకరవర్ణంలో కలిసిపోయాం. మన ఆధిపత్యకుల సోదరీమణులు మూల ఆర్యన్లు అని మనం కచ్చితంగా చెప్పలేం. బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, వాయు, తదితరులు (రుగ్వేదకాలం నాటి దేవతలు, జొరాస్ట్రియన్‌ లిపి కలిగిన రాక్షసులు) అతి పురాతన స్థలం నుంచి వలస వచ్చినట్లుగా కనిపిస్తారు. కానీ వీరిలో ఎవరూ తమతో పాటు మహిళలను తీసుకొచ్చినట్లు కనిపించరు.

ఇకపోతే సతి, బాల్యవివాహాలు, శాశ్వత వైధవ్యం వంటి సమస్యలతో సతమవుతూ వచ్చిన మన అగ్రకుల మహిళలు బహుశా  జర్మనీ నుంచి మొదట వలస వచ్చిన వారు తీసుకొచ్చిన మన ఆండో–ఆఫ్రికన్‌ సోదరీమణులు అయివుండొచ్చు. ఈ జర్మనీనే ఇసాబెల్‌ పురాతన గృహం అంటూ పిలుస్తున్నారు. వెయ్యి సంవత్సరాల క్రమంలో వీరు తమ ప్రస్తుత రంగు, వర్చస్సు, ఆకారాలను పొందారు. కానీ ఇలా రూపొందిన వీరు ఇప్పుడు ఆ పాత ఇంటికి చెందిన నల్లవారిని పెళ్లాడటానికి ఇష్టపడటం లేదు. కమలా హ్యారిస్‌ తల్లి శ్యామల మాత్రం ఒక మినహాయింపు అని చెప్పాలి. 1970లు, 80లలో పాత ఇంటిలో స్త్రీవాద ఉద్యమం ఉండేది. బ్రాహ్మణ, బనియా మహిళలు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. కానీ మరింత మెరుగైన విద్యావకాశాలు పొందడానికేగానీ తమ 3,500 సంవత్సరాల వ్యథలను పట్టించుకోవడానికి వారు ఆ ఉద్యమంలో పాల్గొనలేదు. వారిలో కమ్యూని స్టులు, ఉదారవాదులు, లౌకికవాదులు ఉండేవారు. వీరంతా బయటకి కనిపించే మన దారిద్య్రాన్ని తప్ప, మన మూలగల్లో పేరుకుపోయిన వ్యాధిని చూడలేదు.
వీరి చర్మం మనకంటే కాస్త కాంతివంతగా ఉంటూ వచ్చినందున, బాలీవుడ్‌ మొత్తంలో వీరి సౌందర్యమే కనిపిస్తూ వచ్చేది. అయితే అదే సమయంలో హాలీవుడ్‌ పాత ఇంట్లో అనేకమంది నల్లజాతి సోదరులకు, సోదరీమణులకు స్థానం దక్కింది. కానీ మన స్త్రీపురుషులు తమ చర్మం వల్ల కాక, తమ మూలగల్లో ఉండిపోయిన కులం అనే సమస్య వల్ల దురదృష్టవంతులుగా మిగిలిపోయారు. మన యూరో అమెరికన్‌ ద్విజ స్త్రీపురుష పండిట్లు పాశ్చాత్య ప్రపంచ అవకాశాల దన్నుతో తమ పాత ఇంటిలో విరిగిపడుతున్న దూలాలు, కారుతున్న పైకప్పులు, మసకబారుతున్న గోడలు వంటి వాటిని దాచి ఉంచాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో మన నల్ల సోదరి పాత ఇంటిలో వాస్తవంగా నివసిస్తున్న వారి తలుపులను తెరుస్తూ కొత్త కాంతిని వెదజల్లుతోంది.

ఆమె అమెరికా పాత ఇల్లు లేదా వ్యవస్థను పరారుణ కాంతిని కలిగినదిగా వర్ణిస్తోంది. అదే సమయంలో ఆమె జర్మనీని జాతితత్వానికి, కులతత్వానికి మూలమైన పురాతన ఇల్లుగా అభివర్ణిస్తూ విశ్లేషణకు కొత్త ఆధారాన్ని అందజేస్తోంది. ఇక భారతదేశం విషయానికి వస్తే బుద్ధిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం అన్నీ ఉండి కూడా తీవ్రంగా దెబ్బతింటూనే పై రెండు పాత వ్యవస్థల మధ్య నలుగుతోంది. స్వస్తిక్, త్రిశూల్‌ ఇప్పుడు నాగ్‌పూర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి పాలన సాగిస్తున్నాయి. కానీ మన సోదరులను పక్కన పెట్టండి.. మన సోదరీమణులు కూడా వారి పాత ఇంటిపై ఎలాంటి కాంతీ ప్రసరించాలని కోరుకోవడంలేదు. కాబట్టి అక్కడ మునుపటిలాగే గాఢాంధకారం రాజ్యమేలాలని, అలాగైతేనే బయటి నుంచి వచ్చిన ఎవరూ ఆ ఇంటిలోపల ఏముందని టార్చ్‌ వెలిగించలేరని వీరు భావిస్తున్నారు. ఈస్ట్‌ ఇండియా సామ్రాజ్య కాలం నుంచి అనేకమంది తెల్లవారు ఇక్కడికి వచ్చారు. వాళ్లంతా ఆర్య బ్రాహ్మణులు తమకు చెప్పిందే నమ్ముతూ వచ్చారు. 

ప్రియమైన ఇసాబెల్లా సోదరీ, మా పాత ఇంటిని నీవు సందర్శించినందుకు నీకు కృతజ్ఞతలు. క్షుణ్ణంగా శోధించే విమానాశ్రయాలలోంచి కూడా నీవు ఎంతగానో ప్రేమించే మా డాక్టర్‌ అంబేడ్కర్‌ చిత్రాన్ని నీ దుస్తుల్లో పొదవుకుని తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెబుతున్నాం తల్లీ. నల్ల సోదర అధికారులు ఆ చిత్రపటంలో ఉన్నది ఎవరో తెలుసుకోలేనప్పుడు, అతడు భారత దేశపు మార్టిన్‌ లూథర్‌ అని నీవు వారికి తెలియజెప్పినప్పుడు, మా ఆధిపత్యకుల సోదర సోదరీమణులు తమ కులాన్ని తమ చర్మంలోని కులాన్ని ఇకపై దాచి ఉంచలేరని మేం ఎంతో ఉద్వేగం చెందుతున్నాం. వారి కులం వారి మూలగల్లోకి కూడా చేరుతుంది.

ప్రొ.కంచ ఐలయ్య, షెపర్డ్‌
వ్యాసకర్త ఇంగ్లిష్‌ తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత,
సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement