ఓటర్‌ నాడి ఏం చెబుతోంది? | David Brooks Guest Column On USA Election Voters Opinion | Sakshi
Sakshi News home page

ఓటర్‌ నాడి ఏం చెబుతోంది?

Published Sun, Nov 8 2020 12:35 AM | Last Updated on Sun, Nov 8 2020 12:35 AM

David Brooks Guest Column On USA Election Voters Opinion - Sakshi

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక కొలిక్కి వస్తున్నాయి. డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌ అధ్యక్ష పీఠం ఎక్కడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఈసారి ఎన్నికలు ఒకింత గందరగోళం, వివాదాల మధ్యే పూర్తయ్యాయని చెప్పక తప్పదు. కానీ ఓటర్లు ఈసారి మార్పు కోరుకుంటున్నారనేందుకు అనేక ముందస్తు సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ 2016తో పోలిస్తే ఈసారి ఎక్కువమంది శ్వేతజాతీయులూ డెమొక్రాటిక్‌ పార్టీవైపే మొగ్గు చూపినట్లు అర్థమవుతోంది. విభజన రాజకీయాలకు స్వస్తి చెప్పాలని.. అమెరికన్‌ విలువల పునాదులను కదిలించే ప్రయత్నం చేస్తున్న ఓ వ్యక్తిని తొలగించేందుకు పట్టుపట్టి మరీ ప్రయత్నించినట్లు ఈ ఎన్నికలు మనకు చెబుతున్నాయి. ఇదేమంత ఆషామాషీ విజయం ఏమీ కాదు. రాజకీయ వైరం ఎప్పటి నుంచో కొనసాగుతున్నా మతాన్ని, రాజ్యాన్ని కలపడం ఎవరికీ శ్రేయస్కరం కాదని, ఆ ప్రయత్నం చేసిన వారు ఇంటిదారి పట్టాల్సిందేనన్న అమెరికన్‌ ఓటర్ల సంకల్పమూ ఓటింగ్‌ తీరు ద్వారా స్పష్టమైంది. ఇటీవలి కాలంలో రాజకీయ ఏకీకరణ కాస్తా మతపరమైన యుద్ధం స్థాయికి దిగిపోవడం అందరికీ తెలిసిన విషయమే.

ట్రంపిజమ్‌... సామాజిక చైతన్యం అమెరికన్‌ పరిభాషలో చెప్పాలంటే వోకిజమ్‌...  రెండూ సరిసమానమైన భావనలు కానేకాదు. కానీ వీటిని అనుసరించే ఇరు వర్గాలకూ అవి మతాతీతంగానే కనిపిస్తాయి. మంచి, చెడు అన్న రెండు అంశాలకే పరిమితమవుతాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలి తాలను విశ్లేషిస్తే రాజకీయాలు వాస్తవ అంశాలపై ఉంటేనే మేలన్న భావన ఓటర్లు కలిగి ఉన్నారని స్పష్టమవుతుంది. ఎన్నికలు మత రాజకీయాలకు వేదిక కారాదన్న స్పష్టత ఓటర్లలో కనిపిస్తుంది. 

అ‘‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’’ అన్న వేలంవెర్రి ప్రచారాన్ని మినహాయించి కూడా బలవంతులే అన్న పాఠం ఈ ఎన్నికలు రిపబ్లికన్లకు ఇచ్చాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు ట్రంప్‌ ఓటమి పాలవుతున్నా రిపబ్లికన్లకు హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ఆరు స్థానాలు దక్కడం దీనికి నిదర్శనంగా చూపుతున్నారు. డెమొక్రాట్లు రాష్ట్రాల అసెంబ్లీలో తమదైన ముద్ర ఇంకా చూపించాల్సి ఉంది. మొత్తమ్మీద ఈ ఎన్నికలు కాంగ్రెగేషనల్‌ జిల్లాల స్థాయిలో రానున్న పదేళ్ల వరకూ రిపబ్లికన్లకు మంచి బలం చేకూరుస్తాయనడంలో సందేహం లేదు. 

ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు అనూహ్యంగా లాటినోలు, ఆఫ్రికన్‌ అమెరికన్లు, ముస్లిం మద్దతు కూడగట్టగలిగారు. గత 60 ఏళ్లలో ఏ రిపబ్లికన్‌ అభ్యర్థి కూడా సాధించలేనన్ని శ్వేతజాతీయేతర ఓట్లు సాధించడం రికార్డుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా ట్రంప్‌ వల్ల సాధ్యం కాలేదు. రిపబ్లికన్‌ పార్టీకి ఉన్న పేరు ప్రతిష్టలు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు చిన్న చిన్న వ్యాపారాలకు అండగా నిలబడటం ద్వారా వీలైంది. ఈ లాభాలను మరింత పెంచుకోవడం రిపబ్లికన్లకు కష్టమేమీ కాబోదు. రిపబ్లికన్ల పరిస్థితి ఇలా ఉంటే సాంస్కృతిక అంశాలపై కాకుండా.. విధానపరమైన అంశాలపై దృష్టి పెట్టి ఉంటే డెమొక్రాట్లకూ ఓటర్ల నుంచి మరింత ఎక్కువ మద్దతు లభించి ఉండేది. దురదృష్టవశాత్తూ డెమొక్రాట్లు ఓటర్లలో ఈ నమ్మకం కలిగించలేకపోయారు. జో బైడెన్‌ మద్దతిచ్చే విధానాలు బాగా పాపులర్‌ అయినప్పటికీ నివారించదగ్గ కొన్ని అంశాలను లేవనెత్తడం డెమొక్రాట్ల ఆధిపత్యానికి కళ్లెం వేసింది. 

అంతరాలతో చిక్కులే...
అమెరికా ఎన్నికలు ఎల్లప్పుడూ ఏకస్వామ్యం నుంచి వైవిధ్యతకు దారి ఇవ్వడమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతూంటారు. డెమొక్రాట్లను ఈ వైవిధ్యతను స్వాగతించే వారిగానూ రిపబ్లికన్లను వ్యతిరేకించే వారిగానూ అమెరికన్‌ ఓటర్లు చూస్తూంటారు. ఈ భావనల కారణంగానే ప్రతి ఎన్నికలో కొన్ని ఆశ్చర్యకరమైన ఫలి తాలు వెలువడుతూం టాయి. డెమొక్రాట్లు అంతకంతకూ శక్తి పుంజుకునేందుకూ ప్రతిబంధకం ఈ భావనలే. 

అంతేకాదు.. ఇంకో సమస్య కూడా ఉంది. అమెరికాలో నడుస్తున్న పలు వ్యవహారాలను చాలా తేలికగా సాధారణీకరించడం. మంచికో.. చెడుకోగానీ అమెరికాలో జాతివివక్ష అనేది ఒక చర్చనీయాంశం. ఇది అవసరం కూడా. ఓటర్ల తీర్పు ఫలితంగా బహుశా అమెరికా జో బైడెన్, నాన్సీ పెలోసి (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ స్పీకర్‌), కెంటకీ సెనేటర్, వివాదాస్పద నేత మిచ్‌ మెక్కానెల్‌ వంటి పాలనలోకి చేరుతుంది. వీళ్లు ఎవరూ సాంస్కృతిక అంశాలపై పోరాడే వారు కాదు. ఫక్తు వ్యాపారవేత్తలు, చట్టసభల సభ్యులు. అంతే. ఈ ఎన్నికల పుణ్యమా అని జరిగిన మార్పులు, చేర్పులతో  అటు డెమొక్రాట్లు ఇటు రిపబ్లికన్లు వర్కింగ్‌ క్లాస్‌ పార్టీలుగా మారి పోయాయి. రానున్న కాలంలో విద్యార్హతలు లేని అమెరికన్లకు ఏ పార్టీతో ఎక్కువ లాభం చేకూరుతుందన్న అంశంపై రాజకీయాలు నడుస్తాయేమో! డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఎలక్టోరల్‌ ఓట్ల అంతరం చాలా తక్కువగా ఉండటం భవిష్యత్తులో పాలనపరమైన స్తబ్ధతకు దారితీసే అవకాశం ఉంది. 1984 నుంచి కెంటకీ నుంచి సెనేటర్‌గా గెలుస్తూ వచ్చిన మెక్కానెల్‌ తన పార్టీ రిపబ్లికన్లకు మేలు చేకూర్చేలా రాజకీయాలను నడుపుతారని, 2024 ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తారని ఉన్న అంచనాలు ఎంత నిజమన్నది కాలమే చెప్పాలి.

ఇప్పటికి అయితే అమెరికా సాంస్కృతిక అంశాలపై విడపోయినా ఆర్థిక అంశాల విషయంలో మాత్రం ఈ అంతరం చాలా తక్కువగా ఉంది. పాపులిజం కాస్తా రిపబ్లికన్‌ పార్టీని బలహీన పరచగా మార్కో రూబియో, జాష్‌ హాలీ, టామ్‌ కాటన్‌ వంటి రిపబ్లికన్‌ సెనేటర్లు పారిశ్రామిక అంశాల్లో ఫెడరల్‌ వ్యవస్థ జోక్యం మరింత పెరగాలన్న అంచనాకు బలం చేకూరుస్తున్నారు.

ఈసారి ఎన్నికల ద్వారా ఓటర్లు గుర్తు చేసిన ఇంకో అంశం ఉంది. ట్రంపిజమ్‌ కానీ.. ఇతర అంశాలు కానీ ఇప్పుడిప్పట్లో సమసిపోయేవి ఏమీ కాదు అని ఈ ఎన్నికలు చెబుతున్నాయి. రానున్న ఎన్నికల్లో అంటే 2024లో ఏదో మాయ జరిగిపోయి అందరికీ అన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయన్న కల్పనతోనే ఓటర్లు బతకాల్సి ఉంటుంది. సాంస్కృతిక అంశాలపై పట్టు వదిలించుకోవడం అమెరికా రాజకీయాలు, పాలనలపై ప్రభావం చూపిందనేది వాస్తవం. అందుకే ఈ అంశాలపై పోరు రాజకీయపు ఒత్తిళ్ల రూపంలో కాకుండా.. నిరసన ప్రదర్శనలు, పుస్తకాల రూపంలో సాగాలి. 
 

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. రిపబ్లికన్ల రాష్ట్రాలనుకున్నవి ఆ పార్టీ చేజారు తున్నాయి. డెమొక్రాట్లు విజయఢంకా మోగిస్తారనుకున్నచోట్ల వారికి అరకొర విజయాలే దక్కాయి. కొన్నిచోట్ల లెక్కింపు ఆపాలని అధ్యక్షుడు ట్రంప్‌ కోర్టుకెక్కారు. ఓటర్ల తీర్పును దొంగి లిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరికలు చేస్తున్నారు. ఫలితాల సరళిని, అమెరికా భవిష్యత్తు చిత్రపటాన్ని ఈ వ్యాసాల్లో రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.. 

-డేవిడ్‌ బ్రూక్స్, ఒపీనియన్‌ కాలమిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement