ప్రైమరీలను వేడెక్కిస్తున్న భారతీయులు | Sakshi Guest Column On Primary election in USA | Sakshi
Sakshi News home page

ప్రైమరీలను వేడెక్కిస్తున్న భారతీయులు

Published Mon, Aug 28 2023 1:09 AM | Last Updated on Mon, Aug 28 2023 1:09 AM

Sakshi Guest Column On Primary election in USA

వివేక్‌ రామస్వామి, నిక్కీ హేలీ

నార్త్‌ కరొలైనా మాజీ గవర్నరు నిక్కీ హేలీ, 38 ఏళ్ల పారిశ్రామిక వేత్త వివేక్‌ రామస్వామి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రైమరీ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. అధిక సంఖ్యాకవాద రాజకీయాలకు, వివక్షాపూరిత విధానాలకు బాధితులైన మైనారిటీ సమూహాలను డెమొక్రాటిక్‌ పార్టీ తన ప్రగతిశీల సిద్ధాంతాలతో దరికి చేర్చుకుంటుందన్న వాస్తవానికి విరుద్ధంగా ఉంది – భారతీయ అమెరికన్‌లు ఇలా రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ పడటం! రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ భారతీయ అమెరికన్‌లు పోటీకి నిలిచే అవకాశం లేకపోవచ్చు. అయినప్పటికీ వీరి ఆలోచనలు అమెరికా రాజకీయ నేపథ్య దృశ్యానికి భిన్నంగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకిది ముందరి ఏడాది కావడంతో అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ‘ప్రైమరీ’లు (ప్రాథమిక ఎన్నికలు) రాజకీయ వాతావర ణాన్ని వేడెక్కిస్తున్నాయి. యూఎస్‌లో 40 లక్షల మంది భారతీయ అమెరికన్‌లు ఉన్నారు. యూఎస్‌ మొత్తం జనాభాలో ఇది దాదాపుగా 1.3 శాతం. యూఎస్‌ కాంగ్రెస్‌లో గత దశాబ్ద కాలంలో ఐదుగురు భారత సంతతి అమెరికన్‌లు ప్రతినిధులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నార్త్‌ కరొలైనా మాజీ గవర్నరు, ఐక్యరాజ్యసమితిలో యూఎస్‌ శాశ్వత ప్రతినిధి అయిన నిక్కీ రణ్‌ధవా హేలీ... రిపబ్లికన్‌ అభ్యర్థిత్వం కోసం ప్రైమరీ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. ఆమె పాలనా సామర్థ్యానికి ఇప్పటికే అనేక నిరూపణలు ఉన్నాయి. 

బయోటెక్స్‌ స్టార్టప్‌ను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తున్న 38 ఏళ్ల భారతీయ సంతతి పారిశ్రామిక వేత్త వివేక్‌ రామస్వామి కూడా ప్రస్తుతం వెలుగులో ఉన్నారు. అతడు డబ్బు వరదలో కొట్టుకుని పోతున్నవాడు. అమెరికా గుండెకాయగా పేర్గాంచిన మిడ్‌వెస్ట్‌ ప్రాంతంలో పెరిగి పెద్దవాడైనవాడు. ఐవీ లీగ్‌ ప్రావీణ్యాలతో పరిపుష్ట మైనవాడు. ప్రఖ్యాత మీడియా సంస్థలు ఆయన గురించి రాశాయి. ఆయన కథనాల్లో అతిశయోక్తి కనిపించవచ్చు. కానీ ఓటర్లు ఏం కోరు కుంటున్నారన్న విషయమై ఆయనకు చక్కటి అంచనా ఉంది. 

అత్యధిక సంఖ్యలో డెమోక్రాట్‌ల వైపున ఉన్న యూఎస్‌లోని ప్రవాస భారతీయులకూ, ఇతర అల్పసంఖ్యాక వర్గాలకూ రామ స్వామి ఆలోచనలు గిట్టనివే కావచ్చు. పని ప్రదేశాలలో వైవిధ్యానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడతారు. అదే సమయంలో వైవిధ్యభరిత మైన ఆలోచనలను ఇష్టపడతానని చెబుతుంటారు.

వైవిధ్య వ్యతిరేక తకు ‘తెలివి’ని జోడించడం ఇది. రామస్వామి ఒక రాజ్యాంగ సవర ణను కూడా ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రకారం 18–24 ఏళ్ల మధ్య వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే యూఎస్‌ ప్రభుత్వ స్వరూప స్వభావాలలోని ప్రాథమిక అంశాలపై వారెంత అవగాహ నను కలిగి ఉన్నారో నిర్ణయించే ‘సివిక్స్‌ టెస్ట్‌’ను ఉత్తీర్ణులై ఉండాలి.

మళ్లీ ఇదొక పైకి మంచిగా కనిపించే కపటపూరితమైన ఆలోచన. ఈ వయఃపరిమితిలో ఉన్న జనాభాలో ఎక్కువమంది డెమోక్రాట్‌లకు మద్దతు ఇస్తుంటారు. రిపబ్లికన్‌లకు మద్దతు ఇచ్చేవారిలో మధ్య వయస్కులు అత్యధికం. ‘సివిక్స్‌ టెస్ట్‌’ నిర్వహణ ద్వారా యువజనుల ఓటర్లలో తగ్గించగలిగినంత మందిని తగ్గిస్తే రిపబ్లికన్‌లకు ప్రయో జనం చేకూర్చవచ్చన్నది రామస్వామిలోని మరో ఆలోచనా వైవిధ్యం. 

అయితే రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ భారతీయ అమెరికన్‌లు పోటీగా నిలిచే అవకాశం లేకపోవచ్చు. అయినప్పటికీ వీరి ఆలోచనలు అమె రికా రాజకీయ నేపథ్య దృశ్యానికి భిన్నంగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. సాధారణంగా డెమోక్రాట్‌లకు ఓటు వేస్తుండే భారతీయ అమెరికన్‌లు ఎందుకని రిపబ్లికన్‌ పార్టీ ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు?

అధిక సంఖ్యాకవాద రాజకీయాలకు, పర్యవసాన వివక్షాపూరిత విధానాలకు బాధితులైన మైనారిటీ సమూహాలను డెమొక్రాటిక్‌ పార్టీ తన ప్రగతిశీల సిద్ధాంతాలతో దరికి చేర్చుకుంటుందన్న వాస్తవానికి విరుద్ధంగా ఉంది – భారతీయ అమెరికన్‌లు ఇలా రిపబ్లికన్‌ పార్టీ తర ఫున పోటీ పడటం! ఈ సందర్భంలో ఎవరైనా యూఎస్‌కు భారతీ యుల వలస వెనుక ఉన్న ప్రత్యేక అంశాల మీద, వారు ఏ సామాజిక స్థాయుల నుంచి వలస వచ్చారనే దాని మీద దృష్టిపెట్టడం అవసరం. 

భారతీయుల వలసల్లోని మొదటి దశ ప్రధానంగా 20వ శతాబ్దపు ప్రారంభ సంవత్సరాలలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆధునిక టెక్‌ హబ్‌ ద్వారా మొదలైంది. ఆసియా సంతతి వారిపై ఉన్న చట్టపరమైన పరి మితుల కారణంగా నాటి వలసదారులు సంఖ్యాపరంగా స్వల్పంగా ఉన్నారు. రైలు–రోడ్లు పనులు, కలప డిపోలు, వ్యవసాయ పొలాల్లో ఉపాధిని వెతుక్కున్నారు.

ఆఖరికి కాంగ్రెస్‌ సభ్యుడు దలీప్‌ సింగ్‌ సౌంద్‌ కూడా 1924లో బర్కిలీలోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ పొందినప్పటికీ, యూఎస్‌ ప్రభుత్వం పౌరసత్వాన్ని నిరాకరించిన కారణంగా 1949 వరకు రైతుగా పని చేయవలసి వచ్చింది. అమృత్‌సర్‌లో జన్మించిన దలీప్‌ 1956లో డెమోక్రాటిక్‌ పార్టీ టికెట్‌పై క్యాలిఫోర్నియా నుంచి యూఎస్‌ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన మొదటి ఆసియా – అమెరికన్, మొదటి భారతీయ– అమెరికన్, మొదటి సిక్కు మతస్థుడు దలీప్‌. 

1965 అక్టోబర్‌ 3న అప్పటి అధ్యక్షుడు లిండన్‌ బి జాన్సన్‌ ఇమిగ్రేషన్‌ బిల్లుపై సంతకం చేయడంతో ఆసియా దేశాల నుండి వచ్చే వలసలపై ఉన్న నిబంధనలు తొలగిపోయాయి. ఆ తర్వాత వలస వచ్చి తమ విజయాలతో గుర్తింపు పొందిన అనేక ఆసియా సమూ హాల పిల్లల్లో భారతీయ అమెరికన్‌ల సమూహంలోని పిల్లలు అధికంగా ఉన్నారు. ఇది భారతీయులలోని ఉన్నత విద్యావంతులు యూఎస్‌లో చదువుకోడానికి, ఉద్యోగాలు చేయడానికి తోడ్పడింది.

వారిలో చాలామంది స్కాలర్‌షిప్‌లపై అక్కడికి వెళ్లారు. వారిని జర్న లిస్ట్‌ అనితా రాఘవన్‌ తన పుస్తకం ‘ది బిలియనీర్స్‌ అప్రెంటిస్‌: ది రైజ్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ – అమెరికన్‌ ఎలీట్‌ అండ్‌ ది ఫాల్‌ ఆఫ్‌ గాలియన్‌ హెజ్‌ ఫండ్‌’లో ‘రెండుసార్లు ఆశీర్వదించబడిన తరం’గా చేసిన అభివర్ణన ఎంతో ప్రసిద్ధి చెందినది. యూఎస్‌ వలస చట్టాల సడలింపు వల్లా, స్వాతంత్య్రానంతరం విద్యారంగంపై భారత్‌ అపారంగా పెట్టు బడులు పెట్టడం వల్లా రెండు రకాలుగా లబ్ధి పొందిన తరం అది.

1995 తర్వాతి కాలంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏర్పడిన డిమాండు, ఆ తర్వాత వై2కె మైగ్రేషన్‌ ప్రాజెక్టుతో... వలసలు అకస్మాత్తుగా విస్ఫోట స్థాయిలో పెరిగాయి. దాంతో పాటుగా భారత దేశంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లపై యూఎస్‌లో ఆసక్తి ఏర్పడింది. ఇది చాలామంది ఆర్థిక నిపుణులకు ద్వారాలను తెరిచింది.

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత అంశాలలో బలమైన నేపథ్యం, ఆంగ్ల భాషపై క్రియాత్మక అనర్గళత ఉండి హెచ్‌–1బి నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా ప్రోగ్రామ్‌ కింద దరఖాస్తు చేసుకుని అమెరికా వెళ్లినవారిలో దాదాపు 75 శాతం మంది భారతీయులే. వారిలో అనేకమంది దశాబ్ద కాల వ్యవధిలో అమెరికన్‌ పౌరులుగా మారారు. 2000 తర్వాత, లేదా గత 10 సంవత్సరాలలో వలసవెళ్లినవారు యూఎస్‌లో శాశ్వత నివా సులుగా ఉంటూ, ప్రస్తుతం పౌరసత్వం పొందే దారిలో ఉన్నారు. 

వలసల విశిష్టతల దృష్ట్యా భారతీయ అమెరికన్‌లు రెండు పార్టీల లోనూ ప్రాతినిధ్యం వహించే ధోరణి ఎంత ఎక్కువ మంది పౌరసత్వం పొందితే అంతగా పటిష్ఠం అవుతుంది. ఇతర మైనారిటీ సమూహాల పోరాటం చాలామంది యువ భారతీయ అమెరికన్‌ల జీవితాలలో ప్రతిబింబించదు. ఎందుకంటే వీరంతా ఉన్నత విద్యావంతులైన మొదటి తరం భారతీయ అమెరికన్‌ తల్లిదండ్రులకు జన్మించినవారు. నాణ్యమైన విద్య, సమయపాలన, అందుబాటులో ఉన్న పర్యావరణ వ్యవస్థల మద్దతుతో ఈ యువ బృందం ఆర్థికంగా లాభదాయకమైన అనేక వృత్తిపరమైన రంగాలలో విజయం సాధించింది. 

జెనరేషన్‌ జడ్, లేదా మిలీనియల్‌ జనరేషన్‌ నుంచి కొందరు తక్కువ ఆదాయ పన్ను, ప్రైవేట్‌ హెల్త్‌ కేర్‌ వంటి విధానాలకు మద్దతు ఇస్తున్నారు. ఇతర మైనారిటీ సమూహాలకు భిన్నంగా సంక్షేమ పథ కాల పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండవచ్చు. భారతీయ అమెరికన్‌ల రాజకీయ పొత్తులు యూఎస్‌లోని ఇతర మైనారిటీ సమూహాల రాజ కీయాలపై మన అవగాహన నుండి ఉత్పన్నం అయినవైతే కాదు.  

లవ్‌ పురి 
వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement