అమెరికా ఎన్నికలు: మారుతున్న ఓటర్ల మూడ్‌ | US presidential elections will be held on November 3 | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్ష ఎన్నికలు: నువ్వా.. నేనా?

Published Tue, Nov 3 2020 4:02 AM | Last Updated on Tue, Nov 3 2020 8:46 AM

US presidential elections will be held on November 3 - Sakshi

ప్రపంచానికి పెద్దన్న ఎవరు కాబోతున్నారో తేలే సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే నిర్ణయాధికారం ఎవరికి అప్పగించాలో తేల్చి చెప్పే అతి పెద్ద ఎన్నికలకి ముహూర్తం సమీపిస్తోంది. అమెరికా అధ్యక్ష బరిలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు డెమొక్రాటిక్‌ అ«భ్యర్థి జో బైడెన్‌ ఢీ అంటే ఢీ అంటున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కోట్లాది మంది ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ అసలు సిసలు సంగ్రామానికి తెరలేచే సమయం ఆసన్నమైంది. మంగళవారం నాడు జరిగే ఎన్నికల్లో ఎవరిది పై చేయి కాబోతోంది ? అమెరికన్‌ ఓటరు జాతీయవాదానికే మళ్లీ జై కొడతారా ? ట్రంప్‌ పాలనా వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటారా ? అందరిలోనూ అదే ఉత్కంఠ...  

స్వింగ్‌ భళా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్‌ రాష్ట్రాల్లో ఓటరు ఎటు వైపు మొగ్గుతారన్నదే అత్యంత కీలకం. 2016 ఎన్నికల తరహాలో పాపులర్‌ ఓట్లు సాధించలేకపోయినా, స్వింగ్‌ రాష్ట్రాల ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లతో గట్టెక్కగలనన్న ధీమా అధ్యక్షుడు ట్రంప్‌లో కనిపిస్తోంది. ఎన్నో కీలక రాష్ట్రాల్లో బైడెన్‌కి స్వల్పంగానే ఆధిక్యమున్నట్టుగా పోల్‌ సర్వేలు చెబుతూ ఉండడంతో ఆఖరి నిముషంలో ఫలితం ఎలాగైనా మారే అవకాశం ఉంది. అందుకే ట్రంప్, బైడెన్‌లు స్వింగ్‌ రాష్ట్రాల్లో సుడిగాలి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ఉధృతంగా చేస్తున్నారు. నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో ట్రంప్‌ ఆఖరి నిముషంలో ప్రచారం చేస్తున్నారు. ఇక బైడెన్‌ పెన్సిల్వేనియా రాష్ట్రంపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నారు. పోలింగ్‌ రోజు రాత్రి ట్రంప్‌ మాత్రం శ్వేతసౌధంలోనే ఉంటూ ఎన్నికల ఫలితాల సరళి సమీక్షించనున్నట్టుగా తెలుస్తోంది.

కౌంటింగ్‌ను సవాల్‌ చేస్తాం: ట్రంప్‌
ఫెయేట్‌విల్లే: అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదనుకున్నాడో ఏమోగానీ.. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం నాటి పోలింగ్‌ తరువాత ఓట్ల లెక్కింపును సవాలు చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. మంగళవారం పోలింగ్‌ నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది అంతకుముందే మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్‌ల ద్వారా ఓట్లేశారు. 9కోట్ల 20 లక్షల మంది ఈ పద్ధతిలో ఓట్లు వేసేసిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో వీటిని లెక్కబెట్టేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని అంచనా. ఫలితంగా కొత్త అధ్యక్షుడు ఎవరన్నది స్పష్టమయ్యేందుకు మరింత సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో జరుగుతున్న జాప్యాన్ని తాము సవాలు చేసే అవకాశం ఉందని ట్రంప్‌ చెబుతున్నారు. కంప్యూటర్ల యుగంలోనూ ఎన్నికలు జరిగిన రోజు రాత్రికల్లా ఫలితాలు తేలకపోవడం ఘోరమైన విషయమన్నారు. మెయిల్‌–ఇన్‌ బ్యాలెట్ల పద్ధతిలో మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువని ట్రంప్‌  వ్యాఖ్యానించారు. ఒకవేళ అమెరికన్లు ఓట్లు వేయాలని అనుకుని ఉంటే చాలా ముందుగానే ఆ పని చేసి ఉండాల్సిందని అన్నారు. ‘అందరూ ఒకే రోజు ఓటేయాల్సిన అవసరం లేదు. నెల రోజుల క్రితం ఓటేసి ఉండవచ్చు’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

స్వింగ్‌          ఎలక్టోరల్‌
రాష్ట్రాలు       కాలేజీ ఓట్లు  
అరిజోనా     11  
విస్కాన్సిన్‌     10
మిషిగాన్‌     16
పెన్సిల్వేనియా     20
ఓహియో     18
నార్త్‌ కరోలినా     15
జార్జియా     16
ఫ్లోరిడా     29 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement