‘నీలి విప్లవం’ పగటికలేనా! | Anna Jacobs Guest Column On US Election Result Of Donald Trump | Sakshi
Sakshi News home page

‘నీలి విప్లవం’ పగటికలేనా!

Published Sun, Nov 8 2020 12:57 AM | Last Updated on Sun, Nov 8 2020 12:57 AM

Anna Jacobs Guest Column On US Election Result Of Donald Trump - Sakshi

డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ గెలుపు నిశ్చయమై పోయింది. డొనాల్డ్‌ ట్రంప్‌ సజావుగా నిష్క్రమించడం ఒకటే మిగిలింది. నాలుగురోజులుగా సాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఇంతవరకూ బైడెన్‌ 273 ఓట్లు సాధించారు. ట్రంప్‌ 214 దగ్గరే ఆగిపోయారు. ఈసారి ఎన్నికల్లో అమెరికా ఓటర్లు కనీవినీ ఎరుగని స్థాయిలో ఓట్లేశారు. కానీ డెమొక్రాట్లు ఆశిం చినట్టు అది ‘నీలి విప్లవం’గా రూపుదిద్దు కోలేదు. ఈ ఓట్ల లెక్కింపు, ఫలితాలపైనే దృష్టి పెట్టకుండా అమెరికా చట్టసభ కాంగ్రెస్‌లోని ఉభయసభల్లో ఏమవుతున్నదో చూడాలి. ప్రతి నిధుల సభలో ఎటూ డెమొక్రాట్ల నియంత్రణే వుంటుంది. కానీ అక్కడ రిపబ్లికన్లు బాగానే పుంజుకుంటున్నారు. ప్రస్తుతానికి సెనేట్‌ పరిస్థితేమిటో చెప్పలేం. అయితే దానిపై రిపబ్లికన్ల ఆధి పత్యమే వుంటుందనిపిస్తోంది. కరోనా వైరస్‌ కాటు, దిగజారిన ఆర్థిక స్థితి, హోరాహోరీ రాజకీయ పోరు వగైరాలు కూడా డెమొ క్రాట్లకు పెద్దగా తోడ్పడిన దాఖలా కనబడటం లేదు. రిపబ్లిక న్లకు ఇదెలా సాధ్యమైంది? వారు డెమొక్రాట్లను ఎలా నిలువ రించగలిగారు?

తీరుమార్చిన ట్రంప్‌
సందేహం లేదు. రిపబ్లికన్‌ పార్టీ తీరుతెన్నుల్ని ట్రంప్‌ పూర్తిగా మార్చగలిగారు. కనుక ఈ ఎన్నికల్లో ఓడినా ఆయన ఎటూ వెళ్లరు. అతి పెద్ద రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతారు. ఇప్పుడు వెలువడుతున్న గణాంకాలనుబట్టి ఆయనకు 6 కోట్ల 80 లక్షల ఓట్లు వచ్చాయి. 2016తో పోలిస్తే కీలక రాష్ట్రం ఫ్లోరి డాలో క్యూబన్‌ అమెరికన్ల మద్దతు సాధించి ఆయన అత్యధిక శాతం ఓట్లు తెచ్చుకున్నారు. పెన్సిల్వేనియా, మిన్నెసోటా, మిషిగాన్, ఐయోవా, నార్త్‌ కరోలినా, జార్జియా, ఫ్లోరిడాల్లో ట్రంప్‌ 17 ర్యాలీలు నిర్వహించారు. వాటిల్లో చేసిన ప్రసంగాలు సాధారణమైనవి కాదు. డబ్బుకు ఆశపడి వైద్యులు కరోనా మరణాలను బాగా పెంచి చూపించారని ఆరోపించారు. అంటు రోగాల నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫాసీని పదవినుంచి ఊడ బెరుకుతానని హెచ్చరించారు. మాస్క్‌ ధరించిన ఫాక్స్‌ న్యూస్‌ ప్రోగ్రాం నిర్వాహకురాలు లారా ఇన్‌గ్రాహంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రచారపర్వంలో ఇవన్నీ ఆయనకు బాగా కలి సొచ్చాయి. పోలింగ్‌ కేంద్రాల్లో భారీగా కనబడిన ఓటర్లను చూసి మనమంతా ‘నీలివిప్లవం’ అనుకున్నాం. అది డెమొ క్రాట్లను వైట్‌హౌస్‌కు పంపడానికి పనికొచ్చింది. కానీ సెనేట్‌ లోనూ, ప్రతినిధుల సభలోనూ ఉపయోగపడింది లేదు.  

ఆర్థికమే కీలకం
ఈ ఎన్నికల్లో కరోనా, ఆర్థిక మాంద్యం ఎవరికీ పెద్దగా పట్ట లేదు. ట్రంప్‌ చేతుల్లో ఆర్థిక వ్యవస్థ భద్రంగా వుంటుందన్న విశ్వాసమే ఓటర్లలో కనబడింది. ఆర్థిక సమస్యలకు కరోనా కారణం తప్ప ట్రంప్‌ కాదని వారు నమ్మారు. తాను అధికా రంలో లేకుంటే సోషలిజం, కమ్యూనిజం, రాడికల్‌ లెఫ్ట్‌ తదితర భూతాలు ఆర్థిక వ్యవస్థను మరింత ధ్వంసం చేస్తాయని ట్రంప్‌ చేసిన హెచ్చరికలు ఫలించాయి. కరోనాను చైనాపైకి తోసి, దాన్ని అరికట్టడంలో తన బాధ్యతను ఆయన తెలివిగా దాటే యగలిగారు. అక్టోబర్‌ నెలాఖరుకు ఆయన రేటింగ్‌(44 శాతం) తగ్గిన మాట వాస్తవమేగానీ... అది అంచనాలకు తగినట్టులేద న్నది వాస్తవం. కరోనా మరణాలు, ఇతర సమస్యలు ట్రంప్‌ను కుంగదీస్తాయనుకుంటే రిపబ్లికన్‌లకు గతంలో వున్న మద్దతు స్థిరంగా కొనసాగింది. రిపబ్లికన్‌ ఓటర్లకు ఆయన సంప్రదాయ ఎజెండా నచ్చింది. తుపాకీ హక్కుల పరిరక్షణ, అబార్షన్‌లకూ, స్వలింగసంపర్క పెళ్లిళ్లకూ, ఎల్‌జీబీటీ హక్కులకూ ఆయన వ్యతిరేకంగా నిలబడటం వారిని ఆకట్టుకుంది. ముఖ్యంగా సంప్రదాయవాది జస్టిస్‌ అమీ కోనీ బారెట్‌ను ఎన్నికల ముందు అడ్డగోలుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం ఆయనపై విశ్వాసాన్ని పెంచింది. 

మైనారిటీల్లో అభద్రత
శ్వేతజాతి ఆధిపత్యాన్ని, జాత్యహంకారాన్ని ఎగదోసి మైనారి టీల్లో ఒకరకమైన అభద్రతను కలిగించడంలో ట్రంప్‌ విజయం సాధించారు. ఈ ఏడాది వ్యవస్థాగత జాత్యహంకారం, పోలీసు హింస, సామాజిక, రాజకీయ విభేదాలు బాగా పెరిగాయి. వీటినెక్కడా ట్రంప్‌ ఖండించలేదు. ఆ పనిచేస్తే శ్వేత జాతీ యులు దూరమవుతారు మరి. మైనారిటీ ఓటర్ల హక్కుల్ని అణచడం ఈ ఎన్నికల్లో బాహాటంగా కనబడింది. ఆఫ్రికన్‌ అమెరికన్లను ఓటేయనిస్తే తమకు నష్టమని గుర్తించి ఓటింగ్‌ హక్కుల చట్టంలోని కఠిన నిబంధనలు అమలుచేశారు. అయినా సరే డెమొక్రాట్లకు వైట్‌హౌస్‌ చేరువలోనే వుంది. కానీ  తటస్థ రాష్ట్రాలపై ఈ ప్రభావం ఏమేరకుందో ఇంకా చూడాలి. సారాంశం ఏమంటే... డొనాల్డ్‌ ట్రంప్‌ నిష్క్రమణ ఖాయమే. కానీ ట్రంపిజం మున్ముందు కూడా శాసిస్తూనే వుంటుంది. ప్రభుత్వం ఏం చేయాలో, చేయకూడదో నిర్దేశిస్తూనే ఉంటుంది.

– అన్నా జాకబ్స్, అమెరికా రాజకీయ నిపుణురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement