బాలీవుడ్‌ గమ్యం ఎటువైపు? | Kancha Ailayya Article On Caste Culture In Bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ గమ్యం ఎటువైపు?

Published Thu, Oct 15 2020 12:57 AM | Last Updated on Thu, Oct 15 2020 8:40 AM

Kancha Ailayya Article On Caste Culture In Bollywood - Sakshi

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య, శివసేన ప్రభుత్వంపై కంగనా తిరుగుబాటు, బాలీవుడ్‌లో పేరుకుపోయిన డ్రగ్‌ సంస్కృతి అనేవి లోతైన కులస్వభావాన్ని ప్రతిఫలిస్తున్నాయి. భారతీయ మీడియా.. ప్రత్యేకించి ఇంగ్లిష్‌ మీడియా ఈ కీలకమైన అంశాన్ని దాచేయాలని ప్రయత్నిస్తోంది. సుశాంత్, కంగనా ఇద్దరూ క్షత్రియ కులం నుంచి బాలీవుడ్‌ నటులుగా ఆవిర్భవించారు. జాతీయ పరిశ్రమగా గుర్తింపుపొందిన బాలీవుడ్‌ బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖాత్రీలతోపాటు, ముల్లాల సాంప్రదాయిక నియంత్రణలను దాటుకుని వచ్చిన కొద్దిమంది ముస్లింల అజమాయిషీలో నడుస్తోంది.

క్షత్రియులు చారిత్రకంగా పాలకవర్ణంగా ఉండేవారు. స్వాతంత్య్రానంతరం వీరు ఇంగ్లిష్, పాశ్చాత్య విద్యా సంపర్కం కలిగిన ఆధునిక కులంగా ఆవిర్భవించలేదు. ఇటీవలి వరకు ఈ కులం సాంప్రదాయ చట్రంలోనే ఉండిపోయింది. బాలీవుడ్‌ క్రమంగా ఇంగ్లిష్‌ హిందీ భాషలు మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకున్న విద్యావంతులతో కూడిన ఆధునిక పరిశ్రమగా మారింది. బాలీవుడ్‌ అనేకరూపాల్లో హాలీవుడ్‌ని అనుకరిస్తుంటుంది. తిరోగామి స్వభావంతో ఉంటున్నప్పటికీ, తన మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా బాలీవుడ్‌ ఆధునిక పోకడలను అనుకరిస్తూ ఉంటుంది. పలువురు బాలీవుడ్‌ నటులు, దర్శకులు పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి గురయ్యారు. విదేశాలకు చెందినవారు కూడా బాలీవుడ్‌కి వచ్చి నటన, దర్శకత్వం, చిత్రనిర్మాణ బాధ్యతలను చేపట్టారు.

బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖాత్రీలు ఈ తరహా జీవి తానికి బాగా అలవాటుపడిపోయారు. జాతీయోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత కూడా వీరిలో వచ్చిన మార్పే దీనికి కారణం. అయితే 2014లో ఆరెస్సెస్‌/బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక చిత్రపరిశ్రమలో సాంస్కృతిక ఘర్షణ మొదలైంది. వీరిలో కొందరు హిందుత్వకు బలమైన అనుకూలురుగా మారిపోయారు. ప్రజాభిప్రాయం ఏ వైపు మొగ్గుచూపుతోందో వీరికి స్పష్టంగా తెలిసిపోయింది మరి. బాలీవుడ్‌లో ఇప్పటికీ చాలామంది మతపరమైన ఛాందసవాదం, సాంస్కృతిక పోలీసింగ్‌తో అసౌకర్యంగా భావిస్తున్నారన్నది వాస్తవం. 

భూస్వామ్య హిందూ సంస్కృతికి కట్టుబడిపోయినందున, బాలీ వుడ్‌కి క్షత్రియులు దూరంగానే ఉంటూవచ్చారు. ఏ ఇతర ద్విజ కులాలకు చెందిన మహిళలతో పోల్చినా సరే, క్షత్రియ మహిళలు ఇప్పటికీ పురషాధిపత్యం నీడలోనే ఉంటున్నారు. బ్రాహ్మణ, బనియా, కాయస్థ, ఖాత్రీ వంటి ఇతర ద్విజ కులాల మాదిరికాకుండా ఇంగ్లిష్‌ మీడియం విద్యను గ్రహించడానికి అయిష్టత ప్రదర్శించిన కారణంగా క్షత్రియులు వారి సామాజిక ఔన్నత్యాన్ని కోల్పోయారు. రాజారామ్మోహన్‌రాయ్‌ నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ–అటల్‌ బిహారీ వాజ్‌పేయి వరకు (ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, మొరార్జీ దేశాయ్, పీవీ నరసింహారావులు కూడా బ్రాహ్మణ ప్రధానమంత్రులే) ఢిల్లీలో బ్రాహ్మణాధిపత్యం స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. ఇక గాంధీ, రామ్‌ మనోహర్‌ లోహియా నుంచి నరేంద్రమోదీ వరకు బనియాలనుంచి నాయకులు ఆవిర్భవించారు. వీరికి కూడా ఇంగ్లిష్‌ విద్యా పునాదులతోపాటు పారి శ్రామిక పెట్టుబడి సంచయనం అందుబాటులోకి వచ్చింది. మోదీ ఇంగ్లిష్‌ విద్యావంత కుటుంబంనుంచి రాకపోయినా, గుత్తాధిపత్యం కలిగిన బనియా పెట్టుబడి ఆయనకు పూర్తి మద్దతునిస్తోంది.

ఇక ఖాత్రి నేపథ్యం కలిగిన ఐకే గుజ్రాల్, మన్మోహన్‌ సింగ్‌ ప్రత్యేకమైన రాజకీయ పరిణామాలతో దేశ ప్రధానులు కాగలిగారు. ఇక క్షత్రియులనుంచి ప్రధానులుగా కాగలిగినవారు వీపీ సింగ్, చంద్రశేఖర్‌. కానీ వీరిని మీడియా ఇష్టపడలేదు. చౌదరి చరణ్‌సింగ్, దేవీగౌడలు శూద్ర ప్రధానమంత్రులు. వీరికి కూడా తగినంత స్థాయిలో ఇంగ్లిష్‌ విద్య అలవడని నేపథ్యంలో వీరు గ్రామీణ రైతాంగ ఆర్థికవ్యవస్థ, సంస్కృతికి ప్రాతినిధ్యం వహించేవారు. ఇక చిత్రపరిశ్రమలోని ఆత్యున్నత స్థానాల్లో శూద్రులకు, దళితులకు పెద్దగా స్థానం లభించలేదు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీపీ సింగ్, చంద్రశేఖర్‌ ఇద్దరూ పేదల అనుకూలురు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల వీపీ సింగ్‌ అనుకూల వైఖరి తెలిసిందే. అయితే రామమందిర సమస్య దన్నుతో  క్షత్రియ కులం నుంచి యోగి ఆదిత్యనాథ్‌ రాజకీయాల్లో ఆవిర్భవించేంత వరకు భారత రాజకీయాల్లో క్షత్రియుల నుంచి బలమైన నాయకుడు తయారు కాలేదు. సన్యాసిగా జీవిస్తూ హిందుత్వను పాటిస్తూ వచ్చిన యోగి ఆదిత్యనాథ్‌ ఇటీవల కాలంలో హిందుత్వ శక్తుల కమాం డర్‌గా అవతరించారు. ఇటీవల వికాస్‌ దుబే అనే గ్యాంగ్‌ లీడర్‌ని ఎన్‌ కౌంటర్‌ చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో క్షత్రియులు, బ్రాహ్మణుల మధ్య ఘర్షణను స్పష్టంగా చూడగలం. అయితే ఒక కమ్యూనిటీగా క్షత్రియులు బాధిత స్థానంలోంచే ఎక్కువగా సంఘటితమవుతూ వచ్చారు. వీరు రాజ్‌పుత్‌ కర్ణి సేనగా ఏర్పడ్డారు.

సారస్వత్‌ బ్రాహ్మణ కులానికి చెందిన దీపికా పదుకొనే నటించిన పద్మావత్‌ సినిమాకు వ్యతిరేకంగా వీరు జనాల్ని కూడగట్టారు. ఇప్పుడు ఇదే కర్ణిసేన కంగనా రనౌత్‌కు రక్షణగా ముంబైవరకు వచ్చింది. శివసేనను ఎదుర్కోవాలంటే బీజేపీ అనుకూల వైఖరి ఉపయోగకరమని కంగనాకు అర్థమైంది. ఉద్ధవ్‌ థాక్రే కుటుంబం కాయస్తులే అయినప్పటికీ వారి పార్టీ పాలక పార్టీగా మారి మరాఠాలకు, ఓబీసీలకు మద్దతునిస్తోంది.

తాను చిన్న పట్టణం నుంచి రావడం, ఇంగ్లిష్‌లో పెద్దగా ప్రావీ ణ్యత లేకపోవడం కారణంగా బాలీవుడ్‌లో తాను మనలేనని బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలి సంవత్సరాల్లో భావించినట్లు కంగన తెలిపింది. కానీ ఇప్పుడామె బెంగాలీ బ్రాహ్మిన్‌ అయిన రియా చక్రవర్తి, జయాబచ్చన్‌ బాధురి (ఈమె కూడా బ్రాహ్మినే కానీ కాయస్తుడైన బచ్చన్‌ను పెళ్లాడారు) వంటివారితో పోట్లాడే స్థాయికి చేరుకుంది. బలమైన జాతీయవాద హిందుత్వ ముద్రతో కంగనా పూర్తిగా కాంగ్రెస్‌ వ్యతిరేక వైఖరిని అవలంబించింది. శివసేనను సోనియా సేనగా కూడా ఆమె వర్ణించింది. కాంగ్రెస్‌ సభ్యురాలైన ఊర్మిళా మటోంద్కర్‌పై కూడా సాఫ్ట్‌ పోర్న్‌ అంటూ దాడిచేసింది కంగనా.

కంగనా 2019లో నటించిన మణికర్ణిక చిత్రంలో ఝాన్షీ లక్ష్మీ బాయి పాత్రను పోషించింది. సహదర్శకురాలిగా పునరుద్ధరణ వాద, క్షత్రియ మహిళలకు చెందిన స్త్రీవాద భావనలతో కలిపి, చారిత్రక వ్యక్తి అయిన లక్ష్మీబాయి వ్యక్తిత్వాన్ని వక్రీకరించింది. బ్రాహ్మణురాలైనప్పటికీ లక్ష్మీబాయ్‌ వివాహం ద్వారా క్షత్రియురాలు అయింది. కంగన క్షత్రియ లక్ష్మీబాయి పాత్రను పోషించింది. ఇప్పుడు ఆమె జయలలిత పాత్రను పోషిస్తోంది. జీవితంలో ఏ రంగంలోకైనా సరే ధైర్యంగా అడుగుపెట్టాలంటూ కుటుంబం ప్రోత్సాహం ఉన్న దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా (ఖాత్రి) లాగా కాకుండా కంగనా.. తన కుటుంబం వ్యతిరేకిస్తున్నా సరే స్వయంగా మోడలింగ్, సినిమా రంగాల్లోకి వెళ్లింది. దీపికా, చోప్రా, ఐశ్వర్యారాయ్, శిల్పాశెట్టి లాగా కంగనా కుటుంబం పాశ్చాత్య జీవన ధోరణులకు గురికాలేదు. కానీ ఆధునికత ఎలాంటిదైనా సరే వ్యతిరేకించే పాలకుల చరిత్ర కలిగిన కులం నుంచి కంగనా చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇతర ద్విజ, ముస్లిం హీరోల్లాగా క్షత్రియులకు బాలీవుడ్‌లో బడా పెట్టుబడి దన్ను లేదు. తన ప్రస్తుత రాజకీయ స్థానం నుంచి ఆమెకు దేంతోనైనా సరే తలపడే సాహసం వచ్చింది. ముంబై ప్రాధాన్యతను తగ్గించే లక్ష్యంతో యోగి ఆదిత్య నాథ్‌ ఉత్తరప్రదేశ్‌లో పెద్ద పిల్మ్‌ సిటీని నిర్మించ తలపెడుతున్నారు. ఇప్పుడు జాతీయ చిత్రపరిశ్రమగా బాలీవుడ్‌కి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగించాలని కంగనా కోరుతోంది.

హిందుత్వ జాతీయవాద భావనతో కూడిన చిత్ర పరిశ్రమ కోసం కొత్త బాటను ఏర్పర్చకపోతే ఇదంతా జరిగేది కాదు. ఇది వారి ఒకే సాంస్కృతిక జాతీయవాద ప్రాజెక్టులో భాగమే. దీనిలో కంగనా సరిగ్గా ఇమిడిపోతుంది. గనా ఇప్పుడొక ఆవిర్భవిస్తున్న హీరోయిన్, నిర్మాత. పైగా కులం దన్ను కూడా ఉంది. సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఘటనతో క్షత్రియ కులం మొత్తంగా రగిలిపోతోంది. అందుకే రియాచక్రవర్తితో ముడిపడిన సుశాంత్‌ మరణంపై దర్యాప్తు చేయాలని కేంద్రప్రభుతంపై ఒత్తిడి తెస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి పార్లమెంటులోనే రియాకు మద్దతుగా నిలిచి బ్రాహ్మణురాలు కాబట్టే ఆమెను వేధిస్తున్నారని ఆరోపించారు. బాలీవుడ్‌ను అన్నం పెట్టే తల్లిగా వర్ణించిన జయాబచ్చన్‌పై కంగనా దాడి చేయడంతో బాలీవుడ్‌ మరింత మకిలిపట్టడం ఖాయం.

క్షత్రియులు ఆరెస్సెస్‌కు బలమైన మద్దతుదారులు. ఎందుకంటే ఏకైక బ్రాహ్మణేతర సర్‌సంఘ్‌చాలక్‌ రాజేంద్రసింగ్‌ (రాజు భయ్యా) క్షత్రియుడు. ఆరెస్సెస్‌ అధినేతగా ఆయన పదవీకాలంలోనే రామమందిర సమస్య ముందుపీఠికొచ్చింది. సంస్థాగతంగా గానీ, వారి కుల వారసత్వపరంగా కానీ ఆరెస్సెస్‌ క్షత్రియులను నిర్లక్ష్యం చేయలేదు. వారు ఇప్పుడు తమ ఉనికిని ప్రదర్శిస్తున్నారు. అందుకే సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా కంగనా వారికి ఎంతో అవసరమైన వ్యక్తి. ఇప్పుడంటే ఇంగ్లిష్‌ మీడియం విద్యకు, ఆధునికతకు లోబడే విషయంలో ద్విజ సామాజిక శక్తుల్లోనే క్షత్రియులు బలహీనమైన లింకుగా ఉండవచ్చు. చారిత్రకంగా మాంసాహారమంటే చెవి కోసుకునే వీరు ఆరెస్సెస్‌ ఆహార సంస్కృతికి అలవడేందుకు శాకాహారులుగా మారుతున్నారు. బ్రాహ్మణులు, బని యాలు భౌతికవాదాన్ని స్వీకరిస్తున్న చిత్రసీమ సంస్కృతిలో కంగనా పూర్తి శాకాహారిగా మారిపోయింది.

సుశాంత్‌ అకాల ఆత్మహత్య, అతడి తరపున కంగనా రనౌత్‌ పోరాటం కారణంగా ఆమె కులం ఇప్పుడు మితవాద మీడియా ఆసక్తిని ఆకర్షిస్తోంది. వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌ తర్వాత ఎస్పీ, బీఎస్పీ పార్టీల దన్నుతో ఉత్తరప్రదేశ్‌ బ్రాహ్మణులు పరుశురాముడిని ప్రమోట్‌ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు కంగనా యూపీ రాజకీయాల్లో అసలైన ట్రంప్‌ కార్డు అన్నమాట.  యోగి ఆదిత్యనాథ్‌ సరిగ్గా దీన్ని గుర్తించే గతంలో ఏ నాయకుడూ చేయని విధంగా క్షత్రియ కులాన్ని సంఘటితపరుస్తున్నారు. కంగనా దూసుకురావడం బాలీవుడ్‌ చిత్రపరిశ్రమకు సవాలే అవుతుంది. అలాగే ఇతర రంగాల్లోని ద్విజ క్యాంపులోని ఆధిపత్య కులాలకు కూడా ఆమె సవాలుగానే నిలుస్తుంది.
 


ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ఇంగ్లిష్‌ తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత,
సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement