భగవంతుణ్ణి, పాలకులను కులమతాల్లో ఇరికించవద్దు | God And Rulers Have No Caste Justice B Chandra Kumar Says | Sakshi
Sakshi News home page

భగవంతుణ్ణి, పాలకులను కులమతాల్లో ఇరికించవద్దు

Published Sat, Sep 26 2020 3:33 AM | Last Updated on Sat, Sep 26 2020 3:33 AM

God And Rulers Have No Caste Justice B Chandra Kumar Says - Sakshi

భిన్నభిన్న ప్రాంతాల్లో, వివిధ కాలాల్లో ఆధ్యాత్మిక వేత్తలు, యోగులు, మత ప్రవక్తలు వచ్చి అప్పటి పరిస్థితుల్లో మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్పారు. అయితే ఆత్మజ్ఞానం పొందినవారు, భగవం తుడిని తెలుసుకున్న వారు లేదా భగ వంతుని లీలల అనుభవాన్ని పొంది నవారు అందరిలో ప్రాణ స్వరూ పంగా ఉన్న భగవంతుడు ఒక్కడే అనే సత్యాన్ని కూడా నొక్కి చెప్పారు. అందుకే మహాత్ములెవ్వరూ కులమత భేదాలను పాటించలేదు. రామకృష్ణ పరమహింస షిరిడీ సాయిబాబా, కబీర్, బ్రహ్మంగారు, వివేకానందుడు ఇలా ఏ మహాత్ముడు కులమతభేదాలను పాటించలేదు. రామకృష్ణ పరమహింస ఎన్నో సాధనలు చేశారు. ఎన్నో అనుభూతులు పొందారు. అలాంటి మహాత్ముడు మహమ్మద్‌ ప్రవక్తను ధ్యానించి ఇస్లాంలో చూపిన సాధనలు చేసి మహమ్మద్‌ ప్రవక్తతో అను భూతిని పొందాడు. అదేవిధంగా క్రైస్తవమతాన్ని సాధన చేసి జీసెస్‌ క్రైస్తుతో అనుభవం పొందాడు. ఇప్పుడు ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కొంతమంది అనవసరమైన, అసంగతమైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలోనే ఇదంతా చెప్పాల్సి వస్తోంది.

శైవులకు, వైష్ణవులకు విభేదాలు ఉన్నప్పుడే పోతనామా త్యుడు శివకేశవులకు భేదం లేదని చెప్పాడు. కబీర్‌ రాం రహీం ఒక్కరేనని చెప్పాడు. కబీర్‌ హిందువా, ముస్లిం మతస్తుడా ఎవ్వరికీ తెలీదు. అలాగే షిరిడీ సాయి హిందువా, ముస్లింనా ఎవ్వరికీ తెలీదు. సాయిబాబా ఫకీర్‌ వేషంలో కన్పించారు. షిరిడీలోని దేవాలయాలను పునరుద్ధరించాడు. ఎంతోమంది ప్రముఖులు బాబాను దేవుడిగా పూజించారు. బాబానుంచి ఎన్నో అనుభవాలు పొందారు. అలాంటి బాబా ఏ మతసంప్రదాయాలను, ఆచారాలను పాటించలేదు. అతను ఏ మతస్తుడో చెప్పలేదు. అయితే మతమార్పిడు లనూ అంగీకరించలేదు. ఎవ్వరి విశ్వాసాలకు అనుగుణంగా వారు దైవాన్ని కొలవాలని చెప్పారు. ఎవ్వరు ఏ మతాన్ని విమ ర్శించినా ఒప్పుకునే వారు కాదు. ఒక సందర్భంలో వివిధ మతాల గురించి మాట్లాడుతూ అక్కడికి వెళ్లడానికి ఎన్నో దారులున్నాయి, శిరిడీ నుంచి కూడా ఒక దారి ఉంది అని చెప్పారు.

పోతులూరి వీరబ్రహ్మం విశ్వబ్రాహ్మణుడైనప్పటికీ, దూదేకుల సిద్ధయ్యకు జ్ఞానబోధ చేశాడు. దళితుడైన కక్క య్యకు ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చాడు. రమణ మహర్షి ఆత్మవిచారణకే ప్రాధాన్యమిచ్చాడు. గౌతమ బుద్ధుడు ధ్యాన సాధనకే ప్రాధాన్యమిచ్చాడు. వీరందరూ ఏ రోజూ మతాచా రాలను, సాంప్రదాయాలను పాటించలేదు. ఆరోజుల్లో ఉన్న ఆచారం ప్రకారం గురువు ఉపదేశించిన మంత్రాన్ని బహిరంగ పర్చకూడదు. కానీ శ్రీరామానుచార్యులు ఆ మంత్రం వల్ల అందరికీ లాభం చేకూరాలని గుడి గోపురం ఎక్కి ఆ మంత్రాన్ని అందరికీ వినిపిస్తాడు. గురువాజ్ఞను ధిక్కరించా వని అలా చేసినందుకు నరకానికి వెళ్తావంటే నల్గురికీ లాభం కల్గితే నరకానికి వెళ్లడానికి సిద్ధమే నంటాడు. 
మన ధర్మం ప్రకారం క్షత్రియులే పరిపాలన చేయాలి. బ్రాహ్మణులు పూజలు, యజ్ఞయాగాలు చేయాలి. అలాంట ప్పుడు జవహర్‌లాల్‌ నెహ్రూ, అటల్‌బిహారీ వాజ్‌పేయ్, పీవీ నరసింహారావు నేటి నరేంద్ర మోదీ లాంటి వారికి ప్రధాని అయ్యే అవకాశం లేదు. ఆ నియమాలు ఇప్పుడు మనం పాటిస్తున్నామా? పరిస్థితులనుబట్టి నియమాలు మారు తాయి. చట్టాలు, రాజ్యాంగం, నియమాలు అన్నీ కాలానుగు ణంగా మారకతప్పదు. ఇదివరకు మడికట్టుకొని వంట చేయడం మన ఆచారం. నేడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో, విమా నాల్లో, పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వారికి మడికట్టు కొని వంట చేయడం సాధ్యం అవుతుందా? 

ఇక నిజమైన, పరిపూర్ణమైన భక్తి, జ్ఞానం కలవారు ప్రపంచంలోని అందరూ భగవంతుని రూపాలేనని భావి స్తారు. ప్రతీ ప్రాణిలో ఆత్మ రూపంలో ఉన్నదే ఒక్క విశ్వాత్మ భాగమేనని భావిస్తారు. ఏ పేరుతో పిలిచినా పలుకుతానని భగవంతుడు ఎందరికో అనుభవాలనిచ్చాడు. భగవంతుణ్ణి తనకిష్టమైన రూపంలో పూజిస్తాడు సాధకుడు. కానీ, సాధన ఉన్నత దశకు చేరాక భగవంతుణ్ణి నిరాకారరూపంగా ధ్యాని స్తాడు సాధకుడు. అప్పుడు ధ్యానం, ధ్యానించే సాధకుడు, ధ్యానించే రూపం ఒక్కటిగా అవుతుందని, ఆ స్థితినే సమాధి స్థితి అని మహాత్ములు చెబుతారు. ఆ స్థితికి చేరుకున్న వారు పూజలు, పునస్కారాలు, ఆచారాలు పాటించే స్థితిలో ఉండ రని రామకృష్ణ పరమహంస చెప్పారు. 

‘ఉన్నది ఒక్కటే’ కానీ వివిధ పేర్లతో వ్యవహరిస్తారని వేదం చెప్పింది. శివుడన్నా, అల్లా అన్నా, యెహోవా అన్నా మరే పేరుతో పిలిచినా ఆ పిలిచేది ఒక్కరినే. ఆ పిలుపు చేరిది అక్కడికే. ఒక వ్యక్తిని చూసి అతని కులమేమిటో, మతమే మిటో చెప్పలేము. ప్రకృతికి కులమతాలు లేవు. గాలికి, నీటికి, భూమికి, ఆకాశానికి మతమేది? వీటికి లేని మతం దేవునికి ఎక్కడిది? దేవుళ్ల కులమతాల ముసుగులో చూడటం అజ్ఞానం. ఆత్మకు, పరమాత్మకు కులం లేదు. మతం లేదు. వేదాలన్నీ ‘ఓ మానవుడా’ అని సంబోధిస్తాయి. ఉపనిష త్తులు ఏ మతానికి చెందినవీ కావు. సమస్త మానవాళికి చెంది నవి. ఇక శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా çహథీరాంతో పాచికలాడాడని కథ. అంతేగాదు బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నాడనీ కూడా చెబుతాడు. బీబీ నాంచారమ్మ ఒక ముస్లిం స్త్రీ. ఆమెకు స్వామివారి మీద అనన్యమైన భక్తి. ఆ స్వామి ఆమెను స్వీకరించి తనలో ఐక్యం చేసుకున్నాడని స్వామి వారి కథలో చెబుతారు.

అంటే ఒక ముస్లిం స్త్రీని తనలో ఐక్యం చేసుకున్న స్వామికి కులమతాలు అంటగట్ట వద్దు. హిందువులైనా, ముస్లింలైనా, ఏ మతంవారైనా, ఏ కులం, ఏ జాతివారైనా భక్తితో స్వామిని దర్శించుకుంటే, స్వామిని వేడుకుంటే స్వామి కరుణించడా? ఆ భక్తుని కులమేమిటని, మతమేమిటని ప్రశ్నిస్తాడా?
భారత రాజ్యాంగానికి వస్తే మన రాజ్యాంగం ఏ వ్యక్తిపట్ల కులమత జాతి, లింగ, ప్రాంతీయ వివక్షత చూపవద్దని చెప్తున్నది. ఏకులం వారైనా, ఏ మతంవారైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కావచ్చునని రాజ్యాంగం స్పష్టం చేసింది. దేశానికి ప్రధానమంత్రి అంటే దేశప్రజలం దరికీ ప్రధాని. అంతే కానీ కేవలం హిందువులకో, మహ మ్మదీయులకో ప్రధాని కాదు కదా. అలానే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రంలోని ప్రజలందరికీ ముఖ్య మంత్రి. ఆ రాష్ట్రంలోని హిందువులకు, ముస్లింలకు, క్రైస్త వులకు, జైనులకు, బౌద్ధులకు అందరికీ ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి కూడా నేను నా మతం వారికే, నా పార్టీవారికే ముఖ్యమంత్రి అని చెప్పకూడదు. అలా ప్రవర్తించకూడదు. ప్రజలు అతడిని ఒక మతానికి, ఒక కులానికి చెందిన వ్యక్తిగా గుర్తించవద్దు.
వ్యాసకర్త: జస్టిస్‌ బి. చంద్రకుమార్‌ , రిటైర్డ్‌ న్యాయమూర్తి
79974 84866

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement