Justice Chandra Kumar
-
మూలాలు మరిచిన టీఆర్ఎస్
లక్డీకాపూల్: తెలంగాణ ప్రజల మనోభావాలతో పెనవేసుకుపోయిన టీఆర్ఎస్ తన పరిపాలనాకాలంలో మూలాలు మరిచిపోయిందని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. సోమవారం పంజగుట్టలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాంపాలనలో, ఉమ్మడి రాష్ట్రంలో వంచనకు, దోపిడీకి గురైన ప్రజలు ఎన్నో పోరాటాల ద్వారా ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారని, అలాంటి రాష్ట్రంలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని మరిచిపోయిందని ధ్వజమెత్తారు. తాయిలాలు ప్రకటిస్తూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని విమర్శించారు. కమీషన్ల కోసం అనవసర ప్రాజెక్టులు కట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రజల పార్టీ నడుంబిగించిందని పేర్కొన్నారు. ఉద్యమ ఆకాంక్షలను, ఆశయాలను ఒక్క తెలంగాణ ప్రజల పార్టీయే నెరవేరుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే అవినీతిలేని పాలనను అందిస్తామని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్ల సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాహుల్ చంద్రకుమార్ ఆ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్త, ఉపాధ్యక్షుడు శివారెడ్డి, న్యాయవాది ఆంజనేయులు, నాయకులు రవిప్రసాద్, లింగయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సభ్యత, సంస్కారాలకు తావే లేదా?
నేడు అనేకమంది రాజ కీయ నాయకులు సభ్య తను, సంస్కారాలను మరచి నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టు కొంటున్నారు. కాగితం మీద రాయడానికి వీలు లేని భాషను ఉపయో గిస్తున్నారు. కొందరైతే రాష్ట్ర స్థాయి నాయకులే దేశ రాజ కీయాల్లోనే చక్రం తిప్పుతామని చెప్పేవారు కూడా తమ స్థాయిని, సంస్కారాన్ని మరిచి తిడుతు న్నారు. ఆ పదాలను ఇక్కడ ప్రస్తావించడానికి మనసు ఒప్పడం లేదు. కిందిస్థాయి నాయకులు అటువంటి భాషను వాడినట్లయితే వారి నాయకులు ఆ విధంగా మాట్లాడటాన్ని వెంటనే ఖండించాలి. ఎదుటిపక్షం వారికి క్షమాపణ చెప్పాలి. అప్పుడు ఎదుటిపక్ష నాయకులకు వారి అభిమానులకు మరో విధంగా స్పందించడానికి అవకాశం ఉండదు. అదే విధంగా ఒక పార్టీ ఆఫీసుపై దాడి జరిగినప్పుడు మరో పార్టీ నాయకులు ఆ దాడిని ఖండించి ఇలా దాడులు చేయడం మన విధానం కాదని చెప్పాలి. అప్పుడు ఉద్రేకాలు, కోపతాపాలు చల్లారుతాయి. నాయ కులు కార్యకర్తలను సముదాయించి అల్లర్లు జరగ కుండా చూడాలి. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించిన ట్లయితే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా మరొక వ్యక్తి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా మాట్లాడినా, రాసినా ఐపీసీ 500 ప్రకారం 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష, లేదా జరిమానాకు, లేదా రెండింటికీ గురికావచ్చు. ఎవరైనా మరొక వ్యక్తిని గాయపరుస్తానని లేదా అతని పరువుప్రతిష్టలకు భంగం కలిగిస్తానని పేర్కొనడం ద్వారా అతన్ని భయభ్రాంతులకు గురి చేసినట్లయితే అటువంటి చర్యలవల్ల అలా భయ భ్రాంతులకు గురైన వ్యక్తి చట్ట వ్యతిరేకమైన పనులు చేయడానికి ఉద్యుక్తుడయితే లేదా చేసిన, అలా మాట్లాడిన వ్యక్తి లేదా అటువంటి చర్యలతో రెచ్చ గొట్టిన వ్యక్తి ఐపీసీలోని 504 ప్రకారం 2 సంవ త్సరాల వరకు, లేదా జరిమానాకు లేదా రెండింటికీ గురి కావచ్చు. ఒక వ్యక్తిని అవమానపరిచినా లేదా అలా అవ మాన పరచడంవల్ల ఆ వ్యక్తి శాంతిభద్రతలకు భంగం కలిగించే పరిస్థితి ఏర్పడితే లేదా శాంతి భద్రతలకు భంగం కలిగితే ఐపీసీలో సెక్షన్ 506 ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలుశిక్షకు లేదా జరిమానాకు లేదా రెండింటికీ గురికావచ్చు.నేరం చేయమని ప్రోత్సహించినట్లయితే ఐపీసీ 109, 110 ప్రకారం వారు కూడా శిక్షార్హులే. అలాగే మిగతా నేరాలను ప్రోత్సహించడం సెక్షన్స్ 111 నుండి 117 వరకు శిక్షార్హమైన నేరాలే.వివిధ వర్గాలమధ్య, మతాల మధ్య విద్వే షాన్ని రేకెత్తించడం ఐపీసీలోని సెక్షన్ 153–ఏ ప్రకారం నేరం. ఈ నేరానికి 3 సంవత్సరాల వరకు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ విధించవచ్చు. అల్లర్లు రేపడం సెక్షన్ 153 ఐపీసీ ప్రకారం నేరం. బహిరంగంగా ఆయుధాలు ధరించి ఊరే గింపుగా, గుంపుగా వెళ్లడం ఐపీసీ 153– ఏఏ ప్రకారం నేరం. వివిధ కులాలమధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య విద్వేషం కల్గించడం కూడా నేరాలే. ప్రజా ప్రతినిధుల చట్టం కూడా అభ్యర్థులు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవ ర్తించాలో నిర్దేశిస్తుంది. ఏ వ్యక్తిని, కులాన్ని, మతాన్ని, జాతిని, వర్గాన్ని కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని చెబుతున్నది. చెదురుమదురుగా జరిగిన సంఘటనలను ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయా లనడం లేదా ఒక పార్టీని రద్దు చేయాలనడం రాజ్యాంగం రీత్యా చెల్లదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడలేదు, ఎందరో చనిపోతున్నారు, వారి ప్రాణాలను ప్రభుత్వం కాపాడలేదనే తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడే రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడలేదనే అభిప్రాయానికి రావచ్చు. ఒకప్పుడు నాయకులు ఎంతో హుందాగా ప్రవర్తించేవారు. ప్రతిపక్ష నాయకులు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, జార్జ్ ఫెర్నాండెజ్, అటల్ బిహారీ వాజ్‌పేయి లాంటి నాయకులు ప్రభుత్వ విధానాలను, నాయకులను మాటలతో చీల్చిచెండాడినా, ఏరోజు అసభ్యంగా, అవమాన కరంగా మాట్లాడేవారు కారు. వారు మాట్లాడుతూ ఉంటే అప్పటి ప్రధానమంత్రులు, ముఖ్య మంత్రులు సైతం జాగ్రత్తగా వినేవారు. అధి కారంలో ఉన్నవారు ప్రతిపక్ష నాయకులకు ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారు. అలాగే ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రిపట్ల, మంత్రులపట్ల సభ్యతా సంస్కా రాలతో మాట్లాడేవారు. పరస్పరం గౌరవించు కునేవారు. అప్పటి సీపీఎం నాయకుడు యం. ఓంకార్ మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు సైతం ఆయన సభ్యతా సంస్కారం మరచి మాట్లాడలేదు. నేటి నాయకులకు తాత్కాలిక ప్రయోజనాలు ముఖ్యం. అదీగాక ఆ ఫలితాలు వెంటనే రావాలి. ఓపిక లేదు. ప్రజలు ఒక పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు ఆ పార్టీని పూర్తి పదవీకాలం పనిచేయనివ్వాలి. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఆ పార్టీని అధికారంలో కొనసాగించాలా? లేదా అనే విషయం. ఆర్టికల్ 356ను గతంలో ఎలా దుర్విని యోగపరిచారో, అప్పటి తెలుగుదేశం నాయకుడు ప్రజలతో ఎన్నుకోబడిన ఎన్టీరామారావు ప్రభు త్వాన్ని రద్దుచేస్తే ఎటువంటి ప్రజా ఉద్యమం వచ్చిందో నాయకులు అప్పుడే మరచిపోతే ఎలా? ఎమర్జెన్సీ రోజులను ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాధినేతలు మరువవద్దు. -జస్టిస్ చంద్రకుమార్ వ్యాసకర్త విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 94940 12734 -
రామాయణం నీతి నేటికీ ఆదర్శనీయమే
మన దేశంలో రాముడు కోట్లాదిమందికి దేవుడు, రామనామాన్ని ఎందరో మంత్రంగా జపిస్తారు. రామాయణం నిజంగానే జరిగిందని చెప్పే ఆధారాలను చరిత్రకారులు చూపిస్తారు. మన దేశంలోనే కాక ఇంకా కొన్ని దేశాలలో కొంత భిన్నమైన రామాయణ కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆదికవి వాల్మీకి రామాయణం అన్నింటికి మూలం. రామాయణం ఇంత ప్రాచుర్యం పొందడానికి, రామనామం ఇంత గొప్ప ప్రభావం చూపడానికి కారణాలు ఏమిటి? మానవ జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని జీవన విధానాలను, జీవిత విలువలను రామాయణం చెప్తున్నది. అవి ఈనాటికీ అందరికీ ఆదర్శం. అందుచేతనే ఈ నాటికి రామాయణం కథ ఎందరి మీదనో ప్రభావం చూపుతున్నది. రామాయణం మానవజీవితానికి, సమస్త మానవాళికి, సర్వకాలాలకు, సర్వ దేశాలకు ఉపయోగపడే శాశ్వత సత్యాలను, జీవన విధానాలను మనకు చెప్తున్నది. రామాయణాన్ని విమర్శించే వారు ఇది వర్ణాశ్రమ ధర్మాన్ని కులవివక్షతను చూపుతుందని విమర్శిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో అడుగడుగునా అన్ని వర్గాల వారిని పిలిచి సంప్రదించినట్లు ఉంది. రామ పట్టాభిషేకానికి నాలుగు వర్ణాల వారిని ఆహ్వానించినట్లు ఉంది. అదీగాక రాముడు, గుహుని ఆతి థ్యాన్ని స్వీకరించాడు. మాతంగ మహర్షి (ఒక చండాల స్త్రీ కుమారుడు) ఆశ్రమాన్ని దర్శిస్తాడు. ఆ ఆశ్రమంలోని శబరి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆ విధంగ రాముడు ఎక్కడ కుల వివక్షతను చూపలేదు. ప్రపంచంలో ఎన్నో రామాయణ కథలు ఉన్నాయి. భిన్నమైన కథలున్నాయి. వాల్మీకి రామాయణంలో ఒకచోట రాముడు జాబాలి వాదనను తిరస్కరిస్తూ ‘బుద్ధుడు దొంగ వంటి వాడు అతడు చెప్పినది నాస్తిక వాదం అని’ అయోధ్య కాండలో రాముడు అన్నట్లు ఉంది. బుద్ధుడు క్రీస్తుపూర్వం 623 సంవత్సరంలో జన్మించాడు. క్రీ.పూ. 483లో సమాధి చెందాడు. ఇక రామాయణం ఎప్పుడు జరిగింది? రాముడు క్రీ.పూ. 5114 సంవత్సరంలో జన్మించాడని కొందరు లెక్కలు వేశారు. ఢిల్లీ చాప్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అన్ వేదాస్ డైరెక్టర్ సరోజ్ బాల రామాయణం, భారతాలు జరిగినవనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని రామాయణ కాలం క్రీ.పూ. 7000 సంవత్సరాలలోపు జరిగిందని అంచనా వేశారు. ఏది ఏమైనా గౌతమబుద్ధుని కంటే కనీసం 1000–700 సంవత్సరాల కంటే ముందే రాముడు ఉన్నాడని చరిత్రకారులు చెప్తున్నారు. రాముడు బుద్ధుని కంటే ముందే అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. దశావతారాల ప్రకారం కూడా రామావతారం, కృష్ణావతారం తర్వాతనే బుద్ధావతారం అని చెప్తారు. అందుచేత రాముడు బుద్ధుడు దొంగ వంటివాడు అని చెప్పడం కచ్చితంగా జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే రామాయణం జరిగిన ఎన్నో వందల సంవత్సరాల తరువాతనే బుద్ధుడు జన్మించాడు అంటే రాముడు బుద్ధుడు దొంగ వంటివాడు అనడం కచ్చితంగా ప్రక్షిప్తమని చెప్పవచ్చు. అలాగే శంబుకుని కథ ప్రక్షిప్తం అని పండితుల, విజ్ఞుల అభిప్రాయం. రామాయణం ప్రకారం రావణాసురుడు బ్రాహ్మణుడు, వేదాలు చదివిన వాడు. గొప్ప శివ భక్తుడు. అతడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని అధికారానికి, సంపదలకు, భార్యలకు కొదవలేదు. కానీ శూర్పణఖ తప్పుడు సలహాతో కామప్రేరితుడై సీతను అపహరించి వినాశనాన్ని కొనితెచ్చుకున్నాడు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మొదట బోయవాడు. రాముడు గుహుని, శబరిల ఆతిథ్యాన్ని స్వీకరించడం, సుగ్రీవునితో స్నేహం చేయడం, జటాయువుకు దహన సంస్కారాలు చేయడం ఈవిధంగా ఏ కోణంలో చూసినా రామాయణం కులతత్వాన్ని, వర్ణ వివక్షతను సమర్థించదు. ఏ గ్రంథమైనా, ఏ మహానుభావుని చరిత్ర అయినా ఏ పురాణ కథ అయినా అందులోని నీతి ఏమిటి. అది మానవులకు ఇచ్చే సందేశం ఏమిటి? అనే విషయాలను గమనించాలి. అందులోని మంచిని స్వీకరించాలి. రాముడు దేవుడు కాదని ఎవరైనా వాదిం చినా, రామాయణంలోని నీతిని, జీవన విధానాలను తప్పుపట్టలేడు కదా. గురువుల, పెద్దల సలహా పాటించాలి, ఆడిన మాటకు కట్టుబడి ఉండాలి, తండ్రి మాటను గౌరవించాలి, భర్త కష్టాల్లో పాలు పంచుకోవాలి, అన్నదమ్ములు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ధర్మ మార్గాన్ని అనుసరించాలి. పరస్త్రీలపై కన్ను వేయరాదు. ఇది రామాయణం బోధించిన ప్రధాన జీవన విధానాలు. ఇలాంటి జీవన విధానాలు ప్రపంచ మానవాళికి ఆదర్శం కాదా? జస్టిస్ బి. చంద్రకుమార్ విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 79974 84866 -
వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడాలంటే...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు ఏమాత్రం పెంచలేదు. పైపెచ్చు ప్రధానమంత్రి కిసాన్ యోజనకు గతంలో రూ.75 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.65 వేల కోట్లు కేటాయించారు. రైతు వ్యవసాయ సంక్షేమంలోనూ నిధులు తగ్గించారు. అనేక పబ్లిక్ రంగ పరిశ్రమల నుండి ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరిం చుకుంటామని ప్రకటించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబ డులు పెట్టడానికి కార్పొరేట్ కంపెనీలకు, మల్టీ నేషనల్ కంపె నీలకు అవకాశం కల్పించారు. కరోనా సమయంలోనే 100 కార్పొరేట్ కంపెనీల ఆదాయం రూ.12 లక్షల కోట్లకు పైగా పెరిగింది. వాస్తవంగా మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? వాటిని పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాలి? ప్రధాన సమస్యలను అసలు పట్టించుకుం టున్నారా? ఈ రోజు ఢిల్లీ లాంటి అనేక నగరాల్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోతున్నది. దీనివల్ల అనేక శ్వాస సంబంధమైన రోగాలు వస్తున్నాయి. వాతావరణం వేడెక్కడం వల్ల అనేక పక్షులు, జంతువులు మనలేకపోతున్నాయి. భూగర్భ జలాలు ఇంకి పోయాయి. భవిష్యత్తులో ప్రజల ప్రాణాలను కాపాడాలంటే మొదట చేయాల్సింది వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం. చట్టాలు ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కానీ ప్రభు త్వాలకు చిత్తశుద్ధి లేకపోతే ఎవరూ ఏమి చేయలేరు. కాలుష్య నివారణ చట్టాలను గట్టిగా అమలు చేయడం వల్ల కార్పొరేట్ కంపెనీలకు ఇబ్బంది కలుగుతుంది. కొంత ఆర్థికభారం వారిపై పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆరోగ్యానికి కేటాయించిన బడ్జెట్ నుండి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, భూగర్భ జలాల స్థాయిని పెంచడానికి ఎక్కువశాతం ఉపయోగించాలి. కార్పొరేట్ కంపెనీల కాళ్ళకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీసే ప్రభుత్వం ఉన్నప్పుడు కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, పంటలు ఎవరి ప్రయోజనాల కోసం? నేడు హైబ్రిడ్ విత్తనాలు వచ్చి ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి ఆహారధాన్యాలు విషతుల్యం అవుతు న్నాయి. ప్రజలకు ఆరోగ్యకరమైన పంటలను, కూరగాయలను, పండ్లను అందించాలంటే ఎరువులు, పురుగు మందుల వాడ కాన్ని తగ్గించాలి. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి. పశువులకు అధిక పాల కొరకు ఇచ్చే ఇంజెక్షన్లను రద్దు చేయాలి. ఆహారధాన్యాలను, కూరగాయలను, పండ్లను, కొబ్బరి నీళ్లను విషతుల్యం చేసే అన్ని రకాల మందులను, ఇంజెక్షన్లను నిషే ధించాలి. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పంటలను ప్రోత్స హించాలి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తే వారు ప్రజల ఆరోగ్యం కోసం పంటలు ఉత్పత్తి చేయరు. లాభాల దిశగా వ్యవసాయ రంగాన్ని మరల్చుతారు. రైతులతో ఒప్పందాలు చేసుకొని, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేస్తారు. రైతుల పంటలను కొనుగోలు చేస్తారు. కనీస మద్దతు ధర ఇస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేస్తామని చెప్పడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కనీస మద్దతు ధర ఉండే పరిస్థితి పోతుంది. కొంతకాలానికి అధిక లాభాల కోసం ఎరువులు, విత్తనాల ధరలు పెంచి మరోవైపు పంటల ధరలను తగ్గిస్తారు. క్రమంగా రైతు అప్పుల్లో మునిగిపోతాడు. ఇప్పుడు కేంద్రం చేసిన చట్టాల ప్రకారం రైతుకు కోర్టుకు వెళ్లే అధికారం కూడా లేదు. చివరకు రైతు భూముల్ని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. కంపెనీలు రైతుల భూముల్ని కొని పెద్దపెద్ద వ్యవసాయ క్షేత్రాలుగా చేస్తారు. దీనివల్ల రైతులు కూలీలుగా మారుతారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారధాన్యాల గురించి గానీ, కల్తీలేని పాల గురించి గానీ ఎవరూ ఆలోచించరు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం ద్వారా మొదట జరిగేది కార్మికుల తొలగింపు. నిర్వహణ ఖర్చుల తగ్గింపు పేరుతో నలుగురు పనిచేస్తున్న చోట ఇద్దరితోనే సరిపోతుందనే నెపంతో అనేక మంది ఉద్యోగం కోల్పోతారు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్యకు ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. నిరుద్యోగులు పెరిగితే, రైతులకు కనీస మద్దతు ధర దొరక్కపోతే ఏమవుతుంది? ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీని ప్రభావం మార్కెట్ మీద పడి రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. ఫలితంగా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ప్రజలు కనీస అవసరాలు తీరడానికి ఇబ్బంది పడతారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. అందుకే ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తి పెంచే ప్రయత్నాలు చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు ప్రణాళికలు వేయాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆశిద్దాం. విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తీయడం వల్ల క్రమంగా మన ఆర్థిక వ్యవస్థ వారి గుప్పిట్లోకి పోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ విదేశీయుల చేతిలోకి వెళ్తే వారి రాజకీయ జోక్యం పెరుగుతుంది. చివరకు మనం స్వతంత్రం కోల్పోయే ప్రమాదం కూడా రావచ్చు. జస్టిస్ బి. చంద్రకుమార్ వ్యాసకర్త హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 94940 12734 -
ఈ కులమతాల ముద్రలెందుకు?
నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన దాదాపు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రతి పక్ష నేతగా పనిచేశారు. ఇంతటి అనుభవ మున్న వ్యక్తి.. ఏపీలో ప్రస్తుతం సీఐడీ అధిపతిగా ఉన్నవారు ఒక మతానికి చెందిన వ్యక్తి కాబట్టి రామతీర్థం విగ్రహ విధ్వంసం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారని అన్నట్లు 6 జనవరి 2021న మీడియాలో చూశాను. అలాగే హిందువులపై దాడి జరిగితే ఖబడ్దార్ అని కూడా చంద్ర బాబు అన్నారని వార్తలొచ్చాయి. ఆయన అలా అనే బదులు ఏ మతం వారూ మరో మతంవారిపై, వారి మందిరాలపై దాడి చేసినా అది మంచిదికాదు అని చెప్పి ఉండాల్సింది. ఎవరు ఎవ రిపై దాడి చేసినా సహించం అనాల్సింది. అధికారులకు కులాన్ని, మతాన్ని అంటగడితే ఏ అధికారి కూడా చట్టప్రకారం పని చేయలేడు. ఏ అధికారి అయినా విధి నిర్వహణలో అవినీతి, అలక్ష్యానికి పాల్పడినా, లేదా పక్షపాతం చూపినా ఆ అధికారిమీద తప్పకుండా చర్య తీసుకోవాలి. మన సమాజంలో అత్యంత నిజాయితీ పరులు, అత్యంత అవినీతిపరులు అన్ని కులాల్లో, మతాల్లో ఉన్నారు. ఈ రోజు ఒక కులానికి, మతానికి చెందిన వ్యక్తి అధికారంలో ఉండ వచ్చు. రేపు మరో కులానికి, మతా నికి చెందిన వ్యక్తి అధికారంలోకి రావచ్చు. అతడు ఏం చేస్తున్నాడు, పేద ప్రజలకు లాభం చేస్తున్నాడా లేదా? రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతున్నదా లేదా అతడేమైనా అవినీతికి పాల్పడుతున్నాడా? ఎక్కడైనా పక్షపాతం చూపుతు న్నాడా– వాటిని గమనించాలి. పొరపాటు ఉంటే ఖండించాలి. అంతే కానీ, అతని కులాన్ని బట్టి, మతవిశ్వాసాలను బట్టి ఆ వ్యక్తిని అంచనావేయడం చాలా తప్పు. చంద్రబాబు నాయుడి వంటి పరిపాలనా అనుభవం కలిగిన నాయకులు కులభేదాలను ప్రస్తావిస్తూ ఈ విధంగా మాట్లాడితే సమాజం విచ్ఛిన్న మౌతుంది. ప్రజలు అధికారుల పట్ల, న్యాయమూర్తుల పట్ల విశ్వాసం కోల్పోతారు. రాజ్యాంగ వ్యవస్థ మనుగడ పెను ప్రమా దంలో పడుతుంది. కులమత భేదాలు, ఘర్షణలు ఎక్కువై పోతాయి. ఒక చిన్న ఉదాహరణ. మా నాన్నగారు గొప్ప రామభక్తులు. నిరంతరం రామనామం ఆయన పెదాలపై ఉండేది. అమ్మ నిరంతరం పూజలు పునస్కారాలు చేసేది, కానీ ఎంతోమంది ఇతర మతస్తులకు, ఇతర కులాలవారికి మా ఇంట్లో మాతోపాటు భోజనం పెట్టేవారు. ఎంతోమంది పేద విద్యార్థులకు వారు తోడ్పడ్డారు. ఏ రోజూ కుల, మత భేదాలు పాటించలేదు. కాబట్టి నేను అందరిని కోరుతున్నది ఏమిటంటే అధి కారంలో ఉన్నవారికి కులాలకు, మతాలను ఏ పరిస్థితుల్లోనూ ఆపాదించవద్దు. శంకరన్ లాంటి ఐఏఎస్ అధికారి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో శ్రమించారు. ఆదివాసీల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.అధికారుల్లో, న్యాయమూర్తుల్లో ఏ కులం వారైనా ఉండ వచ్చు. ఒక అధికారి, న్యాయమూర్తి ఫలానా కులం వ్యక్తి కాబట్టి ఒక కేసులో వాది, ప్రతివాది లేదా ముద్దాయి అతని కులంవాడు కాబట్టి ఆ అధికారి లేదా న్యాయమూర్తి న్యాయం చేయడేమో అని అనుమానిస్తే ఇక ఎవరూ దర్యాప్తు చేయలేదు. ఏ కేసును విచా రించలేదు. ఇలా ఐతే ఈ రాజ్యాంగ వ్యవస్థ కూలిపోతుంది. రేపటి రోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురుకావచ్చు. చంద్రబాబు ప్రకటన ఆధారంగా ఒక నేరంలో క్రైస్తవులు గానీ ముస్లింలు గానీ ముద్దాయిలుగా ఉంటే ఏ హిందూ అధికారీ వారిని విచారించగూడదని క్రైస్తవులు లేదా ముస్లింలు డిమాండ్ చేయవచ్చు. అలాగే దళితులు ముద్దాయిలుగా ఉంటే వేరే కులం వారు తమను విచారణ చేయకూడదని డిమాండ్ చేయవచ్చు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దేవాలయంలోని పూజారి ఒక స్త్రీని ఇతరులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడనే వార్త చూశాము. ఇక నేరం చేసిన వ్యక్తి పూజారి (బ్రాహ్మణుడు) కాబట్టి బ్రాహ్మణ కులానికి చెందిన ఏ అధికారి కూడా ఆ పూజారిని విచారించవద్దంటే ఎలా వీలవుతుంది? ఇలా ప్రతీ కేసులో, ప్రతీ విచారణలో విచారణ చేస్తున్న వారిది ఏ మతం, ఏ కులం, ఆ కేసులోని వ్యక్తులది ఏ కులం అని చూడడం మొదలు పెడితే మన సమాజం విచ్ఛిన్నమౌతుంది. కుల, మత ద్వేషాలు పెరుగు తాయి. జస్టిస్ ఒ. చిన్నపరెడ్డి, జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ రంగ నాథ్ మిశ్రా, జస్టిస్ రామస్వామి, జస్టిస్ పి. వెంకటరామిరెడ్డి లాంటి విశిష్ట న్యాయమూర్తులు ఏ రోజైనా కుల మతాల గురించి ఆలోచించారా– ఏనాడైనా వారు విచారణ క్రమంలో పక్షపాతం చూపారా; అన్ని కులాల నుంచి వచ్చిన వారిలో ఎంతో నిజాయితీ, నిబద్ధత కల్గిన అధికారులు, న్యాయమూర్తులు ఉంటారు. బ్రాహ్మణకులంలో పుట్టిన గురజాడ అప్పారావు భర్తలు చనిపోయిన స్త్రీలకు మరో వివాహం చేసుకొనే హక్కు ఉండాలని స్త్రీలకు విద్య కావాలని పోరాడలేదా? అంబేడ్కర్ స్త్రీలకు సమాన ఆస్తిహక్కు ఉండాలని వాదించలేదా?అలాగే బ్రాహ్మణుడైన రామకృష్ణ పరమహంస, కాయస్త కులానికి చెందిన వివేకానందుడిని ప్రథమ శిష్యునిగా చేర్చు కోలేదా? పోతులూరి వీరబ్రహ్మం.. దూదేకుల సిద్ధయ్యను తన ప్రథమ శిష్యుడిగా తీర్చిదిద్దలేదా? షిరిడీసాయి అన్ని కులాల వారిని, మతాలవారిని సమానంగా చూడలేదా? మహాత్ములు ఎవ్వరూ ఏ మతం వారైనా ఏ కులం వారైనా కులమత భేదాలను పాటించలేదు. ఒకవైపు ఎందరో కులాంతర వివాహాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో వ్యక్తులందరికీ.. ముఖ్యంగా అధికారులకు కులం అంట గట్టడం విద్వేషాలను పెంచే యత్నంగా భావించాల్సి వస్తుంది. ఇక ముందైనా మన రాజకీయ నాయకులు కాస్త విజ్ఞతతో, ఇంగితజ్ఞానంతో మాట్లాడతారని ఆశిద్దాం. -జస్టిస్ చంద్రకుమార్ వ్యాసకర్త విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 79974 8486 -
మత విద్వేషాలను రెచ్చగొట్టి ఏం సాధిస్తారు?
ఈ రోజు మీడియాలో బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా? రెండు కొండల పార్టీకి ఓటేస్తారా?– ఏడుకొండల బీజేపీకి ఓటేస్తరా? అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నట్లు వార్త వచ్చింది. ఇదే నిజ మైతే ఇది కచ్చితంగా రాజ్యాంగా నికి, చట్టానికి వ్యతిరేకం. అంతే కాదు, భారత శిక్షాస్మృతి ప్రకారం జైలుశిక్ష విధించగల నేరం. ఈ వ్యాఖ్యలు మత విద్వేషాన్ని రెచ్చగొడ్తాయి. ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తాయి. బైబిల్ చదివేవారిని అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఐపీసీ 153 (ఎ) ప్రకారం విభిన్న వర్గాల మధ్య వైషమ్యాలను పెంచడం నేరం. ఈ నేరాలకు 3 సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. లేదా ఫైన్ విధించవచ్చు. లేదా శిక్ష, ఫైన్ రెండూ విధించవచ్చు. అంతేగాదు పూజా స్థలాలలో వైష మ్యాలను పెంచే చర్యలు చేసినట్లయితే ఈ శిక్ష 5 సంవ త్సరాల వరకు విధించవచ్చు. ఇది పోలీసులే బెయిల్ ఇవ్వ గూడని నేరం. పోలీసులు తప్పనిసరిగా కేసు పెట్టాల్సిన నేరం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయకోవిదుల అభిప్రాయం తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలి. చట్ట బద్ధంగా ఇచ్చిన ఆజ్ఞను (ఆర్డరును) ఉల్లంఘించినా నేరమే. ఇక ప్రజా ప్రతినిధుల చట్టం 1951లో 125 సెక్షన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ ఎన్నికకు సంబంధించి అయినా సరే.. మతాల, జాతుల, కులాల, భాషల మధ్య వైషమ్యాలను కల్గించి, వాటి మధ్య శత్రుత్వాన్ని ద్వేషభావాన్ని పెంపొందించినట్లయితే అతనికి 3 సంవ త్సరాల వరకు శిక్ష లేదా ఫైన్ లేదా రెండింటిని విధిం చవచ్చు. ఎవరైనా సెక్షన్ 125 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరం చేసినట్లు రుజువైతే వారు సెక్షన్ 8 ప్రజా ప్రతినిధుల చట్టం 1951 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయ డానికి అనర్హులు. అదేవిధంగా మత సంస్థల దుర్వినియోగ నిరోధక చట్టం 1988 ప్రకారం, ఎన్నికల్లో పోటీకి అర్హత కోల్పోతారు. బండి సంజయ్ స్టేట్మెంట్ను బీజేపీ ఖండించాలి. లేకపోతే ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యకు గురికావలసి వస్తుంది. గౌరవనీయులు జస్టిస్ ఆవుల సాంబశివరావు భారత రాజ్యాంగ వ్యవస్థ న్యాయవ్యవస్థ అనే పుస్తకంలోని లౌకిక తత్వం అనే వ్యాసంలో ఇలా వ్రాశారు.‘లౌకికత్వాన్ని ప్రతి పౌరుడు, ముఖ్యంగా ముందు కాలంలో దేశాన్ని నడిపించవలసిన యువతరం, వంట బట్టించుకోవడం అవసరం. అది లేకపోవడంతో భారత ఉపఖండం ముక్కచెక్కలయ్యింది. ఆ శకలాలలో నివసించే ప్రజలు మత పిచ్చితో, శ్లేష్మంలోని ఈగల్లాగా కొట్టు మిట్టాడుతున్నారు. దేశాన్ని ముక్కలుగా తరిగిన 1947 నాటికంటే ఇప్పుడు ఆ పిచ్చి ఏ మాత్రం తక్కువగా లేదు. హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, క్రిస్టియన్లు – ఎవరికి వారు తమ మతం, తమ సమాజం, తమ ఉనికి ప్రమాదంలో పడిపోయిందని ఆరాటపడిపోతున్నారు. ఒకళ్ళమీద మరొకరు అనుమానాలు, కక్షలు పెంచుకుంటు న్నారు. ఈ మతపిచ్చి మన ఉపఖండంలోని మూడు రాజ్యా లకే పరిమితం కాలేదు. మధ్య తూర్పు ఆసియా దేశాల్లో ఈ వెర్రి ఏ మాత్రం తక్కువగా లేదు. తమ రాజ్యాలనే మత రాజ్యాలుగా మార్చివేస్తున్నారు. ప్రజల జీవితాన్ని తారు మారు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కాక, ప్రజల్ని పేదరికం నుండి బయట పడవేసే ప్రయత్నాలు కాక, మత స్పర్థల్ని పెంచే తంత్రాల మీదనే ప్రభుత్వాల ప్రయత్నాలు కేంద్రీకృతమైనాయి. వెర్రితలలు ఇంతటితో ఆపలేదు. మత పిచ్చి మాత్రమే చాలదన్నట్లు, కులతత్వాన్ని, రెచ్చగొడుతున్నారు. సమాజం యావత్తు కులాల కింద ముక్కచెక్కలై పోతున్నది’. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం పౌరులందరికీ మత స్వాతంత్య్రపు హక్కు కల్పించారు. మనదేశంలోని ఏ వ్యక్తి అయినా తన సొంత ఆలోచన విధానాన్ని పాటించవచ్చు. తనకిష్టమొచ్చిన మతాన్ని పాటించి ఆచరించి ప్రచారం చేసుకోవచ్చు. ఏ మత వ్యవస్థలైనా, మత సంస్థలను ఏర్పాటు చేసికొని మత విషయాలను తాము సొంతంగా నడుపుకోవచ్చు. ఆస్తు లను సంపాదించుకోవచ్చు. ఏ వ్యక్తినీ కూడా మతపరమైన సంస్థలకు ఖర్చుపెట్టడం కోసం పన్ను చెల్లించమని నిర్బంధించకూడదు. ప్రభుత్వ సహాయంతో నడిచే ఏ విద్యాసంస్థలోనైనా మతపరమైన బోధనలు చేయరాదు. ఏ వ్యక్తికి కూడా ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యా సంస్థలలో మతం కారణంగా ప్రవేశం నిరాకరించరాదు. ప్రతి వ్యక్తికి అతనికి ప్రత్యేకమైన భాష, లిపి, సంస్కృతి ఉంటే వాటిని సంరక్షించుకునే అధికారం ఉంటుంది. అల్ప సంఖ్యాక వర్గాల వారు వారి సొంత విద్యాసంస్థలను నెల కొల్పి వాటిని సొంతంగా నడుపుకోవచ్చు. దీనినే లౌకిక వాదం అంటారు. రాజ్యాంగంలోని 25 నుంచి 30 అధికర ణలు ఈ విషయాలను స్పష్టం చేస్తాయి, ప్రతివ్యక్తి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని రాజ్యాం గంలోని ప్రాథమిక విధులలో పేర్కొన్నారు. ఏ మనిషి ఏ కులంలో పుట్టాలో, ఏ మతంలో పుట్టాలో అతని లేదా ఆమె చేతిలో ఉండదు. పంచభూతాలు సూర్యుడు, గాలి, నీరు, వాయువు, భూమి ఎవ్వరిపట్ల వివక్షత చూపవు. అంటే ప్రకృతికి అంటే పరమాత్మునికి వివక్ష ఉండదు. పరమా త్మకు ఏ కులాన్ని, ఏ మతాన్ని ఆపాదించగూడదు. ఏ పేరుతో ప్రార్థించినా చేరేది అక్కడికే. భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడే ఈ విశ్వాన్ని, ఈ విశ్వంలో అన్ని మతాల వారిని, కులాలవారిని సృష్టించాడు. దీనిని అర్థం చేసుకోక స్వార్థంతో, రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని, మతాన్ని, దేవుణ్ణి వాడుకోవడం చట్టరీత్యా నేరం. దైవం దృష్టిలో అపచారం. నేడు ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల మీద దాడులలో విగ్రహాలు ధ్వంసం చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర లేదా ఆయన పార్టీ హస్తం ఉంటుందని నేను అను కోవడం లేదు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నారు. తనే స్వయంగా తన ప్రభుత్వానికి అస్థిరతను ఎందుకు కల్పిస్తారు? ఎందుకు అశాంతిని, శాంతిభద్రతల సమస్య లను కలుగజేస్తారు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. -జస్టిస్ చంద్రకుమార్ వ్యాసకర్త రిటైర్డ్ న్యాయమూర్తి మొబైల్ : 79974 84866 -
న్యాయమూర్తులు ఆదర్శప్రాయమైన జీవితం గడపాలి
గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయమూర్తులు విధి నిర్వహణలో నీతి, నిజాయితీతో పని చేసి ఆదర్శప్రాయ జీవితాన్ని గడపాలని ఏపీ ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. గుంటూరులో వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ జి.శాంతమూర్తి అధ్యక్షతన ‘సుపరిపాలన సాధనలో న్యాయ వ్యవస్థ పాత్ర’ అంశంపై శనివారం ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగానికి మూల స్తంభాలని, వాటి మధ్య ఘర్షణ ఉండకూడదన్నారు. ఎవరో ఒక వ్యక్తి అవినీతిపరుడు అయినంత మాత్రాన వ్యవస్థ ఎప్పటికీ కళంకం కాదన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రి వ్యవస్థలో చోటు చేసుకుంటున్న లోపాలపై ఆధారాలతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. -
భగవంతుణ్ణి, పాలకులను కులమతాల్లో ఇరికించవద్దు
భిన్నభిన్న ప్రాంతాల్లో, వివిధ కాలాల్లో ఆధ్యాత్మిక వేత్తలు, యోగులు, మత ప్రవక్తలు వచ్చి అప్పటి పరిస్థితుల్లో మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్పారు. అయితే ఆత్మజ్ఞానం పొందినవారు, భగవం తుడిని తెలుసుకున్న వారు లేదా భగ వంతుని లీలల అనుభవాన్ని పొంది నవారు అందరిలో ప్రాణ స్వరూ పంగా ఉన్న భగవంతుడు ఒక్కడే అనే సత్యాన్ని కూడా నొక్కి చెప్పారు. అందుకే మహాత్ములెవ్వరూ కులమత భేదాలను పాటించలేదు. రామకృష్ణ పరమహింస షిరిడీ సాయిబాబా, కబీర్, బ్రహ్మంగారు, వివేకానందుడు ఇలా ఏ మహాత్ముడు కులమతభేదాలను పాటించలేదు. రామకృష్ణ పరమహింస ఎన్నో సాధనలు చేశారు. ఎన్నో అనుభూతులు పొందారు. అలాంటి మహాత్ముడు మహమ్మద్ ప్రవక్తను ధ్యానించి ఇస్లాంలో చూపిన సాధనలు చేసి మహమ్మద్ ప్రవక్తతో అను భూతిని పొందాడు. అదేవిధంగా క్రైస్తవమతాన్ని సాధన చేసి జీసెస్ క్రైస్తుతో అనుభవం పొందాడు. ఇప్పుడు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కొంతమంది అనవసరమైన, అసంగతమైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలోనే ఇదంతా చెప్పాల్సి వస్తోంది. శైవులకు, వైష్ణవులకు విభేదాలు ఉన్నప్పుడే పోతనామా త్యుడు శివకేశవులకు భేదం లేదని చెప్పాడు. కబీర్ రాం రహీం ఒక్కరేనని చెప్పాడు. కబీర్ హిందువా, ముస్లిం మతస్తుడా ఎవ్వరికీ తెలీదు. అలాగే షిరిడీ సాయి హిందువా, ముస్లింనా ఎవ్వరికీ తెలీదు. సాయిబాబా ఫకీర్ వేషంలో కన్పించారు. షిరిడీలోని దేవాలయాలను పునరుద్ధరించాడు. ఎంతోమంది ప్రముఖులు బాబాను దేవుడిగా పూజించారు. బాబానుంచి ఎన్నో అనుభవాలు పొందారు. అలాంటి బాబా ఏ మతసంప్రదాయాలను, ఆచారాలను పాటించలేదు. అతను ఏ మతస్తుడో చెప్పలేదు. అయితే మతమార్పిడు లనూ అంగీకరించలేదు. ఎవ్వరి విశ్వాసాలకు అనుగుణంగా వారు దైవాన్ని కొలవాలని చెప్పారు. ఎవ్వరు ఏ మతాన్ని విమ ర్శించినా ఒప్పుకునే వారు కాదు. ఒక సందర్భంలో వివిధ మతాల గురించి మాట్లాడుతూ అక్కడికి వెళ్లడానికి ఎన్నో దారులున్నాయి, శిరిడీ నుంచి కూడా ఒక దారి ఉంది అని చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మం విశ్వబ్రాహ్మణుడైనప్పటికీ, దూదేకుల సిద్ధయ్యకు జ్ఞానబోధ చేశాడు. దళితుడైన కక్క య్యకు ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చాడు. రమణ మహర్షి ఆత్మవిచారణకే ప్రాధాన్యమిచ్చాడు. గౌతమ బుద్ధుడు ధ్యాన సాధనకే ప్రాధాన్యమిచ్చాడు. వీరందరూ ఏ రోజూ మతాచా రాలను, సాంప్రదాయాలను పాటించలేదు. ఆరోజుల్లో ఉన్న ఆచారం ప్రకారం గురువు ఉపదేశించిన మంత్రాన్ని బహిరంగ పర్చకూడదు. కానీ శ్రీరామానుచార్యులు ఆ మంత్రం వల్ల అందరికీ లాభం చేకూరాలని గుడి గోపురం ఎక్కి ఆ మంత్రాన్ని అందరికీ వినిపిస్తాడు. గురువాజ్ఞను ధిక్కరించా వని అలా చేసినందుకు నరకానికి వెళ్తావంటే నల్గురికీ లాభం కల్గితే నరకానికి వెళ్లడానికి సిద్ధమే నంటాడు. మన ధర్మం ప్రకారం క్షత్రియులే పరిపాలన చేయాలి. బ్రాహ్మణులు పూజలు, యజ్ఞయాగాలు చేయాలి. అలాంట ప్పుడు జవహర్లాల్ నెహ్రూ, అటల్‌బిహారీ వాజ్‌పేయ్, పీవీ నరసింహారావు నేటి నరేంద్ర మోదీ లాంటి వారికి ప్రధాని అయ్యే అవకాశం లేదు. ఆ నియమాలు ఇప్పుడు మనం పాటిస్తున్నామా? పరిస్థితులనుబట్టి నియమాలు మారు తాయి. చట్టాలు, రాజ్యాంగం, నియమాలు అన్నీ కాలానుగు ణంగా మారకతప్పదు. ఇదివరకు మడికట్టుకొని వంట చేయడం మన ఆచారం. నేడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో, విమా నాల్లో, పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి మడికట్టు కొని వంట చేయడం సాధ్యం అవుతుందా? ఇక నిజమైన, పరిపూర్ణమైన భక్తి, జ్ఞానం కలవారు ప్రపంచంలోని అందరూ భగవంతుని రూపాలేనని భావి స్తారు. ప్రతీ ప్రాణిలో ఆత్మ రూపంలో ఉన్నదే ఒక్క విశ్వాత్మ భాగమేనని భావిస్తారు. ఏ పేరుతో పిలిచినా పలుకుతానని భగవంతుడు ఎందరికో అనుభవాలనిచ్చాడు. భగవంతుణ్ణి తనకిష్టమైన రూపంలో పూజిస్తాడు సాధకుడు. కానీ, సాధన ఉన్నత దశకు చేరాక భగవంతుణ్ణి నిరాకారరూపంగా ధ్యాని స్తాడు సాధకుడు. అప్పుడు ధ్యానం, ధ్యానించే సాధకుడు, ధ్యానించే రూపం ఒక్కటిగా అవుతుందని, ఆ స్థితినే సమాధి స్థితి అని మహాత్ములు చెబుతారు. ఆ స్థితికి చేరుకున్న వారు పూజలు, పునస్కారాలు, ఆచారాలు పాటించే స్థితిలో ఉండ రని రామకృష్ణ పరమహంస చెప్పారు. ‘ఉన్నది ఒక్కటే’ కానీ వివిధ పేర్లతో వ్యవహరిస్తారని వేదం చెప్పింది. శివుడన్నా, అల్లా అన్నా, యెహోవా అన్నా మరే పేరుతో పిలిచినా ఆ పిలిచేది ఒక్కరినే. ఆ పిలుపు చేరిది అక్కడికే. ఒక వ్యక్తిని చూసి అతని కులమేమిటో, మతమే మిటో చెప్పలేము. ప్రకృతికి కులమతాలు లేవు. గాలికి, నీటికి, భూమికి, ఆకాశానికి మతమేది? వీటికి లేని మతం దేవునికి ఎక్కడిది? దేవుళ్ల కులమతాల ముసుగులో చూడటం అజ్ఞానం. ఆత్మకు, పరమాత్మకు కులం లేదు. మతం లేదు. వేదాలన్నీ ‘ఓ మానవుడా’ అని సంబోధిస్తాయి. ఉపనిష త్తులు ఏ మతానికి చెందినవీ కావు. సమస్త మానవాళికి చెంది నవి. ఇక శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా çహథీరాంతో పాచికలాడాడని కథ. అంతేగాదు బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నాడనీ కూడా చెబుతాడు. బీబీ నాంచారమ్మ ఒక ముస్లిం స్త్రీ. ఆమెకు స్వామివారి మీద అనన్యమైన భక్తి. ఆ స్వామి ఆమెను స్వీకరించి తనలో ఐక్యం చేసుకున్నాడని స్వామి వారి కథలో చెబుతారు. అంటే ఒక ముస్లిం స్త్రీని తనలో ఐక్యం చేసుకున్న స్వామికి కులమతాలు అంటగట్ట వద్దు. హిందువులైనా, ముస్లింలైనా, ఏ మతంవారైనా, ఏ కులం, ఏ జాతివారైనా భక్తితో స్వామిని దర్శించుకుంటే, స్వామిని వేడుకుంటే స్వామి కరుణించడా? ఆ భక్తుని కులమేమిటని, మతమేమిటని ప్రశ్నిస్తాడా? భారత రాజ్యాంగానికి వస్తే మన రాజ్యాంగం ఏ వ్యక్తిపట్ల కులమత జాతి, లింగ, ప్రాంతీయ వివక్షత చూపవద్దని చెప్తున్నది. ఏకులం వారైనా, ఏ మతంవారైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కావచ్చునని రాజ్యాంగం స్పష్టం చేసింది. దేశానికి ప్రధానమంత్రి అంటే దేశప్రజలం దరికీ ప్రధాని. అంతే కానీ కేవలం హిందువులకో, మహ మ్మదీయులకో ప్రధాని కాదు కదా. అలానే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రంలోని ప్రజలందరికీ ముఖ్య మంత్రి. ఆ రాష్ట్రంలోని హిందువులకు, ముస్లింలకు, క్రైస్త వులకు, జైనులకు, బౌద్ధులకు అందరికీ ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి కూడా నేను నా మతం వారికే, నా పార్టీవారికే ముఖ్యమంత్రి అని చెప్పకూడదు. అలా ప్రవర్తించకూడదు. ప్రజలు అతడిని ఒక మతానికి, ఒక కులానికి చెందిన వ్యక్తిగా గుర్తించవద్దు. వ్యాసకర్త: జస్టిస్ బి. చంద్రకుమార్ , రిటైర్డ్ న్యాయమూర్తి 79974 84866 -
కోర్టుల అతి జోక్యం సరికాదు
సాక్షి, హైదరాబాద్: ‘భావాలను, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తంచేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగే.. పత్రికలు, ప్రసార మాధ్యమాలు వాస్తవాన్ని నివేదించవచ్చు. ఆర్టికల్–19 ప్రకారం సత్యాన్ని వెల్లడించే హక్కు వాటికి ఉంది. దీనిని ఏ న్యాయస్థానం కాదనడానికి వీల్లేదు’.. అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలపై శుక్రవారం ఆయన స్పందించారు. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెలతోపాటు 13 మందిపై ఆ రాష్ట్ర ఏసీబీ నమోదు చేసిన కేసుల వివరాలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో ప్రసారం చేయడానికి వీల్లేదంటూ ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆయన పలు అంశాలపై స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. వాస్తవాన్ని ప్రచురించకుండా, వెల్లడించకుండా అడ్డుకోవడమంటే అది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని, అసాధారణ విషయాల్లో మాత్రమే న్యాయస్థానాలు ఇలాంటి ఆదేశాలిస్తాయని తెలిపారు. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా తమ అభిప్రాయాలతో, ఊహాగానాలతో వాస్తవాలను వక్రీకరించే ప్రమాదముందని భావించినప్పుడు కూడా న్యాయస్థానాలు ఇలాంటి తీర్పులు ఇవ్వవచ్చునని చెప్పారు. అయితే, ఒక సంఘటనను, పరిణామాన్ని యధాతథంగా వెల్లడించేందుకు అడ్డుచెప్పాల్సిన అవసరంలేదన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పాలనలో అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదే ప్రజల సంక్షేమం కోసం విధానాలను రూపొందించి అమలుచేయడం ప్రభుత్వం బాధ్యత. అందులో న్యాయస్థానాలు అతిగా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పరిపాలనాపరమైన అన్ని అంశాల్లోనూ అంతిమ నిర్ణయం ప్రభుత్వానికే ఉంటుంది. అసలు విధానాలనే రూపొందించొద్దు, అమలుచెయొద్దని కోర్టులు చెప్పలేవు. ప్రభుత్వ విధానాలవల్ల, నిర్ణయాలవల్ల అన్యాయం జరిగితే అప్పుడు బాధితుల పక్షాన కోర్టులు తీర్పులు చెప్పవచ్చు. నేర విచారణ చెయ్యొచ్చు భూ కుంభకోణాలు, ఆర్థిక నేరాలు, అవినీతి వంటివి చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం భావిస్తే విచారణకు ఆదేశిస్తుంది. ఈ మేరకు విచారణ సంస్థలు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపడతాయి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇది ప్రభుత్వ బాధ్యత కూడా. కానీ, అసలు అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి విచారణ చేయడానికి వీల్లేదంటూ న్యాయస్థానాలు అడ్డుకోవడం సహేతుకం కాదు. ఇదే సమయంలో ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులున్నాయి. గత ప్రభుత్వాలు తీసుకున్న మొత్తం నిర్ణయాలపైన విచారణ జరిపించడం సాధ్యంకాదు. బహుశా సాంకేతికంగా కూడా వీలుకాదు. ప్రభుత్వ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజలతో, వివిధ సంస్థలతో చేసుకునే ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. సాంకేతిక కారణాలవల్ల ఆ ఒప్పందాలను యధాతథంగా అమలుచేసే అవకాశం లేనప్పుడు బాధితులకు తగిన పరిహారం అందజేయాలి. ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. -
ప్రభుత్వం అప్పుల్లో ఉంది.. మరి ప్రయివేట్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: అప్పుల్లో ఉన్న ఆర్టీసీనీ ప్రయివేటీకరణ చేస్తానని చెబుతున్న సీఎం కేసీఆర్.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించగలరా అంటూ జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. దాదాపు 50 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, టీఎంయూ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడు అశ్వద్దామరెడ్డి, ఆర్టీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కార్మికులు, తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం ఈ సందర్భంగా అశ్వద్దామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదని స్పష్టం చేశారు. ‘ఆర్టీసీ సమ్మెపై సీఎం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. అయితే ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం. గత ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదు. కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బును ఎందుకు ఇవ్వడం లేదు?. ఆర్టీసీపై డిజీల్ భారం ఎక్కువైంది. 27 శాతం డిజీల్‌పై పన్ను వేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థపై నాలుగో వంతు ప్రజలు ఆధారపడి ఉన్నారు. ప్రజలు మా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాకు సహకరించాలి. అవసరమైతే తెలంగాణ బందుకు పిలుపునిద్దాం’అని అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. కాగా, తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఐదో రోజుకు చేరింది. ప్రజల ప్రయాణ కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దసరా పండగ ముగించుకోని తిరిగి గమ్యస్థానాలకు వెళ్లాలనుకునేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా సమ్మెపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోరాడటానికి ఏం చేయాలనే దానిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమావేశంతో అనంతరం గవర్నర్‌ను కలవాలని అఖిలపక్ష సభ్యులు భావిస్తున్నారు. -
సమాజ శ్రేయస్సుకు విద్యే పునాది
అన్ని దానాల కంటే గొప్పదానం అన్నదానం కాదు విద్యాదానం అనే చెప్పాలి. మొత్తం సమాజ శ్రేయస్సు, అభివృద్ధి ఒక్క విద్య, విద్యావిధానంపైనే ఆధారపడి ఉంటుంది. సమాజం గురించి తెలియకుండా, ప్రజల కష్టసుఖాలను, మానవ సంబంధాలను గురించి అవగాహన కలుగని రీతిలో విద్యార్థులను పెంచితే స్వార్థమే పరమార్థమనే భావాలు కలవారు కావచ్చు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకు కూడా ఉన్నతస్థాయి విద్యను అందించే విధంగా ప్రణాళికలు వేయాలి. మంచి మార్పు రావాలంటే విద్యపై ఖర్చుకు వెనకాడకూడదు. ప్రభుత్వం విద్య మీద శ్రద్ధ తీసుకుని ప్రజలకు భరోసా కల్పిస్తే ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అనేక మంది ఆడపిల్లలు 7, 8 తరగతులలో స్కూలు మానేయడానికి ప్రధాన కారణం టాయ్లెట్లు లేకపోవడమే అంటే మన దేశంలో ఈనాటికీ బాలికా విద్యకు ఎన్ని ఆటంకాలున్నాయో అర్థమవుతుంది. సమాజ శ్రేయస్సు విద్యా విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. అన్నిటి కంటే గొప్పదానం విద్యాదానం. విద్య విద్యార్థి మనసును వికసింపచేయాలి. సత్యాన్ని శోధించేటట్లు, తెలుసుకునేటట్లు చేయాలి. విద్యార్థుల ఆలోచనలను సరైన దిశలో పెంపొందేటట్లు చేయాలి. విద్య, విద్యార్థులను మానసికంగా, శారీరకంగా దృఢమైన వారిగా తయారు చేయాలి. సమాజం గురించి తెలియకుండా, ప్రజల కష్టసుఖాలు, మానవ సంబంధాలు లేకుండా విద్యార్థులను పెంచితే స్వార్థమే పరమార్థమనే భావాలు కలవారు కావచ్చు. ప్రభుత్వం సమాజ అవసరాలను అంచనా వేయాలి. ప్రస్తుతానికి, కనీసం ఇంకా 5 ఏళ్ళ వరకు ఎంత మంది డాక్టర్లు కావాలి? ఎంత మంది నర్సులు కావాలి, ఎంత మంది వ్యవసాయ అధికారులు, ఎలక్ట్రీషియన్స్ కావాలి, ఇలా ఒక స్పష్టమైన ముందు చూపు ఉంటే, సమాజ అవసరాలను పూర్తి చేయడానికి ఇప్పుడున్న పాఠశాలలు, సాంకేతిక కళాశాలలు సరిపోతాయా, ఇంకా అదనంగా పాఠశాలలు, కళాశాలలు, సాంకేతిక కళాశాలలను నెలకొల్పాలా?అనే వివరాలు తెలుస్తాయి. నేటి బాలబాలికలే మన రేపటి భవిష్యత్తు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకు కూడా ఉన్నతస్థాయి విద్యను అందించే విధంగా ప్రణాళికలు వేయాలి. మంచి మార్పు రావాలంటే విద్యపై ఖర్చుకు వెనకాడకూడదు. అవసరమైతే ముఖ్యమైన పట్టణాల్లోని ప్రభుత్వ భూముల్ని అమ్మి అవసరమైన డబ్బు సేకరించాలి. ఆర్థిక నిపుణులతో చర్చించి ప్రజలకు లాభం కలిగేటట్లు, ఏ చర్యల వల్ల ఆదాయం సమకూరుతుందో నిర్ణయించి కచ్చితమైన చర్యలు తీసుకొని ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇలా వచ్చిన ఆదాయంలో అత్యధిక శాతం పేద విద్యార్థులకు విద్య కోసం, హాస్టల్ సౌకర్యాల కోసం వినియోగించాలి. పేదవారైనప్పటికీ తమ పిల్లలను చదివిం చాలని అనేకమంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. వారి ఆదాయంలో ఎంతో భాగం పిల్లల విద్యకోసం ఖర్చు చేస్తున్నారు. ఉన్నత విద్యను అందించడానికి విదేశాలకు పంపడానికి ఆస్తులు అమ్ముకున్నవారు ఉన్నారు. అందుకనే ప్రభుత్వాలు చేయాల్సిన తక్షణ కర్తవ్యాలను సూచిస్తున్నాను. పాఠశాలలు లేని గ్రామాలను, తండాలను గుర్తించి ఆ గ్రామాలలో, తండాలలో ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో కాలేజీల్లో కనీస వసతులు కల్పించడం, టాయ్‌లెట్ సౌకర్యాలను కల్పించడం, టాయ్లైట్ల నిర్వహణ ఖర్చు లేకుండా ఆధునిక పద్ధతిలో లేదా నిరంతరం శుభ్రపరిచే విధంగా టాయ్లెట్లను ఏర్పరచాలి. (అనేక మంది ఆడపిల్లలు 7, 8 తరగతులలో స్కూలు మానేయడానికి ప్రధాన కారణం టాయ్లెట్లు లేకపోవడమే). ప్రభుత్వ పాఠశాలలో, హైస్కూళ్లలో, కాలేజీల్లో అవసరమైన మరమ్మత్తులు చేయించాలి. అవసరమైన చోట అదనపు గదులు నిర్మించాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలి. ఆవరణలో మొక్కలు నాటేటట్లు చేయాలి. ప్రతి స్కూలుకు, హైస్కూళ్లకు, కాలేజీలకు ఆట స్థలాలు ఉండాలి. వీలైనంత త్వరలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను, లెక్చరర్ల, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలి. ప్రతీ స్కూళ్లో/ కాలేజీల్లో ఉదయం టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. (ఎందుకంటే అనేక మంది పేద పిల్లలు ఉదయం పూట ఏమీ తినకుండానే స్కూలుకు వస్తారు. మధ్యాహ్న భోజనం కోసమే వచ్చేవారు కూడా ఉన్నారు.) వీలైతే సాయంత్రం పూట తినడానికి ఏదో ఒకటి ఇవ్వాలి. పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత, ఎత్తూ బరువు తక్కువ. ఇవి సాధారణంగా పేద పిల్లల్లో కనబడతాయి. విచారణ జరిపి శాంపిల్ లెక్కలు తీసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఇంగ్లిష్ మీడియంకు లేదా ఇంగ్లిష్ భాషకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే పిల్లలు ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగలగాలి. కంప్యూటర్ విద్య, అధునాతన టెక్నాలజీ విద్యార్థులకు అందేటట్లు చూడాలి. ఒకసారి ప్రభుత్వం విద్య మీద శ్రద్ధ తీసుకుని ప్రజలకు భరోసా కల్పిస్తే ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల మధ్యతరగతి వారు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదివించాలన్న వాతావరణం ఏర్పడాలి. బాగా పనిచేసే ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కలిగించే విధంగా సర్టిఫికెట్లు, బహుమతులు, ఆర్థిక రివార్డులు ఇవ్వాలి. 3 సం‘‘ల వరకు ప్రతీ సంవత్సరం వరుసగా మంచి రికార్డు సాధించిన ఉపాధ్యాయులకు ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి. వీలైనన్ని చోట్ల ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు నిర్వహించాలి. అత్యంత పేద కుటుంబాల నుండి వచ్చిన వారు కష్టపడి ఎలా ఉన్నతస్థాయికి వెళ్ళారో ఉదాహరణలతో వివరించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్ భాషపై పట్టు త్వరగా రాదు. వారికి ప్రత్యేక కోచింగ్‌లు ఏర్పాటు చేయాలి. వీలైనన్ని ఎక్కువ ప్రభుత్వ హాస్టళ్ళను ఏర్పాటు చేసి ఏ పేద విద్యార్థి, పేదరికం కారణంగా, తిండికి లేక, కనీస అవసరాలు తీరక విద్యను మధ్యలో ఆపేసే పరిస్థితి ఉండని విధంగా చూడాలి. అటువంటి పేద కుటుంబాల వారికి వారి పిల్లలను మధ్యలో బడి మాన్పించి ఏదో పనిలో పెట్టకుండా కొంత ఆర్థిక ప్రోద్బలం ఇవ్వగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు, ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. విద్యార్థుల్లోని అంతర్గత శక్తులను గుర్తించి, వారిలోని ప్రావీణ్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలి. ఒక విద్యార్థి పాడగలిగే వాడైతే అతనికి సంగీత విద్యను అందించే ఏర్పాటు ఉండాలి. వ్యాసరచన, ఉపన్యాస మొ‘‘ పోటీలను నిర్వహించాలి. కథలు, కవితలు వ్రాసేవారిని ప్రోత్సహించాలి. ఇవన్నీ ఇప్పుడే చేయడం సాధ్యంకాక పోవచ్చు. కానీ గొప్ప లక్ష్యాలను నిర్ణయించుకొని ఆ లక్ష్య సాధనకు మార్గాలను రూపొందించుకొని పట్టుదలగా ముందుకు సాగితే అనుకోని సహాయం అందుతుంది. ఆదా యం తక్కువగా ఉన్నదనే కారణంతో ప్రజలకు అందించాల్సిన విద్యా వైద్య సహకార విషయాల్లో వెనుకడుగు వేయగూడదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించి ఆదాయం పెంచుకోగలిగితే అన్ని రకాలుగా ప్రయత్నించి ఆదాయాన్ని పెంచుకోవాలి. భయం, పిరికితనమే అన్ని అనర్థాలకు కారణం. భగవంతుని సహాయం మనకు అందుతుందనే ధైర్యంతో ముందుకు సాగాలి. జస్టిస్ బి. చంద్రకుమార్ వ్యాసకర్త విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 89783 85151 -
అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్
పెద్దపల్లి టౌన్/గోదావరిఖని : ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కెసీఆర్ అసమర్థతతో అప్పుల రాష్ట్రంగా మారిందని తెలంగాణ ప్రజలపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. పెద్దపల్లి, గోదావరిఖనిలో శనివారం రైతు సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద వైఖరితోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ప్రభుత్వాలు ఎరువుల, పురుగు మందుల, నకిలీ విత్తనాల కంపెనీలతో లాలుచీ పడి రైతుల గోస పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వివిధ రాజకీయ పార్టీలు రైతు అనుబంధ విభాగాలను ఏర్పాటు చేసుకొని నేతలకు పునరావాసం కల్పిస్తున్నారే తప్ప రైతుల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్ సింగ్ రైతులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దుర్మర్గామని అన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాధామోహన్ సింగ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు పథకం పేరుతో బడాబాబులకు లబ్ధిచేకూర్చేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతును రైతుగా గుర్తించని కేసీఆర్ తాను ఒక రైతునని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కొంతమంది మంత్రులు, శాసస సభ్యులు, బ్యూరోక్రాట్లు వందల ఎకరాల భూములుండి రైతుబంధు కింద వచ్చిన డబ్బును తిరిగి ప్రభుత్వానికే ఇస్తున్నామని ప్రకటిస్తున్నారని, భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం అలాంటి భూస్వాములపై కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భూశుద్ధీకరణతో ఏఒక్క రైతుకు లబ్ధి చేకూరలేదని.. రైతుబంధు పథకంలో తప్పులు దొర్లాయని గగ్గొలు పెడుతున్న, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల చేతుల్లో చావుదెబ్బ తప్పదన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకివస్తే రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా చట్టాలు రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కొంత మంది రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నెల 17న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రైతు సదస్సులో ఆర్థిక సహాయం అందచేస్తామన్నారు. జిల్లాలోని రైతులందరు అధిక సంఖ్యలో హాజరై రైతు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర రైతు బాధ్యులు ఏసీ రెడ్డి, వసీంరాజా, గోదావరిఖనిలో జరిగిన సమావేశంలో టి.సారయ్య, రామనర్సయ్య, రమేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
అవినీతి రహిత పాలన అందించేందుకే
హైదరాబాద్: అవినీతి రహిత పాలన అందించేందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణను రైతు ఆత్మహత్యల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పార్టీ పేరును డిసెంబర్ చివరిలోగాని, జనవరిలో గాని ప్రకటిస్తామని, ఆలోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు తెలిపారు. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. నిజాయతీతో పనిచేసే ఏ పార్టీలు వచ్చినా వారితో కలసి పనిచేస్తామన్నారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ.. ఎలాంటి వివాదాల్లేకుండా జస్టిస్‌గా విధులు నిర్వహించిన చంద్రకుమార్ ద్వారానే సామాజిక తెలంగాణ సాధ్యమన్నారు. కార్యక్రమంలో అరుణోదయా సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి విమలక్క, ప్రొఫెసర్ తిరుమలి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్, ప్రొఫెసర్ మురళీ మనోహర్, పాశం యాదగిరి, నిర్మల, సౌగరాబేగం పాల్గొన్నారు. పార్టీ తాత్కాలిక కార్యవర్గం ఎన్నిక త్వరలో ఏర్పాటు చేయనున్న కొత్తపార్టీ తాత్కాలిక కమిటీని జస్టిస్ చంద్రకుమార్ ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడిగా జస్టిస్ చంద్రకుమార్, ముఖ్య సలహాదారులుగా తిరుమలి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్, ప్రొ.మురళీ మనోహర్, బాల లక్ష్మణ్, ఈశ్వరయ్య, ఏఎల్ మల్లయ్య, ప్రధాన కార్యదర్శులుగా టీవీ రామనర్సయ్య, పి.మోహన్ రాజ్, సాంబశివగౌడ్, పాలె విష్ణు, ఉపాధ్యక్షులుగా ఆకుల భిక్షపతి, నిర్మల, ప్రకాష్, లచ్చన్న, వేదవికాస్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు. -
కొనసాగుతున్న కుల వివక్ష
మంకమ్మతోట (కరీంనగర్): స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా.. దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని సోషల్ జస్టిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్ ఆరోపించారు. కరీంనగర్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు బడుగు, బలహీనవర్గాల అభి వృద్ధికి కృషి చేయడం లేదని ఆరోపించారు. డబ్బులున్న వారే ఎన్నికల్లో గెలుస్తారనే వాతావరణం నెలకొందన్నారు. అవినీతి, నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయి బడుగు బలహీనవర్గాల వారు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. మన నిధులు, మన ఉద్యోగాలు మనకే దక్కాలని ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం చేకూరడం లేదని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడి.. వారి హక్కులు కాపాడేందుకు సోషల్ జస్టిస్ జేఏసీని ఏర్పాటు చేశామని తెలిపారు. దళితుల సంక్షేమ కృషి చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఎంతమంది దళితులు, ఆదివాసీలకు మూడెకరాల భూమి పంపిణీ చేసిందో వివరించాలని డిమాండ్ చేశారు. గుత్తికోయలో ఆదివాసీలను చెట్లకు కట్టేసి దాడిచేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. రచయిత కంచ ఐలయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకే ఆయనపై మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారన్నారు. అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందని, ఐలయ్యను బెదిరించడం సరైంది కాదన్నారు. -
మూడేళ్లలో 3వేల మంది రైతుల ఆత్మహత్య
- రైతుల ఆత్మహత్యలపై హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన పెద్దపల్లి జిల్లా: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన మూడేళ్లలో పంట దెబ్బతిని మూడువేల మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో వంద కుటుంబాలకు కూడా ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫసల్ బీమా పథకం ద్వారా ఎంతమంది రైతులకు పరిహారం అందించారని ఆయన ప్రశ్నించారు. మిర్చి, కందులు పండించిన రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ప్రభుత్వమే మద్దతు ధరలను ప్రకటించి అదనంగా క్వింటాల్‌కు రూ. వెయ్యి నుంచి 2 వేల వరకు చెల్లించి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో మద్దతు ధర కోసం ఆందోళనకు దిగిన మిర్చి రైతులను కటకటాలపాలు చేయడం అన్యాయమన్నార -
సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్‌గా జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: సామాజిక న్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ సారధిని ఎన్నుకు న్నారు. చైర్మన్‌గా జస్టిస్ బి.చంద్రకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. గురువారం హైదరాబాద్‌లోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక న్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్త కమిటీని ఎన్నికున్నారు. కో–చైర్మన్‌గా ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, కన్వీనర్లుగా సోయం బాబూ రావు, భారత్ వాగ్మా రే, ప్రొఫెసర్ తిరుమలి, మురళీ మనోహర్, మన్నారం నాగరాజు, ఎంఎ.ము జీబ్, సొగరా బేగం, కార్యదర్శులుగా ఎన్ శ్రీనివాస్‌యాదవ్, టి. విష్ణు, బిక్షపతిలను ఎన్ను కున్నారు. అనంతరం జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ.. సామా జిక న్యాయం, ప్రజాస్వా మ్య స్థాపనే లక్ష్యంగా ఐక్య కార్యా చరణ కమిటీ ఏర్పడిందన్నారు. తెలంగాణ వస్తే ఆత్మగౌరవం దక్కుతుందని భావించా మని, కాని ఇప్పటికీ అదే వివక్ష కొనసా గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక త్యాగాలతోనే రాష్ట్రం ఏర్పడిందని, కాని లబ్ధి పొందుతున్నది మాత్రం ఒక్క టీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని వివరించారు. -
సామాజిక న్యాయం కోసం జేఏసీ
- జస్టిస్ చంద్రకుమార్ - కొత్త పార్టీ కూడా పెడతామని వెల్లడి హైదరాబాద్: కుల వివక్ష లేని సమాజం, ప్రతి ఒక్కరికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందేలా చూసేందుకు జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్ ప్రకటించారు. అలాగే జేఏసీ ఆధ్వర్యంలో కొత్త పార్టీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఉమ్మడి నాయకత్వంతో పార్టీ కొనసాగు తుం దని వెల్లడించా రు. తెలంగాణ లో రాజకీయ పత్యామ్నాయంగా జేఏసీ ఉండ బోతోందని చెప్పారు. జేఏసీ మొదటి సమావేశాన్ని 16న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సమాజంలో కుల వివక్ష ఇంకా కొనసాగుతోందని, దళితులు, ఆదివాసీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జేఏసీలో భాగస్వామ్యం అయ్యేం దుకు కుల, వృత్తి సంఘాల వారు, అగ్రకులాలలోని పేదవారు, నిజాయితీగా పనిచేసేవారు 9394345252, 9505932030 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రొఫెసర్ ఐ.తిరుమలి మాట్లాడుతూ.. ‘ఆంధ్రాపాలన పోతే మనకు రాజకీయం దగ్గరవుతుంది, మన సమస్యలు వినేవారు వస్తారు అనుకున్నాం, రాష్ట్రం మారింది కాని పాలకుల తీరు మారలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం
ఉస్మానియా యూనివర్సిటీ: కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖకు బడ్జెట్ పెంచాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. శనివారం ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టిస్, ఓయూ పీజీ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో ‘జ్యూడిషియల్ రిఫామ్స్’ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. పర్వీన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేపటా్టలని, సత్వర న్యాయం అందేందుకు కృషి చేయాలన్నారు. న్యాయమూరు్తల నియామకాల్లో రాజకీయ జోక్యం తగదన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో లోపాలను సవరించి దళిత, బహుజనులను న్యాయమూర్తులుగా నియమించాలన్నారు. కార్యక్రమంలో జయ వింధ్యాల, అశోక్‌యాదవ్, న్యాయకళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేస్తే సహించం ఉస్మానియా యూనివర్సిటీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేసే యత్నాలను మానుకోవాలని ఓయూ విద్యారు్థలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏ కులాన్ని దూషించినా మూడేళ్లు జైలు శిక్ష అనే కొత్త చట్టంతో ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసును పూర్తిగా రద్దు చేయాలని చూస్తే సహించేదిలేదని అంసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ హెచ్చరించారు. -
ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కుంది
జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంటుందన్న విషయాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలుసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. అలాకాకుండా ప్రజల గొంతును నొక్కేస్తాను, భయపెడతానంటే కుదరదన్నారు. తాను 16వ ఏట నుంచే ఉద్యమాల్లో ఉన్నానని.. 1969 నుంచే రైతు, విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నానని.. ఈ విషయం తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. తాను ఉద్యమంలో పాల్గొన లేదంటే ఆ సమయంలో ఎక్కడ ఉన్నాను, ఏం జడ్జిమెంట్ ఇచ్చాను అనే విషయాలు తెలుసుకోవాలని అన్నారు. తన తండ్రి రజాకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పనిచేశారని.. అలాంటి కుటుంబం నుంచి తాను వచ్చానని తెలిపారు. జర్నలిస్టుగా, రచయితగా పనిచేసిన వ్యక్తి ఎంతో సమున్నతంగా, విశాలంగా ఆలోచించాలని అందుకు భిన్నంగా తప్పును ప్రశ్నించే వారిని భయపెట్టిస్తామనడం సబబు కాదన్నారు. తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు మన్నారం నాగరాజు, సోగెరా బేగం, రైతు సంక్షేమ సంఘం ప్రతినిధి రాంనర్సయ్య, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు సాంబశివ గౌడ్లు మాట్లాడుతూ.. ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా రెండున్నరేళ్లుగా ఉంటూ జర్నలిస్టుల సమస్యలు ఒక్కటైనా పరిష్కరించకపోగా.. అవి ప్రస్తావించిన వారిపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ అల్లం నారాయణ ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. ఒక ఉన్నతమైన, మచ్చలేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. -
కేసీఆర్ ఖబడ్దార్
- ప్రజలు తలచుకుంటే ప్రత్యామ్నాయాన్ని తీసుకువస్తారు - తెలంగాణ నవ నిర్మాణ వేదిక సదస్సులో జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: ‘‘నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చైతన్యవంతమైన రాష్ట్రం ఇది. తెలంగాణ ప్రజలు తలచుకుంటే మీకు ప్రత్యామ్నాయాన్ని తీసుకువస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖబడ్దార్..’’ అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ హెచ్చరించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ నవ నిర్మాణ వేదిక, ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడుకుందాం-తెలంగాణను రక్షించుకుందాం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ‘‘రైతులకు రుణమాఫీ అన్నారు.. దళితుడిని సీఎం చేస్తామన్నారు.. దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి అన్నారు.. ఇవి అన్నీ గోబెల్స్‌ను మించిన అబద్ధాలు. ఇలా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అవి ఆత్మహత్యలు కావని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీర్లు వద్దని చెప్పిన రూ.34 వేల కోట్ల ప్రాజెక్టును రూ.80 వేల కోట్లకు పెంచి కడుతున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ పార్లమెంటు, అసెంబ్లీల్లో పేదల గురించి చర్చే జరగటం లేదని, దేశంలో 45 శాతం నల్లధనం ఉందని, దానిని బయటికి తీసుకురాలేకపోతున్నారని చెప్పారు. మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సరే.. ముందు ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి గురించి ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజా తెలంగాణ కో-క న్వీనర్ శ్రీశైలంరెడ్డి మాట్లాడుతూ వాక్ స్వాతంత్య్రాన్ని రక్షించుకోవడానికి మేధావులు నోరు విప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పనికిరాని వాళ్లూ..నాయకులు అవుతున్నారు
జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: నిన్నటి వరకూ ఎందుకూ పనికిరాని వాడు ఓ పార్టీ కండువా కప్పుకోగానే నాయకుడైపోతున్నాడని.. అలాంటి వారిని పార్టీలో చేర్చుకునే వారికి, చేరేవారికి సిగ్గులేదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సేవా సమితి, స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, తెలంగాణ నవ నిర్మాణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సైంటిస్ట్ ప్రొ.బాబూరావు అధ్యక్షతన ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు-ప్రజల కర్తవ్యాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో క్రిమినల్స్, మాఫియాలు చేరుతున్న ధోరణిని అడ్డుకోవాల్సిన మేధావులు తమ కర్తవ్యాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. సీనియర్ సిటిజన్లు, యూత్ ఆర్గనైజేషన్, కాలనీ అసోసియేషన్లు అందరూ ప్రతీ కాలనీల్లో సమావేశమై ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుందామని ప్రచారం చేయాలని అన్నారు. ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొ. గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచంలో వ్యవస్థ పక్కదారి పడుతోందంటే అది విద్యావంతులు, మేధావులు మౌనంగా ఉండడం వల్లేనని అంబేద్కర్ చెప్పారని.. విద్యావంతులు ఉన్న నగరంలో ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలంటూ ప్రచారం చేయాలని అన్నారు. నగరంలో వారసత్వ రాజకీయం నడుస్తోందని, రాజకీయం అంటే సం పాదించుకునే వ్యవస్థగా మారిందని మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, నారగోని, ప్రొ. నర్సింహారెడ్డి, శ్రీనివాస్, రాజలింగం, నైనాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాల వైఖరి వల్లే రైతు ఆత్మహత్యలు
జస్టిస్ బి. చంద్రకుమార్ హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్లే తెలంగాణలో రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అన్యాయం చేస్తే దేశానికి ద్రోహం చేసినట్లే అవుతుందన్నారు. రైతులు పిట్టల్లా రాలిపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. రైతులూ.. ఆత్మహత్య చేసుకోకండి.. అనే భరోసాను ప్రభుత్వాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కందిపప్పు మార్కెట్లో కిలో ఒక్కింటికి రూ.200 ఉండగా కంది రైతులకు మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వడంలేదని చెప్పారు. ప్రభుత్వాల వైఖరి వల్లే ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతోందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. కల్తీ విత్తనాలు, నకిలీ మందులతోనే పత్తిరైతుకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రైతు సమాఖ్య వేదిక అధ్యక్షుడు కె.రవి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అమెరికా వంటి అగ్రరాజ్యాలు భారత్‌లోని వ్యవసాయాన్ని మరింత నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నాయని, ఇక్కడి రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించొద్దని, సబ్సిడీలు ఇవ్వొద్దని ఆంక్షలు విధించాయన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త జి.వి.రామాంజనేయులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ధరలను స్థిరీకరిస్తామని హామీ ఇచ్చిన నాయకులు అధికారంలోకి రాగానే దానిని విస్మరించారని ఆరోపించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ నేత శ్రీధర్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్ కుమార్, తెలంగాణ రైతు సంఘం నేత బి.చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూ పంపిణీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేసిందని, దాన్ని అమలు చేయడంతో మాత్రం చిత్తశుద్ధి కొరవడిం దని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. శుక్రవారం హై దరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో దళితులు, భూమిలేని పేదలకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10 నుంచి చేపట్టను న్న ర్యాలీ, ధర్నాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ పెద్దల కంపెనీలకు ఇవ్వడానికే భూమి సరిపోక పాయే.. ఇక పేదలకు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అనేక భూసంస్కరణలు తీసుకొచ్చినా పేదలకు భూ మి లభించలేదన్నారు. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటున్నామ ని ప్రభుత్వం చెబుతోందని... ఎంత స్వాధీనం చేసుకుందో ఎవరికీ తెలియదన్నారు. రైతుల జీవన స్థితి గతులను పెంచేందుకు వారికి ఎరువులు, విత్తనాలు, నీళ్లు ఉచితం గా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ, ప్రజాకళా మండలి ప్రధా న కార్యదర్శి కోటి, టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
నిజాయితీని ఎవరూ గుర్తించడం లేదు
జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన ఆయనకు హైకోర్టు ఘన వీడ్కోలు సాక్షి, హైదరాబాద్: జనవరి 7న పదవీ విరమణ చేయనున్న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్‌కు హైకోర్టు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికింది. గురువారం నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడంతో ఆయనకు బుధవారమే హైకోర్టు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం లో జస్టిస్ చంద్రకుమార్ కుటుంబ సభ్యులు, ఇరు రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి, పి.వేణుగోపాల్, రిజిస్టార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ న్యాయవ్యవస్థకు అందించిన సేవలను ఇరువురు ఏజీలు కొనియాడారు. తరువాత జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... ఇన్నేళ్ల తన న్యాయ ప్రస్థానంలో తనకు సహకరించిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేశారు. సమాజంలో రోజు రోజుకు డబ్బుకు ప్రాధాన్యత పెరిగిపోతూ, విలువలు నశించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీని, కష్టపడే తత్వాన్ని సమాజంలో గుర్తించడం లేదన్నారు. రోజు రోజుకు నిజాయితీ అన్నది అరుదుగా వినిపించే పదంగా మారిపోతుందని చెప్పారు. మానవ హక్కుల పరిరక్షణలో న్యాయవాదులు కీలక పోత్ర పోషించాలని కోరారు. సీనియర్ న్యాయవాదులు కేసులు చేస్తున్న తీరును చూసి జూనియర్ న్యాయవాదులు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చునని, ఆ దిశగా జూనియర్ న్యాయవాదులు దృష్టి సారించాలని హితవు పలికారు. పదవీ విరమణ తరువాత కూడా తాను ప్రజల్లో న్యాయ అవగాహన కోసం పనిచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తరువాత జస్టిస్ చంద్రకుమార్‌ను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. -
నంబర్ 1 పాఠశాల
పాఠశాల.. ప్రతి ఒక్కరి జీవితాన్నీ మలుపు తిప్పగలిగే విజ్ఞానశాల. ఆటపాటలతో పాటు అచంచల విజ్ఞానాన్ని అందిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని.. అక్షరజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. అలా.. అక్షరజ్ఞానం అందించి.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఎందరినో ఉన్నత స్థానాలకు చేర్చిందో పాఠశాల. ఉన్నత స్థాయి అధికారులనే కాక.. అత్యుత్తమ స్థాయి ప్రజా ప్రతినిధులను.. సమున్నత స్థాయి నాయకులనూ అందించిందా పాఠశాల. అదే ఆదిలాబాద్‌లోని గజిటెడ్ నంబర్ 1 పాఠశాల. పేరుకు తగ్గట్టే తీరులోనూ ఆ పాఠశాల నంబర్ వన్నే. దీనిపై నేటి సండేస్పెషల్. పాఠశాలలో చదివిన ప్రముఖులు 1. జస్టిస్ చంద్రకుమార్, హైకోర్టు న్యాయమూర్తి 2. ఉమాకాంత్‌గౌడ్, సర్జికల్ క్యాన్సర్ స్పెషలిస్టు, హైదరాబాద్ 3. ఆకుల నారాయణ, రిటైర్డ్ ఏంఈవో 4. సి.రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, మాజీ డీసీసీ అధ్యక్షుడు 5. కారింగుల దామోదర్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు 6. సామల శ్రీవర్థన్, రిటైర్డ్ డీటీవో 7. చిల్కూరి వామన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే 8. డి.కిష్టు, రిటైర్డ్ ఎంఈవో 9. సర్దార్ అలీ, పీజీ హెచ్ఎం 10. దేవేందర్ పటాస్కర్, స్కూల్ కరస్పాండెంట్ 11. గంగారెడ్డి, రిటైర్డ్ డీవీఈవో హైకోర్టు న్యాయమూర్తి జయచంద్రకుమార్ జయచంద్రకుమార్ గజిటెడ్ నంబర్-1 పాఠశాలలో చదువుకున్నారు. ఈయన జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆ పాఠశాలను సందర్శించకుండా వెళ్లరు. అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ ఏడాది నవంబర్‌లో పాఠశాలను సందర్శించారు. చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను నగదు రూపంలో అందజేశారు. రాష్ట్ర మాజీ మంత్రి చిల్కూరి రాంచంద్రారెడ్డి రాంచంద్రారెడ్డి ఇదే పాఠశాల విద్యార్థి. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో పదవులను చేపట్టారు. ఎమ్మెల్యే నాలుగుసార్లు, రాష్ట్ర చిన్ననీటి పారుదల, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఏడేళ్ల పాటు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తనకు బోధించిన గురువుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగానని ఆయన అంటుంటారు. తెలంగాణ ఉద్యమంలో చిల్కూరి వామన్‌రెడ్డి దివంగత ఎమ్మెల్యే వామన్‌రెడ్డి ఈ పాఠశాలోనే చదువుకున్నారు. మూడుసార్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ మలి దశ ఉద్యమం తర్వాత చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆదిలాబాద్‌లోని జేఏసీ నిర్వహించి దీక్ష శిబిరంలో తనవంతుగా పాల్గొంటూ అందరినీ ప్రోత్సహించేవారు. గత ఏడు, ఎనిమిది నెలల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. కేయూ సెనెట్ సభ్యులుగా డి.కిష్టు డి.కిష్టు 34 ఏళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. పీజీ హెచ్ఎం, ఆదిలాబాద్ ఎంఈవోగా పని చేసి పదవీ విరమణ పొందారు. రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం సెనెట్ సభ్యులుగా పనిచేశారు. తాను గజిటెడ్ నంబర్ వన్ పాఠశాలలో చదవడం గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. గురువులకు రుణపడి ఉన్నాం మాకు బోధించిన గురువులు గొప్పవారు. కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత సదాశివ మాస్టరు స్థాయి వారు మాకు పాఠాలు బోధించారు. వారిని ఎన్నటికీ మరవలేము. వారి బోధనలు ఇప్పటికి మా మదిలోనే మెదులుతాయి. వారు మాకు అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనిది. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. నేను పద్నాలుగేళ్లు ఆదిలాబాద్‌లో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాను. అనంతరం ఖమ్మంలో ఇంటర్మీడియట్ బోర్డులో డీవీఈవోగా పని చేసి రిటైర్డ్ అయ్యాను. - గంగారెడ్డి, రిటైర్డ్ డీవీఈవో కార్పొరేట్లాగా బోధన మేము చదువుకున్నది ప్రభుత్వ పాఠశాల అయినా కార్పొరేట్ పాఠశాల్లో ఎలాంటి బోధన ఉంటుందో.. ఆ స్థాయిలో మాకు బోధన చేశారు. సర్కారు బడిలో చదువుతున్నాననే ఫీలింగ్ వచ్చేది కాదు. వారి ప్రొత్సాహంతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. మా గురువులకు ఇప్పటికీ ఫోన్ చేసి వారి క్షేమ సమాచారం తెలుసుకుంటాను. గజిటెడ్ నంబర్-1 పాఠశాల అంటే చదువుల్లో కూడా నంబర్ వన్నే. అందుకే ఈ పాఠశాల అంటే నేటి తరం వారికి కూడా ఎంతో అభిమానం. ఇది అక్షరాలా నిజం. - సచిన్ దేశ్‌పాండే, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, హైదరాబాద్ గురువులంటే అభిమానం నేను గజిటెడ్ నంబర్-1 పాఠశాలలో ఎనిమిది నుంచి పదో తరగతి వరకు చదివాను. మంచి నాణ్యమైన విద్య అందించేవారు. ఇదే పాఠశాలలో మా నాన్న హన్మగౌడ్ టీచర్‌గా పనిచేసేవారు. మా గురువులు లకా్ష్మరెడ్డి, గంగాధర్, విజేందర్‌ల ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగాను. నేను చదివిన గజిటెడ్ పాఠశాలను ఎన్నటికీ మరవను. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, రీజినల్ క్యాన్సర్ సెంటర్లో అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సర్జికల్‌గా పని చేస్తున్నాను. - ఉమాకాంత్‌గౌడ్, సర్జికల్ క్యాన్సర్ స్పెషలిస్టు, హైదరాబాద్ చదివిన చోటే గురువునయ్యా మాది పెద్ద పాఠశాల. ప్రతి తరగతిలోనూ నాలుగు సెక్షన్లలో తరగతులు జరిగేవి. 1,200ల కంటే ఎక్కువ మంది విద్యార్థుల సంఖ్య ఉండేది. 170 మంది స్టాఫ్‌తో విద్యాబోధన జరిగేది. బాగా చెప్పేవారు. గురువులంటే భయం, భక్తి ఉండేది. వృత్తివిద్య సైతం బోధించేవారు. నేను ఈ పాఠశాలలో చదివి ఇక్కడే ప్రధానోపాధ్యాయుడిగా నియామకం అయ్యాను. ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. మరెంతో గర్వంగా కూడా ఉంది. నేను ఆదిలాబాద్ ఎంఈవోగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. - ఆకుల నారాయణ, రిటైర్డ్ ఎంఈవో అటెండర్ టు హైకోర్టు జడ్జి ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు గుమస్తా నుంచి హైకోర్టు న్యాయమూర్తి స్థాయి వరకు ఎదిగిన వారే. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జయచంద్రకుమార్ ఈ పాఠశాలలో చదువుకున్న ఒకప్పటి విద్యార్థే. ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంజినీర్లు, డాక్టర్లు, అడ్వొకేట్లు, వ్యాపార రంగంలో రాణిం చిన వారే. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఫ్రొఫెసర్లుగా ఎది గారు. తెలంగాణ అంతటా వీరు ఖ్యాతిని ఘడిస్తున్నారు. ప్రజాసేవల్లో ఉండి కూడా ఖ్యాతినార్జిస్తున్నారు. రాజకీయాల్లో.. చట్టసభల్లో... గజిటెడ్ నంబర్-1 పాఠశాలో చదివిన విద్యార్థులు గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ వరకు రాణించిన వారే. రాష్ట్ర రాజకీయాలను శాసించే వ్యక్తుల్లో గజిటెడ్ నంబర్-1 విద్యార్థులు ఉండడం విశేషం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన సి.రాంచంద్రారెడ్డి రాష్ట్ర చిన్న నీటి పారుదల, గిడ్డంగుల శాఖ మంత్రిగా, ఆదిలాబాద్ నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వామన్‌రెడ్డి సైతం ఇదే పాఠశాలలో చదివారు. ఈయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. కె.ఆశన్న ఆదిలాబాద్ ఎంపీగా పనిచేశారు. ఉన్నతంగా బోధించేవారు బాపురావు వైద్య, మాధవరావు, యశ్వంత్‌రావు, సదాశివ మాస్టరు, లక్ష్మణ్‌రావు మాకు గురువులు. మంచి విద్యను బోధించారు. నాలుగు భాషల్లో విద్యా బోధన జరిగేది. ఈ పాఠశాలల్లో మా నాన్నగారు సదాశివ మాస్టరు కూడా ఈ పాఠశాలలోనే విద్యాబోధన చేశారు. వారి ప్రోత్సాహంతో చదివి ఈ స్థాయికి ఎదిగాను. ఆదిలాబాద్‌లో డీటీవోగా, హైదరాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ సెంట్రల్ లైబ్రరీలో అకౌంట్ అధికారిగా పని చేసి రిటైర్డ్ అయ్యాను. గజిటెడ్ పాఠశాలను, గురువులను ఎన్నటికీ మరువ. - సామల శ్రీవర్థన్, రిటైర్డ్ డీటీవో ఎంతో మంది ఉన్నతులుగా.. గజిటెడ్ నంబర్ 1 పాఠశాలలో చదివిన ఎందరో ఉన్నత స్థానాలకు ఎదిగారు. నేను ఈ పాఠశాలలో 1962 నుంచి పదో తరగతి పూర్తయ్యేవరకు పది సంవత్సరాలు ఇక్కడే చదివా. అప్పటి విద్యాబోధన చాలా బాగుండేది. హన్మగౌడ్, వర్ధచారి, వామన్‌రావు సార్లు పాఠాలు చాలా బాగా చెప్పేవారు. ఒకే భాషలో కాకుండా పలు భాషల్లో విద్యబోధన జరిగేది. విద్యలో మంచి స్థానంలో విద్యార్థులు ఉండాలని, మాకు నిపుణులను పిలిపించి విద్యాబోధనను చేసేవారు. ఆ రోజుల్లో గురువులంటే ఎంతో గౌరవం. - కారింగుల దామోదర్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఎప్పటికీ మరిచిపోలేము మేము గజిటెడ్ నంబర్ 1 పాఠశాలలో చదివేటప్పుడు నాణ్యమైన విద్య బోధించేవారు. దీంతో పాఠశాలకు డుమ్మా కొట్టేవాళ్లం కాదు. ప్రతీరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లేవాళ్లం. సెలవు వస్తే ఎందుకు వచ్చిందని అనుకునేవాళ్లం. మేము 1980-81 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివాం. మా గురువులు చెప్పిన విషయాలు ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడు గుర్తుకు వస్తుంటాయి. వారు చేప్పే మంచి మార్గాలతో ఈ స్థాయికి ఎదిగాం. మా గురువులను ఇప్పటికీ కూడా మరిచిపోలేం. - సబ్దర్ అలీ, పీజీహెచ్ఎం అన్నింటిలో ప్రావీణ్యం ఉండేది అన్ని విషయాల్లో, బహుభాషల్లో విద్యబోధన చేసేవారు. పరీక్షలు చాలా స్ట్రిక్ట్‌గా జరిపేవారు. ఎక్కువ మంది పాసయ్యేవారు కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలోనే గడిపేవాళ్లం. గురువులంటే చాలా భయం, భక్తి ఉండేది. నేను పాఠశాల విద్యార్థి లీడర్‌గా పనిచేశాను. వారు చెప్పిన విషయాలను ఇప్పటికీ మరిచిపోకుండా నెమరువేసుకుంటాం. నేను ప్రస్తుతం ఆర్వీఎంలో జీసీడీవోగా, అకౌంట్ అధికారిగా పనిచేస్తున్నాను. నన్ను ఈ స్థాయికి చేర్చిన నా పాఠశాలకు రుణపడి ఉంటా. - గజేందర్, జీసీడీవో అకౌంట్ అధికారి