లక్డీకాపూల్: తెలంగాణ ప్రజల మనోభావాలతో పెనవేసుకుపోయిన టీఆర్‌ఎస్ తన పరిపాలనాకాలంలో మూలాలు మరిచిపోయిందని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. సోమవారం పంజగుట్టలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాంపాలనలో, ఉమ్మడి రాష్ట్రంలో వంచనకు, దోపిడీకి గురైన ప్రజలు ఎన్నో పోరాటాల ద్వారా ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారని, అలాంటి రాష్ట్రంలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని మరిచిపోయిందని ధ్వజమెత్తారు.
తాయిలాలు ప్రకటిస్తూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని విమర్శించారు. కమీషన్ల కోసం అనవసర ప్రాజెక్టులు కట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రజల పార్టీ నడుంబిగించిందని పేర్కొన్నారు. ఉద్యమ ఆకాంక్షలను, ఆశయాలను ఒక్క తెలంగాణ ప్రజల పార్టీయే నెరవేరుస్తుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే అవినీతిలేని పాలనను అందిస్తామని జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్ల సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాహుల్ చంద్రకుమార్ ఆ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్త, ఉపాధ్యక్షుడు శివారెడ్డి, న్యాయవాది ఆంజనేయులు, నాయకులు రవిప్రసాద్, లింగయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment