రాజకీయం వ్యాపారంగా మారింది
కర్నూలు: దేశంలో రాజకీయం వ్యాపారంగా మారిందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజిలో న్యాయ సేవా అధికార సంస్థ, పయనం మార్పు కోసం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెరుగైన సమాజం-యువత పాత్ర’ న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగ హక్కుల గురించి తెలుసుకోవాలని, యువత దేశ మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మెరుగైన సమాజం నిర్మించేందుకు నడుం బిగించాలన్నారు.
ఒక కూల్‌డ్రింక్ తయారు చేసేందుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే కంపెనీకి ఖర్చవుతుందని.. అయితే మన దేశంలో విదేశీ కంపెనీల శీతల పానీయాలు తాగడం వల్ల వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోతున్నాయన్నారు. అన్నదాతలను నాసిరకం విత్తనాలు, నకిలీ పురుగు మందులతో ముంచుతున్నారన్నారు.ప్రతి ఒక్కరు పరిపూర్ణ వ్యక్తిగా మారేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని, హక్కుల గురించి తెలుసుకుని జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలన్నారు. నేటి సమాజంలో మంచికి, మంచి వ్యక్తులకు, సిద్ధాంతాలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవస్థలో మార్పుకోసం యువత ఉద్యమించాలన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలంటే మంచి పోలీసు వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి, జిల్లా జడ్జి బసవయ్య, న్యాయమూర్తులు ఆదినారాయణ, వెంకటజ్యోతిర్మయి, పయనం సంస్థ కన్వీనర్ చెన్నయ్య, కార్యదర్శి మాగంటి ఈశ్వరప్ప, వ్యక్తిత్వ వికాస నిపుణులు కృష్ణ, సెయింట్ జోసెఫ్ కాలేజి సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.