జస్టిస్ బి. చంద్రకుమార్
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్లే తెలంగాణలో రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అన్యాయం చేస్తే దేశానికి ద్రోహం చేసినట్లే అవుతుందన్నారు. రైతులు పిట్టల్లా రాలిపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. రైతులూ.. ఆత్మహత్య చేసుకోకండి.. అనే భరోసాను ప్రభుత్వాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కందిపప్పు మార్కెట్‌లో కిలో ఒక్కింటికి రూ.200 ఉండగా కంది రైతులకు మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వడంలేదని చెప్పారు. ప్రభుత్వాల వైఖరి వల్లే ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతోందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. కల్తీ విత్తనాలు, నకిలీ మందులతోనే పత్తిరైతుకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
రైతు సమాఖ్య వేదిక అధ్యక్షుడు కె.రవి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అమెరికా వంటి అగ్రరాజ్యాలు భారత్‌లోని వ్యవసాయాన్ని మరింత నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నాయని, ఇక్కడి రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించొద్దని, సబ్సిడీలు ఇవ్వొద్దని ఆంక్షలు విధించాయన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త జి.వి.రామాంజనేయులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ధరలను స్థిరీకరిస్తామని హామీ ఇచ్చిన నాయకులు అధికారంలోకి రాగానే దానిని విస్మరించారని ఆరోపించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ నేత శ్రీధర్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్ కుమార్, తెలంగాణ రైతు సంఘం నేత బి.చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.