
మంకమ్మతోట (కరీంనగర్): స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా.. దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని సోషల్ జస్టిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్ ఆరోపించారు. కరీంనగర్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు బడుగు, బలహీనవర్గాల అభి వృద్ధికి కృషి చేయడం లేదని ఆరోపించారు. డబ్బులున్న వారే ఎన్నికల్లో గెలుస్తారనే వాతావరణం నెలకొందన్నారు. అవినీతి, నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయి బడుగు బలహీనవర్గాల వారు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. మన నిధులు, మన ఉద్యోగాలు మనకే దక్కాలని ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం చేకూరడం లేదని ఆరోపించారు.
ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడి.. వారి హక్కులు కాపాడేందుకు సోషల్ జస్టిస్ జేఏసీని ఏర్పాటు చేశామని తెలిపారు. దళితుల సంక్షేమ కృషి చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఎంతమంది దళితులు, ఆదివాసీలకు మూడెకరాల భూమి పంపిణీ చేసిందో వివరించాలని డిమాండ్ చేశారు. గుత్తికోయలో ఆదివాసీలను చెట్లకు కట్టేసి దాడిచేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. రచయిత కంచ ఐలయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకే ఆయనపై మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారన్నారు. అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందని, ఐలయ్యను బెదిరించడం సరైంది కాదన్నారు.