ఉద్యోగ, ఉపాధి బాటలో పట్టణాలకు ప్రజలు
పల్లెల కంటే పట్టణాల్లో 1.5 శాతం ఎక్కువ జనాభా
పదేళ్లలో మున్సిపాలిటీల్లో 1.35 లక్షల మంది పెరుగుదల
జనాభాకనుగుణంగా వసతులు లేక అవస్థలు
పల్లెలు మెల్లిమెల్లిగా ఖాళీ అవుతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలే గ్రామాలు వదిలి వెళ్తుండటంతో జనం లేక కళతప్పుతున్నాయి. మారిన జీవన గమనంలో వివిధ అవసరాల నిమిత్తం పల్లెజనం పట్నం బాట పడుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నదాంట్లోనే సర్దుకుపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రజల మొగ్గు పట్టణాల వైపే కనిపిస్తోంది. పట్టణాల్లో స్థిరపడేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే జిల్లాలోని పట్టణాల్లో జన సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. పల్లెల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. రూ.15 వేలు అంతకంటే తక్కువ వేతనం ఉన్న ప్రైవేటు ఉద్యోగులు సైతం పట్టణాల్లో స్థిరపడుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే తమ పిల్లలను పట్టణాల్లో చదివించేందుకు ఎక్కువమంది తల్లిదండ్రులు వస్తున్నట్లు తేలింది.
పదేళ్లలోనే లక్షన్నర మంది..
అనంతపురం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం వీటి పరిధిలో 6.27 లక్షల మంది మాత్రమే నివసించేవారు. తాజా అంచనాల ప్రకారం ఈ సంఖ్య సుమారు 7.72 లక్షలకు చేరింది. ఒక్క అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 80 వేలకు పైగా జనాభా పెరిగినట్టు తేలింది. తాడిపత్రి, గుంతకల్లు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
పల్లెల్లో ఉపాధి కరువై..
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఎక్కువ మంది పట్టణాలకు వలస వస్తున్నట్టు తేలింది. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కూలి పనులకు వచ్చి పట్టణ ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. మరికొంతమంది పల్లెల్లో వ్యవసాయం చేసుకుంటూనే పిల్లల చదువుల కోసం పట్టణాలకు వస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి లాంటి పట్టణాల్లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. ప్రభుత్వాలు జనాభాకు అనుగుణంగా వసతులు కల్పించలేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు.
సమస్యలెన్నో..
మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. రోజు రోజుకూ ప్లాస్టిక్ వాడకం ఎక్కువై అనర్థాలకు దారి తీస్తున్నాయి. చిన్న చిన్న మున్సిపాలిటీల్లో నిధులు సమకూరకపోవడంతో వ్యర్థాల నిర్వహణ చాలా అధ్వానంగా తయారైంది. ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు ఇవ్వడం సాధ్యపడటం లేదు.
ఆరు మున్సిపాలిటీల పరిధిలో 1.88 లక్షల గృహాలుండగా ఇంకా 80 వేల గృహాలకు నీటి కొళాయి కనెక్షన్ అందించాల్సి ఉంది. రోడ్లు, నీటి కొళాయిలు, డ్రైనేజీ వ్యవస్థలు కూడా సరిగా లేక పట్టణ పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వనరులు చాలడం లేదు
ప్రజలు పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు రావడానికి ప్రధాన కారణం ఉద్యోగాలు, పిల్లల చదువులే. దీంతో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టు మున్సిపాలిటీల్లో వసతులు సమకూర్చాలంటే ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరులు సరిపోవడం లేదు. మున్సిపాలిటీలు ఆదాయ మార్గాలను చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. –నాగరాజు, మున్సిపల్ కమిషనర్, అనంతపురం
జీవనం కష్టంగా మారింది
నా భార్యతో కలిసి రెండున్నరేళ్ల క్రితం కళ్యాణదుర్గం వచ్చా. ప్రస్తుతం పట్టణంలోని శంకరప్ప తోట కాలనీలో నివాసముంటున్నాం. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. పట్టణంలో ఇంటి బాడుగలు అధికమయ్యాయి. ఇటీవల ప్రభుత్వం కరెంటు చార్జీలను సైతం పెంచేసింది. మా లాంటి వారు జీవించాలంటే కష్టంగా ఉంది. – మోహన్, శెట్టూరు
పల్లెల్లో పనులు లేవు..
మా స్వగ్రామం గుమ్మఘట్ట మండలం కలుగోడు. మొదట్లో గ్రామంలోనే ఉండేవాళ్లం. అక్కడ పనులేవీ దొరక్క పదేళ్ల కిత్రం రాయదుర్గం పట్టణానికి వలస వచ్చాం. నా భార్య టైలరింగ్ పనులు చేస్తుంది. నేను హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. నాలాగే చాలామంది పల్లెలు వదిలి పట్టణాల్లో జీవనం సాగిస్తున్నారు. – షమీవుల్లా, రాయదుర్గం
టీ కొట్టుతో జీవనం
మాది కణేకల్లు మండలం ఎర్రగుంట గ్రామం. నా చిన్నప్పుడే ఊరు వదిలి బళ్లారిలోని ఓ హోటల్‌లో కారి్మకుడిగా చేరా. ఆదాయం సరిపోక రాయదుర్గం వచ్చి టీ కొట్టు ప్రారంభించా. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా. నా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉంటున్నారు. పల్లెల నుంచి పట్నం చేరే వారి సంఖ్య క్రమంగా ఎక్కువైంది. అనేక కారణాలతో ప్రజలు గ్రామాలను వీడుతున్నారు. – రంగప్ప, రాయదుర్గం
Comments
Please login to add a commentAdd a comment