పనికిరాని వాళ్లూ..నాయకులు అవుతున్నారు
జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: నిన్నటి వరకూ ఎందుకూ పనికిరాని వాడు ఓ పార్టీ కండువా కప్పుకోగానే నాయకుడైపోతున్నాడని.. అలాంటి వారిని పార్టీలో చేర్చుకునే వారికి, చేరేవారికి సిగ్గులేదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సేవా సమితి, స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, తెలంగాణ నవ నిర్మాణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సైంటిస్ట్ ప్రొ.బాబూరావు అధ్యక్షతన ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు-ప్రజల కర్తవ్యాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో క్రిమినల్స్, మాఫియాలు చేరుతున్న ధోరణిని అడ్డుకోవాల్సిన మేధావులు తమ కర్తవ్యాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు.
సీనియర్ సిటిజన్లు, యూత్ ఆర్గనైజేషన్, కాలనీ అసోసియేషన్‌లు అందరూ ప్రతీ కాలనీల్లో సమావేశమై ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుందామని ప్రచారం చేయాలని అన్నారు. ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొ. గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచంలో వ్యవస్థ పక్కదారి పడుతోందంటే అది విద్యావంతులు, మేధావులు మౌనంగా ఉండడం వల్లేనని అంబేద్కర్ చెప్పారని.. విద్యావంతులు ఉన్న నగరంలో ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలంటూ ప్రచారం చేయాలని అన్నారు. నగరంలో వారసత్వ రాజకీయం నడుస్తోందని, రాజకీయం అంటే సం పాదించుకునే వ్యవస్థగా మారిందని మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, నారగోని, ప్రొ. నర్సింహారెడ్డి, శ్రీనివాస్, రాజలింగం, నైనాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.