సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు పేదలకు, వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్, న్యూస్‌లైన్: సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు పేదలకు, వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఎల్‌బీనగర్ చిత్రా లేఅవుట్‌లో నిర్మిస్తున్న అనాథ విద్యార్థి వసతి గృహం పనులను గురువారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులకు విద్యాబుద్ధులు, వసతి కల్పిస్తున్న అనాథ విద్యార్థి గృహం నిర్వాహకులను అభినందించారు.
అనాథ విద్యార్థి గృహం కార్యదర్శి మార్గం రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులకు శాశ్వత భవనం కల్పించాలన్న ఉద్దేశంతో అప్పట్లో హుడా చైర్మన్‌గా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, చిత్రా లేఅవుట్‌లో 2,250 గజాల స్థలాన్ని ఇచ్చారని, ఇందులో రూ.4.5 కోట్లతో భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్క్ బిల్డర్స్ ఎండీ రామ్‌రెడ్డి, అడ్వయిజరీ బోర్డు చైర్మన్ ఎం.రామ్‌రెడ్డి, వసతి గృహం అధ్యక్షుడు రఘువీర్, చైర్మన్ శశిమోహన్ తదితరులు పాల్గొన్నారు.