కేసీఆర్ ఖబడ్దార్
- ప్రజలు తలచుకుంటే ప్రత్యామ్నాయాన్ని తీసుకువస్తారు
- తెలంగాణ నవ నిర్మాణ వేదిక సదస్సులో జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: ‘‘నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చైతన్యవంతమైన రాష్ట్రం ఇది. తెలంగాణ ప్రజలు తలచుకుంటే మీకు ప్రత్యామ్నాయాన్ని తీసుకువస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖబడ్దార్..’’ అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ హెచ్చరించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ నవ నిర్మాణ వేదిక, ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడుకుందాం-తెలంగాణను రక్షించుకుందాం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ‘‘రైతులకు రుణమాఫీ అన్నారు.. దళితుడిని సీఎం చేస్తామన్నారు.. దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి అన్నారు.. ఇవి అన్నీ గోబెల్స్‌ను మించిన అబద్ధాలు. ఇలా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అవి ఆత్మహత్యలు కావని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీర్లు వద్దని చెప్పిన రూ.34 వేల కోట్ల ప్రాజెక్టును రూ.80 వేల కోట్లకు పెంచి కడుతున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ పార్లమెంటు, అసెంబ్లీల్లో పేదల గురించి చర్చే జరగటం లేదని, దేశంలో 45 శాతం నల్లధనం ఉందని, దానిని బయటికి తీసుకురాలేకపోతున్నారని చెప్పారు. మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సరే.. ముందు ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి గురించి ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజా తెలంగాణ కో-క న్వీనర్ శ్రీశైలంరెడ్డి మాట్లాడుతూ వాక్ స్వాతంత్య్రాన్ని రక్షించుకోవడానికి మేధావులు నోరు విప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.