దానిని అవినీతిగా పరిగణించలేం..!
- పార్టీ ఫిరాయించి, మంత్రి పదవులు పొందినవారి అంశంలో హైకోర్టు
- కేసీఆర్, తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిలపై పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తరువాత పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలకు సీఎం కేసీఆర్ మంత్రి పదవులు కట్టబెట్టారని.. దాని వెనుక అవినీతి దాగి ఉన్నందున విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. గవర్నర్ ముఖ్యమంత్రి సిఫారసు మేరకు మంత్రులను నియమిస్తారని, రాజ్యాంగంలోని అధికరణ 164 కింద గవర్నర్ ఉపయోగించే అధికారం అవినీతి కిందకు రాదని తేల్చి చెప్పింది. ఇక పార్టీ ఫిరాయింపుల అంశం అసెంబ్లీ స్పీకర్ పరిధిలోనిదని, అందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం తీర్పు వెలువరించారు.
ప్రత్యేక కోర్టులే విచారించాలి
తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిలకు పదవులు ఆశజూపి పార్టీ మారేలా ప్రోత్సహించారని, దీని వెనుక భారీగా అవినీతి కూడా ఉన్నందున ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, సామాజిక కార్యకర్త ఫర్హత్ ఇబ్రహీం కొద్దిరోజుల కింద హైదరాబాద్ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫిర్యాదును కోర్టు తోసిపుచ్చడంతో.. ఇబ్రహీం హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో సీఎం కేసీఆర్, మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై ఈ నెల 16న వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్.. మంగళవారం తీర్పు వెలువరించారు.
వాదనల సందర్భంగా సీఎం కేసీఆర్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. అవినీతి నిరోధక చట్టం కింద చేసే ఫిర్యాదులను ఆ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టులు మాత్రమే విచారించగలవని తీర్పులో పేర్కొన్నారు. పిటిషనర్ ఫిర్యాదు చేసినది ప్రత్యేక కోర్టు కానందున... అక్కడ చేసిన ఫిర్యాదుకు విచారణార్హతే లేదన్నారు. ఇక తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిల పార్టీ ఫిరాయింపు వ్యవహారం స్పీకర్ పరిధిలోని అంశమని.. అందులో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు ధర్మాసనం గతంలోనే తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. అంతేగాకుండా ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్న ఏజీ వాదనలను ప్రస్తావించారు. ముఖ్యంగా మంత్రులను గవర్నర్ నియమిస్తారని.. గవర్నర్ ఉపయోగించే అధికారాలు అవినీతి చట్ట పరిధిలోకి రావని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు ఏ కోణంలో చూసినా అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి రావని పేర్కొంటూ.. వ్యాజ్యాన్ని కొట్టివేశారు.