వారికి మంత్రి పదవులివ్వడం వెనుక అవినీతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తరువాత పార్టీలు మారిన ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను సీఎం కేసీఆర్ తన మంత్రి మండలిలోకి తీసుకోవడం వెనుక అవినీతి దాగి ఉందని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ (సీఆర్‌ఎల్‌ఆర్‌సీ) దాఖలైంది. దీనిపై మంగళవారం వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్లకు పదవులు ఆశచూపి వారిని పార్టీలు మా రేలా చేశారని, ఇది అవినీతి కిందకు వస్తుందని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఫర్హత్ ఇబ్రహీం అనే వ్యక్తి హైదరాబాద్ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు.
దీనిని పరిశీలించిన కోర్టు ఈ ఫిర్యాదుకు విచారణ అర్హత లేదని తేల్చి చెబుతూ తోసిపుచ్చింది. కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇబ్రహీం హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతి వాదులుగా చేర్చారు. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మరోసారి విచారించారు.
ఈ సందర్భంగా సీఎం తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు విని పిస్తూ... ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్ పరిధిలోని అంశమన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసిందని, సుప్రీంకోర్టులో విచారణ పెం డింగ్‌లో ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన అధికారం మేరకే ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్‌లను కేసీఆర్ మంత్రి మండలిలోకి తీసుకున్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వాయిదా వేశారు.
ఏజీ దృష్టికి తీసుకురాని ఏసీబీ...
వాస్తవానికి ఈ వ్యాజ్యం పది రోజుల కిందే దాఖలైంది. అయితే ఈ విషయాన్ని ఏజీ దృష్టికి ఏసీబీ తీసుకురాలేదు. పిటిషనర్ తరఫున ఢిల్లీకి చెందిన న్యాయవాది హాజరై వాదనలు వినిపించిన విషయాన్ని కూడా వారు చెప్పారు. చివరకు మంగళవారం కేసు విచారణకు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఏజీ... స్వయంగా హాజరై వాదనలు వినిపించారు. ఏసీబీ తీరుపై ఆయన సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.