
హరితహారంలో మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి
రాంగోపాల్‌పేట్: స్వచ్ఛమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలంటే మొక్కల పెంపకం విస్త్రతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమ వారం సికింద్రాబాద్‌లోని మినిస్టర్ రోడ్‌లో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి ఆయన మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. వాతావరణం కాపాడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని చెప్పారు.
చెట్లను పెంచడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి ఆదాయ వనరులు పెరుగుతాయని అన్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 33 శాతం ఉన్న అడవులు 24 శాతానికి తగ్గిపోయాయని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు సుమారు రూ.230 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం చేపడుతున్నట్లు తెలిపారు. మినిస్టర్ రోడ్‌లో రసూల్‌పుర చౌరస్తా నుంచి రాణిగంజ్ వరకు పాఠశాల, కళాశాలల విద్యార్థులు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలసి సుమారు 2 వేల మొక్కలను నాటారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఉప కమిషనర్ నళిని పద్మావతి తదితరులు పాల్గొన్నారు.