Veterinary department
-
ఫిబ్రవరిలో రాజన్న పశువైద్యం ప్రారంభం
సాక్షి, అమరావతి: రాజన్న పశువైద్యం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత ప్రారంభించనున్న 3,300 రైతు భరోసా కేంద్రాల్లో ఇది అందుబాటులోకొస్తుంది. మొదట రైతు భరోసా కేంద్రాలను ఫిబ్రవరి 1న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాజన్న పశువైద్యాన్ని కూడా అప్పటి నుంచే మొదలుపెట్టాలని పశు సంవర్థక శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే.. రైతు భరోసా కేంద్రాలను ఫిబ్రవరి 28న ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడంతో అప్పటి నుంచే రాజన్న పశువైద్యం కూడా అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో 3,200 పశు వైద్యశాలలే ఉండటంతో పశువులకు, ఇతర జీవాలకు వైద్యం అందించడానికి పోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 నుంచి 30 కిలోమీటర్ల నిడివిలో కొన్ని ప్రాంతాల్లో పశు వైద్యశాలలు ఉండటంతో వ్యాధులకు గురైన పశువులకు చికిత్స అందించడానికి, ఆస్పత్రులకుతరలించడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి గ్రామంలోనూ పశువైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, ఈ మేరకు రానున్న రెండేళ్లలో ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాలు, ప్రస్తుతమున్న పశువైద్యశాలల్లో రాజన్న పశువైద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడత 3,300 రైతు భరోసా కేంద్రాల్లో.. తొలి విడత ప్రారంభం కానున్న 3,300 రైతు భరోసా కేంద్రాల్లో రాజన్న పశువైద్యాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం రూ.50 కోట్లను విడుదల చేసింది. పశువులకు చికిత్స అందించడానికి షెడ్లు, మందులు, మెడికల్ కిట్స్, పశువుల దాణా, పశుగ్రాస విత్తనాలు, చాఫ్ కట్టర్లు, పాలు పితికే యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఖాళీగా ఉన్న 9,886 మంది పశు వైద్య సహాయకులను నియమించేందుకు ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్షకు 5,612 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 2,944 మంది ఉత్తీర్ణులు కావడంతో వారిని ఉద్యోగాల్లో నియమించింది. వీరితోపాటు ప్రస్తుతం పనిచేస్తున్నవారిని 3300 రైతు భరోసా కేంద్రాల్లో నియమించారు. వీరు వైద్యసేవలు అందించడంతోపాటు పశువులకు సమతుల పోషకాహార కార్యక్రమాలు, పశుఆరోగ్య సంరక్షణ కార్డులు, కిసాన్ కార్డులు, పశుగ్రాస లభ్యత, పశు నష్టపరిహారం పథకాన్ని అమలు చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. -
వెటర్నరీ విద్యార్థుల ఆందోళనలో ఉద్రిక్తత
విజయనగర్‌కాలనీ: తమ ఉద్యోగాలను తమకు కాకుండా చేస్తున్నారంటూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఎదుట వెటర్నరీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆందోళనలో ఓ విద్యార్థి ఆకస్మాత్తుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలను కనీస అర్హత లేని అటెండర్లతో భర్తీ చేస్తున్నట్లు తెలుసుకున్న వెటర్నరీ డిప్లొమా చేసిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత ఉన్న కోర్సులు చదివిన తమకు అవకాశం కల్పించాలని సోమవారం మసాబ్‌ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ కార్యా లయం వద్ద ధర్నాకు దిగారు. ఆందోళన పట్ల అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనకారులు కార్యాలయం భవనంపైకి వెళ్లి ఆందోళన నిర్వహించారు. ఇంతలో ఓ విద్యార్థి పెట్రోల్ ఒంటిపై పోసు కుని ఆత్మహత్యకు యత్నించడంతో తోటి విద్యార్థులు అడ్డుకుని అతడిపై నీళ్లు చల్లారు. ఈ ఘటనతో తక్షణమే స్పందించిన పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో ఫోనులో మాట్లాడి సమస్యను వివరించారు. అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 300 మంది వెటర్నరీ డిప్లొమా విద్యార్థులకు కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు విద్యార్థులకు డైరెక్టర్ తెలిపారు. అలాగే మరిన్ని సమస్యల పరిష్కారానికి వచ్చే నెల 3న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. -
మొక్కలతో స్వచ్ఛమైన వాతావరణం
రాంగోపాల్‌పేట్: స్వచ్ఛమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలంటే మొక్కల పెంపకం విస్త్రతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమ వారం సికింద్రాబాద్‌లోని మినిస్టర్ రోడ్లో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి ఆయన మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. వాతావరణం కాపాడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని చెప్పారు. చెట్లను పెంచడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి ఆదాయ వనరులు పెరుగుతాయని అన్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 33 శాతం ఉన్న అడవులు 24 శాతానికి తగ్గిపోయాయని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు సుమారు రూ.230 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం చేపడుతున్నట్లు తెలిపారు. మినిస్టర్ రోడ్లో రసూల్‌పుర చౌరస్తా నుంచి రాణిగంజ్ వరకు పాఠశాల, కళాశాలల విద్యార్థులు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలసి సుమారు 2 వేల మొక్కలను నాటారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఉప కమిషనర్ నళిని పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
రూ.18 లక్షలు ఏమైనట్లు?
సాక్షి, కర్నూలు : పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి కేంద్రం జిల్లా కార్యాలయాన్ని నాబార్డు ఆర్ఐడీఎఫ్ నిధులు రూ.94 లక్షలతో నిర్మించారు. ఇందులో రూ.76 లక్షలు భవన నిర్మాణానికి కేటాయించగా.. రూ.18 లక్షలు ఫర్నీచర్‌కు విడుదల చేశారు. రూ.76 లక్షలతో భవనాన్ని నిర్మించారు. దీనిని ఇటీవలనే ప్రారంభించారు. అయితే ఫర్నీచర్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించినా ఇంతవరకు ఒక్క కుర్చీ కూడా సరఫరా కాలేదు. కలెక్టరేట్లో ఉన్న జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి కేంద్రం కార్యాలయాన్ని 15 రోజులుగా పాతబస్టాండు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాలలో నిర్మించిన సొంత భవనంలోనే నిర్వహిస్తుండగా అక్కడ కూర్చునేందుకు కుర్చీలు కరువయ్యాయి. కార్యాలయానికి ఏసీలతో పాటు అవసరమైన బీరువాలు, కుర్చీలు, టేబుశ్లు, సమావేశ మందిరానికి అవసరమైన కుర్చీలు, టేబుళ్లను ఫర్నీచర్ కోసం కేటాయించిన నిధులతో సమకూర్చాల్సి ఉంది. ఇందులో ఒక్కటి కూడా సరఫరా కాకపోవడంతో నాలుగైదు పాతకుర్చీలు, టేబుళ్లతోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రూ.18 లక్షలు దారి మళ్లాయా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి కేంద్రం ఏడీ డాక్టర్ చంద్రశేఖర్‌ను సంప్రదించగా... ఫర్నిచర్ కోసం ప్రత్యేకంగా రూ.18 లక్షలు కేటాయించామని, అయితే కార్యాలయానికి కనీసం ఒక్క కుర్చీ కూడా రాలేదని తెలిపారు. ఏసీలతో సహా పూర్తి స్థాయిలో ఫర్నిచర్ రావాల్సి ఉందని, ఎందుకు రాలేదో తెలియడం లేదని చెప్పారు. -
పశుసంవర్థక కార్యక్రమాలు భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో అమలుచేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శనివారం సమీక్ష జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి తలసాని కేంద్ర మంత్రికి వివరించారు. గొర్రెల పంపిణీ ఎంతో గొప్ప కార్యక్రమమని, జీవాల ఆరోగ్య పరిరక్షణకు తీసుకున్న చర్యలు బాగున్నాయని గిరిరాజ్ కితాబిచ్చారు. సమావేశంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, పశుసం వర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సువర్ణ, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులను నట్టేట ముంచిన ‘ఆది’
సాక్షి, కర్నూలు : ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ముడుపులు ఇచ్చి ఉద్యోగాల్లో చేరారు. ఉద్యోగంలో చేరిన సంతోషం వారికి ఎంతో కాలం లేదు. చేరినప్పటి నుంచి ఇంతవరకు వేతనాలు లేవు. ముడుపులు పుచ్చుకొని ఉద్యోగాలు ఇప్పించిన టీడీపీ మాజీ మంత్రి పత్తా లేకుండా పోయారు. పశుసంవర్ధకశాఖలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, మెగా పశుగ్రాస క్షేత్రాలు, గోకులాలను టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చేపట్టారు. ఇందుకు సంబంధించి డీఎల్‌సీఈ, టీఎం, టీఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఏర్పడింది. తొలుత అవసరాలకు తగిన విధంగానే నియమించారు. ఎన్నికల ముందు గత ఏడాది చివరిలో మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సిఫారసులతో అవసరం లేకపోయినా అడ్డుగోలుగా టెక్నికల్ మానిటర్, టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వీరికి ఆశచూపి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేసుకొని అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా గుంటూరుకు చెందిన రెడ్డి ఏజెన్సీ ద్వారా నియమితులయ్యారు. ఉద్యోగం వచ్చిందనే సంతోషం కొద్ది రోజులకే ఆవిరయ్యింది. ఆరు నెలలుగా వీరికి జీతాలు లేవు. ఉన్నతాధికారులను సంప్రదిస్తే ‘బిల్లు అయితే పెట్టాము... అది ఆర్డినరీ బిల్లు కావడంతో మంజూరు అయినప్పటికీ సంబంధిత నిధులు లేకపోవడంతో ఏమీ చేయలేము’ అని చెప్పినట్లు తెలిసింది. డీఎల్‌సీఈ, టీఎం, టీఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు జిల్లాలో 45 మందికి పైగా ఉన్నారు. వీరిలో 30 మందికి పైగా ముడుపులు ఇచ్చి ఉద్యోగాల్లో చేరినట్లు సమాచారం. అయితే ఒక్క నెల జీతం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో ఈ నెల 13 నుంచి విధులకు హాజరు కాలేమని, సోషల్ అడిట్ నిర్వహించలేమని చేతుతెత్తేశారు. జీతాలు లేనందున ముడుపుల కింద ఇచ్చుకున్న నగదును వెనక్కి ఇచ్చే విధంగా టీడీపీ నేతపై ఒత్తిడి పెంచేందుకు నిర్ణయించారు. -
3లక్షల మందికి..రూ.75కోట్లు బకాయి..!
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకపు సొమ్ముకు బ్రేక్ పడింది. ఎనిమిది నెలలుగా సొమ్ము అందకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇవ్వలేకపోతున్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. గతేడాది మే నెల నుంచి ఇప్పటివరకు అంటే ఎనిమిది నెలలుగా సొమ్ము చెల్లించకపోవడంతో పాడి రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. మరోవైపు రోజువారీ పాలకు ఇచ్చే బిల్లుల సొమ్ము కూడా నిలిచిపోయింది. ఒకవైపు ప్రోత్సాహకపు సొమ్ము రాకపోవడం, రోజువారీ పాల బిల్లు కూడా ఇవ్వకపోవడంతో సంక్రాంతికి పస్తులుండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మొత్తం సొమ్ము రూ. 145 కోట్లు... విజయ , ముల్కనూరు , రంగారెడ్డి–నల్లగొండ, కరీంనగర్ డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 వంతున ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ఇస్తోంది. దాదాపు 3 లక్షల మందికి ఇది అందుతోంది.మొదట్లో కేవలం విజయ డెయిరీకే పరిమితమైన ఈ పథకం, రెండేళ్ల నుంచి మిగిలిన మూడింటికీ వర్తింప చేసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గతేడాది మే నెల నుంచి ఇప్పటివరకు రూ. 75 కోట్లు నిలిచి పోయాయని విజయ డెయిరీకి చెందిన అధికారులు అంటున్నారు.మరోవైపు విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు గత నెల (డిసెంబర్) ఒకటో తేదీ నుంచి రెగ్యులర్ పాల బిల్లు నిలిపివేశారు. ఈ డైయిరీకి సుమారు రెండు లక్షల మంది రైతులు నిత్యం పాలు పోస్తారు. వీరికి చెందిన రూ. 70 కోట్లు రాకపోవడంతో ఆ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక రైతులకు పండుగ లోపు బిల్లు చెల్లించకపోతే పాల కేంద్రాల నిర్వహణ చేయలేమని అక్కడి అధికారులు,యూనిట్ మేనేజర్లు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయ డెయిరీకి ప్రతిరోజు నాలుగు లక్షల లీటర్లకు పైగా పాలు వస్తోంది. రైతులకు పది రోజులకోమారు ఈ బిల్లు చెల్లిస్తారు. డెయిరీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి చెల్లించలేని పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. రుణానికి వెనుకంజ... గతంలో పాల బిల్లులు ఆలస్యమయ్యే క్రమంలో బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని సర్దుబాటు చేసేవారు. కానీ ప్రస్తుతం విజయ డెయిరీ అధికారులు అందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. పాల అమ్మకాల నుంచి బిల్లులు చెల్లించాలని భావిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకు రుణం తీసుకోకుండా తమను ఇబ్బంది పెట్టడం సరికాదని రైతులు అంటున్నారు. నిధుల కొరత కారణంగా ఈనెల ఉద్యోగుల వేతనాలు కూడా వారం రోజుల తర్వాత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆవు పాల మిక్సింగ్‌తో ఆసక్తి చూపని వినియోగదారులు... విజయ డెయిరీకి 90 శాతం ఆవు పాలు, 10 శాతం మాత్రమే బర్రె పాలు వస్తుండటంతో పాలలో పసుపు శాతం అధికంగా కనిపిస్తుండటంతో వినియోగదారులు కొనడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇది గమనించిన పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఇటీవల సమీక్ష జరిపి బర్రె పాల సేకరణ పెంచాలని కోరినా పురోగతి లేదు. ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే బర్రె పాలకు గాను రైతులకు ఇచ్చే రేటు తక్కువ ఉండటంతో ఆ పాలు రావడంలేదని ఒక అధికారి అన్నారు. బిల్లుల చెల్లింపు ఆలస్యం కూడా ఓ కారణమని తెలుస్తోంది. -
వ్యవసాయానికి వెన్నెముకగా కోళ్ల పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: దేశంలో వ్యవసాయ అనుబంధంగా కోళ్ల పరిశ్రమపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తూ పేదలకు మాంసం, గుడ్ల రూపంలో పౌష్టికాహారం అందిస్తున్నాయని కేంద్ర పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఓపీ చౌదరి పేర్కొన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కోళ్ల రంగం ఏటికేటికీ వృద్ధి సాధిస్తున్న దృష్ట్యా.. మరింత అభివృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతున్న కీలక వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్–ఐపీఈఎంఏ ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు జరగనున్న పౌల్ట్రీ ఇండియా–2018ను ఆయన ప్రారంభించారు. హైటెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 5 డూమ్ల్లో 326 వరకు స్టాళ్లు కొలువు తీరాయి. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పౌల్ట్రీ పరిశ్రమలు, ఫీడ్, క్లీనింగ్, ఔషధ పరిశ్రమలు తమ ఉత్పత్తులు పదర్శిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ రంగంలో వస్తున్న అనూహ్యమైన మార్పులకు అనుగుణంగా విజ్ఞానం, అంతర్జాతీయస్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ యంత్రాలు, పనిముట్లు ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు పెద్దసంఖ్యలో సందర్శకులు, పౌల్ట్రీ రైతులు, యువత, ఔత్సాహికుల తాకిడి కనిపించింది. ఉత్పత్తి, ఉత్పాదకత వ్యయం తగ్గించుకుంటూ ముందుకు వెళితే నికర లాభాలు ఆర్జించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. తెలంగాణలో పౌల్ట్రీ అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్న భారత్.. రాబోయే రోజుల్లో రెండో స్థానానికి వెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్– ఐపీఈఎంఏ అధ్యక్షుడు హరీశ్ గర్వార్ స్పష్టం చేశారు. దక్షిణాసియా స్థాయి ప్రదర్శనలో నాఫెడ్ సంస్థ డైరెక్టర్ అశోక్‌కుమార్ ఠాకూర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇంటర్నేషనల్ ఎగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేశ్ చిట్టూరి రాయుడు, ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్– ఐపీఈఎంఏ కార్యదర్శి చక్రధర్, రాష్ట్ర బ్రీడర్స్ అసోసియేషన్ చైర్మన్ జి.రంజిత్‌రెడ్డి, నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు, తెలుగు రాష్ట్రాల పౌల్ట్రీ సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సమయం లేదు మిత్రమా.. దోచుకో!
ప్రకాశం, యర్రగొండపాలెం: అధికార పార్టీకి చెందిన నాయకుల ఆగడాలకు ఫుల్స్టాప్ పడటంలేదు. అందిన కాడికి దోచుకో.. రేపు ప్రభుత్వం చేజారిపోతుంది.. ఆ తరువాత దిగమింగటానికి ఏమీ ఉండదు అన్న చందంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. గుంతలు తీయకుండా తీసినట్లు కోట్లు కాజేశారు. నాసిరకం చెక్ డ్యాంలు కట్టి లక్షలకు లక్షలు మింగారు. పేద రైతులకు అందాల్సిన మొక్కల బిల్లులు బినామీ పేర్లతో కాజేశారు. ఎన్ఆర్ఈజీఎస్, వాటర్‌షెడ్, వెలుగు శాఖలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. గృహనిర్మాణం, మరుగుదొడ్లు, పింఛన్లు మంజూరు చేయటానికి లంచం తీసుకున్నారు. ఇంకా పేద ప్రజలవద్ద పిండుకోవటానికి ఏమీలేవు. అందుకే ఇప్పుడు అడవుల్లో జీవించే గిరిజనులపై పడ్డారు టీడీపీ నేతలు. వారికి అందాల్సిన పథకాలు అందనివ్వకుండా మధ్యలోనే పచ్చనేతలు ఎగిరెగిరి అందుకుంటున్నారు. అందుకు నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి అండదండలు ఉండటమే ప్రధాన కారణం. అధికారులు సైతం తప్పని పరిస్థితుల్లో వారికి దాసోహం అనక తప్పడంలేదు. తాజాగా పొట్టేళ్ల యూనిట్లను కాజేయటానికి టీడీపీ వర్గీయులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎలా? ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన యూనిట్లను బినామీ పేర్లతో అరకోటి రూపాయలు తమ సొంతం చేసుకోవాటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. పశుసంవర్థక శాఖ పరంగా ఈ యూనిట్లు మంజూరవుతాయి. లబ్ధిదారుడు రూ. 7,500 చెల్లిస్తే ప్రభుత్వం రూ. 20వేలు కలిపి మొత్తం రూ. 27,500 ఖరీదు చేసే పొట్టేళ్లను సరఫరా చేస్తారు. ఈ పొట్టేళ్లను కూడా లబ్ధిదారులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పొట్టేళ్ల యూనిట్ల మంజూరులో రాజకీయం చోటు చేసుకోవడంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఎస్టీలకు దక్కకుండా ఏకంగా తామే ఈ యూనిట్లను కాజేయటానికి ప్రయత్నిస్తున్నారు. యర్రగొండపాలెం మండలానికి 140 యూనిట్లు, పుల్లలచెరువు మండలానికి 110 యూనిట్లు మంజూరయ్యాయి. ముందుగా లబ్ధిదారుడు రూ. 7,500 డీడీ రూపంలో అందచేయాలి. అంతేకాకుండా లబ్ధిదారుడు తన ఆ«ధార్ కార్డు జెరాక్సును అందచేయాల్సి ఉంటుంది. యర్రగొండపాలెం మండలానికి చెందిన ఒక ప్రజాప్రతినిధితోపాటు మరో ఇద్దరు టీడీపీ నాయకులు, పుల్లలచెరువు మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ అధినాయకులు ఈ యూనిట్లను తమ సొంతం చేసుకోవటానికి పథకం పన్నారు. వెంటనే రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఎస్టీల నుంచి ఆధార్ జెరాక్స్ కాపీలను సేకరించుకున్నారు. ఈ రెండు మండలాలకు చెందిన 240 మంది లబ్ధిదారుల జాబితా తీసుకొనివెళ్లి విజయవాడలోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో అందచేశారు. తమ పలుకుబడిని ఉపయోగించుకొని ఆ యూనిట్లను మంజూరు చేయించుకున్నారు. ఈ యూనిట్లు రెండు, మూడు రోజుల్లో లబ్ధిదారులకు చేరాల్సి ఉంది. ఈ యూనిట్లను ఇతర జిల్లాల్లో కొనుగోలు చేయాల్సి ఉంది. ఒక్కొక్క యూనిట్‌కు సంబంధించిన రూ. 27,500 తమకు అనుకూలంగా ఉన్న పొట్టేళ్ల యజమానుల పేర్లతో చెక్కులను తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుణాలు ఇప్పిస్తామని ఆధార్ కార్డులు తీసుకున్న నాయకులు లబ్ధిదారుడికి ఎటువంటి సమాచారం అందివ్వక పోవడంతో తమకు రుణాలు ఎప్పుడు మంజూరవుతాయని కొంత మంది లబ్ధిదారులు వారిని ప్రశ్నించారు. రుణాలు మంజూరులో జాప్యం జరుగుతుందని మాయమాటలు చెప్తూ వచ్చారని తెలిసింది. యూనిట్ల గురించి తెలుసుకున్న మరి కొంతమంది ఎస్టీలు తమకు పొట్టేళ్లు మంజూరయ్యాయని తెలిసిందని, అందుకు కావలసిన డబ్బులు చెల్లించటానికి సిద్ధంగా ఉన్నామని నాయకులను నిలదీయడంతో అసలు విషయం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తోంది. ఈ విషయం బయటికి రాకుండా తమకు అనుకూలంగా ఉన్నవారిని వారు బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. వెంటనే పశుసంవర్థకశాఖ ఉన్నతాధికారులు ఈ యూనిట్లపై దర్యాప్తు జరిపి వాస్తవ లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు అయ్యే విధంగా చూడాలని గిరిజన నాయకులు కోరుతున్నారు. -
టెండర్లు వద్దు.. నేరుగా కొనండి!
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు సబ్సిడీపై ఇచ్చే బర్రెలు, ఆవుల కొనుగోలుకు టెండర్లు పిలవకూడదని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాటిని ఎలా కొనాలన్న దానిపై పశుసంవర్థకశాఖ అధికారులు రెండు రకాల పద్ధతులను ప్రభుత్వానికి నివేదించారు. ఒకటి టెండర్లు పిలవడం, మరొకటి నేరుగా లబ్ధిదారులతో వెళ్లి కొనుగోలు చేయడం. ఈ రెండింటిలో నేరుగా కొనుగోలు చేయడం వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపినట్లు పశుసంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి. అంటే సబ్సిడీ గొర్రెల మాదిరిగానే బర్రెలను కూడా నేరుగా కొనుగోలు చేయనున్నారు. అలాగే ఈ బర్రెలను ఎలా పంపిణీ చేయాలన్న దానిపై పశుసంవర్థకశాఖ మార్గదర్శకాలు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపినట్లు సమాచారం. సీఎం ఆమోదించాక పథకం ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. టెండర్ల ప్రక్రియ వైపే అధికారుల మొగ్గు సబ్సిడీ గొర్రెల కొనుగోలులో అనేక సమస్యలు వచ్చాయి. అనేక చోట్ల పేపర్ పైనే కొన్నట్లు, మరికొన్ని చోట్ల రీసైక్లింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చా యి. దీంతో ఈ బర్రెల కొనుగోలుకు సంబంధించి టెండర్ల ద్వారా వెళితేనే మంచిదన్న అభిప్రాయాన్ని పశుసంవర్థకశాఖ ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల ద్వారా వెళితే ఆవు లేదా గేదె ప్రమాణాల ప్రకారం లేకుంటే కాంట్రాక్టర్‌దే బాధ్యత ఉంటుందన్నారు. పైగా పశు వైద్యులు వివిధ రాష్ట్రాలకు వెళ్లడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వారు చెబుతున్నారు. ఆ నాలుగు డెయిరీల పాడి రైతులకే... ప్రభుత్వం సబ్సిడీపై బర్రెలు, ఆవులను పాడి రైతులకు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతుల వాటా, ప్రభుత్వ వ్యయం కలిపి రూ.1,600 కోట్లతో ప్రణాళిక రచించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం, ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీతో రైతులకు అందజేయనుంది. రాష్ట్రంలోని పాడి రైతులందరికీ కాకుండా కేవలం విజయ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, నార్ముల్ డెయిరీలకు పాలు పోసే రైతులకే ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో పాడి రైతుకు ఒక గేదె లేదా ఒక ఆవు వారి కోరిక మేరకు ఏదో ఒకటి ఇస్తారు. బర్రెలు కావాలా.. ఆవులు కావాలా ఏదో ఒకటి చెప్పాలని ఆయా డెయిరీలకు పశుసంవర్థకశాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. 2.13 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి రాష్ట్రవ్యాప్తంగా 2.13 లక్షల మంది పాడి రైతులకు ప్రభుత్వం బర్రెలు లేదా ఆవులను పంపిణీ చేయనుంది. అందులో 31 వేల మంది ఎస్సీ, ఎస్టీ రైతులున్నారు. హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాడి పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పశు వైద్యులు ఆయా రాష్ట్రాలకు లబ్ధిదారులతో వెళ్లి పాడి పశువులను లారీల్లో తరలిస్తారు. ఒక్కో గేదె లేదా ఆవు యూనిట్ ధర రూ.62 వేల నుంచి రూ.75 వేల వరకు ఉండే అవకాశముంది. పాడి పశువులను రెండేళ్లలో పంపిణీ చేయాలని అధికారులు భావిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే పథకం మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుందని చెబుతున్నా ఆచరణలో సాధ్యం కాదని వారంటున్నారు. ఇప్పటికీ మార్గదర్శకాలు ఖరారు కాలేదని, వచ్చే నెలలో పథకం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పశుసంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి. -
గోపాలమిత్రలతో గొడ్డుచాకిరీ
సాక్షి, హైదరాబాద్: గోపాలమిత్రలతో ప్రభుత్వం గొడ్డుచా కిరీ చేయిస్తోంది. నెలకు కేవలం రూ.3,500 వేతనం ఇచ్చి వీరితో పనిచేయిస్తున్నారు. టార్గెట్లు పూర్తి చేయకపోయినా, సగమే పూర్తిచేసినా కూడా వీరికి ఒక్క పైసా వేతనం రాదు. ఈ కఠిన నిబంధనలు వీరి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు వేతనం పెంచాలని వినతులు చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని గోపాలమిత్రలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అప్పుడంటూ కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కలగజేసుకొని తమ వేతనాలను పెంచాలని గోపాలమిత్రల సంఘం నేత చెరుకు శ్రీనివాస్ కోరుతున్నారు. అంతకుముందు వెట్టి... వైఎస్‌తోనే వేతనం గ్రామాల్లో పశుసంపదను సంరక్షించడం కోసం 2001లో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. గ్రామాల్లోని నిరుద్యోగులను ఎంపిక చేసి, నాలుగు నెలలు శిక్షణ ఇచ్చి, వారి సొంత గ్రామాల్లో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు. అప్పట్లో వీరికి జీతాలు లేవు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక వీరికి వేతనం ఖరారు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలతో సమానంగా వీరి వేతనాలు పెంచడంలో విఫలమయ్యాయి. తెలంగాణ వచ్చాక కూడా వారి ఆశలు నెరవేరలేదు. గ్రామాల్లో ప్రభుత్వ పశు వైద్య సిబ్బందికి అనుబంధంగా వీరు పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 మంది గోపాల మిత్రలు పనిచేస్తున్నారు. పాడిపశువులకు కృత్రిమ గర్భధారణతోపాటు గొర్రెలకు, మేకలకు ప్రాథమిక చికిత్స చేయడం, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు వేయడం వీరి విధులు. అలాగే ప్రభుత్వం నుంచి రూ.40 చొప్పున వీర్యాన్ని కొనుగోలు చేస్తారు. నెలలో 40 నుంచి 60 పశువులకు గర్భధారణ కోసం ఇస్తుంటారు. ఈ మొత్తాన్ని మొదట వీరు పెట్టుకుంటే, రెండు నెలల తర్వాత ప్రభుత్వం వీరి బ్యాంకు ఖాతాలో వేస్తుంది. ప్రభుత్వ వైద్యశాలలు, సబ్ సెంటర్లలో వీరు రైతులకు అందుబాటులో ఉంటారు. గొర్రెల పంపిణీ, వాటికి చికిత్సల్లోనూ వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే కొంతకాలంగా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, నెలనెలా వేతనాలు ఇవ్వడం లేదని వీరు విధులకు సరిగా రావడం లేదు. గోపాలమిత్రల ప్రధాన డిమాండ్లు ఇవే... - పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ.16 వేలు ఇవ్వాలి. - పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించాలి. - పశువైద్యశాఖ అటెండర్ పోస్టుల్లో 50 శాతం గోపాలమిత్రలకు అవకాశం కల్పించాలి. - ఆరోగ్యకార్డులు, అర్హత కలిగిన వారికి వెటర్నరీ అసిస్టెంట్లుగా అవకాశం ఇవ్వాలి. -
ఒక్క బల్బుకు బిల్లు రూ.8.73 లక్షలు
తోటపల్లిగూడూరు (సర్వేపల్లి): ఒక్క బల్బుకు కరెంటు వాడితే బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.8.73 లక్షలు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ బిల్లు అందుకున్న వినియోగదారుడు షాక్‌కు గురయ్యాడు. తోటపల్లిగూడూరు మండలం నరుకూరుతొట్టి ప్రాంతానికి చెందిన వేగూరు రవీంద్ర తన పక్కాగృహంలో ఒక బల్బు వినియోగిస్తున్నాడు. ఫిబ్రవరిలో 1,26,517 యూనిట్లు వాడినట్లుగా లెక్కలేసి రూ.8,73,696 బిల్లును ట్రాన్స్‌కో అధికారులు వినియోగదారుడికి అందించారు. దీనిపై బాధితుడు ట్రాన్స్‌కో అధికారులను కలవగా తామేమీ చేయలేమని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. పొట్ట విప్పిచూడ మేకులుండు! ఓ ఆవు కడుపులో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 80 కిలోల వ్యర్థాలు బయటపడ్డాయి! ఈ వ్యర్థాల్లో గుట్టగుట్టలుగా క్యారీ బ్యాగులతో పాటు మేకులు, గాజుపెంకులు, కూల్‌డ్రింక్ మూతలు, ప్లాస్టిక్ వైర్లు, తాళం చెవులు ఉండడంతో వైద్యులు విస్మయం చెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఆదివారం చోటుచేసుకుంది. తణుకు మునిసిపల్ పరిధిలో మేత మేయలేక అవస్థపడుతున్న ఓ ఆవును గోసంరక్షణ సమితి సభ్యులు ఆవపాడు గోశాలకు తరలించారు. పశువైద్య శాఖ జేడీ సూచనతో నల్లజర్ల పశువైద్య కేంద్రం వైద్యులు లావణ్యవతి, లింగపాలెం డాక్టర్ లింగయ్య, మాధవరం డాక్టర్ మహేష్, కేవీకే నుంచి వచ్చిన డాక్టర్ విజయనిర్మల ఆరుగంటలపాటు కష్టపడి గోవుకు శస్త్రచికిత్స చేశారు. ఆవు ఉదరం నుంచి 80 కేజీల వ్యర్థాలను బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు పరిస్థితి విషమంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉందని వారు తెలిపారు. – నల్లజర్ల -
పోస్టుల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి
– పశుసంవర్ధకశాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్నూలు(అగ్రికల్చర్): పశువైద్యశాలల్లో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్లు, ఆఫీసు సబార్డినేట్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.నాగేష్‌బాబు అన్నారు. బుధవారం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కె.రాజగోపాల్‌తో కలిసి జిల్లా పశుసంవర్థక శాఖ అధికారుల సంఘ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో 50 శాతంపైగా పోస్టులు ఖాళీగా ఉండటంతో పశువైద్యం భారమవుతోందన్నారు. మంజూరు చేసిన కొత్త పోస్టులను పదోన్నతులతో భర్తీ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పశువుల ఆసుపత్రుల నిర్వహణకు మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేడీ సుదర్శన్‌కుమార్, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని ఏడీలు సీవీ రమణయ్య, జీవీ రమణ, వెంకటేశ్వర్లు, పి.రమణయ్య, గొర్రెల విభాగం ఏడీ చంద్రశేఖర్, ఏడీలు విజేయుడు, హమీర్‌పాషా, వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రినే కబ్జా చేశాడు
15 ఏళ్లుగా అందులోనే నివాసం నెలన్నర క్రితమే కబ్జా ఆస్పత్రి గోడ కూల్చి.. ఇంటి నిర్మాణం బరితెగించిన పశుసంవర్ధక శాఖ అటెండర్ కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గావ్‌లో అక్రమం వైద్యులు మెమోలిచ్చినా పట్టించుకోని వైనం ఉన్నతాధికారుల అండదండలతోనే..? సాక్షి, మంచిర్యాల : అతనో సాధారణ ఉద్యోగి. పశుసంవర్ధక శాఖలో అటెండర్. అదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం ఈజ్గావ్లోని సబ్సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. చెప్పుకోవడానికి అతని పోస్టింగ్ చిన్నదే.. అయినా పెద్ద ఘనకార్యమే చేశాడు. అందరు ఖాళీ స్థలాలు కబ్జా చేస్తే.. అతను ఏకంగా తను విధులు నిర్వర్తించే ఆస్పత్రినే కబ్జా చేసేశాడు. అధికారులేమంటారోనన్న భయం లేకుండానే బరితెగించాడు. 1998లో ఆ ప్రాంతానికి బదిలీపై వచ్చిన అతను పదిహేనేళ్ల నుంచి ఈజ్‌గావ్ సబ్సెంటర్లోనే నివాసముంటున్నాడు. మధ్యలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినా.. ఈజ్గావ్లోనే ఉంటూ రాకపోకలు సాగించేవాడు. ఏళ్ల నుంచీ సబ్సెంటర్లోని రెండు గదుల్లో ఉంటున్న అతను ఏకంగా ఆస్పత్రిపైనే కన్నేశాడు. నెలన్నర క్రితమే.. గోడను కూల్చి మరీ ఆస్పత్రిని కుదించాడు. మిగిలిన సగ భాగంలో ఇంటిని నిర్మించుకున్నాడు. ఇంటి చుట్టూ తడకలు కట్టుకుని.. సున్నం వేసుకున్నాడు. సకల సౌకర్యాలు ఏర్పర్చుకుని దర్జాగా నివాసముంటున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన పైస్థాయి అధికారుల మాటలు బేఖాతర్ చేస్తూ వచ్చాడు. చివరకు కాగజ్‌నగర్ వైద్యుడు విజయ్‌కుమార్ ఇచ్చిన మెమోకూ విలువ లేకుండా చేశాడు. ‘ఎవరి అనుమతితో ఆస్పత్రి గోడను కూల్చావు..? మిగిలిన సబ్సెంటర్లో ఇల్లు నిర్మించుకునే అధికారం నీకెవరిచ్చారు..?’ అని ప్రశ్నించినా పట్టించుకోలేదంటూ ఆ సబ్సెంటర్లో విధులు నిర్వర్తించే జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ మధునమ్మ, కాగజ్‌నగర్ వైద్యుడు విజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అటెండర్ చేపట్టిన అక్రమ నిర్మాణంపై గత నెల 12న మధునమ్మ డాక్టర్ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సదరు వైద్యుడు అదే నెల 16న మంచిర్యాల డివిజన్ అసిస్టెంట్ డెరైక్టర్ కుమారస్వామికి ఫిర్యాదు చేశారు. ఏడీ ఆదేశాల మేరకు.. డాక్టర్ విజయ్‌కుమార్ మళ్లీ పూర్తి విచారణ చేపట్టి.. అదే రోజు సదరు అటెండర్‌కు మెమో జారీ చేశారు. గత నెల 18న ఏడీ కుమారస్వామికి విచారణ నివేదిక అందజేశారు. అదే రోజు ఏడీ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ జాయింట్ డెరైక్టర్ ప్రేమ్‌దాస్‌కు పూర్తి వివరాలతో కూడిన నివేదిక చేరింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. మళ్లీ సమగ్ర విచారణ చేపట్టి.. వివరాలతో నివేదిక ఇవ్వాలని జేడీ కార్యాలయం నుంచి ఏడీ కుమారస్వామికి సమాచారం అందింది. ఏడీ కుమారస్వామి.. స్వయంగా ఈజ్‌గావ్ వెళ్లి విచారణ చేపట్టారు. ఆగస్టు 2న జేడీ కార్యాలయానికి సమగ్ర విచారణ నివేదిక అందజేశారు. విచారణ నివేదిక చేరి ఇరవై రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు అక్రమార్క అటెండర్‌పై చర్యలు తీసుకోకపోవడం అదే శాఖలో అనుమానాలకు తావిస్తోంది. పశుసంవర్ధక శాఖ జిల్లా కార్యాలయంలో అతనికి పలుకుబడి ఉండడంతోనే అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పదిహేనేళ్ల నుంచీ ఇక్కడే మకాం.. 1975లో ఈజ్‌గావ్‌లో పశుసంవర్ధక శాఖ సబ్‌సెంటర్ నిర్మాణానికి 2 గుంటల స్థలం అక్కడి గ్రామ పంచాయతీ ఇచ్చింది. ఆ స్థలంలో మొత్తం నాలుగు గదుల నిర్మాణం చేపట్టి.. పశుసంవర్ధక శాఖ సబ్‌సెంటర్ కొనసాగిస్తున్నారు. అయితే.. సబ్సెంటర్కు అప్పట్లో రెండు గదులే ఎక్కువవ డంతో.. మిగిలిన రెండు గదులు కార్యాలయ అటెండర్‌కు కేటాయించారు. ఇదే క్రమంలో 1998 నుంచి సదరు అటెండర్ అందులో ఉంటున్నాడు. మధ్యలో బదిలీ అయినప్పుడు ఈజ్‌గావ్ నుంచి రాకపోకలు సాగించేవాడు. ఆరేళ్ల క్రితం ఈజ్‌గావ్‌లో బాధ్యతలు చేపట్టిన అతను అప్పట్నుంచీ క్రమంగా ఇంట్లో వసతులు సమకూర్చుకున్నాడు. చివరకు నెలన్నర క్రితమే ఆస్పత్రి గోడను కూల్చి మధ్యలో మరో గోడను నిర్మించే శాడు. తర్వాత మిగిలిన సగం భాగంలో ఇంటి ప్రహరిని నిర్మించుకున్నాడు. చర్యలు తీసుకుంటాం.. ఈజ్‌గావ్ సబ్సెంటర్లో కొంత భాగాన్ని అందులో పనిచేసే అటెండరే కబ్జా చేశాడ ని నాకు ఫిర్యాదు అందింది. మంచిర్యాల జేడీతో విచారణ చేపట్టాం. నాకు నివేదిక అందింది. అటెండర్‌పై చర్యలు తీసుకునే విషయంలో ఇంకా సమయం ఉంది. ఆలస్యమైనా చర్యలు తీసుకుంటాం. - ప్రేమ్‌దాస్, జాయింట్ డెరైక్టర్, పశుసంవర్ధక శాఖ -
అర్హులకే అవకాశమివ్వాలి
వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీపై నిపుణుల వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉత్తర్వులు అశాస్త్రీయంగా ఉన్నాయని, అలాంటి వారితో రైతాంగానికి ఎలాంటి మేలు జరగదని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రైతాంగానికి అనుబంధంగా ఉన్న పశువుల సంరక్షణ కోసం ప్రభుత్వం నియమించే ఉద్యోగుల అర్హతలను సడలించడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని వారు చెబుతున్నారు. పశువులు, ఇతర జంతువుల సంరక్షణ, వాటికి రోగాలు సోకితే చికిత్స చేయడానికి మండల స్థాయిలో పశు సంవర్థక వైద్యుడిని నియమిస్తారు. రాష్ట్రంలో ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఉత్తర్వులను సవరించాలని నిపుణులు కోరుతున్నారు. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం వెటర్నరీ అసిస్టెంట్(వీఏ) ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్‌లో మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్(ఎంపీవీఏ) కోర్సు, వెటర్నరీ పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేసిన వారితో పాటు ఇంటర్మీడియెట్ ఒకేషనల్, పౌల్ట్రీ, డైరీ కోర్సు పాసైన వారు కూడా అర్హులే. పశువుల ఆసుపత్రులలో ప్రతి నిత్యం గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు, ఎద్దులు, కుక్కలు, కోళ్లకు, రోగ నివారణ చర్యలతో పాటు, రోగ నిర్ధారణ చికిత్సలు జరుగుతుంటాయి. కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఇందులో భాగమే. వీటితో డైరీ కోర్సు చదివిన వారికి సంబంధమే లేదు. ఆరోగ్యంగా ఉన్న పశువుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులు, వాటి నిల్వ జాగ్రత్తలకు సంబంధించినదే డైరీ కోర్సు. కేవలం కోళ్లకు సంబంధించినదే పౌల్ట్రీ కోర్సు. పశువుల ఆసుపత్రికి వచ్చే అనేక రకాలైన వాటిలో కోళ్లు ఒక భాగం మాత్రమే. ఈ రెండు కోర్సులు చేసిన వారిని కూడా వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేయడం వల్ల వీరికి గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు, కుక్కలు తదితర జంతువులు వాటి వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో ఎలాంటి పరిజ్ఞానం ఉండదు. వీరిని ఎంపిక చేసిన అనంతరం ప్రభుత్వం ఇచ్చే ఒక సంవత్సరం శిక్షణ కూడా ఆస్పత్రుల నిర్వహణకే తప్ప సబ్జెక్టుకు సంబంధించింది కాదు. ఇంతెందుకు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ ఉద్యోగాలకు బీవీఎస్సీ పాసైన వారు మాత్రమే అర్హులు తప్ప బీఎస్సీ డైరీ టెక్నాలజీ పాసైన వారిని ఎట్టి పరిస్థితిలో తీసుకోరని నిపుణులు చెబుతున్నారు. వెటర్నరీ అసిస్టెంటు ఉద్యోగాల అర్హతలో వివక్ష ఉండకూడదన్నది వారి అభిప్రాయం. సరైన విషయ పరిజ్ఞానం లేని వారితో పశు సంవర్ధక శాఖలో క్షేత్రస్థాయిలో కీలకమైన వెటర్నరీ అసిస్టెంటు ఉద్యోగాలకు డైరీ, పౌల్ట్రీ కోర్సులు చేసిన వారికి అవకాశం ఇవ్వడం వల్ల ఉద్యోగాల విధులకు న్యాయం జరుగదు. రైతులకు ప్రయోజనం కలుగదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది ఎంపికలో అశాస్త్రీయ విధానాలను సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.