గోపాలమిత్రలతో గొడ్డుచాకిరీ  | There is no minimum wages from last 15 years | Sakshi
Sakshi News home page

గోపాలమిత్రలతో గొడ్డుచాకిరీ 

Published Sat, Feb 17 2018 3:29 AM | Last Updated on Sat, Feb 17 2018 3:29 AM

There is no minimum wages from last 15 years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోపాలమిత్రలతో ప్రభుత్వం గొడ్డుచా కిరీ చేయిస్తోంది. నెలకు కేవలం రూ.3,500 వేతనం ఇచ్చి వీరితో పనిచేయిస్తున్నారు. టార్గెట్లు పూర్తి చేయకపోయినా, సగమే పూర్తిచేసినా కూడా వీరికి ఒక్క పైసా వేతనం రాదు. ఈ కఠిన నిబంధనలు వీరి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు వేతనం పెంచాలని వినతులు చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని గోపాలమిత్రలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అప్పుడంటూ కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కలగజేసుకొని తమ వేతనాలను పెంచాలని గోపాలమిత్రల సంఘం నేత చెరుకు శ్రీనివాస్‌ కోరుతున్నారు.  

అంతకుముందు వెట్టి... వైఎస్‌తోనే వేతనం 
గ్రామాల్లో పశుసంపదను సంరక్షించడం కోసం 2001లో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. గ్రామాల్లోని నిరుద్యోగులను ఎంపిక చేసి, నాలుగు నెలలు శిక్షణ ఇచ్చి, వారి సొంత గ్రామాల్లో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు. అప్పట్లో వీరికి జీతాలు లేవు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక వీరికి వేతనం ఖరారు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలతో సమానంగా వీరి వేతనాలు పెంచడంలో విఫలమయ్యాయి.

తెలంగాణ వచ్చాక కూడా వారి ఆశలు నెరవేరలేదు. గ్రామాల్లో ప్రభుత్వ పశు వైద్య సిబ్బందికి అనుబంధంగా వీరు పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 మంది గోపాల మిత్రలు పనిచేస్తున్నారు. పాడిపశువులకు కృత్రిమ గర్భధారణతోపాటు గొర్రెలకు, మేకలకు ప్రాథమిక చికిత్స చేయడం, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు వేయడం వీరి విధులు. అలాగే ప్రభుత్వం నుంచి రూ.40 చొప్పున వీర్యాన్ని కొనుగోలు చేస్తారు. నెలలో 40 నుంచి 60 పశువులకు గర్భధారణ కోసం ఇస్తుంటారు. ఈ మొత్తాన్ని మొదట వీరు పెట్టుకుంటే, రెండు నెలల తర్వాత ప్రభుత్వం వీరి బ్యాంకు ఖాతాలో వేస్తుంది. ప్రభుత్వ వైద్యశాలలు, సబ్‌ సెంటర్లలో వీరు రైతులకు అందుబాటులో ఉంటారు. గొర్రెల పంపిణీ, వాటికి చికిత్సల్లోనూ వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే కొంతకాలంగా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, నెలనెలా వేతనాలు ఇవ్వడం లేదని వీరు విధులకు సరిగా రావడం లేదు. 

గోపాలమిత్రల ప్రధాన డిమాండ్లు ఇవే... 
- పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ.16 వేలు ఇవ్వాలి.  
పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించాలి.  
పశువైద్యశాఖ అటెండర్‌ పోస్టుల్లో 50 శాతం గోపాలమిత్రలకు అవకాశం కల్పించాలి.  
ఆరోగ్యకార్డులు, అర్హత కలిగిన వారికి వెటర్నరీ అసిస్టెంట్లుగా అవకాశం ఇవ్వాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement