gopalamitra
-
గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక శాఖ పరిధిలో పనిచేస్తున్న గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న నెలవారీ వేతనానికి అదనంగా 30 శాతం పెంచుతున్నట్టు వెల్లడించింది. గోపాలమిత్రలకు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరహాలోనే 30 శాతం వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీచేశామని, ప్రస్తుతం నెలకు వస్తున్న రూ.8,500కు తోడు పెంచిన 30 శాతం (రూ.2550) కలిపి రూ.11,050 చెల్లిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి అందుబాటులో ఉంటూ పాడిగేదెలకు కృత్రిమ గర్భధారణ, వ్యాక్సినేషన్, నట్టల నివారణ మందుల పంపిణీ లాంటి కార్యక్రమాల అమలులో సేవలందిస్తున్న గోపాల మిత్రలను ప్రభుత్వ గుర్తించి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణలో గోపాలమిత్రలకు ఇస్తున్న వేతనాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తాజా పెంపుతో 1,530 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. (చదవండి: ఉపఎన్నికలో ఓ గ్రామ ఇన్చార్జిగా కేసీఆర్.. ఏ గ్రామానికి అంటే?) -
గోపాలమిత్రలతో గొడ్డుచాకిరీ
సాక్షి, హైదరాబాద్: గోపాలమిత్రలతో ప్రభుత్వం గొడ్డుచా కిరీ చేయిస్తోంది. నెలకు కేవలం రూ.3,500 వేతనం ఇచ్చి వీరితో పనిచేయిస్తున్నారు. టార్గెట్లు పూర్తి చేయకపోయినా, సగమే పూర్తిచేసినా కూడా వీరికి ఒక్క పైసా వేతనం రాదు. ఈ కఠిన నిబంధనలు వీరి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు వేతనం పెంచాలని వినతులు చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని గోపాలమిత్రలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అప్పుడంటూ కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కలగజేసుకొని తమ వేతనాలను పెంచాలని గోపాలమిత్రల సంఘం నేత చెరుకు శ్రీనివాస్ కోరుతున్నారు. అంతకుముందు వెట్టి... వైఎస్‌తోనే వేతనం గ్రామాల్లో పశుసంపదను సంరక్షించడం కోసం 2001లో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. గ్రామాల్లోని నిరుద్యోగులను ఎంపిక చేసి, నాలుగు నెలలు శిక్షణ ఇచ్చి, వారి సొంత గ్రామాల్లో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు. అప్పట్లో వీరికి జీతాలు లేవు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక వీరికి వేతనం ఖరారు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలతో సమానంగా వీరి వేతనాలు పెంచడంలో విఫలమయ్యాయి. తెలంగాణ వచ్చాక కూడా వారి ఆశలు నెరవేరలేదు. గ్రామాల్లో ప్రభుత్వ పశు వైద్య సిబ్బందికి అనుబంధంగా వీరు పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 మంది గోపాల మిత్రలు పనిచేస్తున్నారు. పాడిపశువులకు కృత్రిమ గర్భధారణతోపాటు గొర్రెలకు, మేకలకు ప్రాథమిక చికిత్స చేయడం, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు వేయడం వీరి విధులు. అలాగే ప్రభుత్వం నుంచి రూ.40 చొప్పున వీర్యాన్ని కొనుగోలు చేస్తారు. నెలలో 40 నుంచి 60 పశువులకు గర్భధారణ కోసం ఇస్తుంటారు. ఈ మొత్తాన్ని మొదట వీరు పెట్టుకుంటే, రెండు నెలల తర్వాత ప్రభుత్వం వీరి బ్యాంకు ఖాతాలో వేస్తుంది. ప్రభుత్వ వైద్యశాలలు, సబ్ సెంటర్లలో వీరు రైతులకు అందుబాటులో ఉంటారు. గొర్రెల పంపిణీ, వాటికి చికిత్సల్లోనూ వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే కొంతకాలంగా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, నెలనెలా వేతనాలు ఇవ్వడం లేదని వీరు విధులకు సరిగా రావడం లేదు. గోపాలమిత్రల ప్రధాన డిమాండ్లు ఇవే... - పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ.16 వేలు ఇవ్వాలి. - పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించాలి. - పశువైద్యశాఖ అటెండర్ పోస్టుల్లో 50 శాతం గోపాలమిత్రలకు అవకాశం కల్పించాలి. - ఆరోగ్యకార్డులు, అర్హత కలిగిన వారికి వెటర్నరీ అసిస్టెంట్లుగా అవకాశం ఇవ్వాలి. -
గోపాలమిత్రా ఉద్యోగులకు వైఎస్ జగన్ హామీ
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం గోపాలమిత్ర ఉద్యోగులు కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలమిత్రా ఉద్యోగులు ఈ సందర్భంగా తమ సమస్యలను వైఎస్ జగన్‌కు వివరించి, వినతపత్రం సమర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. కాగా జిల్లాలో 61వ రోజు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. -
‘మా పొట్ట కొడుతున్నారు’
అనంతపురం అర్బన్ : సమస్యలు పరిష్కరించకుండా, వేతన, ఇతర బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం, అధికారులు తమ పొట్టకొడుతున్నారని గోపాలమిత్రులు ధ్వజమెత్తారు. బకాయిలు చెల్లించాలని సోమవారం కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. గోపాల మిత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ అధ్వర్యంలో జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ మాట్లాడారు. ప్రభుత్వం గోపాల మిత్రుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు. అనంతరం జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్దీన్కి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ కోశాధికారి వెంకటనారాయణ, నాయకుల పెద్దన్న, గురివిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.