
విజయనగర్‌కాలనీ: తమ ఉద్యోగాలను తమకు కాకుండా చేస్తున్నారంటూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఎదుట వెటర్నరీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆందోళనలో ఓ విద్యార్థి ఆకస్మాత్తుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలను కనీస అర్హత లేని అటెండర్లతో భర్తీ చేస్తున్నట్లు తెలుసుకున్న వెటర్నరీ డిప్లొమా చేసిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత ఉన్న కోర్సులు చదివిన తమకు అవకాశం కల్పించాలని సోమవారం మసాబ్‌ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ కార్యా లయం వద్ద ధర్నాకు దిగారు.
ఆందోళన పట్ల అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనకారులు కార్యాలయం భవనంపైకి వెళ్లి ఆందోళన నిర్వహించారు. ఇంతలో ఓ విద్యార్థి పెట్రోల్ ఒంటిపై పోసు కుని ఆత్మహత్యకు యత్నించడంతో తోటి విద్యార్థులు అడ్డుకుని అతడిపై నీళ్లు చల్లారు. ఈ ఘటనతో తక్షణమే స్పందించిన పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో ఫోనులో మాట్లాడి సమస్యను వివరించారు. అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 300 మంది వెటర్నరీ డిప్లొమా విద్యార్థులకు కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు విద్యార్థులకు డైరెక్టర్ తెలిపారు. అలాగే మరిన్ని సమస్యల పరిష్కారానికి వచ్చే నెల 3న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment