ఒక్క బల్బుకు బిల్లు రూ.8.73 లక్షలు
తోటపల్లిగూడూరు (సర్వేపల్లి): ఒక్క బల్బుకు కరెంటు వాడితే బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.8.73 లక్షలు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ బిల్లు అందుకున్న వినియోగదారుడు షాక్‌కు గురయ్యాడు. తోటపల్లిగూడూరు మండలం నరుకూరుతొట్టి ప్రాంతానికి చెందిన వేగూరు రవీంద్ర తన పక్కాగృహంలో ఒక బల్బు వినియోగిస్తున్నాడు. ఫిబ్రవరిలో 1,26,517 యూనిట్లు వాడినట్లుగా లెక్కలేసి రూ.8,73,696 బిల్లును ట్రాన్స్‌కో అధికారులు వినియోగదారుడికి అందించారు. దీనిపై బాధితుడు ట్రాన్స్‌కో అధికారులను కలవగా తామేమీ చేయలేమని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు.
పొట్ట విప్పిచూడ మేకులుండు!
ఓ ఆవు కడుపులో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 80 కిలోల వ్యర్థాలు బయటపడ్డాయి! ఈ వ్యర్థాల్లో గుట్టగుట్టలుగా క్యారీ బ్యాగులతో పాటు మేకులు, గాజుపెంకులు, కూల్‌డ్రింక్ మూతలు, ప్లాస్టిక్ వైర్లు, తాళం చెవులు ఉండడంతో వైద్యులు విస్మయం చెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఆదివారం చోటుచేసుకుంది. తణుకు మునిసిపల్ పరిధిలో మేత మేయలేక అవస్థపడుతున్న ఓ ఆవును గోసంరక్షణ సమితి సభ్యులు ఆవపాడు గోశాలకు తరలించారు.
పశువైద్య శాఖ జేడీ సూచనతో నల్లజర్ల పశువైద్య కేంద్రం వైద్యులు లావణ్యవతి, లింగపాలెం డాక్టర్ లింగయ్య, మాధవరం డాక్టర్ మహేష్, కేవీకే నుంచి వచ్చిన డాక్టర్ విజయనిర్మల ఆరుగంటలపాటు కష్టపడి గోవుకు శస్త్రచికిత్స చేశారు. ఆవు ఉదరం నుంచి 80 కేజీల వ్యర్థాలను బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు పరిస్థితి విషమంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉందని వారు తెలిపారు. – నల్లజర్ల