విద్యుత్ బిల్లులు చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలు
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ట్రాన్స్‌కో
ఉన్నతాధికారులు ఆదేశించినా పట్టించుకోని యంత్రాంగం
ఖమ్మం : విద్యుత్ బిల్లులు చెల్లించని నిరుపేదలపై జులుం ప్రదర్శించే ట్రాన్స్‌కో అధికారులు వేలకు వేలు బకాయి ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బడా నేతలు, పరిశ్రమల యాజమాన్యాలపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా వారికి విద్యుత్ సరఫరా చేసే లైన్‌లో ఏ చిన్నలోపం తలెత్తినా ఉరుకులుపరుగుల మీద రిపేర్ చేసేస్తారు. పేదల కాలనీల్లో విద్యుత్ సమస్య తలెత్తితే మాత్రం రోజుల తరబడి స్పందించని వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పభుత్వశాఖల్లో భారీగా పేరుకుపోయిన బకాయిలపై ఎన్‌పీడీసీఎల్ సీఎండీ ఆగ్రహం వ్యక్తం చేసినా సంబంధిత అధికారుల్లో కాస్త చలనమైనా కలగలేదు. బకాయిలు చెల్లించని కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయండని హుకుం జారీ చేసినా అధికారులు తమకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ‘నీది తెనాలే.. నాది తెనాలే..’ అన్నట్టుగా ‘నీది ప్రభుత్వ ఆఫీసే నాది ప్రభుత్వ కార్యాలయమే..’ అన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
జిల్లాలో 7,77, 387 విద్యుత్ కనెక్షన్‌లున్నాయి. దీనిలో గృహ అవసరాలవి 6,24, 463, కేటగిరి-2 (వ్యాపార అవసరాలు) 48, 399, పరిశ్రమలకు సంబంధించి 4,090 కనెక్షన్‌లు ఉన్నాయి. జిల్లా మొత్తమ్మీద సుమారు రూ.130 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. దీనిలో ప్రభుత్వ కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలు సుమారు రూ.54.90 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిలో రైల్వేశాఖ రూ.5.98 లక్షలు, బ్యాంకులు రూ.1.27 లక్షలు, మైనర్ పంచాయతీ వాటర్ వర్క్స్ పరిధిలో రూ.16.69 కోట్లు, మైనర్ పంచాయతీ ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో రూ.1.81 లక్షలు, మైనర్ పంచాయతీ స్ట్రీట్‌లైట్స్ బకాయిలు రూ.20.20 కోట్లు, మేజర్ పంచాయతీ వాటర్ వర్క్స్ రూ.3.02 కోట్లు, మేజర్ పంచాయతీ వీధిలైట్ల బకాయిలు రూ. 3.82 కోట్లు, మున్సిపల్ నీటి సరఫరా బకాయిలు రూ.94 లక్షలు, మున్సిపల్ వీధిలైట్ల బకాయిలు రూ.82 లక్షలు, ఆర్‌డబ్ల్యూఎస్ రూ.1.83 కోట్లు, టెలిఫోన్ ఎక్స్చేంజ్‌లు రూ.41 లక్షలు, కో ఆపరేటివ్ మార్కెట్‌లు రూ.2.26 లక్షలు, పోలీస్‌శాఖ రూ.79 లక్షలు, ఏపీఎస్‌ఆర్‌టీసీ రూ.2.20 లక్షలు, విద్యాశాఖ రూ.1.80 కోట్లు, వైద్యారోగ్యశాఖ రూ.33 లక్షలు, న్యాయశాఖ రూ.2 లక్షలు, రెవెన్యూశాఖ రూ.31 లక్షలు, పర్యాటక శాఖ రూ.2.85 లక్షలు, రోడ్డుభవనాలశాఖ రూ.7.19 లక్షలు, పశుసంవర్ధశాఖ రూ.3.75 లక్షలు, పరిశ్రమల శాఖ రూ. 3.97 లక్షలు, అటవీశాఖ రూ.5.96 లక్షలు, సాంఘిక సంక్షేమశాఖ రూ. 24 లక్షలు, పంచాయతీరాజ్ శాఖ రూ.17.7 కోట్లు, ప్రాజెక్టు ఆఫీసు, ఐటీ పరిధిలో రూ. 63.42 లక్షలు, దేవాదాయశాఖ బకాయిలు రూ. 1.84 లక్షలు, ఏపీ ఐఐసీ రూ. 1.81 లక్షలు, కార్పొరేషన్ పరిధిలో రూ. 87 లక్షలు ఇలా జిల్లాలోని దాదాపు అన్ని ప్రభుత్వశాఖలు రూ. 54.90 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు జిల్లాలోని పలువురు ప్రముఖులు, క్యాంపు కార్యాలయాల్లో లక్షలాది రూపాయలు బకాయిలు పడ్డారు. అటు ప్రభుత్వ అధికారులు, ఇటు వీరిని కదిలించడంలో మాత్రం విద్యుత్‌శాఖ అధికారులు వెనుకంజవేస్తున్నారు.
పై అధికారుల ఆదేశాలు బేఖాతరు
జిల్లాలో భారీగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను ఏవిధంగానైనా వసూలు చేయాలని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ ఆదేశించారు. వైద్యం, హాస్టల్స్, ఇతర అత్యవసరశాఖలను మినహాయించి మిగిలిన అన్ని శాఖలకు అవసరమైతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించినా చలనం లేదు. కట్ చేస్తే జిల్లా అధికారులతో తంటా..లేదంటే పై అధికారులతో చివాట్లు తినాల్సి వస్తుందని ట్రాన్స్‌కో సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు.
బిల్లులు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తాం: తిరుమలరావు, ఎస్‌ఈ ప్రభుత్వ కార్యాలయాలు కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు పడ్డాయి. వీటిని వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నాం. అత్యవసర విభాగాల అధికారులకు బకాయిలు చెల్లించాలని చెప్పాం. మిగిలిన శాఖలకు నోటీసులు జారీ చేశాం. ఒకటి, రెండు రోజుల్లో చెల్లించపోతే సరఫరా నిలిపివేస్తాం. సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలి.
ఎంత బకాయో!
Published Mon, Oct 13 2014 2:44 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement
Advertisement