Transco officials
-
ట్రాన్స్‌కో నిర్లక్ష్యానికి యువకుడి బలి
పుట్లూరు: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకడంతో హిటాచీలో ఉన్న యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పుట్లూరు గ్రామానికి చెందిన కుళ్లాయమ్మ, కుళ్లాయప్ప దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కుమారుడు నజీర్ (25) హిటాచీ హెల్పర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం పుట్లూరు నుంచి పని నిమిత్తం హిటాచీని లారీలో ఎక్కించి తీసుకెళ్తుండగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించి లారీ డ్రైవర్‌తో పాటు నజీర్ కిందకు దూకారు. నజీర్ చేయి లారీకి తగలడంతో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానికులు అతడిని తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే నజీర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్లే నజీర్ మృతి చెందాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన చోట నుంచి లారీని పక్కకు తొలగించకుండా అడ్డుకున్నారు. ట్రాన్స్‌కో ఏఈ షెక్షావలి సంఘటనా స్థలానికి రావాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల డిమాండ్‌తో లైన్మెన్ సంఘటనా స్థలానికి వచ్చాడు. తాము పలుమార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ తీగలు సరిచేయకుండా నిర్లక్ష్యం చేయడంతో నేడు ఒక ప్రాణం బలైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒక్క బల్బుకు బిల్లు రూ.8.73 లక్షలు
తోటపల్లిగూడూరు (సర్వేపల్లి): ఒక్క బల్బుకు కరెంటు వాడితే బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.8.73 లక్షలు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ బిల్లు అందుకున్న వినియోగదారుడు షాక్‌కు గురయ్యాడు. తోటపల్లిగూడూరు మండలం నరుకూరుతొట్టి ప్రాంతానికి చెందిన వేగూరు రవీంద్ర తన పక్కాగృహంలో ఒక బల్బు వినియోగిస్తున్నాడు. ఫిబ్రవరిలో 1,26,517 యూనిట్లు వాడినట్లుగా లెక్కలేసి రూ.8,73,696 బిల్లును ట్రాన్స్‌కో అధికారులు వినియోగదారుడికి అందించారు. దీనిపై బాధితుడు ట్రాన్స్‌కో అధికారులను కలవగా తామేమీ చేయలేమని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. పొట్ట విప్పిచూడ మేకులుండు! ఓ ఆవు కడుపులో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 80 కిలోల వ్యర్థాలు బయటపడ్డాయి! ఈ వ్యర్థాల్లో గుట్టగుట్టలుగా క్యారీ బ్యాగులతో పాటు మేకులు, గాజుపెంకులు, కూల్‌డ్రింక్ మూతలు, ప్లాస్టిక్ వైర్లు, తాళం చెవులు ఉండడంతో వైద్యులు విస్మయం చెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఆదివారం చోటుచేసుకుంది. తణుకు మునిసిపల్ పరిధిలో మేత మేయలేక అవస్థపడుతున్న ఓ ఆవును గోసంరక్షణ సమితి సభ్యులు ఆవపాడు గోశాలకు తరలించారు. పశువైద్య శాఖ జేడీ సూచనతో నల్లజర్ల పశువైద్య కేంద్రం వైద్యులు లావణ్యవతి, లింగపాలెం డాక్టర్ లింగయ్య, మాధవరం డాక్టర్ మహేష్, కేవీకే నుంచి వచ్చిన డాక్టర్ విజయనిర్మల ఆరుగంటలపాటు కష్టపడి గోవుకు శస్త్రచికిత్స చేశారు. ఆవు ఉదరం నుంచి 80 కేజీల వ్యర్థాలను బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు పరిస్థితి విషమంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉందని వారు తెలిపారు. – నల్లజర్ల -
స్వామివారి రథోత్సవంలో అపశ్రుతి
అనంతపురం: అనంతపురం జిల్లాలోని రాయదుర్గం వెంకటేశ్వరస్వామి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవం జరుగుతున్న సమయంలో విద్యుత్ తీగలు అడ్డురావడంతో వాటిని తొలగించేందుకు ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ నేపథ్యంలో స్తంభం పైనుంచి అతడు ప్రమాదవాశాత్తూ జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే బళ్లారి ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. విద్యుత్‌కు సంబంధించి మరమ్మతులు ప్రైవేట్ వ్యక్తితో చేయిస్తున్న ట్రాన్స్‌కో అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమరావతికి నిరంతర విద్యుత్
తొలిదశలో 2 వేల మెగావాట్ల సరఫరా ముసాయిదాలో ట్రాన్స్‌కో వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తొలిదశలో నిరంతరాయంగా రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా 2021 నాటికి 5 వేల మెగావాట్లకు పెంచాలని భావిస్తోంది. ప్రభుత్వం తాజాగా రూపొం దించిన బృహత్తర ప్రణాళికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇందుకోసం రూ. 1,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అమరావతి చుట్టూ అన్ని ప్రాంతాల నుంచి విద్యుత్‌ను ట్రాన్స్మిషన్ వ్యవస్థ ద్వారా అందించేందుకు నాలుగు 400 కేవీ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు. అంతా భూగర్భ కేబుళ్ల ద్వారానే తొలిదశలో కామవరపు కోటలో మాత్రమే 400 కేవీ వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మిగిలినవి గుడివాడ, చిలకలూరిపేట, సత్తెనపల్లిలో ఏర్పాటు చేసి వీటిని విజయవాడ వరకూ కలుపుతారు. పూడిమడక నుంచి విద్యుత్‌ను అందించేందుకు వీలుగా 765 కేవీ లైన్‌ను ఏలూరు వరకూ విస్తరించాలని ప్రతిపాదించారు. విశాఖలో హిందూజా అందించే విద్యుత్‌ను కామవరపు కోటకు తరలించి గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. ఇబ్రహీంపట్నంలో ప్రతిపాదిస్తున్న 800 మెగావాట్ల ప్రాజెక్టుకు అనుబంధంగా మూడు 220 కేవీ లైన్లు నిర్మిస్తున్నారు. సీఆర్డీఏ పరిధిలో మరో ఆరు 132 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా విద్యుత్ సరఫరా ఉంటుందని ముసాయిదాలో స్పష్టం చేశారు. బాహ్య వలయం పరిధిలో ఉండే 400 కేవీ లైన్లను కూడా భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారానే అనుసంధానం చేయాలని సింగపూర్ సంస్థలు సూచిస్తున్నాయి. దీనికి ట్రాన్స్‌కో సానుకూలంగా స్పందించడం లేదు. దీనివల్ల వ్యయం పెరుగుతుందని ట్రాన్స్‌కో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. -
ట్రాన్స్‌కో నిర్లక్ష్యానికి ఎలక్ట్రీషియన్ బలి
కార్యాలయం వద్ద మృతదేహంతో ధర్నా ఏఈనే కారణమని మృతుని సంబంధీకుల ఆరోపణ బద్వేలు అర్బన్ : ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఓ ప్రయివేటు ఎలక్ట్రీషియన్ బలయ్యాడు. ఈ సంఘటన బద్వేలు మండలంలోని లక్ష్మిపాళెంలో గురువారం జరిగింది. గ్రామంలో విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని సవరించాలని ఏఈ కోరడంతో మరమ్మతు చేస్తూ విద్యుత్ షాక్‌తో ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతిచెందాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ భార్య, పిల్లలు, బంధువులు, గ్రామస్తులుట్రాన్స్కో ఏఈ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. బద్వేలు మండలం అనంతరాజపురం పంచాయతీ లక్ష్మిపాళెంకు చెందిన కాకాని తిరుపతయ్య (45) ప్రయివేటు ఎలక్ట్రీషియన్. ఇతనికి భార్య సుబ్బమ్మతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. అనంతరాజపురం పంచాయతీకి రెగ్యులర్ లైన్‌మన్ లేకపోవడంతో ఏ సమస్య వచ్చినా తిరుపతయ్యే చేస్తుండేవాడు. ట్రాన్స్‌కో అధికారులు కూడా సమస్యలు ఏవైనా ఉంటే తిరుపతయ్య ద్వారా చేయిస్తుండేవారు. ఈ క్రమంలో గురువారం గ్రామంలోని కొన్ని వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా రావడం లేదని రైతులు టౌన్ ఏఈ రాజేంద్రప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. లైన్ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు అందుబాటులో లేకపోవడంతో తిరుపతయ్యకు ఫోన్‌చేసి మరమ్మతు చేయాలని కోరారు. మరమ్మతు చేయడానికి ఎల్సీ తీసుకున్నట్లుతిరపతయ్యకు ఏఈ చెప్పాడు దీంతో విద్యుత్ స్తంభం ఎక్కిన తిరుపతయ్య విద్యుత్ షాక్ తగిలి పైనుంచి కింద పడ్డాడు. గమనించిన సమీపంలోని రైతులు తిరుపతయ్యను ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్థారించారు. దీంతో మృతుడి భార్య, పిల్లలు, బంధువులు, గ్రామస్తులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఏఈ కార్యాలయం ఎదుట శవంతో ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించిన అనంతరం విద్యుత్ అధికారులు బాధితులు, గ్రామ పెద్దలతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వెంకటప్ప, రూరల్ ఎస్ఐ నరసింహారెడ్డి బాధితులను శాంతింపచేశారు. తిరుపతయ్య మరమ్మతు చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపి వేశామని, పక్కనే ఉన్న హెటె న్షన్ విద్యుత్ తీగలు తగిలి ఉండవచ్చని ఏడీఈ క్రిష్ణమూర్తి తెలిపారు. -
కరెంట్ కట్...కట
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని పలు పంచాయతీలు చీకట్లోకి వెళ్లిపోతున్నాయి. విద్యుత్ బిల్లులు పేరుకుపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కట్ చేస్తున్నారు. దీంతో జిల్లాలోని 52 పంచాయతీల్లో వీధిదీపాలకు సరఫరా నిలిపివేయగా, మరికొన్ని మైనర్ పంచాయతీ కార్యాలయాలకు కూడా సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పటికే బకాయిలు చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చామని, అయితే జిల్లా పంచాయతీ అధికారుల నుంచి కూడా స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీల నుంచి విద్యుత్ శాఖకు రూ.53 కోట్లకుపైగా బకాయిలున్నాయి. మొత్తం జిల్లాలో 1045 గ్రామ పంచాయతీలున్నాయి. వాటిలో 905 మైనర్ పంచాయతీలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. మైనర్ పంచాయతీల నుంచి రూ.33 కోట్లు, 53 మేజర్ పంచాయతీల నుంచి రూ.20 కోట్లు మేర విద్యుత్ బిల్లులు రావల్సి ఉంది. ఇటీవల 13వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయితీలకు రావడంతో రూ.3 కోట్లు ఆ నిధుల నుంచి విద్యుత్ శాఖకు పలు పంచాయతీలు చెల్లించాయి. మొత్తం బకాయిలు 53 కోట్లుంటే అందులో కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడంతో ఇంకా బకాయిలు రూ.50 కోట్లు బకాయిగానే మిగిలిపోయాయి. గత ఏడాది జూన్ వరకూ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులు నిలిచిపోయాయి. దీంతో ట్రాన్స్‌కో కూడా చూసీచూడనట్లు వ్యవహరించింది. తాజాగా 13వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడంతో రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ జిల్లా అధికారులు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో పంచాయతీరాజ్ అధికారులు ముందు విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. దీంతో మూడు కోట్ల రూపాయల వరకూ వసూలయ్యాయి. కనీసం 50 శాతం బకాయిలైనా వసూలు చేయాలని విద్యుత్ శాఖ అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయి.కొన్ని పంచాయతీలు వచ్చి న నిధులను పెండింగ్‌లో ఉన్న ఇతర బిల్లులు చెల్లించడానికి ప్రాధాన్యతనివ్వడంతో ట్రాన్స్‌కో బకాయిలు వసూలు కాలేదు. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు చెల్లించని 52 గ్రామ పంచాయితీలకు వీధిదీపాలు నిలిపివేశారు. -
ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి
తాడిపత్రి: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఓ విద్యార్థిని బలైంది. తాడిపత్రి మండల పరిషత్తు కార్యాలయం వద్ద శుక్రవారం విద్యుదాఘాతానికి గురై గౌస్‌బీ(14) అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చనిపోరుుంది. వివరాలిలా ఉన్నారుు. పట్టణంలోని పీర్లమాన్యంలో నివాసముం టున్న హమాలీ కుళ్లాయప్ప రెండో కుమార్తె గౌస్‌బీ. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సమీప బంధువు గృహాప్రవేశానికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటిపైకి వెళ్లగా.. అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు తగిలారుు. షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహానికి తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా..ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాయలసీమ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు రామాంజినేయులు ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని రోడ్డుపై ధర్నా చేశారు. ఈ ప్రమాదానికి బాధ్యత విద్యుత్ అధికారులదేనని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పట్టించుకోని అధికారులు.. విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయంపై చాలా సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని, ఇలా ఎంత మంది చనిపోవాలో వారే చెప్పాలని ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువుల ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఇళ్లపై నుంచే పట్టణంలోని ప్రధాన సబ్‌స్టేషన్‌కు 11 కేవీ లైన్ అనుసంధానించబడింది. ఈ తీగలు చాలా తక్కువ ఎత్తులో ఉన్నారుు. ఈ విషయూన్ని స్థానికులు చాలా సార్లు విద్యుత్, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోలేదు. ఏడాది క్రితం కూడా రేకులకు విద్యుత్ సరఫరా అరుు్య ఓ వ్యక్తి మృతి చెందాడు. ఐదేళ్ల క్రితం ఇదే కాలనీకి చెందిన బాబావలి(11) విద్యుత్ షాక్‌కు గురై ఒక చెయ్యి పూర్తిగా కోల్పోయూడు. -
జిల్లాలో పవన విద్యుత్ కేంద్రం ..
జిల్లాలో పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పరిగి సమీపంలోని రాఘవాపూర్, సయ్యద్‌మల్కాపూర్, కాళ్లాపూర్ కొండల ప్రాంతంలో విండ్ పవర్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కొండల పైభాగం పవన విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమని ట్రాన్స్‌కో అధికారులు నిర్ధారించారు. దీంతో ఓ ప్రైవేటు సంస్థ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందుకు అవసరమైన భూమిని ఇప్పటికే కొంత కొనుగోలు చేశారు. సర్వే పనులూ చేపట్టారు. రూ.600 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ నుంచి 100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పరిగి: పవన విద్యుత్ (విండ్ పవర్) ప్లాంట్ ఏర్పాటుకు పరిగికి సమీపంలోని రాఘవాపూర్, సయ్యద్‌మల్కాపూర్, కాళ్లాపూర్ పరిధిలోని కొండలను ఎంపిక చేశారు. ప్లాంట్ ఏర్పాటుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. ప్లాంట్ ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం అవసరం ఉండగా ఇప్పటికే సదరు సంస్థ 80 ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. అయితే పవన విద్యుత్ ప్రాజెక్టు గ్రీన్ ప్రాజెక్టు తరహాలోకి వస్తున్నందున పెద్దగా అనుమతుల కోసం ఇబ్బంది లేకుండా కేవలం నాలా అనుమతులు తీసుకుని ప్రాజెక్టును ప్రారంభించొచ్చని అధికారులు చెబుతున్నారు. 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం రూ.600 కోట్లతో సుమారు 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పవన విద్యుత్ ప్రాజెక్టు ద్వారా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను నేరుగా ప్రభుత్వానికి విక్రయించనున్నారు. ఇందుకోసం ముందుగానే ప్రభుత్వంతో ఒప్పందం చేయించుకునేందుకు సంస్థ ప్రతినిధులు సిద్ధమవుతున్నట్లు తెలి సింది. ఉత్పత్తి అయిన ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.5.48 లెక్కన ప్రభుత్వానికి విక్రయించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం విద్యుత్ కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో త్వరగానే పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా సదరు కంపెనీ రంగాపూర్ సమీపంలో 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి యోచిస్తున్నట్టు తెలిసింది. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వారు నిర్మించుకున్న సబ్‌స్టేషన్‌కు, అక్కడినుంచి ట్రాన్స్‌కో విద్యుత్ లైన్‌కు అనుసంధానం చేయనున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు చెందిన నాలుగు నియోజకవర్గాలకు అవసరమ య్యే విద్యుత్‌తో సమానమని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు. పరిగికి నిరంతర విద్యుత్.. పరిగి సమీపంలో నిర్మించతలపెట్టిన ఈ పవన విద్యుత్ ప్రాజెక్టు ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు పూర్తికానుందని అధికారులు పేర్కొంటున్నారు. కాళ్లాపూర్, సయ్యద్‌మల్కాపూర్, రాఘవాపూర్ శివారు ప్రాంతంలోని ఎత్తై కొండలపై నిర్మిస్తున్న విండ్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తై పరిగి ప్రజల కరంటు కష్టాలు తీరనున్నాయి. పవర్ ప్రాజెక్టులో తయారైన విద్యుత్‌ను నిల్వ చేయటం వీలుకాదు. దీంతో తయారయ్యే విద్యుత్ ఎప్పటికప్పుడు విద్యుత్ ఫీడర్లతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి అయిన కరెంటును మిగతా లైన్లతో అనుసంధానం చేసేందుకైనా పరిగిలో నిరంతర విద్యుత్‌ను ఉంచాల్సిన అవసరం ఉంటుందని సమాచారం. -
రైతులను ఆగం చేస్తున్న ‘కరెంట్’
బాల్కొండ:బాల్కొండ మండలంలో సాగుకు నాలుగు ఫీడర్లలో విద్యుత్ సరఫరా చేసే అధికారులు గత రెండు రోజుల నుంచి ఏ ఫీడర్‌కు ఎప్పుడు సరఫరా ఉంటుందో చెప్ప లేమంటున్నారు. ఉదయం ఉన్నతాధికారుల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకైనా విద్యుత్ సరఫరా చేపట్టవచ్చంటున్నారు. దీంతో రైతులు పంట భూముల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక్క ఫీడర్‌కు ఏడు గంటల విద్యుత్ కూడా సరఫరా చేస్తున్నారు. ఆరు గంటలు కూడా నిరంతరం సరఫరా చేస్తున్నారు. కానీ ఎప్పుడిస్తారో, ఇవ్వరో తెలియదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇలా ట్రాన్స్‌కో అధికారులు రైతుల బతుకులను ఆగం చేస్తున్నారు. రబీ పంటలు సాగు చేయడంలో రైతులు నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా జొన్న పంటను అధికంగా సాగు చేస్తున్నారు. ఏ, బీ, సీ, డీ గ్రూపుల్లో సాగుకు విద్యుత్ సరఫరా చేసిన అధికారులు ప్రస్తుతం ఏ గ్రూపునకు సరఫరా ఎప్పుడు ఉంటుందో చెప్పలేక పోతున్నారు. రైతులు మాత్రం విద్యుత్ ఎప్పుడు వస్తుందోనని విద్యుత్ డబ్బాల వద్ద రాత్రి, పగలు కాపలా కాస్తున్నారు. వెన్ను వణికే చలిలో కూడా పంట భూముల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. విద్యుత్ వస్తే మాత్రం నిరంతరంగా 5 నుంచి ఆరు గంటల సరఫరా చేస్తున్నారని అంటున్నారు. కోతలప్పుడు వేళాపాల లేకుండా కోతలు విధించారు. కానీ నిరంతరం సరఫరా చేస్తున్నప్పుడు కూడా వేళాపాల లేకుండా చేయడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి విద్యుత్‌కు గంట బోనస్..! రాత్రి విద్యుత్‌కు గంట విద్యుత్‌ను బోనస్‌గా ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా సరఫరా చేస్తున్నారు. రాత్రి విద్యుత్‌కు వెళితే గంట విద్యుత్ కలిసొస్తుందని రైతులు చలిని కూడా లెక్క చేయకుండా వెళుతున్నారు. నాణ్యమైన విద్యుత్ అంటే వేళాపాల లేని సరఫరా అని రైతులు విమర్శిస్తున్నారు. ఆరు తడి పంటలు సాగు చేస్తున్న ప్రాంతాల్లో మూడు ఫీడర్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఫీడర్‌కు 4 గంటల విద్యుత్ నిరంతరం సరఫరా చేస్తే సరిపోతుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ సరఫరా తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ట్రాన్స్‌కో x మున్సిపాలిటీ
* సంగారెడ్డిలో ముదిరిన వివాదం * బకాయి చెల్లించలేదని మున్సిపాలిటీకి కరెంటు కట్ * ట్రాన్స్‌కో పన్నుల బకాయిపై లెక్కతీస్తున్న మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డిలో ట్రాన్స్ కో, మున్సిపాల్టీల మధ్య వార్ నడుస్తోంది. మున్సిపాలిటీ బకాయిలు పెరిగిపోయాయని ట్రాన్స్‌కో అధికారులు కార్యాలయానికి కరెంటు సరఫరాను నిలిపివేశారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు అసలు ట్రాన్స్‌కో ఆస్తి బకాయి ఎంత ఉందో లెక్కలు తీసే పనిలో ఉన్నారు. ఎవరి లెక్కలు వారివి మున్సిపాల్టీ ట్రాన్స్‌కోకు రూ.5.65 లక్షల బకాయిగా ఉండడంతో వారం రోజుల క్రితం ట్రాన్స్‌కో అధికారులు సరఫరాను నిలిపివేశారు. దీంతో వారం రోజులుగా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. జనన, మరణ ధువపత్రాలతో పాటు ప్రభుత్వం కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు ఏకంగా మున్సిపల్ పాలక వర్గ సమావేశం నిర్వహించి ట్రాన్స్‌కో ఆస్తి పన్ను బకాయిపై లెక్క తీయాలని తీర్మాణం చేశారు. ఆమేరకు మున్సిపాలిటీ అధికారులు ట్రాన్స్‌కో కార్యాలయం భవనంతో పాటు అతిథిగృహం, పట్టణంలో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు, ఎన్ని విద్యుత్ స్తంభాలు మున్సిపల్ స్థలంలో ఉన్నాయన్న దానిపై మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ గయాసోద్దీన్ సిబ్బందితో కలిసి లెక్కలు వేస్తున్నారు. ట్రాన్స్ కో ఎస్ఈ కార్యాలయంతో పాటు డీఈ , ట్రాన్స్‌కో సమావేశ మందిరానికి సంబంధించి ఇంతవరకు ఆస్తి పన్ను చెల్లించలేదని తేలినట్లు తెలిసింది. కొత్తగా నిర్మించిన మూడు భవనాలకు సైతం మున్సిపాల్టీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. మొత్తంగా ట్రాన్స్‌కో మున్సిపాలిటీకి దాదాపు 9.కోట్ల మేర బకాయిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ట్రాన్స్‌కోకు నోటీసులు పంపేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. రూ.3 లక్షలు చెల్లిస్తామన్నా వినలేదు ట్రాన్స్‌కోకు మున్సిపాలిటీ బకాయి ఉన్న మాట వాస్తవమే. అందువల్లే బిల్లులతో సంబంధం లేకుండా ప్రతినెలా ట్రాన్స్‌కోకు రూ. 3 లక్షలు చెల్లిస్తామన్నా ట్రాన్స్‌కో అధికారులు ఒప్పుకోలేదు. వాస్తవానికి ట్రాన్స్‌కో రూ.5.65 లక్షల బకాయిగా చూపిస్తున్నప్పటికీ, మున్సిపాలిటీ మాత్రం రూ.3 కోట్లు మాత్రమే బకాయిగా ఉంది. ఈ బకాయి అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసి తగు చర్యలు తీసుకుంటాం. -గయాసోద్దీన్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, సంగారెడ్డి -
ఎంత బకాయో!
విద్యుత్ బిల్లులు చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ఆదేశించినా పట్టించుకోని యంత్రాంగం ఖమ్మం : విద్యుత్ బిల్లులు చెల్లించని నిరుపేదలపై జులుం ప్రదర్శించే ట్రాన్స్‌కో అధికారులు వేలకు వేలు బకాయి ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బడా నేతలు, పరిశ్రమల యాజమాన్యాలపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా వారికి విద్యుత్ సరఫరా చేసే లైన్లో ఏ చిన్నలోపం తలెత్తినా ఉరుకులుపరుగుల మీద రిపేర్ చేసేస్తారు. పేదల కాలనీల్లో విద్యుత్ సమస్య తలెత్తితే మాత్రం రోజుల తరబడి స్పందించని వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పభుత్వశాఖల్లో భారీగా పేరుకుపోయిన బకాయిలపై ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆగ్రహం వ్యక్తం చేసినా సంబంధిత అధికారుల్లో కాస్త చలనమైనా కలగలేదు. బకాయిలు చెల్లించని కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయండని హుకుం జారీ చేసినా అధికారులు తమకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ‘నీది తెనాలే.. నాది తెనాలే..’ అన్నట్టుగా ‘నీది ప్రభుత్వ ఆఫీసే నాది ప్రభుత్వ కార్యాలయమే..’ అన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. జిల్లాలో 7,77, 387 విద్యుత్ కనెక్షన్లున్నాయి. దీనిలో గృహ అవసరాలవి 6,24, 463, కేటగిరి-2 (వ్యాపార అవసరాలు) 48, 399, పరిశ్రమలకు సంబంధించి 4,090 కనెక్షన్లు ఉన్నాయి. జిల్లా మొత్తమ్మీద సుమారు రూ.130 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. దీనిలో ప్రభుత్వ కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలు సుమారు రూ.54.90 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిలో రైల్వేశాఖ రూ.5.98 లక్షలు, బ్యాంకులు రూ.1.27 లక్షలు, మైనర్ పంచాయతీ వాటర్ వర్క్స్ పరిధిలో రూ.16.69 కోట్లు, మైనర్ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో రూ.1.81 లక్షలు, మైనర్ పంచాయతీ స్ట్రీట్‌లైట్స్ బకాయిలు రూ.20.20 కోట్లు, మేజర్ పంచాయతీ వాటర్ వర్క్స్ రూ.3.02 కోట్లు, మేజర్ పంచాయతీ వీధిలైట్ల బకాయిలు రూ. 3.82 కోట్లు, మున్సిపల్ నీటి సరఫరా బకాయిలు రూ.94 లక్షలు, మున్సిపల్ వీధిలైట్ల బకాయిలు రూ.82 లక్షలు, ఆర్డబ్ల్యూఎస్ రూ.1.83 కోట్లు, టెలిఫోన్ ఎక్స్చేంజ్లు రూ.41 లక్షలు, కో ఆపరేటివ్ మార్కెట్లు రూ.2.26 లక్షలు, పోలీస్‌శాఖ రూ.79 లక్షలు, ఏపీఎస్ఆర్టీసీ రూ.2.20 లక్షలు, విద్యాశాఖ రూ.1.80 కోట్లు, వైద్యారోగ్యశాఖ రూ.33 లక్షలు, న్యాయశాఖ రూ.2 లక్షలు, రెవెన్యూశాఖ రూ.31 లక్షలు, పర్యాటక శాఖ రూ.2.85 లక్షలు, రోడ్డుభవనాలశాఖ రూ.7.19 లక్షలు, పశుసంవర్ధశాఖ రూ.3.75 లక్షలు, పరిశ్రమల శాఖ రూ. 3.97 లక్షలు, అటవీశాఖ రూ.5.96 లక్షలు, సాంఘిక సంక్షేమశాఖ రూ. 24 లక్షలు, పంచాయతీరాజ్ శాఖ రూ.17.7 కోట్లు, ప్రాజెక్టు ఆఫీసు, ఐటీ పరిధిలో రూ. 63.42 లక్షలు, దేవాదాయశాఖ బకాయిలు రూ. 1.84 లక్షలు, ఏపీ ఐఐసీ రూ. 1.81 లక్షలు, కార్పొరేషన్ పరిధిలో రూ. 87 లక్షలు ఇలా జిల్లాలోని దాదాపు అన్ని ప్రభుత్వశాఖలు రూ. 54.90 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు జిల్లాలోని పలువురు ప్రముఖులు, క్యాంపు కార్యాలయాల్లో లక్షలాది రూపాయలు బకాయిలు పడ్డారు. అటు ప్రభుత్వ అధికారులు, ఇటు వీరిని కదిలించడంలో మాత్రం విద్యుత్‌శాఖ అధికారులు వెనుకంజవేస్తున్నారు. పై అధికారుల ఆదేశాలు బేఖాతరు జిల్లాలో భారీగా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను ఏవిధంగానైనా వసూలు చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ ఆదేశించారు. వైద్యం, హాస్టల్స్, ఇతర అత్యవసరశాఖలను మినహాయించి మిగిలిన అన్ని శాఖలకు అవసరమైతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించినా చలనం లేదు. కట్ చేస్తే జిల్లా అధికారులతో తంటా..లేదంటే పై అధికారులతో చివాట్లు తినాల్సి వస్తుందని ట్రాన్స్‌కో సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు. బిల్లులు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తాం: తిరుమలరావు, ఎస్ఈ ప్రభుత్వ కార్యాలయాలు కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు పడ్డాయి. వీటిని వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నాం. అత్యవసర విభాగాల అధికారులకు బకాయిలు చెల్లించాలని చెప్పాం. మిగిలిన శాఖలకు నోటీసులు జారీ చేశాం. ఒకటి, రెండు రోజుల్లో చెల్లించపోతే సరఫరా నిలిపివేస్తాం. సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలి. -
కాటేస్తున్న కరెంట్
షాబాద్: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి తరచూ జనం మృత్యువాత పడుతున్నారు. ఇటీవల పలువురు కరెంట్ కాటుకు బలైపోయారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద అధికారులు ఆన్ఆఫ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యుదాఘాతానికి గురవుతున్నారు. మామూళ్లకు అలవాటుపడిన అధికారులు చేతి తడపనిదే ఏపని చేయడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల కందూకురు మండలంలో ఓ రైతు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంట్ సరఫరా నిలిపి వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే. ఈనెల 3వ తేదిన షాబాద్ మండలం దామర్లపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్య తన ఇంటిపై ఉన్న కట్టెలను ఓ దగ్గర పేర్చుతుండగా పైన ఉన్న కరెంట్ వైర్లు తగిలి మృతి చెందాడు. పండుగ పూటే ఆ ఇంటి విషాదం చోటుచేసుకుంది. ఇంటికి పెద్దదిక్కు అయిన ఆయన మృతితో కుటుంబం వీధిన ప డింది. తాజాగా మంగళవారం దామర్లపల్లి సర్పంచ్ గట్టుపల్లి జంగయ్య ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా కరెంట్ కాటేసింది. దీంతో అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. విద్యుత్ అధికారుల లోపం స్పష్టంగా ఉండడంతో జనం వారి తీరుపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సర్పంచ్ మృతదేహాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ట్రాన్స్‌కో ఏడీ, ఏఈలపై ఫోన్లో మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించకపోతే ఆందోళనలు తప్పవని మండలవాసులు హెచ్చరిస్తున్నారు. -
‘డి-గ్రూపు’తో రైతు డీలా
బాల్కొండ: విద్యుత్ సరఫరా కోసం అధికారులు నిర్ణయించిన డి-గ్రూపుపై రైతులు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం రైతులను విద్యుత్తు కోతల కంటే అధికంగా డి-గ్రూపు కలవర పెడుతోంది. నెలరోజులుగా ట్రాన్స్‌కో అధికారులు సాగుకు నాలుగు గ్రూపులుగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. అంతకు ముందు మూడు గ్రూపులలో విద్యుత్‌ను స రఫరా చేసేవారు. ప్రస్తుతం నాలుగో గ్రూపుగా డి-గ్రూపు ద్వారా రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆ రుత డి పంటలకు నీరందించే రైతులు డి-గ్రూపుతో తీవ్ర కలవరానికి గురవుతున్నారు. రాత్రి పూట పంటకు ఎలా నీరందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడు గం టల విద్యుత్‌ను ఐదు గంటలకు కుదించారు. అందులోనూ ఇన్కమింగ్ పేరిట రెండు గంటల కోతలు విధిస్తున్నారు. దీని భావమేమిలో? విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని నాలుగో గ్రూపు ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ, పగలు ఏదో ఒకగ్రూపు ఖాళీగానే ఉంచుతున్నారు. లోడ్ తగ్గించడానికే అయితే, అధిక లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో రెండు గ్రూపులలో విద్యుత్ సరఫరా చేస్తే ఫలితం ఉంటుందని రైతులు అం టున్నారు. అలా కాకుండా నాలుగు గ్రూపులుగా విభజించి, మూడు గ్రూపుల ద్వారానే విద్యుత్ సరఫరా చేయడం వెనుక మర్మం ఏమిటో తెలియక వారు కలవరపడుతున్నారు. ట్రాన్స్‌కో అధికారుల పూటకో నిర్ణయంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పంటలు ఎండి రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. అయినా, అధికారులలో ఎలాం టి మార్పులేదు. వరి సాగుచేసే ప్రాంతంలో రాత్రి కరెంట్ సరఫరా ఉంటే వరి పంటకు నీరందించవచ్చు. ఆరు తడిపంటలు పండించే ఆర్మూర్ సబ్ డివిజన్ లాంటి ప్రా ంతంలో డి-గ్రూపు వృథా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుతడి పంటలకు రైతులు దగ్గరుండి నీటి సరఫరా చేపట్టాల్సి ఉంటుంది. దీంతో ప్రమాదా లకు గురయ్యే అవకాశం ఉందని వాపోతున్నారు. ట్రాన్స్‌కో అధికారులు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. సాగుకు విద్యుత్ సరఫరా వేళలు ప్రస్తుతం సాగుకు నాలుగు గ్రూపులలో అధికారులు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఎ- గ్రూపులో తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు, బి- గ్రూపులో ఉదయం తొమ్మిది గంటల నుంచి పగలు రెండు గంటల వరకు, సి-గ్రూపులో పగలు రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు, డి-గ్రూపులో రాత్రి పది గంటల నుంచి మరునాడు తెల్లవారుజామున మూడు గంటల వరకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఇక అనధికార కోతలకు లెక్కే లేదు. -
ఉచితమనే ఉదాసీనత
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ట్రాన్స్‌కో అధికారులు బడాబాబులకే కొమ్ముకాస్తున్నారు. ఆరుగాలం శ్రమించి దేశానికే అన్నం పెడుతున్న రైతన్నలతో కన్నీరు పెట్టిస్తున్నారు. నారుమళ్లు ఎండబెట్టి పరిశ్రమలకు విద్యుత్ మళ్లిస్తున్నారు. వ్యవసాయాన్ని, రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసి అధికారికంగానే కరెంటును పరిశ్రమలకు అమ్ముకుంటున్నారు. జిల్లాలో కరెంటు కోతలు, రైతుల నిరసన సెగల నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాకు రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు జిల్లాకు రోజుకు 18.8 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కేటాయించారు. ఇందులో 6 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి, 9 నుంచి 10 మిలియన్ యూనిట్లు పరిశ్రమలకు, మిగిలినది గృహ అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు టాన్స్‌కో రికార్డులు చెప్తున్నాయి. ఇదీ వ్యత్యాసం జిల్లాలో 2.22 లక్షల ఉచిత విద్యుత్తు మోటారు కనెక్షన్లు ఉండగా, వీటి ద్వారా దాదాపు 5.58 లక్షల ఎకరాలు సాగు అవుతోంది. ఈ విద్యుత్ మోటార్ల ద్వారా నెలకు 180 లక్షల మిలియన్ల విద్యుత్ ఖర్చవుతోంది. ఒక్కో బోరు మోటరుకుసర్వీస్ పన్ను రూపంలో రూ. 20 మాత్రమే ట్రాన్స్‌కో వసూలు చే స్తోంది. ఈ మొత్తం నెలకు రూ.20 కోట్లకు మించదు. ఇక జిల్లాలో 9 వేల భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా, వీటికి రోజుకు 9 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. పరిశ్రమలకు ఇస్తున్న ప్రతి యూనిట్ విద్యుత్‌కు రూ. 6 చార్జి వేస్తారు. ఈ లెక్కన పరిశ్రమల నుంచి నెలకు రూ.150 నుంచి రూ.200 కోట్ల ఆదాయం వస్తోంది. భారం అంతా వ్యవసాయం మీదే ఇటీవల రాష్ట్రం విడిపోవటం, విద్యుత్ డిస్కం పంపకాలలో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య లేకపోవడం తోడు, వర్షాలు కూడా కురవకపోవడంతో రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్తు కొరత ఏర్పడింది. దీంతో జిల్లాకు రావాల్సిన రోజువారీ వాటాలో 2 మిలియన్ యూనిట్లు కోత పెట్టారు. గత శుక్ర, శని, ఆది వారాల్లో ఈ కోతను మరింత పెంచారు. కేవలం 14 మిలియన్ యూనిట్లు మాత్రమే జిల్లాకు సరఫరా చేశారు. అంటే దాదాపు 4.8 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరాపై కోత పడింది. కోత పడిన మొత్తాన్ని విద్యుత్ అధికారులు అటు పరిశ్రమలకు, ఇటు వ్యవసాయానికి పంచి పంపిణీ చేస్తే సమస్య వచ్చేదే కాదు. కానీ ఇక్కడే విద్యుత్ అధికారులు చేతివాటం చూపించారు. వ్యవసాయానికి ఇచ్చేది ఉచిత విద్యుత్ కాబట్టి కోత పడిన మొత్తం లోడును వ్యవసాయంపైనే వేశారు. గృహ అవసరాలకు వినియోగపడే విద్యుత్‌లో కూడా కోతపెట్టి పరిశ్రమలకు పంపించారు. దీంతో వ్యవసాయానికి రోజుకు కనీసం 2 గంటల కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఒకటి రెండు రోజుల పాటు ఓపిక పట్టిన రైతులకు మడి ఎండిపోయే పరిస్థితి రావడంతో ఉద్యమానికి సిద్ధమయ్యారు. రోడ్ల మీదకు వచ్చి రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన తెలిపారు. -
‘భారం’ మోపేందుకే ఆ బిగింపు!
తుని : వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ప్రభుత్వం చెప్పి అడ్డదారిలో ఉచిత విద్యుత్‌కు మంగళం పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పంట రుణాల మాఫీ హామీ అమలులో మాట మార్చి రైతులను వంచించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఉచిత విద్యుత్ కేటగిరీలో ఉన్న వ్యవసాయ బావులకు మీటర్లు ఏర్పాటు చేయజూస్తూ వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వ్యవసాయ బావులకు మీటర్లు వేసేది ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకేనని అధికారులు చెబుతున్నా.. అన్నదాతలకు నమ్మకం కలగడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం వల్ల వేలాది మంది రైతులు ప్రయోజనం పొందారు. మెట్ట ప్రాంతంలో ఎక్కువ శాతం రైతులు బోరు బావుల ఆధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల పరిధిలో ఉచిత విద్యుత్ కేటగిరీలో 12,165 కనెక్షన్లు ఉన్నాయి. 2005 నుంచి ఇప్పటి వరకు రైతులు ఒక్క రూపాయి బిల్లు చెల్లించాల్సిన అవసరం రాలేదు. తత్కాల్, చెల్లింపు కేటగిరీలోని 3,630 కనెక్షన్ల ద్వారా వాడిన విద్యుత్‌కు మాత్రం బిల్లులు చెల్లించాలి. ఎప్పటికప్పుడు వసూలు చేయకపోవడంతో వీటి బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. జగ్గంపేట డివిజన్ పరిధిలో రూ.6.42 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని రైతుల నుంచి వసూలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ‘నూరురోజుల ప్రణాళిక’తో మళ్లీ పాతరోజులు..! మెట్ట ప్రాంతంలోని 12,165 ఉచిత విద్యుత్ కనెక్షన్లకు కొత్త మీటర్లను వేయడానికి ట్రాన్స్‌కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీ రైతుల జాబితా తయారు చేసి మీటర్లు ఇవ్వనున్నారు. వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇవన్నీ పూర్తి చేయడానికి వంద రోజుల ప్రణాళిక రూపొందించారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న బోరు బావుల మోటార్లను తనిఖీ చేసి, వాటి స్థానంలో విద్యుత్ ఆదాకు కొత్త మోటార్లు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మళ్లీ పాత రోజులు వస్తున్నాయని, వ్యవసాయం దండగన్న చంద్రబాబు కొత్త మీటర్ల మాటున తిరిగి తమకు చేదును చవి చూపి స్తారని, మునుముందు ఉచిత విద్యుత్‌కు ఎగనామం పెట్టి, బిల్లులు గోళ్లూడగొట్టి వసూలు చేయడానికే ఇదంతా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఉచిత విద్యుత్ కేటగిరీలో ఉన్న వ్యవసాయ బోర్లకు మీటర్ల బిగింపునకు ట్రాన్స్‌కో అధికారులు రాజానగరం మండలం నుంచి శ్రీకారం చుట్టినట్టు తె లిసింది. అధికారులు మాత్రం పాత కనెక్షన్లకు కాక.. కొత్త వాటికి మాత్రమే మీటర్లు అమర్చుతున్నట్టు చెపుతున్నారు. -
ట్రాన్స్‌కోనా మజాకా!
బాల్కొండ/రెంజల్/నిజామాబాద్ నాగారం: వ్యవసాయానికి కరెంటు సరఫరా వేళలలో పూటకో నిర్ణయం తీసుకుంటూ ట్రాన్స్ కో అధికారులు రైతులను అయోమయంలో పడవేస్తున్నారు. ఆదివారం నుంచి సరఫరా వేళలను మార్చారు. కానీ, ఇన్కమింగ్ పేరిట కోతలను తీవ్రం చేశారు. శుక్రవారం రాత్రి 10.20 గంటలకు కరెంట్ కట్ చేస్తే, 11.20 గంటలకు వచ్చింది. మళ్లీ శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు, ఉదయం 11.20 నుంచి మధ్యాహ్నం 1.20 వరకు, 3.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఇన్కమింగ్ పేరిట విద్యుత్ కోతలను విధిం చారు. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నాలు చేశారు. ఇప్పటి వరకు మూడు గ్రూపులలో కరెంటును సరఫరా చేసిన ట్రాన్స్‌కో అధికారులు ఆదివారం నుంచి దానిని నాలుగు గ్రూపులకు మార్చారు. సరఫరాలో అధిక లోడ్ పడకుండా ఉండాలనే గ్రూపులుగా విభజించామని గతంలో ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ప్రస్తుతం ‘డి’ గ్రూపు వేళలను చూస్తే, రెండు గ్రూపులలో ఒకే సారి సరఫరా ఎలా సాధ్యమవుతుందో అధికారులకే తెలియాలి. రాత్రి కరెంట్‌కు ఎగనామం పెట్టడానికే ‘డి’ గ్రూపును సృష్టించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేమి తీరు! ఎ గ్రూపులో రాత్రి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు, బి గ్రూపులో 12 గంటల నుంచి 2 గంటల వరకు, సి గ్రూపులో 2 గంటల నుంచి 4 గంటల వరకు స రఫరా చేస్తారు. డి గ్రూపులో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు కరెంటు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఎ, బి, సి గ్రూపులలో రాత్రి పూట ఇచ్చే క రెంటుపై అధిక లోడ్ పడదా? సరఫరాకు అంతరాయం జరగదా? ఇది అధికారులకే తెలియాలి. -
మళ్లీ కట్‌కట
ఖమ్మం: ట్రాన్స్‌కో అధికారులు మళ్లీ జులుం విదిల్చారు. ఇప్పటికే ప్రజలు విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతుంటే అవి చాలదన్నట్లు శనివారం నుంచి అదనపు కోతలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలు లేకపోవడంతో పంటలు సాగు చేయకపోయినా విద్యుత్ కోతల బాధలు మాత్రం తప్పేలా లేవని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాకేంద్రం మొదలు మారుమూల గ్రామం వరకు దేన్నీ వదలిపెట్టకుండా కోతల సమయాన్ని పెంచనున్నారు. వ్యవసాయ సీజన్ ముమ్మరమైతే పరిస్థితి ఎంటా? అని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చిన్నపాటి గాలికే విద్యుత్ తీగ లు తెగిపడటం, షార్ట్‌సర్క్యూట్ చోటుచేసుకోవడం, లైన్ల మర్మతుల పేరుతో గంటలకొద్దీ కోతలు విధిం చడం ఆనవాయితీగా చేసుకున్న ట్రాన్స్‌కో అధికారులు..అనధికారిక కోతలే కాకుండా అధికారిక కోతల సమయాన్ని కూడా పెంచటం ఆందోళన కలిగిస్తోంది. వినియోగం పెరిగిందనే నెపంతో... జలాశయాల్లో నీరు లేకపోవడం, జిల్లాకు సరఫరా చేసే విద్యుత్ కంటే వినియోగం ఎక్కువ అయిందనే నెంపతో ఇప్పుడున్న కోతలకు తోడు అదనంగా పెంచారు. జూన్ నెలలో జిల్లాకు రోజు వారీగా 5.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటాను కేటాయించారు. అయితే అప్పుడు జిల్లాలో అంతకంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారని కోతలు విధించారు. జిల్లా కేంద్రంలో రెండు గంటలు, మున్సిపల్ కేంద్రాల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాలో ఆరు గంటలు కోత ఉండేది. వర్షాలు లేకపోవడం, వేసవిని తలపించే విధంగా ఎండల తీవ్రత ఉండటంతో ప్రజలు విలవిలలాడారు. ఇది చాలదన్నట్లు జూలై నెల రోజువారీ కోటా సగటున 4.28 యూనిట్లకు కుదించారు. విద్యుత్ వినియోగానికి జిల్లాకు కేటాయించి కోటాకు తేడా ఉండటంతో అదనపు కోతలు విధిస్తున్నామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం జిల్లా కేంద్రంలో ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు, మున్సిపల్, మండల, సబ్‌స్టేషన్ కేంద్రాలో ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు మొత్తం ఆరు గంటల విద్యుత్ కోతలు విధిస్తారు. వ్యవసాయానికీ కోతలే... ఓవైపు వర్షాలు లేక అల్లాడుతున్న రైతన్నకు ఇబ్బందులు తప్పేలా లేవు. కరెంట్ ఉంటే ఓ మడైనా తడుస్తుందనుకుంటున్న రైతన్నకు నిరాశ తప్పేలా లేదు. సాగు చేస్తున్న కొద్దిపాటి పంటలకు నీరు పెట్టేందుకు అర్ధరాత్రి అపరాత్రి ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం ప్రకటించిన ఏడు గంటల విద్యుత్‌ను నిరంతరాయంగా ఇవ్వకుండా ఉదయం, రాత్రివేళల్లో ఇవ్వడంపై అన్నదాతల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. ఏ, బీ, సీ, డీ నాలుగు గ్రూపులుగా విభజించి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో సరఫరా చేస్తున్నారు. -
పదహారేళ్లుగా వెట్టి
ఆ భూమి లక్షల విలువ చేస్తోంది. ఆత్మకూర్ శివారులోనే ఉన్న ఆ వ్యవసాయ భూమిలో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ ఉప కేంద్రం నిర్మించేందుకు పూనుకున్నారు. దీనికి గాను భూమి ఇస్తే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి లక్షల విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకొని నేటి కీ భూమి ఇచ్చిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వనేలేదు. వివరాలు.. ఆత్మకూర్ మండలం ఖానాపూర్ శివారులో (ఆత్మకూర్‌కు అతి సమాపంలో) ఉన్న సర్వే నెం.128లో ఖానాపూర్‌కు చెందిన కుర్వ మల్లేష్‌కు సంబంధించిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆత్మకూర్‌లో విద్యుత్ ఉప కేంద్రం లేని కారణంగా పట్టణ శివారులో ఉన్న ఆ భూమిని ట్రాన్స్‌కో అధికారులు ఎంపిక చేశారు. ఆ భూమిలోంచి అర ఎకరం ఇస్తే ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో లక్షల విలువ చేసే భూమిని 1997లో అధికారులకు అప్పజెప్పారు. అనంతరం విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం పూర్తి స్థాయిలో జర గడంతో సెప్టెంబర్ 29, 1998లో ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే కొత్తకోట దయాక ర్‌రెడ్డి, ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ కేఎస్ఎన్మూర్తి, ఎస్ఈ వైసీ కొండారెడ్డిలు హాజరై ప్రారంభించారు. అనంతరం వికలాంగుడైన కుర్వ మల్లేష్‌కు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి తాత్కాలిక వాచ్‌మెన్‌గా విధుల్లో చేర్చుకున్నారు. ఐదేళ్లపాటు కాస్తో, కూస్తో జీతం చెల్లిస్తూ వెట్టిచాకిరీ చేయించుకున్నారు. అనంతరం తమకు వాచ్మెన్ అక్కరలేదని అధికారులు పేర్కొనడంతో మల్లేష్ బిత్తరపోయాడు. ఈ విష యమై ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలుమార్లు కాళ్లావేళ్లా పడి ప్రాధేయప డ్డా ఇది తమ చేతుల్లో ఏమీ లేదని, ఉద్యోగం వచ్చే అవకాశం లేదని అధికారులు తేల్చిచెప్పడం గమనార్హం. ఉన్న కాస్త భూ మిలో వ్యవసాయం చేసుకొని బతుకుదామంటే ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు పాతి తీగలు ఉండటంతో వ్యవసాయానికి ఆ భూమి ప నికిరాకుండా పోయిం దని, జీవనాధారం కోల్పోయామని బాధిత కుటుంబం ఆందోళ న వ్యక్తం చేస్తోంది. అరుునా తనపై అధికారులకు కనికరం వ స్తుందేమోనని ప్రతిరోజు అతను విధులకు హాజరవుతున్నాడు. ట్రా న్స్‌కో అధికారులు ఎలాంటి వేతనం ఇవ్వకపోవడంతో తోటి కాంట్రాక్ట్ కార్మికులు నలుగురు రూ.500 చొప్పున ప్రతినెల రెండువే లుఇస్తూమానవత్వాన్ని చాటుకుంటున్నారు. -
8 గంటలు కరెంట్ కట్
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : విద్యుత్ లైన్లో ఏ ర్పడిన సాంకేతిక సమస్యతో తూర్పు ప్రాం తంలోని పది మండలాల్లో శనివారం గంట ల కొద్ది విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంట ల వరకు కరెంట్ సరఫరా పూర్తిగా స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. కాసిపేట మండలం కొండాపూర్ ఫీడర్ లో 33 కేవీ లైన్లో రెండు డిస్క్‌లు ఫెయిలవడమే ఇందుకు కారణం. వీటి మరమ్మతు పేరిట బెల్లంపల్లి నుంచి మండలాలకు వెళ్లే 132 కేవీ ప్రధాన విద్యుత్ లైన్ కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఈ కారణంగా భీమి ని, నెన్నెల, తాండూర్, బెల్లంపల్లి, తిర్యాణి, వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన, కెరమెరి, కాసిపేట మండలాల్లోని వందకుపైగా గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచింది. అల్లాడిన జనం కరెంట్ సరఫరా ఆగిపోవడంతో ప్రజలు నానా యాతన పడ్డారు. మధ్యాహ్నం ఉక్కపోతతో బాధపడిన ప్రజలు రాత్రి దోమల రోదతో సతమతమయ్యారు. కరెంట్ లేక ఫ్యాన్లు పని చేయని పరిస్థితులు ఏర్పడి చి న్నారులు నిద్రకు దూరమయ్యారు. కరెంట్ లేక ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, జిరాక్స్ సెంట ర్లు, రైస్ మిల్లులు, వెల్డింగ్ షాపుల యజ మానులు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. బెల్లంపల్లిలోని బజార్ ఏరియా, కాల్టెక్స్, రైల్వేస్టేషన్ ప్రాంతాలు పూర్తిగా చీకటిమయమయ్యాయి. వాహనాల రాకపోకలతో రహదారిపై కాస్తా వెలుతురు కనిపించిన కార్మికేతర వాడలలో మాత్రం చీకటి రాజ్యమేలింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండిపోయింది. ఎటు చూసిన చీకటి అలుముకోవడంతో ప్రజలు క్యాండీ ల్స్, కిరోసిన్ బుడ్డిలతో కాలం గడిపారు. మరమ్మతుల్లో నిర్లక్ష్యం పాడైపోయిన డిస్క్‌లను తొలగించి కొత్త వా టిని ఏర్పాటు చేయడానికి అధికారులు గం టలకొద్దీ సమయం వృథా చేశారు. కేవలం రెండు గంటల వ్యవధిలో మరమ్మతు పూర్తి చేసే అవకాశాలున్నా అధికారుల నిర్లక్ష్యంతో 9 గంటలకు పైగా సమయం గడిచిపోయిం ది. ఎట్టకేలకు చివరికి రాత్రి 9 గంటల తర్వా త విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ లైన్లను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు మరమ్మతు చేయించాల్సి ఉండగా ట్రాన్స్‌కో అధికారులు విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఏదేని సమస్య ఏర్పడినప్పుడు కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. అధికారుల తీరులో మార్పు రావాలని, కరెంటు సమస్యలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
గుండె కోత
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : వేసవి రాకమునుపే కరెంటు కోతలు బెంబేలెత్తిస్తున్నాయి. రబీ పంటల సాగు సమయంలోనే ట్రాన్స్‌కో అధికారులు తమ మార్కును ప్రదర్శిస్తున్నారు. వ్యవసాయానికి అధికారికంగా ఒక గంట కోత పెట్టారు. అనధికారికంగా రెండు గంటల పాటు తీసేస్తున్నారు. మిగిలిన ఐదు గంటలు కూడా విడతల వారీగా ఇస్తున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతోందో తెలియని పరిస్థితి. దీంతో అన్నదాతలు వ్యవసాయ బోరుబావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో మొత్తం 1.96 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటి కింద వాస్తవానికి 1,61,694 హెక్టార్లలో పంటలను సాగు చేయాలి. అయితే... కొన్నేళ్లుగా వేసవిలో కరెంట్ సరఫరా అస్తవ్యస్తంగా మారుతోంది. దీంతో చాలా మంది రైతులు రబీలో పంటల సాగుకు వెనుకాడుతున్నారు. దీనికారణంగా ఏడాదికేడాది పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రస్తుతం 1.33 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగవుతున్నాయి. ట్రాన్స్‌కో అధికారుల దెబ్బకు భయపడి రైతులు వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు స్వస్తి చెబుతున్నారు. బిందు సేద్యం(డ్రిప్)పై ఆధారపడి కూరగాయల పంటలు, కళింగర, దోస లాంటి పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువగా కూరగాయలు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పప్పుశనగ పంటలు వేశారు. రబీలో వరి సాధారణ విస్తీర్ణం 16,124 హెక్టార్లు కాగా.. ప్రస్తుతం ఆరు వేల హెక్టార్లకే పరిమితమైంది. వేరుశనగ సాధారణ విస్తీర్ణం 19,448 హెక్టార్లు కాగా.. 12 వేల హెక్టార్లకు పరిమితమైంది. వాస్తవానికి వ్యవసాయానికి విద్యుత్‌కోత విధించరాదనే నిబంధన ఉంది. ఏడు గంటల పాటు నిర్విరామంగా సరఫరా చేయాలి. ట్రాన్స్‌కో అధికారులు మాత్రం అన్నదాతలపై శీతకన్ను వేస్తున్నారు. ఉత్పత్తి తగ్గిందన్న సాకు చూపి మొదట వ్యవసాయ రంగానికే కోత పెడుతున్నారు. కృత్రిమ కొరతేనా? చలి కాలంలోనూ కరెంట్ కోతలు విధిస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లాకు 14 మిలియన్ యూనిట్ల కరెంటు అవసరం. ప్రస్తుతం 13.2 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోందని అధికారులు చెబుతున్నారు. చలికాలంలో వినియోగం ఎందుకు పెరిగిందో ట్రాన్స్‌కో అధికారులకే అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. రైతులకు మాత్రం ఇది శాపంగా పరిణమిస్తోంది. సాగు సమయంలోనే కోత పెడుతుండడంతో రబీ పంటలపై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. కాగా... కోతల కారణంగా రైతులు నిత్యం వ్యవసాయ బోర్ల వద్దే ఉంటున్నారు. కరెంటు రాగానే అందరూ ఒకేసారి మోటార్లు వేస్తున్నారు. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్‌లోడ్ పడి కాలిపోతున్నాయి. వాటిని మరమ్మతు చేసేందుకు 10 నుంచి 15 రోజులు పడుతోంది. దీనివల్ల పంటలు ఎండిపోతున్నాయి. నిబంధనల మేరకు అర్బన్ పరిధిలో 24 గంటలు, రూరల్ పరిధిలో 48 గంటల్లోపు కొత్త ట్రాన్స్ఫార్మర్ అమర్చాలి. దీన్ని అధికారులెవరూ పాటించడం లేదు. రైతుల ఇబ్బందులను గుర్తించాం విద్యుత్ సరఫరాలో లోటు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నది వాస్తవమే. ఆ లోటును ఎలాగోలా పూడుస్తున్నాం. పగలు కోత పెట్టినా రాత్రి వదులుతున్నాం. అక్కడక్కడ గంట పాటు కోత పడుతోంది. భవిష్యత్‌లో రైతన్నలకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. వేసవిలో వ్యవసాయానికి ఏ విధంగా విద్యుత్ సరఫరా చేయాలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తాం. - ప్రసాద్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ -
పైసా..? ప్రతిభా..??
ఖమ్మం, న్యూస్‌లైన్: విద్యుత్ సబ్స్టేషన్లలో ఖాళీగా ఉన్న ఆపరేటర్లు, వాచ్మెన్ పోస్టులు ప్రతిభావంతులకు వస్తాయా.. పైసలు ఉన్నవారికేనా.. అనేది ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమైంది. అన్ని అర్హతలు ఉన్నవారికే ఉద్యోగాలు ఇస్తామని ట్రాన్స్‌కో అధికారులు చెపుతున్నారు. అయితే ఉద్యోగం ఇప్పిస్తామంటూ పలువురు దళారులు నిరుద్యోగుల నుంచి రూ. లక్షలు వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు ఉద్యోగాలు ఎవరికి వస్తాయో అర్థం కాక ప్రతిభావంతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు తమ అనుచరులకే ఉద్యోగం ఇవ్వాలంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆపరేటర్ పోస్టులకు పెరిగిన పోటీ.. సబ్‌స్టేషన్ ఆపరేటర్లు, వాచ్‌మెన్‌గా చేరితే ట్రాన్స్‌కోలో ఇతర ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఉంటుందనే ఆలోచనతో భారీ సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం డివిజన్ల పరిధిలో మొత్తం 53 ఆపరేటర్ పోస్టులకు 2,350 దరఖాస్తులు, 13 వాచ్మెన్ పోస్టులకు 877 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ భర్తీ ప్రక్రియలో ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ ప్రాంతాల వారీగా రిజర్వేషన్ కల్పించాలని గిరిజన సంఘాలు పట్టుబట్టాయి. దీంతో భద్రాచలం, కొత్తగూడెం డివిజన్ పరిధిలో ఉన్న 15 పోస్టులకు 1:4 నిష్పత్తి ప్రకారం 60 మంది ఎస్టీలను, సత్తుపల్లి డివిజన్ పరిధిలోని ఏజన్సీ ప్రాంతంలో ఉన్న తొమ్మిది పోస్టులకు 36 మందిని, మైదాన ప్రాంతంలో ఉన్న ఐదు పోస్టులకు 20 మందిని, ఖమ్మం డివిజన్ పరిధిలో ఉన్న 23 ఉద్యోగాల్లో నాలుగు ఎస్టీ పోస్టులకు గాను 16 మందిని, 19 గిరిజనేతరుల పోస్టులకు 76 మందిని ఎంపిక చేశారు. వీరిలో భద్రాచలం, కొత్తగూడెం డివిజన్ పరిధిలోని అభ్యర్థులకు ఈనెల 27న, సత్తుపల్లి డివిజన్ పరిధిలోని అభ్యర్థులకు 28న, ఖమ్మం డివిజన్ పరిధిలోని అభ్యర్థులకు 30న పోల్ క్లెయిమ్(స్తంభాలు ఎక్కే పరీక్ష) నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఇంతవరకు అభ్యర్థుల విద్య, ఇతర టెక్నికల్ పరీక్షల్లో సాధించిన ప్రగతిని ప్రామాణికంగా తీసుకొని ఎంపిక చేశారు. ఇక పోల్ క్లెయిమ్‌లో మెరిట్ సాధించిన వారికే ఉద్యోగాలు లభిస్తాయి. దీన్ని ఆసరాగా తీసుకొని పలువురు దళారులు తమకు తెలిసిన అధికారులతో ప్రాక్టికల్ మార్కులు అధికంగా వేయిస్తామంటూ నిరుద్యోగుల వద్ద రూ.50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఓ అధికారి పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారని సదరు దళారులు నిరుద్యోగులకు చెపుతున్నట్లు సమాచారం. దీంతో ప్రతిభ ఆధారంగా ఉద్యోగం వస్తుందనే ధీమాతో ఉన్న నిరుద్యోగులు.. దళారుల రంగ ప్రవేశంతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ప్రతిభావంతులనే నియమించాలని కోరుతున్నారు. అనుచరుల కోసం నాయకుల ఆరాటం... గతంలో తమకు నచ్చిన వారికి ఉద్యోగం ఇప్పించే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఎంపిక విధానం మార్చడంతో తమ అనుచరుల పరిస్థితి ఏమిటని పలువురు అధికార, ప్రతిపక్ష నాయకులు డైలామాలో పడ్డారు. ఎలాగైనా తమ అనుచరులనే ఆపరేటర్లుగా నియమించాలని వారు ట్రాన్స్‌కో అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. గతంలో సబ్‌స్టేషన్ పరిధిలో ఉండే నాలుగు ఆపరేటర్ పోస్టుల నియామకంలో స్థానిక ఎమ్మెల్యే, కాంట్రాక్టర్, సర్పంచ్, విద్యుత్‌శాఖ అధికారులకు అనువైన వారిని నియమించేవారు. కానీ ఇప్పుడు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాలని సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. సీఎండీ కఠినమైన ఆదేశాల విషయం చెప్పినా వినకుండా పలువురు ప్రజాప్రతినిధులు ‘మా అనుచరులకే ఉద్యోగాలు ఇవ్వాలి.. ఏం చేస్తావో తెలియదు. ఎంత డబ్బులు కావాలో తీసుకో.. లేకపోతే నియమించిన ఉద్యోగి ఎలా పనిచేస్తాడో మేము, మా కాంట్రాక్టర్లు చూస్తారు’ అని అధికారులను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. ఒకవైపు ప్రజాప్రతినిధుల ఒత్తిడి, మరోవైపు అధికారుల ఆదేశాలతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. పారదర్శకంగానే ఎంపిక చేస్తాం సబ్‌స్టేషన్ కాంట్రాక్టు ఆపరేటర్లు, వాచ్మెన్ నియామకాలు పారదర్శకంగా జరుగుతాయి. ఉన్నతాధికారుల ఆదేశాలు తు.చ. తప్పకుండా పాటిస్తాం. ప్రతిభావంతులకే ఉద్యోగం వస్తుంది. దళారుల మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. - తిరుమలరావు, ఎస్ఈ