జిల్లాలో పవన విద్యుత్ కేంద్రం ..
జిల్లాలో పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పరిగి సమీపంలోని రాఘవాపూర్, సయ్యద్‌మల్కాపూర్, కాళ్లాపూర్ కొండల ప్రాంతంలో విండ్ పవర్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కొండల పైభాగం పవన విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమని ట్రాన్స్‌కో అధికారులు నిర్ధారించారు. దీంతో ఓ ప్రైవేటు సంస్థ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందుకు అవసరమైన భూమిని ఇప్పటికే కొంత కొనుగోలు చేశారు. సర్వే పనులూ చేపట్టారు. రూ.600 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ నుంచి 100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పరిగి: పవన విద్యుత్ (విండ్ పవర్) ప్లాంట్ ఏర్పాటుకు పరిగికి సమీపంలోని రాఘవాపూర్, సయ్యద్‌మల్కాపూర్, కాళ్లాపూర్ పరిధిలోని కొండలను ఎంపిక చేశారు. ప్లాంట్ ఏర్పాటుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. ప్లాంట్ ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం అవసరం ఉండగా ఇప్పటికే సదరు సంస్థ 80 ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. అయితే పవన విద్యుత్ ప్రాజెక్టు గ్రీన్ ప్రాజెక్టు తరహాలోకి వస్తున్నందున పెద్దగా అనుమతుల కోసం ఇబ్బంది లేకుండా కేవలం నాలా అనుమతులు తీసుకుని ప్రాజెక్టును ప్రారంభించొచ్చని అధికారులు చెబుతున్నారు.
100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
రూ.600 కోట్లతో సుమారు 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పవన విద్యుత్ ప్రాజెక్టు ద్వారా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను నేరుగా ప్రభుత్వానికి విక్రయించనున్నారు. ఇందుకోసం ముందుగానే ప్రభుత్వంతో ఒప్పందం చేయించుకునేందుకు సంస్థ ప్రతినిధులు సిద్ధమవుతున్నట్లు తెలి సింది. ఉత్పత్తి అయిన ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.5.48 లెక్కన ప్రభుత్వానికి విక్రయించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
అయితే ప్రస్తుతం ప్రభుత్వం విద్యుత్ కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో త్వరగానే పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా సదరు కంపెనీ రంగాపూర్ సమీపంలో 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి యోచిస్తున్నట్టు తెలిసింది. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వారు నిర్మించుకున్న సబ్‌స్టేషన్‌కు, అక్కడినుంచి ట్రాన్స్‌కో విద్యుత్ లైన్‌కు అనుసంధానం చేయనున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు చెందిన నాలుగు నియోజకవర్గాలకు అవసరమ య్యే విద్యుత్‌తో సమానమని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు.
పరిగికి నిరంతర విద్యుత్..
పరిగి సమీపంలో నిర్మించతలపెట్టిన ఈ పవన విద్యుత్ ప్రాజెక్టు ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు పూర్తికానుందని అధికారులు పేర్కొంటున్నారు. కాళ్లాపూర్, సయ్యద్‌మల్కాపూర్, రాఘవాపూర్ శివారు ప్రాంతంలోని ఎత్తై కొండలపై నిర్మిస్తున్న విండ్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తై పరిగి ప్రజల కరంటు కష్టాలు తీరనున్నాయి. పవర్ ప్రాజెక్టులో తయారైన విద్యుత్‌ను నిల్వ చేయటం వీలుకాదు. దీంతో తయారయ్యే విద్యుత్ ఎప్పటికప్పుడు విద్యుత్ ఫీడర్లతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి అయిన కరెంటును మిగతా లైన్లతో అనుసంధానం చేసేందుకైనా పరిగిలో నిరంతర విద్యుత్‌ను ఉంచాల్సిన అవసరం ఉంటుందని సమాచారం.