మృతి చెందిన నజీర్
పుట్లూరు: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకడంతో హిటాచీలో ఉన్న యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పుట్లూరు గ్రామానికి చెందిన కుళ్లాయమ్మ, కుళ్లాయప్ప దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కుమారుడు నజీర్ (25) హిటాచీ హెల్పర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం పుట్లూరు నుంచి పని నిమిత్తం హిటాచీని లారీలో ఎక్కించి తీసుకెళ్తుండగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించి లారీ డ్రైవర్‌తో పాటు నజీర్ కిందకు దూకారు. నజీర్ చేయి లారీకి తగలడంతో విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానికులు అతడిని తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే నజీర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్లే నజీర్ మృతి చెందాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన చోట నుంచి లారీని పక్కకు తొలగించకుండా అడ్డుకున్నారు. ట్రాన్స్‌కో ఏఈ షెక్షావలి సంఘటనా స్థలానికి రావాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల డిమాండ్‌తో లైన్‌మెన్ సంఘటనా స్థలానికి వచ్చాడు. తాము పలుమార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ తీగలు సరిచేయకుండా నిర్లక్ష్యం చేయడంతో నేడు ఒక ప్రాణం బలైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment