కరెంట్ కట్...కట
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని పలు పంచాయతీలు చీకట్లోకి వెళ్లిపోతున్నాయి. విద్యుత్ బిల్లులు పేరుకుపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కట్ చేస్తున్నారు. దీంతో జిల్లాలోని 52 పంచాయతీల్లో వీధిదీపాలకు సరఫరా నిలిపివేయగా, మరికొన్ని మైనర్ పంచాయతీ కార్యాలయాలకు కూడా సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పటికే బకాయిలు చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చామని, అయితే జిల్లా పంచాయతీ అధికారుల నుంచి కూడా స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో గ్రామ పంచాయతీల నుంచి విద్యుత్ శాఖకు రూ.53 కోట్లకుపైగా బకాయిలున్నాయి. మొత్తం జిల్లాలో 1045 గ్రామ పంచాయతీలున్నాయి. వాటిలో 905 మైనర్ పంచాయతీలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. మైనర్ పంచాయతీల నుంచి రూ.33 కోట్లు, 53 మేజర్ పంచాయతీల నుంచి రూ.20 కోట్లు మేర విద్యుత్ బిల్లులు రావల్సి ఉంది. ఇటీవల 13వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయితీలకు రావడంతో రూ.3 కోట్లు ఆ నిధుల నుంచి విద్యుత్ శాఖకు పలు పంచాయతీలు చెల్లించాయి.
మొత్తం బకాయిలు 53 కోట్లుంటే అందులో కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడంతో ఇంకా బకాయిలు రూ.50 కోట్లు బకాయిగానే మిగిలిపోయాయి. గత ఏడాది జూన్ వరకూ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులు నిలిచిపోయాయి. దీంతో ట్రాన్స్‌కో కూడా చూసీచూడనట్లు వ్యవహరించింది. తాజాగా 13వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడంతో రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ జిల్లా అధికారులు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు.
దీంతో పంచాయతీరాజ్ అధికారులు ముందు విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. దీంతో మూడు కోట్ల రూపాయల వరకూ వసూలయ్యాయి. కనీసం 50 శాతం బకాయిలైనా వసూలు చేయాలని విద్యుత్ శాఖ అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయి.కొన్ని పంచాయతీలు వచ్చి న నిధులను పెండింగ్‌లో ఉన్న ఇతర బిల్లులు చెల్లించడానికి ప్రాధాన్యతనివ్వడంతో ట్రాన్స్‌కో బకాయిలు వసూలు కాలేదు. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు చెల్లించని 52 గ్రామ పంచాయితీలకు వీధిదీపాలు నిలిపివేశారు.