Department of Energy officials
-
ఎడాపెడా కోతలు
దానవాయిపేట (రాజమహేంద్రవరం) / కాకినాడ సిటీ : రాష్ర్ట విభజనానంతరం మిగులు విద్యుత్ ఉండ డంతో విద్యుత్ కోతలు ఉండవని ప్రభుత్వం చెప్పిన మాటలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒకపక్క ఎండల తీవ్రత పెరిగిన తరుణంలో శుక్రవారం ఎడాపెడా అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కరెంట్ కోతలు లేవని అధికారులు చెబుతున్నా ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు వార్షిక తనిఖీల పేరుతో గంటల తరబడి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. రాజమహేంద్రవరంలో కొన్ని రోజులుగా విద్యుత్ శాఖ అధికారులు ఆయా సబ్స్టేషన్ల పరిధిలో వార్షిక మరమ్మతులు నిర్వహించి సుమారు మూడు నాలుగు గంటల పాటు విద్యు త్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. బయటి కొస్తే ఎండ వేడి.. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో సతమతమవుతున్నారు. మరోపక్క జిల్లా కేంద్రం కాకినాడలోని పలు ప్రాంతాల్లో కూడా శుక్రవారం సాయంత్రం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. వేసవి ఉష్ణోగ్రత పెరగడంతో ట్రాన్స్ఫార్మర్ల వద్ద అంతరాయాలు ఏర్పడడంతో గాంధీనగర్, రామారావుపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కొద్దిసేపు నిలిచిపోయింది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
ఆరు లైన్ల హైవే
♦ హైదరాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణకు కసరత్తు ♦ పునరావాసం, తరలింపునకే రూ.140 కోట్లకు పైగా వ్యయం ♦ రివైజ్డ్ ప్రతిపాదనల్లో అధికార యంత్రాంగం ♦ బ్రిడ్జి నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించిన హైవే చీఫ్ ఇంజినీర్ సాక్షి, విజయవాడ : నగర పరిధిలోని హైదరాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణకు కసరత్తు మొదలైంది. విజయవాడ రాజధానిగా మారిన క్రమంలో ట్రాఫిక్ రద్దీ రెట్టింపయింది. నగరంలోని రహదారులను ఇప్పటికే కొంత మేరకు విస్తరించినా, నగర ప్రవేశ ప్రాంతాల్లో మాత్రం రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. దీంతో కనకదుర్గ ఫ్లైఓవర్‌కు అనుసంధానంగా జాతీయ రహదారిని కూడా విస్తరించాలని నిర్ణయించారు. కోట్లాది రూపాయల విలువైన విద్యుత్ లైన్ మార్చడం మొదలు రెండు సబ్ స్టేషన్లు కూడా తొలగించాల్సి రావటం ఇబ్బందికరంగా మారింది. విజయవాడ నగరానికి బయటి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రద్దీ బాగా పెరగడంతో తరచూ ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఈ క్రమంలో కనకదుర్గ దేవస్థానం సమీపంలో బ్రిడ్జినిర్మిస్తే ట్రాఫిక్ తీవ్రత కొంత తగ్గుతుందని భావిం చారు. దీనికి అనుగుణంగా ఆర్అండ్బీ జాతీయ రహదారుల విభాగం అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలను సిద్ధం చేసి జాతీయ రహదారుల శాఖకు పంపడంతో ఆమోదముద్ర వేసింది. రూ.427 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం, రహదారుల విస్తరణ పనులు నిర్వహించనుంది. ఈ క్రమంలో జాతీయ రహదారుల శాఖ మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తిచేయనుంది. 1850 మీటర్ల పొడవున 50 పిల్లర్లతో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. కుమ్మరిపాలెం సెంటర్ దాటిన తర్వాత లారీ స్టాండ్ నుంచి రాజీవ్ గాంధీ పార్క్ వరకు బ్రిడ్జి నిర్మించనున్నారు. వచ్చే ఏడాది కల్లా దీనిని పూర్తి చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో బిడ్జ్రితో పాటు హైదరాబాద్ వెళ్లే వైపు 220 మీటర్లు, విజయవాడ వైపు 220 మీటర్ల అప్రోచ్ రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించడం తదితర పనులు నిర్వహించనున్నారు. ఫ్లైవోవర్ నిర్మాణం నేపథ్యంలో 28 వేల చదరపు మీటర్ల మేర స్థల సేకరణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆక్రమణల తొలగింపు బాధ్యతను నగరపాలక సంస్థ, ఆర్ అండ్ బీ అధికారులు పర్యవేక్షించనున్నారు. విద్యుత్ శాఖ అధికారులు రోడ్లపై ఉన్న లైన్లను తొలగించడంతోపాటు, ఈ మార్గంలోని రెండు సబ్స్టేషన్ల మార్పు తదితర పనులు నిర్వహించనున్నారు. జలవనరుల శాఖ ఇరిగేషన్ కాలవలకు ఇబ్బంది లేకుండా అవసరమైన సహకారం అందించనుంది. ఈ క్రమంలో వచ్చే నెలలో పనులు ప్రారంభమగానే ఆయా శాఖలు పనులతో పాటు ఆక్రమణల తొలగింపు చేపట్టాల్సి ఉంది. రూ.140 కోట్లకు పైనే ఖర్చు జాతీయ రహదారి పక్కనున్న ఆక్రమణల తొలగింపు, విద్యుత్ లైన్ల మార్పు తదితర పనులు నిర్వహణకు సుమారు రూ.140 కోట్లకు పైగా ఖర్చు అవుతందని అంచనా వేశారు. ముఖ్యంగా వెయ్యికిపైగా చిరువ్యాపారుల దుకాణాలు, రోడ్డు మార్జిన్‌లోని వందలాది ఇళ్లను తొలగించాల్సి ఉంది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. విద్యుత్ లైన్ల మార్పునకు రూ.6.1 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. రెండు సబ్స్టేషన్లను తరలించేందుకు రూ.35 కోట్ల ఖర్చవుతుందని ట్రాన్స్‌కో అంచనా వేసిప్రతి పాదనలు పంపింది. అయితే అంచనాలు ఎక్కువగా ఉన్నాయని 30 నుంచి 40 శాతం తగ్గించి పంపించాలని ఆదేశాలు అందాయి. పునరావాసానికి కూడా తక్కువ ఖర్చు చేస్తేనే ప్రాజెక్ట్‌కు కేటాయించిన నిధులు సరిపోతాయన్న అభిప్రాయం జాతీయ రహదారుల విభాగం అధికారులు వ్యక్తంచేస్తున్నారు. -
దిగులు లేదిక.. కరెంట్ పోదిక !
♦ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ♦ జనవరి వరకు సమస్యే ఉండదు ♦ యూనిట్ అదనపు ఉత్పత్తి లేకున్నా మిగులు విద్యుత్ ♦ ఆరు నెలల్లో మారిన పరిస్థితులు ♦ వచ్చే మార్చిలో స్వల్ప లోటు ♦ డిమాండు, లభ్యతపై విద్యుత్ శాఖ అధికారుల అంచనాలు సాక్షి, హైదరాబాద్: ఎడాపెడా విద్యుత్ కోతలు.. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు.. వ్యవసాయానికి మూడు గంటలే విద్యుత్.. అదీ రెండు మూడు విడతల్లో... ఆర్నెల్ల కిందటి వరకు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉండేది. అయితే ఆర్నెల్లు తిరిగే సరికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ కోతలు లేవు! ప్రస్తుతం రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. గరిష్టంగా రోజుకు 165 మిలియన్ యూనిట్ల(ఎంయూ) సరఫరా సామర్థ్యం కలిగి ఉన్నా..ప్రస్తుతం డిమాండు 130 ఎంయూలకు మించడం లేదు. నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజెక్టులు పూర్తయితే 2016 నాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత వుండదని, 2018 నాటికి తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. నూతన రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలోనే.. అదీ కొత్త ప్రాజెక్టుల నుంచి ఒక్క యూనిట్ రాకున్నా రాష్ట్రం ‘మిగులు విద్యుత్’ మైలురాయిని అందుకుంది. 2015 జూన్ నుంచి 2016 మార్చి వరకు రాష్ట్రంలో విద్యుత్ డిమాండు, లభ్యతపై తాజాగా విద్యుత్ సంస్థలు రూపొందించిన అంచనాలు ఇదే అంశాన్ని పేర్కొంటున్నాయి. ఈ అంచనాల ప్రకారం వచ్చే జనవరి వరకు రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కొరత వుండదు. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్వల్పంగా కొరత ఏర్పడవచ్చు. మిగులు విద్యుత్‌పై ధీమా.. సొంత ఉత్పత్తి, కేంద్ర ఉత్పత్తి సంస్థలు (సీజీఎస్), పీపీఏల ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 5,500 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉంది. అందులో 1,980 మెగావాట్లను ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తుండగా, మరో 1,200 మెగావాట్ల కొనుగోళ్లకు సంబంధించి ఆర్డర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎన్టీపీసీ ఝజ్జర్ ప్లాంట్ నుంచి 150, కేంద్ర విద్యుత్ సంస్థల ద్వారా 290, గాయత్రి థర్మల్ పవర్ నుంచి 810 మెగావాట్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయగలమని విద్యుత్ సంస్థలు ధీమాతో వున్నాయి. గత ఖరీఫ్‌లో వ్యవసాయానికి సరిగా విద్యుత్ సరఫరా చేయలేకపోయినా, రానున్న ఖరీఫ్‌లో మాత్రం ఏడు గంటల విద్యుత్ ఇస్తామని అధికారులు ధీమాతో వున్నారు. కాగా, గతేడాది డిమాండుతో పోల్చితే ఈ ఏడాది 8 శాతం పెరుగుదల ఉంటుందన్న భావనతో విద్యుత్ సంస్థలు తాజాగా ఓ అంచనాను తయారు చేశాయి. -
విజి‘లెన్స్’ గుబులు
విద్యుత్ శాఖ అధికారుల వసూళ్లు.. వేధింపులవిద్యుత్ శాఖ అధికారుల వసూళ్లు జిల్లావ్యాప్తంగా ఆరు బృందాల ఏర్పాటు బి.కొత్తకోట: విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది గుండెల్లో ట్రాన్స్‌కో విజిలెన్స్ బృందాలు గుబులు పుట్టిస్తున్నాయి. కనెక్షన్ల మంజూరుకోసం వినియోగదారుల నుంచి మామూళ్ల వసూళ్లు, లేదంటే కారణాలు లేకుండా సర్వీసులు మంజూరు చేయకపోవడం లాంటి కారణాలతో ఇబ్బందులకు గురిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించేందుకు జిల్లా ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం రహస్య విచారణ ప్రారంభించింది. దీనికోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది. జిల్లాలో 25 డిస్కం సబ్డివిజన్ల పరిధిలో కాల్ సెంటర్లు నడుస్తున్నాయి. వ్యవసాయ, వాణిజ్య, గృహ విద్యుత్ కనెక్షన్ల కోసం వినియోగదారులు ఇక్కడ దరఖాస్తులు చేసుకోవాలి. దీనిపై సంబంధిత సబ్డివిజన్ల పరిధిలోని అధికారులు కనెక్షన్ల మంజూరుకు చర్యలు తీసుకొవాలి. అయితే వీటీ మంజూరులో పలు ఆరోపణలు వచ్చాయి. నిబంధనల మేరకు ఎవరికి ఎప్పుడు కనెక్షన్ ఇవ్వాలి. దరఖాస్తుదారుడు ఎప్పుడు దరఖాస్తు చేశాడు. ఎప్పుడు సర్వీసు ఇచ్చారు. లేదా ఇవ్వలేదా అనే అంశాలపై ముఖ్యంగా విచారిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీసును సీనియారిటీ ప్రకారం కాకుండా ముందుగానే కనెక్షన్ ఇవ్వడంపై దృష్టిపెడతారు. ఇదిలావుంటే రైతులకు ఇవ్వాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సర్వీసులను సీనియారిటీ ప్రకారం మంజూరు చేశారా, దీనికోసం రైతులనుంచి మామూళ్లు వసూలు చేశారా అన్నదానిపై ప్రధానంగా దృష్టిసారించారు. ఈ వ్యవహారాల్లో ఎవరెవరు అవినీతికి పాల్పడి నిబంధనలు ఉల్లఘించారన్నది తేల్చనున్నారు. సీనియారిటీ ఉన్నా ఇంతవరకూ కనెక్షన్లు మంజూరుకాని వినియోగదారుల పరిస్థితిపై ప్రత్యేకంగా పరిశీలిస్తారు. వీరికి కనెక్షన్లు ఇవ్వకపోవడానికి మామూళ్లు చె ల్లించకపోవడం కారణమా లేక ఇంకేమైనా ఉందా అన్నదానిపై వివరాలు సేకరిస్తారు. ఆరు బృందాలు ఈ వ్యవహారాలను నిగ్గుతేల్చేందుకు ట్రాన్స్‌కో పోలీసు బృందాలు జిల్లా వ్యాప్తంగా విచారణ ప్రారంభించాయి. ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో ఒక బృందంగా మొత్తం ఆరుబృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలోనే పర్యటిస్తాయి. రైతులు, వినియోగదారుల వద్దకే వెళ్లి వివరాలు సేకరిస్తాయి. ఈ బృందాలు ఎక్కడ పర్యటిస్తాయి.. ఎవరి నుంచి వివరాలు సేకరిస్తాయి.. అన్నది పూర్తి రహస్యంగా సాగుతుంది. కాల్ సెంటర్ల నుంచి తీసుకున్న సమాచారంతో ఒక్కో మండల పరిధిలో కొందరు రైతులు, వినియోగదారులను ఎంపిక చేసుకుని వారి వద్దకే వెళ్తాయి. అధికారుల్లో గుబులు ట్రాన్స్‌కో విజిలెన్స్ పోలీసు బృందాల విచారణ ప్రారంభం కావడంతో డిస్కం అధికారులు, సిబ్బందిలో ఆందోళన కనిపిస్తోంది. చాలాచోట్ల వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరు వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. దరఖాస్తు చేసుకొన్న నెలల తరబడి కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు అందని రైతులు ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తే ఇబ్బందులని కొందరిలో ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది. సీవీవోకు నివేదిక జిల్లాలో రహస్యంగా నిర్వహించే విచారణ నివేదికను చీఫ్ విజిలెన్స్ అధికారికి నివేదిస్తాం. ఎంపిక చేసిన వినియోగదారుల నుంచి సేకరించే వివరాలతో ఆయా ప్రాంతాలకు చెందిన సిబ్బంది, అధికారుల ప్రమేయం, అవినీతిపై సమగ్ర నివేదికను సిద్ధంచేసి సీవీవోకు పంపనున్నాం. విచారణలో అంతా రహస్యంగానే వ్యవహరిస్తున్నాం. బృందాలు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియనివ్వం. -పి.సురేష్‌కుమార్, ట్రాన్స్‌కో విజిలెన్స్ సీఐ, తిరుపతి -
కరెంట్ కట్...కట
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని పలు పంచాయతీలు చీకట్లోకి వెళ్లిపోతున్నాయి. విద్యుత్ బిల్లులు పేరుకుపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కట్ చేస్తున్నారు. దీంతో జిల్లాలోని 52 పంచాయతీల్లో వీధిదీపాలకు సరఫరా నిలిపివేయగా, మరికొన్ని మైనర్ పంచాయతీ కార్యాలయాలకు కూడా సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పటికే బకాయిలు చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చామని, అయితే జిల్లా పంచాయతీ అధికారుల నుంచి కూడా స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీల నుంచి విద్యుత్ శాఖకు రూ.53 కోట్లకుపైగా బకాయిలున్నాయి. మొత్తం జిల్లాలో 1045 గ్రామ పంచాయతీలున్నాయి. వాటిలో 905 మైనర్ పంచాయతీలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. మైనర్ పంచాయతీల నుంచి రూ.33 కోట్లు, 53 మేజర్ పంచాయతీల నుంచి రూ.20 కోట్లు మేర విద్యుత్ బిల్లులు రావల్సి ఉంది. ఇటీవల 13వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయితీలకు రావడంతో రూ.3 కోట్లు ఆ నిధుల నుంచి విద్యుత్ శాఖకు పలు పంచాయతీలు చెల్లించాయి. మొత్తం బకాయిలు 53 కోట్లుంటే అందులో కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడంతో ఇంకా బకాయిలు రూ.50 కోట్లు బకాయిగానే మిగిలిపోయాయి. గత ఏడాది జూన్ వరకూ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులు నిలిచిపోయాయి. దీంతో ట్రాన్స్‌కో కూడా చూసీచూడనట్లు వ్యవహరించింది. తాజాగా 13వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడంతో రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ జిల్లా అధికారులు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో పంచాయతీరాజ్ అధికారులు ముందు విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. దీంతో మూడు కోట్ల రూపాయల వరకూ వసూలయ్యాయి. కనీసం 50 శాతం బకాయిలైనా వసూలు చేయాలని విద్యుత్ శాఖ అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయి.కొన్ని పంచాయతీలు వచ్చి న నిధులను పెండింగ్‌లో ఉన్న ఇతర బిల్లులు చెల్లించడానికి ప్రాధాన్యతనివ్వడంతో ట్రాన్స్‌కో బకాయిలు వసూలు కాలేదు. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు చెల్లించని 52 గ్రామ పంచాయితీలకు వీధిదీపాలు నిలిపివేశారు.