విజి‘లెన్స్’ గుబులు
విద్యుత్ శాఖ అధికారుల వసూళ్లు.. వేధింపులవిద్యుత్ శాఖ అధికారుల వసూళ్లు
జిల్లావ్యాప్తంగా ఆరు బృందాల ఏర్పాటు
బి.కొత్తకోట: విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది గుండెల్లో ట్రాన్స్‌కో విజిలెన్స్ బృందాలు గుబులు పుట్టిస్తున్నాయి. కనెక్షన్ల మంజూరుకోసం వినియోగదారుల నుంచి మామూళ్ల వసూళ్లు, లేదంటే కారణాలు లేకుండా సర్వీసులు మంజూరు చేయకపోవడం లాంటి కారణాలతో ఇబ్బందులకు గురిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించేందుకు జిల్లా ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం రహస్య విచారణ ప్రారంభించింది. దీనికోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది.
జిల్లాలో 25 డిస్కం సబ్‌డివిజన్ల పరిధిలో కాల్ సెంటర్లు నడుస్తున్నాయి. వ్యవసాయ, వాణిజ్య, గృహ విద్యుత్ కనెక్షన్ల కోసం వినియోగదారులు ఇక్కడ దరఖాస్తులు చేసుకోవాలి. దీనిపై సంబంధిత సబ్‌డివిజన్ల పరిధిలోని అధికారులు కనెక్షన్ల మంజూరుకు చర్యలు తీసుకొవాలి. అయితే వీటీ మంజూరులో పలు ఆరోపణలు వచ్చాయి. నిబంధనల మేరకు ఎవరికి ఎప్పుడు కనెక్షన్ ఇవ్వాలి. దరఖాస్తుదారుడు ఎప్పుడు దరఖాస్తు చేశాడు. ఎప్పుడు సర్వీసు ఇచ్చారు. లేదా ఇవ్వలేదా అనే అంశాలపై ముఖ్యంగా విచారిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీసును సీనియారిటీ ప్రకారం కాకుండా ముందుగానే కనెక్షన్ ఇవ్వడంపై దృష్టిపెడతారు. ఇదిలావుంటే రైతులకు ఇవ్వాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ సర్వీసులను సీనియారిటీ ప్రకారం మంజూరు చేశారా, దీనికోసం రైతులనుంచి మామూళ్లు వసూలు చేశారా అన్నదానిపై ప్రధానంగా దృష్టిసారించారు. ఈ వ్యవహారాల్లో ఎవరెవరు అవినీతికి పాల్పడి నిబంధనలు ఉల్లఘించారన్నది తేల్చనున్నారు. సీనియారిటీ ఉన్నా ఇంతవరకూ కనెక్షన్లు మంజూరుకాని వినియోగదారుల పరిస్థితిపై ప్రత్యేకంగా పరిశీలిస్తారు. వీరికి కనెక్షన్లు ఇవ్వకపోవడానికి మామూళ్లు చె ల్లించకపోవడం కారణమా లేక ఇంకేమైనా ఉందా అన్నదానిపై వివరాలు సేకరిస్తారు.
ఆరు బృందాలు
ఈ వ్యవహారాలను నిగ్గుతేల్చేందుకు ట్రాన్స్‌కో పోలీసు బృందాలు జిల్లా వ్యాప్తంగా విచారణ ప్రారంభించాయి. ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో ఒక బృందంగా మొత్తం ఆరుబృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలోనే పర్యటిస్తాయి. రైతులు, వినియోగదారుల వద్దకే వెళ్లి వివరాలు సేకరిస్తాయి. ఈ బృందాలు ఎక్కడ పర్యటిస్తాయి.. ఎవరి నుంచి వివరాలు సేకరిస్తాయి.. అన్నది పూర్తి రహస్యంగా సాగుతుంది. కాల్ సెంటర్ల నుంచి తీసుకున్న సమాచారంతో ఒక్కో మండల పరిధిలో కొందరు రైతులు, వినియోగదారులను ఎంపిక చేసుకుని వారి వద్దకే వెళ్తాయి.
అధికారుల్లో గుబులు
ట్రాన్స్‌కో విజిలెన్స్ పోలీసు బృందాల విచారణ ప్రారంభం కావడంతో డిస్కం అధికారులు, సిబ్బందిలో ఆందోళన కనిపిస్తోంది. చాలాచోట్ల వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. దరఖాస్తు చేసుకొన్న నెలల తరబడి కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు అందని రైతులు ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తే ఇబ్బందులని కొందరిలో ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది.
సీవీవోకు నివేదిక
జిల్లాలో రహస్యంగా నిర్వహించే విచారణ నివేదికను చీఫ్ విజిలెన్స్ అధికారికి నివేదిస్తాం. ఎంపిక చేసిన వినియోగదారుల నుంచి సేకరించే వివరాలతో ఆయా ప్రాంతాలకు చెందిన సిబ్బంది, అధికారుల ప్రమేయం, అవినీతిపై సమగ్ర నివేదికను సిద్ధంచేసి సీవీవోకు పంపనున్నాం. విచారణలో అంతా రహస్యంగానే వ్యవహరిస్తున్నాం. బృందాలు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియనివ్వం.
-పి.సురేష్‌కుమార్, ట్రాన్స్‌కో విజిలెన్స్ సీఐ, తిరుపతి