విద్యుత్ విజిలెన్స్ అధికారుల దాడులు
-
211 మందిపై కేసుల నమోద
-
రూ.14.13 లక్షల జరిమానా విధింపు
నెల్లూరు(అర్బన్) :
ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు జిల్లాలో అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై శనివారం మెరుపుదాడులు చేశారు. కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల విజిలెన్స్ అధికారులు బృందాలుగా విడిపోయి కావలి, నెల్లూరు, కోట, వెంకటగిరి, నార్తురాజుపాళెం, కోవూరు తదితర ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేశారు. సాయంత్రం నగరంలోని విద్యుత్ భవన్‌లో ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ ఎస్‌ఈ వి.రవి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అదనపు లోడ్‌ను వినియోగిస్తున్న 171 మంది, గృహ విద్యుత్ కనెక‌్షన్ పేరుతో వ్యాపారానికి వాడుతున్న 28 మంది, మీటర్ బైపాస్ చేసి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 7 మంది, బిల్లింగ్ అవకతవకలకు పాల్పడుతున్న ఒక్కరి మీద కలిపి మొత్తం 211 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. వీరికి రూ.14.13 లక్షలు జరిమానా విధించి వసూలు చేశామన్నారు. కావలి, నెల్లూరు, కోవూరు ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యానికి ఎక్కువ మంది పాల్పడుతున్నారని తెలిపారు. మొదటి సారి జరిమానా వేసి వదిలి పెట్టామన్నారు. రెండో సారి కూడా దొరికితే కఠినమైన కేసులు పెట్టి కోర్టుకు పంపిస్తామని హెచ్చరించారు. 8 జిల్లాల్లో గత నెలలోనే జరిమానా ద్వారా రూ.2.95 కోట్లు వసూలు చేశామని తెలిపారు. ఎస్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ అధికారి, అడిషనల్ ఎస్పీ పి.మనోహర్, నెల్లూరు విజిలెన్స్ సీఐ నాగేశ్వరి, జిల్లా విద్యుత్ విజిలెన్స్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.