ఎడాపెడా కోతలు
దానవాయిపేట (రాజమహేంద్రవరం) / కాకినాడ సిటీ : రాష్ర్ట విభజనానంతరం మిగులు విద్యుత్ ఉండ డంతో విద్యుత్ కోతలు ఉండవని ప్రభుత్వం చెప్పిన మాటలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒకపక్క ఎండల తీవ్రత పెరిగిన తరుణంలో శుక్రవారం ఎడాపెడా అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కరెంట్ కోతలు లేవని అధికారులు చెబుతున్నా ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు వార్షిక తనిఖీల పేరుతో గంటల తరబడి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు.
రాజమహేంద్రవరంలో కొన్ని రోజులుగా విద్యుత్ శాఖ అధికారులు ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో వార్షిక మరమ్మతులు నిర్వహించి సుమారు మూడు నాలుగు గంటల పాటు విద్యు త్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. బయటి కొస్తే ఎండ వేడి.. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో సతమతమవుతున్నారు. మరోపక్క జిల్లా కేంద్రం కాకినాడలోని పలు ప్రాంతాల్లో కూడా శుక్రవారం సాయంత్రం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది.
వేసవి ఉష్ణోగ్రత పెరగడంతో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అంతరాయాలు ఏర్పడడంతో గాంధీనగర్, రామారావుపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కొద్దిసేపు నిలిచిపోయింది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.