రైతులను ఆగం చేస్తున్న ‘కరెంట్’
బాల్కొండ:బాల్కొండ మండలంలో సాగుకు నాలుగు ఫీడర్లలో విద్యుత్ సరఫరా చేసే అధికారులు గత రెండు రోజుల నుంచి ఏ ఫీడర్‌కు ఎప్పుడు సరఫరా ఉంటుందో చెప్ప లేమంటున్నారు. ఉదయం ఉన్నతాధికారుల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకైనా విద్యుత్ సరఫరా చేపట్టవచ్చంటున్నారు. దీంతో రైతులు పంట భూముల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది.
ఒక్క ఫీడర్‌కు ఏడు గంటల విద్యుత్ కూడా సరఫరా చేస్తున్నారు. ఆరు గంటలు కూడా నిరంతరం సరఫరా చేస్తున్నారు. కానీ ఎప్పుడిస్తారో, ఇవ్వరో తెలియదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇలా ట్రాన్స్‌కో అధికారులు రైతుల బతుకులను ఆగం చేస్తున్నారు.
రబీ పంటలు సాగు చేయడంలో రైతులు నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా జొన్న పంటను అధికంగా సాగు చేస్తున్నారు. ఏ, బీ, సీ, డీ గ్రూపుల్లో సాగుకు విద్యుత్ సరఫరా చేసిన అధికారులు ప్రస్తుతం ఏ గ్రూపునకు సరఫరా ఎప్పుడు ఉంటుందో చెప్పలేక పోతున్నారు. రైతులు మాత్రం విద్యుత్ ఎప్పుడు వస్తుందోనని విద్యుత్ డబ్బాల వద్ద రాత్రి, పగలు కాపలా కాస్తున్నారు. వెన్ను వణికే చలిలో కూడా పంట భూముల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. విద్యుత్ వస్తే మాత్రం నిరంతరంగా 5 నుంచి ఆరు గంటల సరఫరా చేస్తున్నారని అంటున్నారు. కోతలప్పుడు వేళాపాల లేకుండా కోతలు విధించారు. కానీ నిరంతరం సరఫరా చేస్తున్నప్పుడు కూడా వేళాపాల లేకుండా చేయడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి విద్యుత్‌కు గంట బోనస్..!
రాత్రి విద్యుత్‌కు గంట విద్యుత్‌ను బోనస్‌గా ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా సరఫరా చేస్తున్నారు. రాత్రి విద్యుత్‌కు వెళితే గంట విద్యుత్ కలిసొస్తుందని రైతులు చలిని కూడా లెక్క చేయకుండా వెళుతున్నారు. నాణ్యమైన విద్యుత్ అంటే వేళాపాల లేని సరఫరా అని రైతులు విమర్శిస్తున్నారు.
ఆరు తడి పంటలు సాగు చేస్తున్న ప్రాంతాల్లో మూడు ఫీడర్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఫీడర్‌కు 4 గంటల విద్యుత్ నిరంతరం సరఫరా చేస్తే సరిపోతుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ సరఫరా తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.