విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి
దుబ్బాక : విద్యుత్ షాక్ తగిలి ఒకే రోజు మండలంలో ఇద్దరు మృతి చెందడంతో ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన దుబ్బాక పట్టణంలో సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ సుభాష్ గౌడ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాకకు చెందిన రైతు బట్టు మల్లేశం(30) ఉదయం తన పొలం వద్దకు వెళ్లి పశువులకు నీళ్లు తాపుదామని చూడగానే, బోరు మోటరు నడవ లేదని తెలిపారు.
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ సతాయించడంతో బోరుమోటరు నడవలేదని గ‍్రహించిన మల్లేశం ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి బాగు చేస్తున్న తరుణంలో ఒక్క సారిగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటిన దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతినికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతిని భార్య బట్టు భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టమ్ నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పట్టణ ప్రజలు కోరారు.
మండలంలోని ఆరెపల్లిలో విద్యుత్ షాక్‌తగిలి మహిళమృతి
మండలంలోని ఆరెపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన సంఘటన దుబ్బాక మండలం ఆరెపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ సుభాష్ గౌడ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆరెపల్లి గ్రామానికి చెందిన దాసర్ల సావిత్రి(50) తన ఇంటి వద్ద ఉన్న విద్యుత్ స్థంభం నుండి ఇంటికి సరాఫరా అవుతున్న విద్యుత్ వైరుకు ఇనుప(జే)వైరు ఉందని తెలిపారు.
ఇంటిలోకి సరాఫరా అవుతున్న విద్యుత్ వైరుకు జే వైరు ఉండడం వలన జే వైరుకు విద్యుత్ సరాఫరా కావడంతో సావిత్రికి విద్యుత్ వైరు తగలడం వలన విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మొదటగా సావిత్రి తల్లి ఎల్లవ్వకు విద్యుత్ షాక్ తగలడంతో తన తల్లిని దూరంగా పంపించింది. తల్లిని పంపిస్తున్న తరుణంలో విద్యుత్ వైరు సావిత్రికి తగిలి షాక్‌కు గురై మృతి చెందింది. ఎల్లవ్వకు స్వల్ప గాయాలయ్యాయి. తన కూతురు కళ్ల ఎదుట మరణించడంతో ఆవృద్ద తల్లి గుండెలవిసేలా రోధించింది. గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలు భర్త రాంచంద్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత దేహాన్ని ఫోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.