జాతీయ ఆహార భద్రతా మిషన్‌లో భాగంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని, వినియోగాన్ని పెంపొందించడం ద్వారా పోషకాహార లోపాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ‘మిల్లెట్ మిషన్’ను 2018–19 నుంచి అమల్లోకి తెస్తున్నది. ఐదేళ్లలో రూ. 1,700 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. తొలి ఏడాదిలో రూ. 300 కోట్లు కేటాయించారు. చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల వరకు నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్.) సంచాలకులు డా. విలాస్ ఎ. తొనపి వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 13 రాష్ట్రాల్లో తొలుత మిల్లెట్ మిషన్ ఈ ఖరీఫ్ నుంచే అమల్లోకి వస్తుందని ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యాంశాలు..
► ‘మిల్లెట్ మిషన్’ విశేషాలేమిటి?
హరిత విప్లవ కాలంలో వరి, గోధుమల సాగుపై దృష్టి కేంద్రీకరించడంతో పోషకాల గనులైన చిరుధాన్యాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల్లో పౌష్టికాహార లోపం ఏర్పడడంతోపాటు జీవన శైలి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిని కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మిల్లెట్ మిషన్ అమలుకు తొలి అడుగు పడింది. తొలుత 13 రాష్ట్రాల్లో మిల్లెట్ మిషన్‌ను ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి తెస్తున్నాం. ఐదేళ్లలో రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తాం. 2018–19లో రూ. 300 ఖర్చు చేయనున్నాం.
► చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు..?
జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు వంటి చిరుధాన్యాలను సాగు చేసే రైతులతో క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తాం. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ, నాబార్డు, ఐ.ఐ.ఎం.ఆర్. బాధ్యులతో కూడిన వర్కింగ్ గ్రూప్ మిల్లెట్ మిషన్ అమలును పర్యవేక్షిస్తుంది. 2018–19 ఖరీఫ్ సీజన్ నుంచే చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల వరకు నేరుగా నగదు బదిలీ చేస్తాం. చిరుధాన్యాల ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో అత్యధికంగా చిరుధాన్యాలను సాగు చేస్తున్నది మన దేశమే. దేశంలో 1.7 కోట్ల హెక్టార్లలో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. 1.8 కోట్ల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. ప్రతి సంవత్సరం పది శాతం సాగు పెంచాలన్నది లక్ష్యం.
► ప్రోత్సాహకాలు రైతులకా.. రైతు బృందాలకా?
రైతులకు వ్యక్తిగతంగా కాదు. చిరుధాన్యాలు పండించే రైతుల ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్.పి.ఓ.) ద్వారా అందిస్తాం. నాబార్డు ద్వారా ఎఫ్.పి.ఓ.లను ఏర్పాటు చేస్తాం. ఎఫ్.పి.ఓ.లను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చును కూడా మిల్లెట్ మిషన్ నిధుల నుంచి కేటాయిస్తాం. తెలంగాణా రాష్ట్రంలో 8 జిల్లాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సాహానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక జిల్లాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యంగా చిన్న చిరుధాన్యాలైన కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, ఒరిగల సాగును విలేజ్ క్లస్టర్ల ద్వారా ప్రోత్సహించడం.. స్థానికంగానే వినియోగంలోకి తేవడానికి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారిస్తున్నాం. స్వయం సహాయక బృందాల ద్వారా 100 మిల్లెట్ ప్రాసెసింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. ఎఫ్.పి.ఓ.లు కొన్నిటిని కలిపి ఫెడరేషన్‌గా ఏర్పాటు చేస్తాం.
► విత్తనం కోసం ఎవరిని సంప్రదించాలి?
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (డా.రఘునా«ద్: 99842 15020, డా. వెంకటేష్ భట్: 94406 44040)లో, నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (డా. సుబ్బారావు: 99896 25227), విజయనగరంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం(డా. పాత్రో: 97010 23194) చిరుధాన్య విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
► ప్రాసెసింగ్ యంత్రాలపై సబ్సిడీ ఇస్తారా?
పౌష్టికాహార లోపం, జీవనశైలి వ్యాధుల బెడద ప్రస్తుతం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంత వాసుల్లో కూడా అధికంగానే ఉన్నాయి. అందువల్ల చిరుధాన్యాల వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా పెంచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు సాగు చేసిన చిరుధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించి స్థానికంగానే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తాయి. రైతుల పొలాల దగ్గరలోనే ప్రాథమిక స్థాయి ప్రాసెసింగ్ సదుపాయాలను అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. ఎఫ్.పి.ఓ.లకు ప్రాసెసింగ్ మిషన్లను సబ్సిడీపై అందిస్తాం. చిరుధాన్యాలను నిల్వ చేసుకోవడానికి గోదాముల నిర్మాణానికి కూడా తోడ్పాటునందిస్తాం. ప్రభుత్వ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకుంటాం. ప్రస్తుతం ప్రోసెసర్లు చిరుధాన్యాల రైతులను దోపిడీ చేస్తున్నారు. అలా కాకుండా రైతులకు సాగు ఖర్చులకు 50% అదనంగా ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
► చిరుధాన్య ఉత్పత్తులకు ప్రోత్సాహం చర్యలేమిటì ?
హైదరాబాద్‌లోని ఐ.ఐ.ఎం.ఆర్.లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రత్యేక శిక్షణా సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం వివరాలకు డా. దయాకర్‌రావు (99897 10405), డా. సంగప్ప (98800 45728)లను సంప్రదించవచ్చు.
► డాక్టర్ ఖాదర్‌వలి చిరుధాన్యాలకు సిరిధాన్యాలని పేరుపెట్టి.. రోగులకు ఔషధాలుగా ఇచ్చి జబ్బులు నయం చేస్తున్నారు. దీనిపై ఐ.ఐ.ఎం.ఆర్. అభిప్రాయం ఏమిటి.?
అవును. మా దృష్టికి వచ్చింది. డాక్టర్ ఖాదర్ వలి గారు గొప్ప సేవ చేస్తున్నారు. ఆయనను ఆహ్వానించి గౌరవించాలనుకుంటున్నాం. ఆయన అనుసరిస్తున్న చికిత్సా పద్ధతిపై అధ్యయనం చేయించి.. చిరుధాన్యాల వినియోగం వ్యాప్తికి చేపట్టనున్న ప్రచారోద్యమంలో ఈ భావనను అంతర్భాగం చేస్తాం. ఈ కృషిలో ఆయుష్ శాఖ నిపుణుల తోడ్పాటు కూడా తీసుకుంటాం.
(డా. తొనపిని 85018 78645 నంబరులో సంప్రదించవచ్చు. millets.icar@nic.in
director.millets@icar.gov.in)
చిరుధాన్యాల రైతుకు ఎకరానికి రూ.4 వేలు!
Published Tue, May 29 2018 12:32 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment