కాటేస్తున్న కరెంట్
షాబాద్: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి తరచూ జనం మృత్యువాత పడుతున్నారు. ఇటీవల పలువురు కరెంట్ కాటుకు బలైపోయారు. ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద అధికారులు ఆన్‌ఆఫ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యుదాఘాతానికి గురవుతున్నారు. మామూళ్లకు అలవాటుపడిన అధికారులు చేతి తడపనిదే ఏపని చేయడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల కందూకురు మండలంలో ఓ రైతు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంట్ సరఫరా నిలిపి వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే. ఈనెల 3వ తేదిన షాబాద్ మండలం దామర్లపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్య తన ఇంటిపై ఉన్న కట్టెలను ఓ దగ్గర పేర్చుతుండగా పైన ఉన్న కరెంట్ వైర్లు తగిలి మృతి చెందాడు.
పండుగ పూటే ఆ ఇంటి విషాదం చోటుచేసుకుంది. ఇంటికి పెద్దదిక్కు అయిన ఆయన మృతితో కుటుంబం వీధిన ప డింది. తాజాగా మంగళవారం దామర్లపల్లి సర్పంచ్ గట్టుపల్లి జంగయ్య ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా కరెంట్ కాటేసింది. దీంతో అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. విద్యుత్ అధికారుల లోపం స్పష్టంగా ఉండడంతో జనం వారి తీరుపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సర్పంచ్ మృతదేహాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ట్రాన్స్‌కో ఏడీ, ఏఈలపై ఫోన్‌లో మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించకపోతే ఆందోళనలు తప్పవని మండలవాసులు హెచ్చరిస్తున్నారు.