మోసగాళ్ల ముఠా అరెస్ట్
మోసగాళ్ల ముఠా అరెస్ట్
Published Tue, Mar 21 2017 1:41 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
గోపాలపురం: మోసగాళ్ల ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు ఆదేశాల మేరకు గోపాలపురం సీఐ జి.శ్రీనివాస్ సోమవారం ఇక్కడ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 13న గోపాలపురానికి చెందిన వ్యాపారి సు తాపల్లి రామకృష్ణ వద్దకు మేకా త్రినాథ్, దాట్ల రవీంద్ర అనే వ్యక్తులు వచ్చారు. రూ.4 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు ఇస్తే రూ.30 వేలు కలిపి రూ.500 నోట్లు ఇస్తామని రామకృష్ణను నమ్మించారు. వీరి మాటలు నమ్మిన రామకృష్ణ రూ.4 లక్షలు తీసుకువచ్చారు. త్రినాథ్, రవీంద్ర అప్పటికే సిద్ధం చేసిన రూ.4.30 లక్షల విలువైన రూ.500 నోట్ల కట్టలను రామకృష్ణకు ఇచ్చారు. అయితే వీటిలో కొన్ని అసలు నోట్లు, తెల్ల కాగితాలు, చిన్నపిల్లలు ఆడుకునే నోట్లు ఉండటంతో కంగుతిన్న రామకృష్ణ ప్రశ్నించేలోపు వీరు జారుకున్నారు. దీంతో మోసపోయినట్టు గ్రహించిన రామకృష్ణ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేయగా ముఠాలో 13 మంది సభ్యులు ఉన్నట్టు గుర్తించామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇదే తరహాలో భీమోలు రోడ్డు పోలవరం కాలువ వద్ద ముఠా సభ్యులు చర్చించుకుంటుండగా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మేకా త్రినాథ్, కొండే ప్రభాకర్, ఏలేటి చంద్రశేఖర్, మానుకొండ వంశీ, చలసాని వెంకట్, కూరపాటి మధు, పసలపూడి రాజును అరెస్ట్ చేసి రూ. రూ.1.20 లక్షలు, స్కార్పియో కారు, ఇండికా డీఎల్‌ఎస్ కారు, ఆటో, మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఎస్సై యు.లక్ష్మీనారాయణ, హెచ్‌సీలు రాజేం దర్, వైఎస్ సత్యనారాయణ, ఏఎస్సై వై.జయబాబు, ఐటీ పార్టీ సిబ్బంది రాజశేఖర్, మధు, పోశిబాబు, దుర్గారావు, గోవిందు, రాజుకు రివార్డులకోసం ఎస్ఫీకి సిఫార్సు చేస్తామని సీఐ శ్రీనివాస్ చెప్పారు.
Advertisement