శివ శివా ఏమిటీ ఘోరం
శివ శివా ఏమిటీ ఘోరం
Published Fri, Feb 24 2017 11:50 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ ఆందోళన
మహా శివరాత్రి ... ఆ కుటుంబానికి మహా శోకం మిగిల్చిందిఏ కష్టమూ రాకూడదంటూ ప్రార్థించిన ఆ ఇల్లాలి మదిలో మహా కల్లోలమే రేపింది వేకువ జామునే లేచి... నిష్టతో పుష్కర ఘాట్‌కు చేరుకొని గోదారమ్మలో స్నానం చేసిముక్కంటిని మనసారా దర్శనం చేసుకొని తృప్తిగా బయటకు వస్తున్న వారిపై కరెంటు రూపంలో మృత్యువు కాటేసింది... ఇంటి యజమానినే బలి తీసుకుంది... తీరని విషాదం నింపింది...
రాజమహేంద్రవరం క్రైం : శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకొంది. రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కోరుకొండ మండలం శ్రీ రంగపట్నానికి చెందిన గొల్లకోటి రాంబాబు(32) మహాశివరాత్రి సందర్భంగా పుణ్య స్నానం ఆచరించేందుకు శుక్రవారం తెల్లవారు జామున భార్య వరలక్ష్మి, కుమారులు ధర్మ శివ, ఆది ఈశ్వర్, చిన్నాన్నలు గొల్లకోటి నరసింహ మూర్తి, చిన్నాన్న కుమార్తె బాపనమ్మ, పదిమంది కుటుంబ సభ్యులతో రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్‌కు వచ్చారు. ఘాట్‌లో ఉన్న వీరభద్ర స్వామి గుడిలో పూజలు చేసి తిరిగి వస్తున్నారు. కుమారుడిని ఎత్తుకుని వస్తున్న రాంబాబు ఘాట్‌లో ఒక విద్యుత్ పోల్‌ను ముట్టుకోవడంతో కుమారుడు సహా షాక్‌కు గురయ్యారు. గమనించిన అతడి చిన్నాన్న నరసింహమూర్తి అతడి కుమార్తె బాపనమ్మలు రక్షించేందుకు ప్రయత్నించారు. ప్లాస్టిక్ కుర్చీతో రాంబాబును తోసివేయడంతో ఒక్కసారిగా అందరూ కిందపడి పోయారు. ఈ సంఘటనలో షాక్‌కు గురై కొన ఊపిరితో ఉన్న రాంబాబును హాస్పటల్‌కు తరలించాలని భార్య వేడుకున్నా పుష్కర ఘాట్‌లో అంబులెన్స్ సకాలంలో లేకపోవడంతో బాధితుడిని తరలించడంలో జాప్యం జరిగింది. సకాలంలో వైద్యం అందక రాంబాబు మృతి చెందాడు.
బాధితులకు న్యాయం చేయాలి
అధికారుల నిర్లక్ష్యం వల్ల మృత్యువాతపడిన రాంబాబు కుటుంబానికి న్యాయం చెయ్యాలని కోరుతూ వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర యువత విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్, పిల్లి నిర్మల, మాసా రామ్ జోగ్, తదితరులు రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ పోసయ్యతో చర్చలు జరిపారు. ఆపద్బంధు పథకం ద్వారా రూ.50 వేలు మంజూరు చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలదని, రెండు ఎకరాల భూమి, రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు నష్టపరిహారం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో వైఎస్సార్ సీపీ నాయకులు లాలా చెరువులోని జాతీయ రహదారిని దిగ్బంధించి సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.
పోలీస్ స్టేషన్‌కు తరలింపు
జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్ట్ చేసి బొమ్మూరు పోలీస్ స్టేష¯ŒSకు తరలించారు. 19 మందిపై కేసులు నమోదు చేసి సాయంత్రం పూచీకత్తు పై విడుదల చేశారు.
మృతుడి భార్యనూ వదలలేదు...
తన కళ్లముందే భర్త మృతి చెంది దుఃఖంలో ఉన్న మృతుడి భార్య గొల్లకోటి వరలక్షి్మని, ఆమె కుమారులను, పోలీసులు బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి బొమ్మూరు పోలీస్ స్టేషన్‌కు తరలించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఆందోళనలో కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్, బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, నరవ గోపాల కృష్ణ, గుర్రం గౌతం, ఆరీఫ్, మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, పోలు కిరణ్ మోహన్, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, వాకచర్ల కృష్ణ, మాసా రామజోగ్, చిక్కాల బాబులు, తగరపు సోము, వి.సత్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీరంగపట్నంలో విషాదఛాయలు
కోరుకొండ (రాజానగరం) : శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన గొల్లకోటి రాంబాబు (31) రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందడంతో తండ్రితో పాటు, మృతుడి భార్య, పిల్లలు, బంధువులు బోరున విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి ఉన్నారు. శ్రీరంగపట్నానికి చెందిన గొల్లకోటి అప్పారావు ఏకైక కుమారుడు రాంబాబు. ఇటీవల అతడి తల్లి ఆదిలక్ష్మి మృతి చెందింది. పెద్దలు సూచించిన ప్రకారం రాంబాబు తన తల్లికి శివరాత్రి రోజున గోదావరిలో స్నానం చేసి పిండ ప్రదానం చేయడానికి వెళ్లాడు. గోదావరి వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. తండ్రి, భార్య, పిల్లలు, బంధువులు బోరున విలపించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గ్రామపెద్దలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
Advertisement