అదే నిర్లక్ష్యం | man died current shock | Sakshi
Sakshi News home page

అదే నిర్లక్ష్యం

Published Fri, Feb 24 2017 11:17 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

అదే నిర్లక్ష్యం - Sakshi

అదే నిర్లక్ష్యం

పాఠం నేర్వని యంత్రాంగం
శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లలో అలసత్వం
బలైన నిండు ప్రాణం
మానవ తప్పిదాల వల్లే ఇలాంటి ఘటనలు
సాక్షి, రాజమహేంద్రవరం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా భక్తుల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మానవ తప్పిదాల వల్ల కలిగే ప్రాణనష్టం క్షమించరానిది. 2015 గోదావరి పుష్కరాలి తొలిరోజున రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతి చెందగా, 54 మంది గాయపడ్డారు. సంఘటన స్థలంలో సరైన ఏర్పాట్లు లేకే ప్రాణనష్టం పెరిగిందని అధికారులు నివేదిక ఇవ్వడం గమనార్హం. ఈ ఘటన నుంచి గుణపాఠాలు నేర్వని యంత్రాంగం శుక్రవారం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం అదే ఘాట్‌లో ఓ భక్తుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన ఈ రెండూ మానవ తప్పిదాల వల్లే సంభవించాయి.                                                                    
క్షుణ్ణంగా పరిశీలించరా?
లక్షలాది మంది భక్తులు వచ్చే కార్యక్రమాలకు ఉన్నతాధికారులు వారం పదిరోజుల ముందే ఏర్పాట్లపై సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. చివరి రోజు ఘాట్లను పరిశీలించిన ఉన్నతాధికారుల బృందం ఏఏ లోపాలను గమనించిందో చెప్పలేని పరిస్థితి. పైకి కనిపించే దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు బాగున్నాయంటే అంతా బాగున్నట్టు కాదు. ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉన్న ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఈ పని ఆయా శాఖల ఉన్నతాధికారులు చేస్తున్నారా? అంటే భుజాలు తడుముకునే పరిస్థితి. 
అంబులెన్స్‌ ఏదీ? 
వారం రోజుల ముందే నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ వి.విజయరామరాజు అధ్యక్షతన వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, విద్యుత్, రోడ్లు, భవనాల శాఖ తదితర శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఘాట్లలో ఆయా శాఖలు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో దిశానిరే్ధశం చేశారు. అయినా పుష్కరఘాట్‌లో అంబులెన్స్‌ ఏర్పాటు చేయకపోవడం యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనం. కనీసం డాక్టర్‌ కూడా అందుబాటులో లేరంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన గంట తర్వాత అంబులెన్స్‌ వచ్చింది.. తిరిగి వేగంగా వెళ్లడానికి సరైన మార్గం లేదు. మార్కండేయస్వామి దేవాలయం మీదుగా తీసుకు వెళితే అక్కడ రోడ్డుపై ట్రాఫిక్‌ నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తిరిగి పుష్కరఘాట్‌ నుంచి మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ మీదుగా ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళుతుండగా కంబాలచెరువు వద్ద రాంబాబు శ్వాస ఆగిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత గంటకు అంబులెన్స్‌ వచ్చింది. అదే అంబులెన్స్‌ తిరిగి వెళ్లడానికి దాదాపు 45 నిమిషాల సమయం పట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు రెండు గంటల సేపు రాంబాబు ప్రాణాలతో ఉన్నాడు. సకాలంలో వైద్యం అందక మృతి చెందాడు. అత్యవసర పరిస్థితుల్లో వాహనం వెళ్లడానికి సరైన ఏర్పాట్లు లేకుండా రోడ్లు భవనాల శాఖ పక్కా ప్రణాళిక లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం గమనార్హం.   
విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు?
శివరాత్రి సందర్భంగా పుష్కరఘాట్‌లో ఉన్న ఆలయాలను విద్యుత్‌ కాంతులతో సుందరంగా అలంకరించారు. వేలాది మంది భక్తులు వచ్చే పుష్కర ఘాట్‌లో చేసిన ఏర్పాట్లలో చిన్న తప్పిదం ఉన్నా నష్టం భారీగా ఉంటుంది. అదే శివరాత్రి పర్వదినాన  జరిగింది. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ గోలకోట రాంబాబు (30) విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. భార్య పిల్లలు, కుటుంబసభ్యులతో రాంబాబు పుష్కరఘాట్‌లో స్నానం చేసి పక్కనే ఉన్న ఆలయంలో దేవుడిని దర్శించుకున్నారు. అక్కడ ట్యూబ్‌లైట్‌ కోసం ఏర్పాటు చేసిన ఇనుప స్తంభం పట్టుకోవడంతో రాంబాబు షాక్‌ కు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోప్రాణాలు విడిచాడు.
అంబులెన్స్‌, డాక్టర్‌ ఉన్నారు 
నాలుగు చోట్ల అంబులెన్స్‌ ఉంచాలని నిర్ణయించాం. పుష్కర ఘాట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అంబులె¯న్స్‌ పెట్టాం. కోటిలింగాల ఘాట్‌లో సాయి ఆస్పత్రి, సరస్వతి ఘాట్‌ వద్ద జీఎస్‌ఎల్‌ ఆస్పత్రి, గౌతమి ఘాట్‌లో బొల్లినేని ఆస్ప త్రి అంబులెన్స్‌లు పెట్టాలని సూచించాం. రాత్రి 9 గంటల సమయంలో కమిషనర్‌ నిర్ధారిస్తూ ఫొటోలు కూడా తీశారు. పుష్కరఘాట్‌లో డాక్టర్‌ కూడా ఉన్నారు. ప్రమా దం జరిగిందని మాకు తెలిసిన తర్వాత 20 నిమిషాల్లో ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఘాట్‌లో డాక్టర్‌ నారాయణ ప్రాథమిక చికిత్స చేశారు. ఘాట్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో కొంత ఆలస్యమైందని చెబుతున్నారు.                              
– డాక్టర్‌ రమేష్‌ కిషోర్, 
సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement