చిన్నారిపై మృత్యుఘాతం
చిన్నారిపై మృత్యుఘాతం
Published Tue, Aug 9 2016 12:03 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
విద్యుత్ తీగ తగలడంతో మృతి l
నిర్లక్ష్యంగా చెట్ల కొమ్మలు నరికిన ఫలితం
మూడేళ్ల చిన్నారిని నిర్లక్ష్యం బలిగొంది. విద్యుత్ తీగలకు అవరోధంగా ఉన్నాయంటూ చెట్ల కొమ్మలు నరకడంతో, తెగిపడిన విద్యుత్ తీగ ఆ బాలుడి పాలిట మృత్యుపాశంగా మారింది. – బలభద్రపురం (బిక్కవోలు)
రంగంపేట మండలంలో పాడైన గుడ్లు తిని ఇద్దరు చిన్నారులు మరణించిన సంఘటన ను మరువక ముందే బిక్కవోలు మండలంలోని బలభద్రపురంలో సోమవారం మరో చిన్నారి విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. గ్రామంలోని 84వ అంగన్‌వాడీ కేంద్రం వద్ద జరిగిన ఈ సంఘటనలో ఆలపు సూరిబాబు, కుమారి పెద్ద కుమారుడు ఆలపు వేణు(3) అలియాస్ నాని పండు మరణించాడు. చిన్నారి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం పెట్రోలు బంకు వెనుక చెట్ల కొమ్మలను కూలీలు తొలగించారు. ఈ క్రమంలో కొమ్మ పడడంతో విద్యుత్ తీగ తెగిపోయింది. ఈ విషయాన్ని కూలీలు యజమానికి చెప్పకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న నానిపండు టాయిలెట్ కోసం చెట్టు వద్దకు వచ్చాడు. కిందపడి ఉన్న తీగను గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై, అక్కడికక్కడే మరణించాడు. దీనిని గమనించిన స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, సరఫరాను నిలిపివేశారు. అప్పటికే చిన్నారి మరణించడంతో ఆ ప్రాంతమంతా రోదనలతో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లి కుమారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
బంధువుల ఆగ్రహం
అంగన్‌వాడీ సిబ్బంది కేంద్రాలను ఆయాలకు విడిచిపెట్టి, మీటింగులతో కాలయాపన చేస్తున్నారని, చిన్నారులను పట్టించుకోవడం లేదని నానిపండు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిక్కవోలు మండల పరిషత్‌లో నియోజకవర్గ స్థాయి తల్లిపాల వారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెట్టు కొమ్మలు తొలగించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని తల్లిదండ్రులను పరామర్శించి, ట్రా¯Œæ్సకో, ఐసీడీఎస్ నుంచి నష్ట పరిహారం ఇప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనపర్తి ఎస్సై కె.కిషోర్‌బాబు ఆధ్వర్యంలో బిక్కవోలు హెచ్‌సీ నరసింహమూర్తి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Advertisement