మృత్యుపాశం
విద్యుదాఘాతంతో తల్లి, కొడుకు మృతి
మాచవరంలో విషాద సంఘటన
మాచవరం (రాయవరం) : బుడి బుడి అడుగులతో ఇల్లంతా కలియ తిరుగుతూ... సందడి చేసే ఆ చిన్నారి ఇకలేడు. నాన్నా ఈ బువ్వతిను.. అంటూ చిన్నారి వెనుకతిరిగే తల్లీ లేదు. దసరా సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉన్న చిన్నారి... అమ్మ దుస్తులు ఉతుకుతుంటే తాను ఉడత సాయం చేస్తున్నాడు. ఈలోగా విద్యుత్ తీగ వారి ప్రాణాలు బలిగొంది. రాయవరం మండలం మాచవరంలో బుధవారం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మాచవరం గ్రామానికి చెందిన చింతా శ్రీహరిరెడ్డి, మహాలక్ష్మి(25)ల కుమారుడు హర్షమణికంఠభామిరెడ్డి(4) స్కూల్‌కు సెలవు కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు. భర్త శ్రీహరిరెడ్డి పనిమీద బిక్కవోలు మండలం బలభద్రపురం వెళ్లగా, భార్య మహాలక్ష్మి ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుంది. మోటార్ వేసి బట్టలు ఉతుకుతున్న సమయంలో విద్యుత్ ప్రవహించి తల్లి మహాలక్ష్మి, కుమారుడు భామిరెడ్డి అక్కడే మృతి చెందారు. వీరిద్దరు చనిపోయిన సమయంలో మోటార్ తిరుగుతూనే ఉంది. దీంతో ట్యాంక్ నిండి నీరు బయటకు పొతోంది. దీన్ని ఇంటి ఎదురుగా ఉన్న వారు గమనించారు. గేటు వద్దకు వెళ్లగా భామిరెడ్డి నిర్జీవంగా పడి ఉండడంతో స్థానికులను అప్రమత్తంచేశారు. ఆ సమయంలో ఇరుగుపొరుగు వారు వచ్చి గోడ ఎక్కి చూడగా విద్యుత్‌షాక్‌కు గురై ఇరువురు మరణించినట్లుగా భావించారు. వెంటనే గొలుగూరి సుబ్బారెడ్డి రాయవరం సబ్‌స్టేçÙన్‌కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
విద్యుత్ పోల్ నుంచి ఇంటికి వచ్చే విద్యుత్ వైరుకు మధ్యలో సపోర్టు కోసం ఇనుప స్తంభం ఏర్పాటు చేశారు. బట్టలు వేసుకునేందుకు ఈ స్తంభం నుంచి జీఐ వైరు కట్టారు. ఆ వైరుకు విద్యుత్ ప్రవహించి ప్రమాదం జరిగి ఉంటుందని తొలుత భావించారు. విద్యు™Œ lశాఖ ఏడీఈ రాజబాబు ఆధ్వర్యంలో బిక్కవోలు, అనపర్తి ఏఈలు జి.శ్రీనివాసరావు, జి.అన్నవరం వచ్చి ప్రమాదంపై విచారణ చేశారు. మోటార్‌కు ప్రవహించే విద్యుత్ వైరు మధ్యలో తెగి ఉండడం.. బట్టలు ఉతుకుతున్న సమయంలో మోటార్ తిరగడం.. నీళ్లతో ఆ ప్రాంతమంతా తడిగా ఉండడంతో విద్యుత్ ప్రవహించి ప్రమాదం జరిగిందని నిర్దారణకు వచ్చారు. షాక్ కొట్టిన సమయంలో సపోర్టు కోసం మహాలక్ష్మి జీఐ వైరును పట్టుకోగా అది ఆమెపై పడడంతో ఉదరభాగంలో ఆమె శరీరం కాలిపోయినట్లు భావిస్తున్నారు.
గ్రామంలో విషాదఛాయలు..
ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అప్పటి వరకు చలాకీగా తిరిగిన చిన్నారి విగతజీవిగా పడి ఉండడాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోయారు. ఇంటికి వచ్చే సరికి భార్య, కుమారుడు మృతి చెందడంతో శ్రీహరిరెడ్డి భోరున విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. రాయవరం ఎస్సై వెలుగుల సురేష్ సంఘటనా స్థలానికి వచ్చారు. ప్రమాదlఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.