పాతనోట్ల మార్పిడి పేరుతో ఘరానా మోసం | Police Arrested A Gang Of Counterfeit Notes For Allegedly | Sakshi
Sakshi News home page

పాతనోట్ల మార్పిడి పేరుతో ఘరానా మోసం

Published Thu, Aug 22 2019 7:57 AM | Last Updated on Mon, Sep 2 2019 12:08 PM

Police Arrested A Gang Of Counterfeit Notes For Allegedly  - Sakshi

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా  

రూ. వంద పాత కరెన్సీకి రూ.15 అసలు కరెన్సీ ఇస్తాం.. అని మభ్య పెడతారు.. తీరా పాత నోట్లు తీసుకొని అసలు నోట్లు ఇవ్వకపోగా.. ఎదురు డబ్బు ఇవ్వమని బెదిరిస్తారు.  ఇది ఓ ముఠా దందా.. ఒక వంతు ఒరిజినల్‌ కరెన్సీకి మూడు రెట్ల నకిలీ నోట్లు ఇస్తాం.. ఇవి అచ్చం అసలు నోట్లను పోలి ఉంటాయి. మార్కెట్లో సులభంగా చెలామణీ చేసేయొచ్చు.. అంటూ మరో ముఠా మాయాజాలం.. .. పోలీసులు ఒకే రోజు ఈ రెండు ముఠాల ఆట కట్టించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా, ఇతర పోలీస్‌ అధికారులు ఈ రెండు కేసుల వివరాలు వెల్లడించారు. మొదటి కేసులో 14 మంది సభ్యులున్న ముఠా రద్దయిన రూ.500, రూ.1000 నోట్లున్న వ్యాపారులను ఎన్నుకొని వల వేస్తుంది. రద్దయిన నోట్లు ఇస్తే.. వాటి విలువలో 15 శాతం అసలు నోట్లు ఇస్తామని ఎర వేస్తుంది. పాత నోట్లు ఇస్తే.. అసలు నోట్లు ఇవ్వకపోగా తిరిగి మరింత అసలు సొమ్ము ఇవ్వాలని బెదిరిస్తుంది. ఇవ్వకపోతే కాల్చి చంపేస్తామని డమ్మీ పిస్టల్‌తో హెచ్చరిస్తుంది. పోలీసు అన్న బోర్డు పెట్టుకొని మరీ కారులో దర్జాగా తిరుగుతూ ఈ దందాలు నిర్వహిస్తున్న ఈ ముఠాలోని 13 మందిని పోలీసులు పట్టుకొని.. వారి నుంచి రూ.1.97 కోట్ల పాత కరెన్సీ, డమ్మీ పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక రంగు కాగితాలు, రసాయనాలు ఇచ్చి 1 అసలు నోటుకు మూడు నకిలీ నోట్లు ఇస్తామని చెబుతూ మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను కూడా ఎంవీపీ పోలీసులు పట్టుకొని రూ.2.38 లక్షల పాత, కొత్త నోట్లు, రసాయనాలు, మెషిన్లు, కొన్ని సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

సాక్షి, విశాఖపట్నం: పాత నోట్లు ఇస్తే ఆ మొత్తానికి 15 శాతం ఒరిజినల్‌ నగదు ఇస్తామంటూ ఆశ చూపి మోసానికి పాల్పడుతున్న నకిలీ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రూ.కోటి 97వేల విలువ గల పాత కరెన్సీ స్వాధీనం చేసుకుని 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారయ్యారు. ఈ సందర్భంగా నగర పోలీస్‌ కమిషనర్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్‌ ఆర్‌కే మీనా వివరాలు వెల్లడించారు. 14 మందితో కూడిన ఓ ముఠా పాత రూ.500, రూ.1000ల నోట్లు మార్పిడి చేస్తామంటూ నమ్మిస్తున్నారు. ఈ క్రమంలో పాత కరెన్సీ రూ.లక్ష ఇస్తే ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.15వేలు నగదు ఇస్తామని చెబుతున్నారు. తీరా ఎవరైనా పాత కరెన్సీ ఇవ్వగానే... మీ వద్ద పాత నోట్లు ఉన్న విషయాన్ని బట్టబయలు చేస్తామని బెదిరిస్తున్నారు. తిరిగి వారినే డబ్బులు ఇవ్వమని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో లంకెలపాలేనికి చెందిన వ్యాపారి గురున్నాథ నూకరాజును ముఠా సభ్యులు నమ్మించి మోసగించడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ ముఠా కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.

ఒక ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న పాత నోట్లు, డమ్మీ పిస్టల్‌ 

బుధవారం అగనంపూడి టోల్‌గేట్‌ వద్ద మాటు వేయగా పోలీసు అనే పేరుతో ప్లేటు తగిలించిన వాహనంలో వస్తున్న ముఠా సబ్యులు 13 మందిని పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి రూ.కోటీ 97 లక్షల విలువ చేసే పాత రూ.500, రూ.1000ల నోట్లు, నకిలీ కారు నంబర్‌ ప్లేట్లు, వాకీటాకీలు, డమ్మీ తుపాకీలు, బుల్లెట్లు, పోలీస్‌ పేరుతో ఉన్న నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన ఎస్‌.మనోహర్‌(ఏ1), విశాఖకు చెందిన ఎం.ఉమామహేశ్వరరావు(ఏ3), విజ యనగరానికి చెందిన పి.పటాన్‌నాయడు(ఏ4) సహా 13 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పీవీ నాగేశ్వరరావు అలియాస్‌ నరేష్‌(ఏ2) పరారీలో ఉన్నట్టు ఆర్కే మీనా వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సీఐ రఘువీర్‌ విష్ణు, ఎస్సై గోపితో పాటు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలి పారు. సమావేశంలో డీసీపీ–2 ఉదయ్‌భాస్కర్‌ బిల్లా, ఏసీపీ జీఆర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

నకిలీ కరెన్సీ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న మిషన్, సెల్‌ఫోన్లు, నోట్లు  

నకిలీ కరెన్సీ మార్పిడి ముఠా అరెస్ట్‌
సాక్షి, విశాఖపట్నం: మీరు లక్ష రూపాయలు ఇస్తే రూ.3లక్షలు విలువ చేసే నకిలీ నోట్లు ఇస్తాం... అవి అచ్చం ఒరిజినల్‌ నోట్లను పోలినట్టే ఉంటాయి... వాటిని సులువుగా మార్కెట్‌లో మార్పిడి చేసుకోవచ్చని నమ్మించి మోసగిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎంవీపీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1.4 లక్షల నగదుతోపాటు రూ.98వేల విలువ గల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా వెల్లడించిన వివరాల ప్రకారం... విజయనగరం ప్రాంతానికి చెందిన కింగుమహంతి పద్మావతి, విశాఖకు చెందిన మద్దిల లక్ష్మి, మాడేమ్‌ రాజేశ్వరరావు అలియాస్‌ జేమ్స్, నేతల శివన్నారాయణ ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు నగరంలో సంచరిస్తూ తమకు ఒక ఒరిజినల్‌ నోటు ఇస్తే మూడు నకిలీ కరెన్సీ నోటు ఇస్తామని నమ్మిస్తుంటారు. ఈ క్రమంలో పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన బెల్లాన నగేష్‌ను తమ మాటలతో నమ్మించడంతో అతను ఈ నెల 18న ఈ ముఠా సభ్యులకు రూ.లక్ష ఇచ్చాడు.

కొద్దిరోజుల్లోనే నకిలీ కరెన్సీ ఇస్తామని నమ్మించారు. అదేవిధంగా మరికొందరి వద్ద రూ.44వేలు తీసుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా తనకు నకిలీ కరెన్సీ అందకపోవడంతో బెల్లాన నగేష్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఎంవీపీ పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. రసాయనాలు, నల్ల కాగితాలు, లిక్విడ్‌తో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నారని గుర్తించారు. నలుగురినీ ఉషోదయ కూడలికి సమీపంలో అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.4 లక్షల నగదుతోపాటు రూ.98వేల విలువ గల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పేపర్‌ కటింగ్‌ మెషీన్, నగదు లెక్కింపు మెషీన్, నల్ల పేపర్‌ బండిళ్లు 9, 8 సెల్‌ ఫోన్లు, మూడు రకాల రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా పదేళ్లుగా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతోందని సీపీ మీనా తెలిపారు. గతంలో వీరిపై టూ టౌన్, త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సీపీఎస్‌ సిబ్బందితోపాటు క్రైంఏసీపీ శ్రావణ్‌కుమార్‌లను సీపీ అభినందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement