ఉచితమనే ఉదాసీనత | transco giving preference to industries | Sakshi
Sakshi News home page

ఉచితమనే ఉదాసీనత

Published Thu, Aug 7 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

transco giving preference to industries

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  ట్రాన్స్‌కో అధికారులు బడాబాబులకే కొమ్ముకాస్తున్నారు. ఆరుగాలం శ్రమించి దేశానికే అన్నం పెడుతున్న రైతన్నలతో కన్నీరు పెట్టిస్తున్నారు.  నారుమళ్లు ఎండబెట్టి పరిశ్రమలకు విద్యుత్ మళ్లిస్తున్నారు. వ్యవసాయాన్ని, రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసి అధికారికంగానే కరెంటును పరిశ్రమలకు అమ్ముకుంటున్నారు.

 జిల్లాలో కరెంటు కోతలు, రైతుల నిరసన సెగల నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాకు రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు జిల్లాకు రోజుకు 18.8 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కేటాయించారు. ఇందులో 6 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి, 9 నుంచి 10 మిలియన్ యూనిట్లు పరిశ్రమలకు, మిగిలినది గృహ అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు టాన్స్‌కో రికార్డులు చెప్తున్నాయి.

 ఇదీ వ్యత్యాసం
 జిల్లాలో 2.22 లక్షల  ఉచిత విద్యుత్తు మోటారు కనెక్షన్లు ఉండగా, వీటి ద్వారా దాదాపు 5.58 లక్షల ఎకరాలు సాగు అవుతోంది. ఈ విద్యుత్ మోటార్ల ద్వారా నెలకు 180 లక్షల మిలియన్ల విద్యుత్ ఖర్చవుతోంది. ఒక్కో బోరు మోటరుకుసర్వీస్ పన్ను రూపంలో రూ. 20  మాత్రమే ట్రాన్స్‌కో వసూలు చే స్తోంది. ఈ మొత్తం నెలకు రూ.20 కోట్లకు మించదు. ఇక జిల్లాలో 9 వేల భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా, వీటికి రోజుకు 9 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. పరిశ్రమలకు ఇస్తున్న ప్రతి యూనిట్ విద్యుత్‌కు రూ. 6 చార్జి వేస్తారు. ఈ లెక్కన పరిశ్రమల నుంచి నెలకు రూ.150 నుంచి రూ.200 కోట్ల ఆదాయం వస్తోంది.

 
 భారం అంతా వ్యవసాయం మీదే
 ఇటీవల రాష్ట్రం విడిపోవటం, విద్యుత్ డిస్కం పంపకాలలో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య లేకపోవడం తోడు, వర్షాలు కూడా కురవకపోవడంతో రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్తు కొరత ఏర్పడింది. దీంతో జిల్లాకు రావాల్సిన రోజువారీ వాటాలో  2 మిలియన్ యూనిట్లు కోత పెట్టారు. గత శుక్ర, శని, ఆది వారాల్లో ఈ కోతను మరింత పెంచారు.

 కేవలం 14 మిలియన్ యూనిట్లు మాత్రమే జిల్లాకు సరఫరా చేశారు. అంటే దాదాపు 4.8 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరాపై కోత పడింది. కోత పడిన మొత్తాన్ని విద్యుత్ అధికారులు అటు పరిశ్రమలకు, ఇటు వ్యవసాయానికి పంచి  పంపిణీ చేస్తే సమస్య వచ్చేదే కాదు. కానీ ఇక్కడే విద్యుత్ అధికారులు చేతివాటం చూపించారు.

 వ్యవసాయానికి ఇచ్చేది ఉచిత విద్యుత్ కాబట్టి కోత పడిన మొత్తం లోడును వ్యవసాయంపైనే వేశారు. గృహ అవసరాలకు వినియోగపడే విద్యుత్‌లో కూడా కోతపెట్టి పరిశ్రమలకు పంపించారు. దీంతో వ్యవసాయానికి రోజుకు కనీసం 2 గంటల కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఒకటి రెండు రోజుల పాటు ఓపిక పట్టిన రైతులకు మడి ఎండిపోయే పరిస్థితి రావడంతో ఉద్యమానికి సిద్ధమయ్యారు. రోడ్ల మీదకు వచ్చి రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement