జిన్నారం మండలంలోని పారిశ్రామికవాడ
సాక్షి, సంగారెడ్డి: పటాన్‌చెరు నియోజకవర్గంలో వేలాది పరిశ్రమలు ఉన్నాయి. సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో పరిశ్రమలు వెలిశాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరకడంతోపాటు బీహర్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పరిశ్రమల్లో పని చేస్తున్నారు. ఆర్థిక మాంద్యంతో నాలుగు, ఐదు రోజులు మాత్రమే పని దినాలు కల్పిస్తున్నారు. దీంతో కార్మికులు జీవనోపాధి పొందడానికి ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని మహీంద్ర అండ్ మహీంద్ర ఆర్థిక మాంద్యం ప్రభావంతో సుమారు 30 శాతం ఉత్పత్తి తగ్గించిందని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు.
వెయ్యి మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారని వారు తెలిపారు. ఈ పరిశ్రమపై ఆధారపడిన అవంతి, పోలాల్ లాంటి చిన్న పరిశ్రమలు మూత పడే పరిస్థితిలో ఉన్నాయి. ఎంఆర్‌ఎఫ్‌లో కాంట్రాక్టు కార్మికులకు వారానికి మూడు రోజుల వీక్లీ ఆఫ్ ఇస్తున్నారు. దీనివల్ల కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీఐడీసీ పరిశ్రమలో ఉత్పత్తి సగానికి పడిపోయింది. దీంతో నాలుగు వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. సుమారు 250 పరిశ్రమల్లో ఆర్థిక మాంద్యం ప్రభావంతో మూతపడే దశలో ఉన్నాయి.
ఆటోమొబైల్ రంగానికి పొంచి ఉన్న ప్రమాదం..
ఆర్థిక మాంద్యంతో ఆటోమోబైల్ రంగాలపై ఆధారపడిన పరిశ్రమలకు ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిశ్రమల్లో తయారు చేసిన ఉత్పత్తులు అమ్మకాలు జరగడం లేదు. ఈ పరిశ్రమలపై ఆధారపడిన చిన్న తరహా పరిశ్రమల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కార్మికులకు ఉపాధి లేకుండా పోతోంది. దీంతో వేరే రంగాలకు వెళ్లలేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోవడంతో వారి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment