తుని : వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ప్రభుత్వం చెప్పి అడ్డదారిలో ఉచిత విద్యుత్‌కు మంగళం పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పంట రుణాల మాఫీ హామీ అమలులో మాట మార్చి రైతులను వంచించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఉచిత విద్యుత్ కేటగిరీలో ఉన్న వ్యవసాయ బావులకు మీటర్లు ఏర్పాటు చేయజూస్తూ వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
వ్యవసాయ బావులకు మీటర్లు వేసేది ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకేనని అధికారులు చెబుతున్నా.. అన్నదాతలకు నమ్మకం కలగడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం వల్ల
వేలాది మంది రైతులు ప్రయోజనం పొందారు.
మెట్ట ప్రాంతంలో ఎక్కువ శాతం రైతులు బోరు బావుల ఆధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల పరిధిలో ఉచిత విద్యుత్ కేటగిరీలో 12,165 కనెక్షన్లు ఉన్నాయి. 2005 నుంచి ఇప్పటి వరకు రైతులు ఒక్క రూపాయి బిల్లు చెల్లించాల్సిన అవసరం రాలేదు. తత్కాల్, చెల్లింపు కేటగిరీలోని 3,630 కనెక్షన్ల ద్వారా వాడిన విద్యుత్‌కు మాత్రం బిల్లులు చెల్లించాలి. ఎప్పటికప్పుడు వసూలు చేయకపోవడంతో వీటి బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. జగ్గంపేట డివిజన్ పరిధిలో రూ.6.42 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని రైతుల నుంచి వసూలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
‘నూరురోజుల ప్రణాళిక’తో మళ్లీ పాతరోజులు..!
మెట్ట ప్రాంతంలోని 12,165 ఉచిత విద్యుత్ కనెక్షన్లకు కొత్త మీటర్లను వేయడానికి ట్రాన్స్‌కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీ రైతుల జాబితా తయారు చేసి మీటర్లు ఇవ్వనున్నారు. వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇవన్నీ పూర్తి చేయడానికి వంద రోజుల ప్రణాళిక రూపొందించారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న బోరు బావుల మోటార్లను తనిఖీ చేసి, వాటి స్థానంలో విద్యుత్ ఆదాకు కొత్త మోటార్లు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
మళ్లీ పాత రోజులు వస్తున్నాయని, వ్యవసాయం దండగన్న చంద్రబాబు కొత్త మీటర్ల మాటున తిరిగి తమకు చేదును చవి చూపి స్తారని, మునుముందు ఉచిత విద్యుత్‌కు ఎగనామం పెట్టి, బిల్లులు గోళ్లూడగొట్టి వసూలు చేయడానికే ఇదంతా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఉచిత విద్యుత్ కేటగిరీలో ఉన్న వ్యవసాయ బోర్లకు మీటర్ల బిగింపునకు ట్రాన్స్‌కో అధికారులు రాజానగరం మండలం నుంచి శ్రీకారం చుట్టినట్టు తె లిసింది. అధికారులు మాత్రం పాత కనెక్షన్లకు కాక.. కొత్త వాటికి మాత్రమే మీటర్లు అమర్చుతున్నట్టు చెపుతున్నారు.
‘భారం’ మోపేందుకే ఆ బిగింపు!
Published Mon, Aug 4 2014 11:52 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement