ఖమ్మం: ట్రాన్స్‌కో అధికారులు మళ్లీ జులుం విదిల్చారు. ఇప్పటికే ప్రజలు విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతుంటే అవి చాలదన్నట్లు శనివారం నుంచి అదనపు కోతలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలు లేకపోవడంతో పంటలు సాగు చేయకపోయినా విద్యుత్ కోతల బాధలు మాత్రం తప్పేలా లేవని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
జిల్లాకేంద్రం మొదలు మారుమూల గ్రామం వరకు దేన్నీ వదలిపెట్టకుండా కోతల సమయాన్ని పెంచనున్నారు. వ్యవసాయ సీజన్ ముమ్మరమైతే పరిస్థితి ఎంటా? అని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చిన్నపాటి గాలికే విద్యుత్ తీగ లు తెగిపడటం, షార్ట్‌సర్క్యూట్ చోటుచేసుకోవడం, లైన్ల మర్మతుల పేరుతో గంటలకొద్దీ కోతలు విధిం చడం ఆనవాయితీగా చేసుకున్న ట్రాన్స్‌కో అధికారులు..అనధికారిక కోతలే కాకుండా అధికారిక కోతల సమయాన్ని కూడా పెంచటం ఆందోళన కలిగిస్తోంది.
వినియోగం పెరిగిందనే నెపంతో...
జలాశయాల్లో నీరు లేకపోవడం, జిల్లాకు సరఫరా చేసే విద్యుత్ కంటే వినియోగం ఎక్కువ అయిందనే నెంపతో ఇప్పుడున్న కోతలకు తోడు అదనంగా పెంచారు. జూన్ నెలలో జిల్లాకు రోజు వారీగా 5.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటాను కేటాయించారు. అయితే అప్పుడు జిల్లాలో అంతకంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారని కోతలు విధించారు. జిల్లా కేంద్రంలో రెండు గంటలు, మున్సిపల్ కేంద్రాల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాలో ఆరు గంటలు కోత ఉండేది.
వర్షాలు లేకపోవడం, వేసవిని తలపించే విధంగా ఎండల తీవ్రత ఉండటంతో ప్రజలు విలవిలలాడారు. ఇది చాలదన్నట్లు జూలై నెల రోజువారీ కోటా సగటున 4.28 యూనిట్లకు కుదించారు. విద్యుత్ వినియోగానికి జిల్లాకు కేటాయించి కోటాకు తేడా ఉండటంతో అదనపు కోతలు విధిస్తున్నామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం జిల్లా కేంద్రంలో ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు, మున్సిపల్, మండల, సబ్‌స్టేషన్ కేంద్రాలో ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు మొత్తం ఆరు గంటల విద్యుత్ కోతలు విధిస్తారు.
వ్యవసాయానికీ కోతలే...
ఓవైపు వర్షాలు లేక అల్లాడుతున్న రైతన్నకు ఇబ్బందులు తప్పేలా లేవు. కరెంట్ ఉంటే ఓ మడైనా తడుస్తుందనుకుంటున్న రైతన్నకు నిరాశ తప్పేలా లేదు. సాగు చేస్తున్న కొద్దిపాటి పంటలకు నీరు పెట్టేందుకు అర్ధరాత్రి అపరాత్రి ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం ప్రకటించిన ఏడు గంటల విద్యుత్‌ను నిరంతరాయంగా ఇవ్వకుండా ఉదయం, రాత్రివేళల్లో ఇవ్వడంపై అన్నదాతల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. ఏ, బీ, సీ, డీ నాలుగు గ్రూపులుగా విభజించి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో సరఫరా చేస్తున్నారు.
మళ్లీ కట్‌కట
Published Sun, Jul 27 2014 2:30 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement